#


Back

Page 20

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


20
యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు ।
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ॥ 6-17 ॥

ఆచరణమే యోగమని చెప్పాము. ఆచరణ అనే సరికది సాధకుడి మనో డార్ఢ్యాన్ని బట్టి ఉంటుంది. మనోడార్ఢ్యామంటే అది ఒక్కసారిగా ఊడిపడేది కాదు. ఆహారం దగ్గర నుంచీ ఉన్నాయి దానికి పునాదులు. అవి గట్టిపడితే గాని దానిపైన నిర్మించే కట్టడం నిలవదు. ఎలా గట్టిపడాలంటారది.

మనమే పని చేసినా ఒక మోతాదు దాటి చేయరాదు. మోతాదులోనే ఉంది సమత్వం. అది దాటితే దానికి దెబ్బతగులుతుంది. ఈ మోతాదుకే యుక్తమని పేరు పెట్టారు. ఆహారం తీసుకొంటే యుక్తంగా తీసుకోవాలి. విహరిస్తే యుక్తం గానే విహరించాలి. ఇవే సగం బలమిస్తాయి మానవుడి మనస్సుకు.

పోతే ఇక ఎన్నో ఉంటాయి మనం ప్రతి క్షణం సాగించే పనులు. ఒక ప్రసంగాలే కావు. ప్రయాణాలే కావు. విందులే కావు. వినోదాలే కావు. ఉద్యోగాలే కావు. వ్యాపారాలే కావు. ఇవన్నీ చేష్టల క్రిందికి వస్తాయి. ఈ చేష్టలు కూడా తగ్గించు కోవాలి మనమదే పనిగా. అసలే వాటిని చేయకూడదని కాదు. చేస్తే అర్ధం ప్రాణం ధారబోసి చేయటమూ కాదు. ఎంత వరకో అంత వరకే. ఎంత సుఖంగా ప్రవేశిస్తామో అందులో - అంత సుఖంగా బయట పడగలగాలి. లేకుంటే మనస్సు దానిలో బాగా లగ్నమై తన బలాన్ని కోల్పోతుంది. అన్నింటి కన్నా ముఖ్యం నిద్రా-మెలకువా. అతి నిద్రా పనికి రాదు. అతి జాగ్రత్త పనికిరాదు. మొదటిది అభ్యాసానికి దెబ్బయితే రెండవది వైరాగ్యానికి దెబ్బ. కాబట్టి వాటిని కూడా సాధకుడు అదుపులో పెట్టుకోవాలి.

ఇలా నిగ్రహం పాటిస్తూపోతే అది మనోడార్ఢ్యానికి క్రమంగా దారి తీస్తుంది. మనసు దృఢమైతే ఇక యోగం మనకు నిలిచిందన్న మాటే. లేకపోతే యోగమని మాటలు చెప్పడమే గాని అది మనకెప్పుడూ దక్కేదిలేదు. అనుభవానికి వచ్చేది లేదు.