#


Back

Page 18

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


18
అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః ।
వశ్యాత్మనా తు యతతా శక్యోఽవాప్తుముపాయతః ॥ 6-36 ॥

అయితే ఈ అభ్యాస వైరాగ్యాలు మాత్రమను కొన్నంత సులభమా అని మరలా ప్రశ్న వస్తుంది. ఎందుకంటే బంధుమిత్రాదులూ వస్తు వాహనాదులూ - మనలను చాలా బలంగా పట్టుకొని బాధిస్తున్నాయి వీటన్నింటనీ నిరభి మానంగా చూడటమనేది అంత సుళువైన వ్యవహారం కాదు. అట్లాగే వాటిని కేవలం చైతన్యమనే దృష్టితోచూడటం కూడా చెప్పినంత సులభం కాదు.

చైతన్యమంటే జ్ఞానం. ప్రాపంచికమైన పదార్థాలన్నీ మనకు జ్జేయంగా Known కనిపిస్తాయేగాని జ్ఞానంగా Knowledge కాదు. జ్ఞానంగానయితే అసలు కనిపించనే కనిపించవు. మరి కండ్లు తెరచినా మూసినా వందలు వేలు మన చుట్టూ కనిపిస్తూనే ఉన్నాయి పదార్థాలు. అనుక్షణమూ చూస్తూనే ఉన్నాము వాటి రూపాలు మనం. అలా చూడటానికి బాగా అలవాటు పడ్డాము కూడ. అవి లేకుంటే ఉండలేని పరిస్థితికి కూడా వచ్చింది మానవుడి మనస్సు. అలాంటప్పుడు ఎంత శాస్త్రీయంగా నిరూపణ చేసినా ఈ రూపాలనన్నింటినీ కేవలం చైతన్య రూపంగా దర్శించగలమా అని కూడా పెద్ద అనుమానం.

దీనికి సమాధానమే ఈ శ్లోకం. అసంయతాత్ముడి కైతేనే ముందు చెప్పిన క్లేశం. వశ్యాత్ముడికి కాదట, ఆత్మ అంటే ఇక్కడ మనస్సనే అర్థం. మానవుని మనస్సు కొక గొప్ప సామర్ధ్యమున్నది. దానిపేరు సంయమం. సంయమమంటే ఒక పదార్ధాన్ని సంశ్లేషాత్మకంగా Synthetic చూచే మనస్తత్వం. లోకంలో మనమే పదార్థాన్ని చూచినా రెండువిధాలుగా చూస్తుంటాము. సంశ్లేషంగా Synthetic నైనా చూస్తాము. విశ్లేషం Analytic నైనా చూస్తాము. మనం దారిలో నడుస్తూంటే దారి ప్రక్కన ఒక చెట్టు కనిపిస్తుంది. దాన్ని చెట్టుగానే చూచామంటే పచ్చగా ఎత్తుగా ఒక అఖండమయిన రూపాన్నే చూస్తుంది. మన కన్ను. అప్పుడది సంశ్లేష దృష్టి.

అలాకాక అదేమిటి-ఇదేమిటి-అని విశ్లేషణ చేసి చూచామంటే చాలు. అదే కొమ్మలు రెమ్మలుగా-పూవులుగా కాయలుగా -గోచరిస్తుంది. చెట్టనే దృష్టితో చూచినవ్పుడీ విభాగాలన్నీ అక్కడే ఉన్నా గోచరం కావు. విభాగదృష్టితో చూచినప్పుడు చెట్టు అనే అఖండ రూపం మనసుకు రాదు. ఒకటి మగ్నమైతే merged ఇంకొకటి ఉన్మగ్న Emerged మవుతుంది. మొత్తంమీద రెండు శక్తులూ సహజంగానే ఉన్నాయి మానవుని మనస్సుకు. ఏ సందర్భంలోనయినా సరే. రెండు శక్తులూ ఏదో ఒక మోతాదులో పనిచేస్తూనే ఉంటాయి. ఒక దానిని విడిచి మరి ఒకటి ఉండదు. అలా ఉండేట్టయితే మన మనో నేత్రాని కెప్పుడూ పరమాత్మ అయినా కనిపించాలి. లేదా ఎప్పుడూ పరమాణువులయినా కని పించాలి. ఎందుచేతనంటే ఒకటి కేవల సంశ్లేషం. వేరొకటి కేవల విశ్లేషం. అయితే మనకలా కనిపించటంలేదు. దీనినిబట్టి మన ప్రతి ఒక్క అనుభవం లోనూ రెండూ కలిసే పనిచేస్తుంటాయని తార్కాణమవుతుంది.

