#


Back

Page 110

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(ఉత్తరార్థమ్)


110
సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ।
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ॥ 18-66 ॥

కాబట్టి ఇంతకూ చెప్పవచ్చే దేమంటే మోక్ష సాధకుడైన మానవుడు ఇక మీన మేషాలు నెమరువేస్తూ కూచోరాదు. మనసు నిలుస్తుందా నిలవదా- మన మింత గొప్ప స్థాయిని ఈ జీవితంలో అందుకోగలమా - అందులోనే కూచుంటే మన గతి ఏమి - మన పనులెలా జరుగుతాయి - అని ఇలాంటి ఆలోచనలే వనికిరావు. అవన్నీ ప్రకృతి ధర్మాలు మనవి కావు. ప్రకృతి ధర్మాలు మన అవిద్యాదోషంవల్ల మనసులో చేరి మనలను నిత్యమూ భ్రమ పెడుతుంటాయి. ఇవే కర్మవాసన లంటే. సాధన సాగకుండా అడ్డు తగిలేవి ఇవే. కాబట్టి వీటన్ని టినీ సమూలంగా వివేచనా బలంతో పరిత్యజించాలి మోక్షకాముడు. ఒక్కటి కూడా లోపల మిగల నీయరాదు. బుణశేషం - శత్రుశేషమున్నట్లు ఏకొంచెం శేషించినా అది మన బుద్దిని దూషిస్తుంది. కాబట్టి శత్రువుమాదిరి ద్వేషించ వలసిందే. దానితో విక్షేపమనే దోషం Distraction పూర్తిగా తొలగి పోతుంది సాధకుడికి.

అయితే ఇది ప్రతిలోమసాధన. అనులోమం కాదు. విక్షేపం పోయినా ఆవరణమనే దోషమొకటి Contraction ఉంది మనకు. అది చాలా ప్రబలమైన దోషం. ప్రతిలోమంగా సాధిస్తే పోయేది కాదది. అనులోమంగా అభ్యసించాలి. అంటే అన్ని విక్షేపాలూ తొలగిన తరువాత ఉన్నదిక ఏమిటా అని ఆలోచించాలి. లేకుంటే అది శూన్యమయి కూచుంటుంది. ఇలాంటి శూన్యం సుషుప్తి మూర్భాది దశలలోనే ఉంది మనకు. ఇక క్రొత్తగా సాధనదేనికి. కాబట్టి విక్షేపం లేదు. శూన్యంకాదు - అలాంటి దేదో భావరూపంగా ఒకటి అనుభవానికి రావాలి మానవునికి. ఏమిటది. అదే “మామేకం శరణంవ్రజ” మాం అంటే నన్ను అని అర్ధం. నన్ను అంటే ఎవడా నేననే వ్యక్తి. ఎదుట నొగలమీద కూర్చొని గుజ్టాలుతోలే నీలమేఘ శ్యామలమైన విగ్రహమని తోస్తుంది. అది కాదు. అదే అయితే ఆ విగ్రహం అర్జునుడింకా బ్రతికి ఉండగానే కాల ప్రవాహంలో కలిసి పోయింది అది అర్జునుడికి ఎలా శరణ్య మవుతుంది. కాబట్టి నేనంటే ఒకానొక క్షేత్రంలో కుంచించుకు పోయిన నేనుకాదు. సర్వక్షేత్రాలలో వీరవిహారం చేసేనేను. అంటే “యేన సర్వ మిదంతత” మనే వాసుదేవ స్వరూపం. “వాసుదేవ. స్సర్వమితి” అనే వాక్యానికిది మరలా ప్రతిధ్వని. అక్కడా “మాం ప్రపద్యతే” అనే ఉందిమాట. మాం అనేది ఏమిటో వివరించా డక్కడ - “వాసుదేవ స్సర్వమితి” అని. వాసుదేవుడంటే వసుదేవస్య అపత్యం పుమాన్"కృష్ణః - అని పోతుంది మన శాబ్దిక మైన దృష్టి. అది కాదు “వాసుదేవ” అంటే. వసతి-సర్వత్ర అస్తి -దీవ్యతి-ప్రకాశతే- చైతన్య రూపేణ సదా - సర్వత్ర ఇతి వాసుదేవః ఏదైతే సర్వత్రా ఉన్నదో భాసిస్తున్నదో అది. మరో మాటలో చెబితే సత్తు-చిత్తు-ఇంతకన్నా ఏమీలేదు. ఇలాంటి తత్త్వమే నేనని గట్టిగా పట్టుకోవాలి. ఇదే శరణాగతి.
అలా పట్టుకొంటే చాలు. అది స్వతః ప్రకాశమైన ఆత్మతత్త్వమే కాబట్టి సుషుప్త్యాదుల లాగా అభావరూపం గాక భావ రూపంగానే నిలిచి ఉంటుంది. అంతే గాదు. అలా నిలిచిన ఆ. అఖండభావనే మన సకల పాపాలనూ ప్రక్షాళితం చేసి మనలను వాటి బారినుంచి బయటపడ వేస్తుంది. అదే విమోచన మీజీవుడికి. అప్పటి నుంచీ, అటు జగద్భావమూ లేదు. ఇటు జీవభావమూ లేదు. ఆవరణ విక్షేపాలు రెందూ పటాపంచలవుతాయి. దానితో త్రిగుణాత్మకమైన మాయ మన మీద పని చేయదు. మాయే లేదంటే తన్నిమిత్తంగా కలిగే విషాద మెప్పుడో బలాదూరయింది.

