#


Back

Page 2

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


2
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ।
ఉభయోరపి దృష్టోఽన్తస్త్వనయోస్తత్త్వదర్శిభిః ॥ 2-16 ॥

ఆత్మా నాత్మా వివేక రూపమైన సాంఖ్య దృష్టి నలవరుచుకోటమే మరణాన్ని జయించటాని కుపాయమని చెప్పాము. అయితే అది ఆత్మ చైతన్య మొక్కటే నిత్యం-మిగతా అనాత్మ జగత్తంతా అనిత్యమేననే సూత్రం మీద ఆధారపడి ఉంది. మరి ప్రపంచ మనిత్యమని చెప్పటానికి గాని చైతన్యమే శాశ్వతమని చెప్పటానికి గాని ఏమిటి ప్రమాణమని ఇప్పుడు ప్రశ్న వస్తుంది.

దీనికి సమాధానమే ఈ శ్లోకం సత్తు అసత్తు అని లోకంలో పదార్థాలన్నీ రెండు వర్గాలు. సత్తంటే ఉన్నదనీ అసత్తంటే లేనిదనీ అర్ధం. అందులో ఉన్నదేదో. అది ఎప్పుడూ ఉంది. లేనిదెప్పుడూ లేదు. ఉన్నది లేకపోవటం గానీ లేని పదార్థ ముండుట గాని ఎన్నటికీ సంభవం కాదు.

అయితే ఇది అందరికీ తెలిసిందే గదా-క్రొత్తగా భోధించటం దేనికని అడగవచ్చు. అక్కడే ఉన్న దంతరార్థం. అది మనకు తెలిసినట్టు కనిపించినా నిజంగా చూస్తే తెలియదు. నిజంలో మనమంతా ఉన్నదే లేదను కొంటున్నాము. లేనిదే ఉన్నదని భావిస్తున్నాము. ఆత్మ చైతన్యమనేది సర్వత్రా ఉన్నది. సర్వదా ఉన్నది. దాన్నే మనం లేదనుకొంటున్నాము. అలాగే ఉందను కొని నిత్యమూ చూచే ఈ చరాచర జగత్తెప్పుడూ లేదు. అయినా అనుక్షణమూ దీని నున్నట్టే చూస్తున్నాము. ఇదే మనం చేస్తున్న పొరపాటు. కనుకనే దీనిని సవరించి మనకుజ్ఞానోదయం కలిగించాలని భగవానుడి ఈ ఉవదేశం.

కావచ్చు. కానీ మనకీ ప్రపంచం నిత్యమూ అనుభవానికి వస్తూనే ఉంది గదా. ఇది అసత్తెలా అయింది. అలాగే మీరుందని చెప్పే ఆ చైతన్యమెక్కడా మనకు గోచరం కావటం లేదు గదా-అది ఒక్కటే సత్తని ఎలా చెప్పగలరు అని ఆశంక.

ఇలాంటి ఆశంక కలగటం సహజమే, వస్తు నిరూపణ చేయనంత వరకే ఆశంక. చక్కగా నిరూపించి చూచామంటే సదసద్విభాగం మనకు బాగా అర్ధమవుతుంది. నామరూపాత్మకమైన ఏ పదార్థమైనా తీసుకొని చూడు. ఒక ఘటం గాని పటం గాని ఏదైనా సరే. అది దాని కారణ ద్రవ్యం కన్నా భిన్నంగా ఉండబోదు. ఇంతెందుకు. ఘటమనే పదార్థమే ఉంది. అది దాని కారణమైన మృత్తు కంటే వ్యతిరిక్తంగా ఎక్కడ ఉంది. మృత్తికే ఘటరూపంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఘటమనేది వేరే ఎక్కడా లేదు. అది అసత్తే.

అలాగే ఆ మృత్పిండం దాని అణవుల సంయోగమే. వేరు కాదు. అవి వృథివీ పరమాణువులు. ఆ వృథివి జలవికారం. జలం తేజో వికారం. తేజస్సు వాయు కార్యం. ఆ వాయు వాకాశ జన్యం. కాబట్టి ఆకాశం కన్నా వేరుగా ఏ భౌతిక వదార్ధమూ లేదు. పోతే ఈ ఆకాశం కూడా ఆచేతనమే కాబట్టి దానిపాటి కది సిద్ధించదు. సిద్ధించాలంటే దానికి విలక్షణమైనది మరేదో వుండాలి. అది మరలా పరాధీనం Dependent కాగూదదు. స్వతస్సిద్దమైనది కావాలి ఆలాంటి దొక్క చైతన్యమే Pure Consciousness.

కాబట్టి చైతన్యమే అన్ని భావాలకూ ఆఖరి భావం. దానికిక కారణం లేదు గనుక అది దేనికీ కార్యం కాదు. కార్యం కాకపోతే మిగతా ఘటపటాది కార్యాల మాదిరి దానికి వ్యభిచారం Mutation లేదు. అవ్యభిచారి Immutable. కనుకనే అది సత్తు. పోతే మిగతా నామరూపాది ప్రపంచ మంతా ఆకాశం దాకా ఎక్కడి కక్కడే వ్యభిచరించే కార్యరూపాలే కాబట్టి మూలకారణమైన ఈ శుద్ధ చైతన్యం కన్నా భిన్నంగా లేవవి. కనుక ఈ చరాచర జగత్తంతా అసత్తేనని తీర్మానం.