అలాంటప్పు డీరెండు శక్తులలో ఒకదానిని తొంబది తొమ్మిది శాతం దాకా పెంచుకుంటూ పోగలిగితే మరొకటి కేవలం ఒక్క శాతమే కాబట్టి బాగా దుర్చలమై పోతుంది. అప్పుడది ఉన్నా మనకు ప్రమాదంలేదు. అసలే లయం కావడంలేదు కాబట్టి రెండూ అవినాభావంగా ఉండాలనే సూత్రానికి అపవాదం లేదు. అలాగే ఉన్నప్పటికీ దుర్చలం కాబట్టి దాని ఉనికివల్ల మనకు భయంలేదు.

అయితే ఇందులో ఏది తగ్గించుకోవాలి. ఏది హెచ్చించుకోవాలని ప్రశ్న తగ్గించుకోవలసింది విశ్లేష దృష్టి ఎందుకంటే అదే వైషమ్యానికి కారణం. దానికి భిన్నంగా సామ్యానికి కారణం కాబట్టి సంశ్లేష దృష్టిని హెచ్చించుకోవలసి ఉంది. సంశ్లేష దృష్టిని పెంచుకుంటూ పోతే చివరకంతా చైతన్యమే ననే భావనకు తీసుకుపోతుంది. అవ్పుడు మనసు తొంబది తొమ్మిదిపాళ్లు సంశ్లేష స్థితిలోనే ఉంటుంది. అప్పటికి ఒక్క భాగం విశ్లేష మనేది లేకుండా పోదని చెప్పాము. అయితే అది ఒక బిందు రూపంగా మారి చాలా బలహీనమవుతుంది. కాబట్టి చైతన్యాన్ని ఏమాత్రమూ బాధించలేదు. మీదు మిక్కిలి దానికే అధీనమై దాని ఇచ్చానుసారంగా ప్రవర్తించే శక్తిగా మారుతుంది. దీనినే అవ్యక్తమనీ - ప్రకృతి అనీ - మాయ అనీ - Cosmic power పేర్కొంటారు వేదాంతులు.

మొత్తంమీద ఇక్కడ ఉన్న పెద్ద షరతేమంటే నిరంతరమూ సంశ్లేష దృష్టినే పెంచుకుంటూ పోవటం. కొంతవరకూ ఇప్పుడే మనకున్నదది. అయితే అది చాలదు. విస్ఫులింగ మాత్రంగా ఉన్నదీనినే జ్వాలారూపంగా ప్రజ్వలింపజేయాలి మనం. అలా పరిణతి చెందాలంటే దానికి మొదటి నుంచీ సంయమ మనేది ఉండాలి. సంయమ మంటే సంశ్రేషమనే గదా పేర్కొన్నాము. ఈ సంశ్లేష దృష్టి మానవులందరిలో ఉన్నా సమానంగా ఉండదు. కొందరిలో దాని మోతాదు తక్కువ. కొందరిలో ఎక్కువ. వారిలో వ్యక్తమైన Concrete సంశ్లేషాలనే గమ నించగలరు గాని చాలామంది అవ్యక్తమైన Abstract వాటి నవగాహన చేసుకో లేరు. ఏ ఒకరిద్దరో అలా ఆకళించుకోగలరు. వారిని వశ్యాత్ములని వర్ణించారు పెద్దలు. మనస్సును కూడగట్టుకొని ఏది చూచినా అఖండంగా చూడడానికే అలవాటుపడి ఉంటారు వారు. సహజమైన శక్తి కొంత. అలవాటు కొంత. అది శక్తిని పెంచుతూపోతుంది. దానితో యోగాన్ని సాధించవచ్చు. శక్తి ఉన్నా 'పెంచుకోలేకపోతే అది అసంయమం అలాంటి వాడెప్పుడూ యోగానికి నోచుకోలేడు.