ఇందులో శరణాగతి మన వంతయితే పాపవిమోచన మీశ్వరుని వంతు. శరణాగతి అంటే అర్థం చెప్పాము. పాపమంటే ఇప్పుడు చెప్పవలసి ఉంది. పాపమన్నా పాతకమన్నా క్రింద పడగొట్టేదని అర్థం. శుద్ధ చైతన్య రూపుడైన జీవుణ్ణి మొదట పడగొట్టింది అవిద్య. ఆవిద్య పడగొడితే అక్కడినుంచి కామంలో పడ్డాము. కామం పడగొడితే కర్మలో పడ్డాము. కర్మ నుంచి మరలా జన్మలో పడ్డాము. ఇది ఒక పెద్ద పద్మవ్యూహం. విషవలయం. పడటమే తప్ప లేవటం లేదు దీనిలో. ఇలా పడగొట్టి పరమార్ధానికీ మనలను దూరంచేశాయి కాబట్టే ఇవన్నీ పాపాలే మనపాలిటికి. అవిద్యా కామ కర్మ జన్మలన్నీ పాపాలే.

వీటి నన్నిటినీ వదలించు కోవాలంటే ఏమిటి మనకిప్పుడు ఉపాయం. అది ఎప్పటికైనా ఆ పరమాత్మనే ఆశ్రయించటమే. అదే సబబు కూడ. ఎక్కడి నుంచి పడ్డామో-పడి దేనికి దూరమయ్యామో-మరలా దానినేకదా మనం పట్టుకో వలసింది. ఈ పట్టుకొనే భావం పరమాత్మ అయితే-పట్టుకొనే సాధనం విద్య, విద్యేకదా అవిద్యకు విరుగుడు. అవిద్యవల్ల క్రింద పడ్డాము. విద్య వల్ల పైకి లేస్తాము. విద్య అంటే బ్రహ్మమే నేనని మరలా గుర్తించటం. గుర్తిస్తే బ్రహ్మమే అవుతాడు జీవుడు. “బహ్మవిత్బ్రహ్మైవ భవతి” అని శాస్త్రమిచ్చే హామీ. అంచేత జ్ఞానమే అనుష్టాన మిక్కడ. అంతకన్నా అనుస్థాన Practice మనేది మరేదీ వేరుగా లేదు వేదాంత రంగంలో.

ఈ అనుష్టాన రూపమైన జ్ఞానం రెండు పాయలుగా ప్రవహిస్తుంది. ఒకటి నేనా పరతత్త్వాన్నే అంతకన్నా .' వేరుకాదనే భావన. ఇదే శరణాగతి. పోతే రెండవది ఆబ్రహ్మమనేది ఏదోగాదు-అది నాస్వరూపమే నేనేసుమా - అనే భావన. ఇదే పాపమోక్షమనేమాట. మనమీ ప్రపంచోపాధి అయిన జీవులం కాము - నిరుపాధికమైన చైతన్యమేనని అఖండగా ఎప్పుడు భావిస్తామో - ఆ అఖండవృత్తే మనల నీ అవిద్యామయమైన సంసార మహేంద్రజాలం నుంచి విముక్తులను చేస్తుంది. సందేహంలేదు. యద్భావ స్తద్భవతి. 'ఏది మనసా పదేపదే భావిస్తే అదే అవుతాడు మానవుడు. భ్రమరకీట దృష్టాంతమూ స్వవ్న దృష్టాంతమూ- ఇలాంటి దృష్టింతాలెన్నో ఉన్నాయి దీన్ని సత్యమని చాటటానికి.

ఏతావతా తేలిన సారాంశ మేమిటి. గీతా శాస్త్రాని కంతటికీ సారభూతమైన విషయమిదే. నేనొక జీవుడనే అని భావిస్తే - ఈ పిండాండమూ - బ్రహ్మాండమూ - వీటి మూలంగా సతమతమయ్యే నేనూ - వీటన్నిటికీ అతీతుడైన ఒక ఈశ్వరుడూ - ఇంత ఉన్నది వ్యవహారం. ఇదే సంసారబంధం. విషాదయోగం. కాగా నేనీ జీవుడేమిటి - సర్వదా సర్వధా సర్వత్రా ఉన్న చైతన్యమే నేనని ఎవ్పుడు భావిస్తామో అప్పుడు ఈ జీవుడులేడు. అండపిండాత్మకమైన ప్రపంచమూ లేదు. వీటి కతీతుడైన ఈశ్వరుడూ లేడు. అంతా కలిసి అద్భితీయమైన నాచిత్స్వరూపమే. నేనే. ఇదే సంసారమోక్షం. మోక్ష సన్వాసయోగం. ఇందులో మొదటిది అవిద్యవల్లనైతే - రెందవది విద్యవల్ల. కనుక అలాంటి ఆధ్యాత్మ విద్య అనే అమృత భాండానికి నిలయమే ఈ గీతాశాస్త్రమనే క్షీరసాగరం. అసుర శక్తితోగాక దైవసంపదతో దాన్ని మనోమందిరంలో పెట్టిమధించినప్పుడే మనమా అమృతరసాన్ని ఆస్వాదించ గలుగుతాము. అనంతానందానుభూతి నందుకోగలుగుతాము.