#


Back

Page 11

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


11
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ ।
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ॥ 2-48 ॥

బ్రహ్మస్వరూవమైన మోక్ష సుఖాన్ని చూరగొనాలంటే నిరంతరమూ మన మనస్సు సామ్యావస్థలోనే ఉండాలని చెప్పాము. ఇదిగో ఈ సామ్యమే నిజమైన యోగం. యోగమంటే ఉపాయమని అర్ధం. ఒక "ఫలితాన్ని సాధించే దాని కుపాయ Means మని పేరు. ఉపేయ End మిక్కడ మోక్షం. అది సామ్య స్వరూపం. దాన్ని సాధించే ఉపాయం కూడా సామ్యమే. సమదర్శనంతోనే సమత్వం సాధించాలి. కనుకనే ఆదీ అంతమూ కూడా సమత్వమేనని చెప్పటం. ఉపాయ రూపంగా ఆది అయితే ఉపేయ రూపంగా అంతం. దీనిని బట్టి బ్రహ్మమనేది ఎప్పుడూ అద్వీతీయమనే మాట తేటపడుతున్నది. సమత్వమే గదా బ్రహ్మమంటే.

సమత్వమే యోగమని కూడా చెప్పాము. అది ఒక్కటి సాధిస్తే చాలు. మిగతా యోగాలన్నీ అందులోనే కలిసివస్తాయి. అయితే దానికి సంగం మాత్రం పనికిరాదు. సంగమంటే నామరూపాది విశేష దృష్టి ఆ దృష్టి ఉన్నంత వరకూ అది వైషమ్యానికి దారి తీస్తుంది. ఎందుకంటే వైషమ్య మనేది సామ్యానికి విరుద్దం ఎలాగని ప్రశ్నించవచ్చు. ఒక ఇల్లు కట్టుకొని ఇది నాది అని కాంక్ష పెట్టుకొన్నాను. గ్రామంలో ఇంకా ఎన్నో ఇండ్లున్నాయి. కాని దానిని మాత్రమే నాదని అభిమానిస్తున్నాను. అంచేత అది విశేష దృష్టి అయింది. అందులో తగులుకొనే సరికి ఆ ఇంటిమీదనే లోకం నాకు. అలాంటి అభిమానం దాని ప్రక్కనే ఉన్న మరొక ఇంటిమీది ఉండబోదు. ఇక సమత్వమేముంది. అంతా వైషమ్యమే. అలాకాక అన్నీ ఇండ్లే గదా. ఇటుకా సున్నంతో కట్టినవే గదా - అని చూస్తే -- ఏదీ లేదు. వైషమ్య మెగిరిపోతుంది.

అంతేకాదు. ఇది మన దృష్టిలోనే ఉందిగాని ఆ వస్తువులో లేదని చెప్పటాని కెంతో దూరం పోనక్కరలేదు. కట్టకముందు నాది కాదది. మట్టిలో కలిసిపోతే నాది కాదు. డబ్బుకు కసాలాపడి వేరొకడికి విక్రయిస్తే నాది కాదు. అంతెందుకు ఈ క్షణంలో హఠాత్తుగా నేను కన్ను మూస్తే నాకు సంబంధం లేదు. ఇలా భావన చేస్తూ పోతే చాలు. వెంటనే వైషమ్య దృష్టిపోయి సామ్య దృష్టి మనసులో చోటు చేసుకోవటం ఖాయం. ఇదే యోగమంటే.
ఇలాంటి యోగం మానసికంగా. ఎప్పుడు సాధించామో జీవితంలో కూడా అది తొంగి చూస్తుంది. జీవితమంటే ఒక మనస్సే కాదు. మనోవాక్కాయములు -- మూడూ కలిసి జీవితం. అందులో మిగతా రెండింటికీ మనసు మూలం. మనసు ఆలోచించిందే మాటలోకి వస్తూంది. కర్మ అంటే పని గదా. ప్రతి పనికి వెనకాల పని చేసేది మనసే. ఒక దొంగతనం చేయాలని మనసులో అనుకు౦టే దొంగతనం చేస్తాము. అలాకాక దేవతార్చన చేయాలనుకుంటే దేవతార్చన చేస్తాము. ఏది సంకల్పిస్తే అది. సంకల్పాను గుణంగానే సకల కర్మలూ జరుగుతుంటాయి. అలాంటప్పు డాసంకల్పం సవికల్చంగా గాక ఎప్పుడూ నిర్వికల్పంగా ఉండగలిగితే జీవితంలో మనం తప్పకుండా సమత్వాన్నే చూడగలం. అంటే మనసులోనే గాక దైనందిన వ్యవహారంలో కూడా మన మా సమత్వ రూపమైన బ్రహ్మ చైతన్యాన్నే దర్శించగలమని భావం.

అయితే ప్రతి దినమూ మన మాచరించే పనులు ఎన్నో ఉంటాయి గదా. అందులో కొన్ని జరిగితే బాగుండుననీ కొన్ని జరగకుంటే బాగుండుననీ కోరుతుంటాము. ఇలాంటి ఇష్టా నిష్టాలు పని చేస్తున్నప్పుడు సమత్వ దృష్టి ఎలా నిలుపుకోగలమని ప్రశ్న వస్తుంది. వాస్తవమే. సవికల్పంగా భావించినంత వరకూ నిలుపుకోవడం కష్టతరమే. కాని నిర్వికల్పమైన భావనను అలవరచు కుంటే మాత్రం నిలవకుండా పోదు. ఆ భావన అలవడాలంటే నీకొకటే మార్గం. మనం చేసే ప్రతి పనీ తప్పక ఫలించాలనే పట్టుదల మనకుండ కూడదు. ఫలించకపోయినా ఒకటేననే బరోసా మనకుండాలి.

మరి ఈ బరోసా ఎలా ఏర్పడాలని ప్రశ్న. సంగమనేది లేనప్పుడే అది ఏర్పడుతుంది. అది ఎలా లేకపోతుంది. విశేష దృష్టికి స్వస్తి చెప్పినప్పుడే. దానికెప్పుడు స్వస్తి చెప్పగలం. అంతా నా చైతన్యమే - నా స్వరూపమేననే అఖండ భావన సడలకుండా పట్టుకొన్నప్పుడు. అదే గదా యోగమని చెప్పాము. ఆ యోగంలో పాదుకొనిపోవాలి సాధకుడి మనస్సు. యోగస్థః అనే మాటకిదే అర్థం. అలా పాదుకొన్న మనస్సుకు తన స్వరూపం తప్ప మరేదీ కనిపించదు. ప్రతి ఒక్కటీ తన స్వరూపమే. అలాంటప్పుడిక ఏది ఆలోచించినా - తదను గుణంగా ఏ పని చేసినా - అందులో భేదం కానరాదు. స్వరూప భావనతోనే చూస్తాడు. కాబట్టి జయాప జయాదులైన ద్వంద్వాలు రెండూ సమానంగా స్వీకరించే ధైర్య మేర్చడుతుంది. అప్పటినుంచీ సాధకుడి జీవితమిక ఎలాంటి ఒడిదుడుకులూ ఒత్తిడులూ లేకుండా ప్రశాంతంగా నడుస్తూ పోతుంది.