#


Back

Page 13

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


13
సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః ।
సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే ॥ 6-31 ॥

అసలు లోకంలో ఏ సందర్భాన్ని గానీ మనం చూచే చూపు రెండు విధాలుగా ఉంటుంది. నామ రూప క్రియల వరకూ పరిమిత మయ్యేది ఒకటి. వాటిలో దాగి ఉన్న తత్త్వాన్ని ఆకళించేది మరొకటి. నామాదుల మేరకే చూచేది ఆ మేరకే వచ్చి నిలిచిపోతుంది. అంతకన్నా దూరం పోలేదు. నామ రూపాదులు అసంఖ్యాకం కాబట్టి అవి వైషమ్యానికి దారితీస్తాయి. ఆ వైషమ్యంలో తగులు, కొన్న మనస్సు రాగ ద్వేషాదులకు గురి అవుతుంది. దానితో బరువెక్కి అంత కంత కగాధమైన ఊబిలో దిగబడి ఫోతుంది. అదే సంసార బంధం. ఉదాహర ణకు మన ఇండ్లూ వాకిండ్లూ ఆస్తూలూ పాస్తులూ - చుట్టాలూ - పక్కాలూ - వ్యాపారాలూ - వ్యవహారాలూ ఇవన్నీ మన మనస్సును సంకుచితం చేసేవే. పాతాళాని కీడ్చుకు పోయేవే.
అలాకాక ఈ నామ రూపాలనే ఆవరణాన్ని భేదించుకొనిపోయి చూడ గలిగితే అందులోని తత్త్వం మీద పడుతుంది మానవుని దృష్టి. తత్త్వమనేది సకల భూతాలలోనూ సమానంగా పంచి పెట్టబడి ఉంది. ఒక దానిలో హెచ్చుగా లేదు. మరొక దానిలో లొచ్చుగ లేదు. అణువు మొదలుకొని ఆకాశం దాకా అన్ని పదార్థాలనూ అలము కొని ఉంది. దాని నాకళించుకోవాలంటే మన చూపు కూడ ఏకాగ్రమే కావాలి. అనేకాగ్రమైన దృష్టి కది అంతు చిక్కదు. దాని కంతు చిక్కేవి నామ రూపాదులే. అవి మానవుడి కెప్పుడూ శాంతి నీయవని గదా చెప్పాము. శాంతే కావాలంటే ఎప్పటికైనా అనేకంలో ఉన్న ఏకత్వాన్ని మనసుకు తెచ్చుకోవటమొక్కటే మార్గం.

దీనికొక చక్కని దృష్టాంతం మనవి చేస్తాను. వినండి. మనమొక జవుళి అంగడికి వెళ్తాము బట్టలు కొన్ని బేరం చేయటానికి. అంగడిలో ఎన్నో రకాల బట్టలుంటాయి. అవి నూలువే కాదు - టెర్లినే కాదు - టెరికాటనే కాదు. చూచేకొద్దీ కళ్ళు జిగేలుమనిపించే గుడ్డలెన్నెన్నో మనకళ్ళ ముందు సాక్షాత్క రిస్తాయి. అందులో ఒక దానికున్న నేతా- నయమూ- నాజూకూ-మరొక దానికుండదు. వాటి మీదనే చూపు పెట్టి చూస్తూపోతే మన మెప్పటికీ తేరుకో లేము. ఏదీ నిర్ణయించుకోలేము. మనసు పరిపరివిధాల పరుగులు పారుతుంది.

అలా కాక ఇవన్నీ బట్టలే గదా- పడుగు పేకగా నేసినవే గదా- మాన సంరక్షణమే గదా వీటి ప్రయోజనం- అని భావించగలిగితే చాలు. ఏదో ఒకటి కొంటాము. వెళ్ళిపోతాము. చూడండి. ఇక్కడ మొదట చూపులో శాంతిలేదు. రెండవ దానిలో ఉంది. ఏమి కారణం. నామరూపాలనే చూచేసరి కేబట్ట కాబట్ట విశిష్టంగానూ విలువైనది గానూ కనిపించి మనసుకు విభ్రాంతి కొలిపింది. దానికి భిన్నంగా అన్నింటిలోనూ ఒకే స్వరూపాన్ని ఒకే ప్రయోజనాన్ని ఎప్పుడు చూచామో అప్పుడన్నీ వస్త్రంగానే భాసించి ఇందులో ఏదైనా ఒకటేననే తృప్తి నిచ్చింది.

దీనిని బట్టి ఏకత్వాన్ని దర్శిస్తూ పోవట మొక్కటే శాంతి దాయకమని అర్థమయింది. అలాంటి ఏకత్వం పిపీలికాది బ్రహ్మ పర్యంతమూ ఒకే ఒక ఆత్మ చైతన్యం తప్ప మరొకటి లేదని ఇంతకు ముందే చాటించాము. ఆ చైతన్యం కూడా ఎక్కడో లేదు. అది మన స్వరూపమే. అలాంటప్పుడిక మనకు భయ మేమిటి. మన స్వరూపం మన దగ్గరే ఉంది. మనమే. మన చూపే. ఆ చూపుతో మనం నిత్యమూ చూడగలిగితే చాలు. ఏది చూచినా- ప్రమాదం లేదు. ఆ చూపే మనలనొక అంగరక్షకుడి లాగా కాపాడుతూ పోతుంది. ఆయా కార్యాలు మనం నిర్వర్తిస్తున్నా వాటన్నిటినీ మనం బ్రహ్మాకారంగా మారుస్తూ పోతే అది పరమ శాంతిని మనకు ప్రసాదిస్తుంది.