#


Back

Page 10

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


10
ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః ।
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః ॥ 5-19 ॥

సుఖ దుఃఖాదులైన ద్వంద్వాలు సమానంగా అనుభవానికి రావటమే సామ్యం. ఇలాంటి సామ్యావస్థలో మన మనస్సెప్పుడూ నిలవగలిగితే చాలు, మనమీ సృష్టిని జయించామన్న మాటే. "సృష్టిని జయించటమంటే సృష్టి రహస్యాన్ని భేదించటమే. సృష్టి రహస్యమేమిటి, ద్వంద్వ మోహమే సృష్టిలో ఉన్న రహస్యం. సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరం తప” అని భగవానుడే సెలవిచ్చాడు. ఈ ద్వంద్వ సంఘాతం వల్లనే సామ్యం దెబ్బతిని - వైషమ్య మేర్చడింది. అదే సృష్టికంతా మూలం. సామ్య వైషమ్యాలనేవి మరొక మాటలో చెబితే సామాన్య విశేషాలనవచ్చు. అందులో సామాన్యమనేది జ్ఞానం. అది పదార్థాలన్నింటినీ వ్యాపించి ఉంది. కాబట్టి అదే సామాన్యమనేమాట కర్థం. పోతే విశేషాలనేవి దానికి విలక్షణంగా కనిపించే నామరూపాలు. ఇవే అఖండంగా వ్యాపించిన జ్ఞానాన్ని జ్ఞేయ రూపంగా మనకు ప్రదర్శిస్తున్నాయి. వీటిని చూస్తున్నంత వరకూ వీటికి మూలమైన సామాన్యం మీదికి మన దృష్టి పోదు. అలా పోనంత వరకూ సృష్టికి మనం లోబడవలసిందేగాని సృష్టిని మనం లోబరచుకోలేము. విశేషాలను త్రోసిరాజని కేవలం సామాన్యాన్ని నిఘాపెట్టి చూచినప్పుడే మన దృష్టి త్రిగుణాత్మకమైన సృష్టిని దాటిపోగలదు. సామాన్యమే అసలు బ్రహ్మస్వరూవం. దానికి విశేష మనేది ఒక దోషం. సవిశేషంగా చూస్తే బ్రహ్మమే ప్రపంచంగా భాసిస్తుంది. అప్పుడది సదోషం. నిర్విశేషంగా చూస్తే మరలా ఈ ప్రపంచమే బ్రహ్మంగా అనుభవానికి వస్తుంది. అప్పుడది నిర్ధోషం.

కాబట్టి సాధకులుగా మనం చేయవలసిన పని ఏమిటి. సవిశేష దృష్టిని వదులుకోవాలి. నిర్విశేషమైన సామాన్య దృష్టినే అంతకంతకు అభ్యసిస్తూ పోవాలి అలా అభ్యసిస్తూ పోతే క్రమంగా ఈ సంసారానికి దూరమవుతూ ఆ బ్రహ్మ తత్త్వానికి దగ్గర పడతాము. అది సమగ్రమయ్యే నాటికి సమగ్రమైన బ్రహ్మానుభవాన్నే అందుకో గలుగుతాము. ఆ బ్రహ్మమే నేననే భావంతో ఉండి పోతాము. అలా ఉండటమే మోక్షం. అదే అమృతత్వం.

ఎటువచ్చీ ఆ సమదర్శనాన్ని సాధించటంలోనే ఉన్నది ఉన్నదంతా. అది అన్నింటికీ ఆది. ఆన్నిటికీ అంతం. కొంత నేర్పున్న వాడికది సాధించటం కూడా ఏమంత దుష్కరం కాదు. మామూలుగా లోకంలో మనమే వస్తువును గాని - వ్యక్తిని గాని దృష్టించి చూడము. చూచీ చూడనట్లు వెళ్ళిపోతుంటాము. అలాకాక కొంచెం సేపలాగే దృష్టి పెట్టి చూడడం నేర్చుకోవాలి. చూస్తే అందులో రూప గుణాదులేవీ మన దృష్టికి అంతగా రావు. అంతకంత కాపదార్ధం అస్పష్టంగా సూక్ష్మంగా మారిపోతుంది. ఎంతెంత ఖాళీ అవుతుందో - అంతంత మన చైతన్య మా ఖాళీని భర్తీ చేస్తుంది. అప్పుడంతా మన స్వరూపమేననే ప్రత్యయ Notion మొకటి తప్పకుండా ఏర్పడుతుంది.

ఈ విధమైన నిర్వికల్ప దృష్టితో చూచేవాడికి సృష్టిలో ఎన్ని వికల్పాలున్నా అడ్డురావు. చరాచర పదార్ధాలేవి ఎప్పుడు తారసిల్లినా అవన్నీ సామాన్య రూపమైన Universal తన స్వరూపంగానే అనుభవానికి వస్తాయి. అప్పుడీ సృష్టిలో వైవిధ్యం గాదు - ఏకత్వమే దర్శనమిస్తుంది. ఆ ఏకత్వం కూడా నాకు భిన్నంగా కాదు. నేనుగానే నాకు సాక్షాత్కరిస్తుంది. ఇది సాధనలో కొంత ప్రవేశమున్న వాళ్ళకు గాని అవగాహనకు రాదు.