అయితే అసత్తయిన ఇదే మనకు కనిపిస్తున్నది గాని సత్తని చెప్పినా అది కనిపించటం లేదే అనవచ్చు. కనిపిస్తున్నా ఈ కనిపించేది అదే గాని ఇదిగాదు. ప్రతి ఒక్క పదార్దాన్నీ పట్టి చూడు. సత్ ఘటః - సత్ పటః, ఘటమున్నది- పటమున్నది అంటూ ప్రతి ఒక్కటీ ఉన్నది ఉన్నదనే చూస్తున్నాము. ఉండటమనే భావమూ-ఘట పటాది భావాలూ-రెండు సమానాధి కరణాలుగా Inequation కనిపిస్తాయి. వాటిలో ఘటపటాది భావాలు మారుతూ పోతాయి గాని ఉండటమనే భావ మెప్పటికీ మార్పు చెందదు. ఘటంలో కాకపోతే అది పటంలో కనిపిస్తుంది. పటంలో కాకపోతే అది కుడ్యంలో కనిపిస్తుంది. ఘటం మాత్ర మలాకాదు. పటం దగ్గరికి వచ్చేసరికి ఘటమనే బుద్ది లేదక్కడ. అలాగే కుడ్యం దగ్గరికి వెళ్ళేసరికి పటమనే బుద్ధిలేదు. సద్బుద్ధి అలా కాక సర్వత్రా ఉంటుంది. నష్టమైన ఘటంలో సద్బుద్ధి కూడా లేదు గదా అని ఆక్షేపించ రాదు. ఘటమనే విశేష రూపమే నశించింది గాని అక్కడ సత్తనే సామాన్యానికి క్షతి లేదు. ఎందుకంటే ఘట ముందని ఎలా చూచావో ఘటాభావాన్ని The Absence of pot కూడా ఉందనే చూస్తున్నావు. ఉభయత్రా సద్బుద్ధి ఉండనే వుంది. ఘట బుద్దే ఒకచోట వుంది. మరొక చోట లేదు. ఈ విధంగా లోకంలో అణువు మొదలు ఆకాశం దాకా ప్రతి ఒక్క భావమూ మార్చు చెందుతూ పోవటం వల్ల అంతా చివర కసత్తే. అంటే వాటి వాటి విశేష రూపాలలో అవి లేవు. కేవలం సద్రూపంగానే ఉన్నాయి అన్నీ.

అయినా కనిపిస్తున్నా యంటే సత్తనే భావమే ఆయా విశేష రూపాలుగా భాసిస్తున్నదని చూడాలి మనం_ఎండమావులలో నీళ్ళు ప్రవహిస్తున్నట్టు కనిపించినా అవి నీళ్ళు కావు. సూర్య కిరణాలే ఆ రూపంలో భాసిస్తున్నాయని అర్ధం చేసుకోటం లేదా మనం. అలాగే ఇక్కడా ఇందులో ఉన్న మర్మమేమంటే సత్తనే దానికి రూపం లేదు. కాబట్టి దాని నున్నదున్నట్టు దర్శించలేకపోతున్నాము. అసత్తయినా ఘట పటాదుల కొక రూపముంది. కాబట్టి లేకున్నా వాటి నున్నట్టు చూస్తున్నాము. మరి దీనికి పరిష్కారమేమిటని అడగవచ్చు. సత్తనే దాని వివిధ రూపాలే ఈ ఘట పటాదులన్నీ.సద్రూపం గానే ఇవి సత్యం కాని తత్ ద్రూపంగా కావని-సమన్వయించుకోటమే.

ఇదిగో ఈ సద్రూపమైన చైతన్యమే ఆత్మ. అది అన్నింటిలోనూ పరచుకొని ఉన్నదే. కాబట్టి దాని నలాగే దర్శించి పట్టుకోటమే తత్త్వ దర్శనం. అప్పుడీ అనాత్మ ప్రపంచం కూడా ఆయా విశేష రూపాలుగా కాక ఆత్మరూపంగానే గోచరిస్తుంది కాబట్టి ఆత్మా నాత్మలు రెండింటినీ ఆత్మ రూపంగానే చూచినట్టవు తుంది. ఉభయో రపి దృష్టోంతః అంటే ఇదే అర్థం. ఆత్మా నాత్మల రెండింటి అంతమూ ఆత్మే. ఇలా రెండింటినీ కలిపి ఒకే ఒక చైతన్యంగా దర్శించటమే తత్త్వ దర్శనం. అంతే గాని కేవల మాత్మను మరచి ఆనాత్మనే చూడటం గాదు. అలా చూడటం వల్లనే మరణ భయం మానవులకు.