#


Back

Page 1

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు


(పూర్వార్థమ్‌)


1
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ।
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ॥ 2-11 ॥

ఇది మన సాధకగీతలో మొదటి శ్లోకం. విషాదంతో ప్రారంభమవుతున్నది గీత. విషాదమే జీవితానికున్న ఏకైక సమస్య. ఇది ఒక అర్జునుడికే గాదు. అర్జునుడు నరుడైతే మనమంతా కూడా నరులమే. కాబట్టి నరులందరికీ ఉన్న సమస్యే ఇది. ఏమిటా సమస్య. ఎప్పుడూ శోకిస్తూ ఉండటం. ఎవరిని గూర్చి శోకించటం. ఎవరిని గూర్చి శోకించకూడదో వారిని గూర్చి. ఎవరా శోకించ గూడని వారు. గతాసువులు. అంటే చనిపోయిన వారు. చచ్చిపోయిన పుత్ర మిత్ర కళత్రాదులను గూర్చి ఎప్పుడూ పరితపిస్తుంటాడు మానవుడు. అలాగే అగతాసువులు. బ్రతికున్న వారిని గురించి కూడా బాధపడు తుంటాడు. ఎప్పుడో ఒకప్పుడు వారిమాదిరే వీరుకూడా పోకతప్పదు గదా అని.

ఇలా వ్యథ చెందటంవరకే అయితే బాగుండును. అదేదో అజ్ఞానంవల్ల తెలియక అలా బాధ పడుతున్నారని సమాధానం చెప్పుకోవచ్చు. అలాంటిది కాదిక్కడ వ్యవహారం. అన్నీ తెలిసిన ప్రజ్ఞావంతుల లాగా మరలా అభినయిస్తుంటారు మానవులు. అర్జునుడు ప్రదర్శిస్తున్న దిప్పు డిలాంటి ప్రజ్ఞా వాదమే. భీష్మ ద్రోణాదులను చంపితే తనకు పాపం వస్తుందనీ- దానివల్ల నరకంలో పడవలసి వస్తుందనీ- పితృపితామహాదులంతా అలాంటి కుల పాంసనుల మూలంగా ఉత్తమగతులు లేకుండా పోతారనీ- ఇలా ఏకరువు పెడుతూ పోతాడర్జునుడు. చచ్చిన తరువాత జీవుడనే వాడుంటాడనే విషయం తెలియకపోతే అతడీ పుణ్యపాపాలూ -స్వర్గనరకాలనూ గూర్చి ఎలా చర్చించ గలడు. చర్చించాడంటే అప్పటికి శరీరం కంటే భిన్నంగా జీవుడనే వాడొక డున్నాడని గ్రహించాడనే అర్ధం. గ్రహించే ప్రజ్ఞ ఉన్నప్పుడిక భీష్మాదులు మరణిస్తున్నారే అని దుఃఖపడటం దేనికి. మరణించినా అదివారి శరీరమేగాని శరీరి అయిన జీవుడు కాదు గదా.

ఇదుగో ఇలా తెలిసీ తెలియని ప్రసంగం చేయటం వల్లనే అర్జునుణ్ణి చీవాట్లు పెడుతున్నాడు భగవానుడు. నరుడికి బోధ చేయవలసింది నారాయణుడే గదా. అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకొని మనబోటి నరుల కందరికీ చేసే బోధ అది. సరిగా అర్జునుడి కున్న అవలక్షణమే మనందరికీ కూడా ఉంది. మనకు కొంత తెలుసు. కొంత తెలియదు. తెలియని దాన్ని తెలుసు కొందామనే ఓపిక లేదు మనకు. అంతా తెలిసినట్టు పండితులం కాకపోయినా లేని పాండిత్యాన్ని ఒలక బోస్తుంటాము. పాండిత్యమంటే నీవూ నేనూ అనుకొనేది గాదు పాండిత్యం. చచ్చినవారి కోసం గాని చావబోయేవారి కోసం గాని ఏమాత్రమూ విలపించ కుండా ఉండ గలగటమే అసలైన పాండిత్యం- అని చాటుతున్నాడు భగవానుడు.

పండా ఆత్మ విషయా బుద్ది:- సా యేషాం తే వండితాః- పండ అంటే ఆత్మ విషయమైన జ్ఞానం. అది ఎవడి కుంటే వాడు పండితుడు. ఈ కనిపించే, శరీరమూ - ఇదే నేనని భ్రమించే జీవుడూ- ఇది రెండూగాక వీటి రెంటినీ గ్రహిస్తున్న శుద్ధమైన చైతన్య మేదో అదీ ఆత్మ అది ప్రతి ఒక్క ప్రాణీ లోపలా వెలపలా కూడా వ్యాపించి ఉన్నది. దానికీ శరీరాదులన్నీ ఉపాధులే Medium. ఉపాధు లనేవి భౌతికం Physcial కాబట్టి ఎప్పటి కప్పుడు మార్పు చెందుతుంటాయి. మార్పు చెందటం వల్లనే ఎప్పుడో ఒకప్పుడు పూర్తిగా మార్పుచెంది మరణిస్తాయి.

పోతే చైతన్య మనేది ఇలా మార్పు చెందేది గాదు. మార్పుల నన్నిటినీ కసిపెట్టి చూచేది కాబట్టి మార్పు చెందదు. అదీ మారితే దాని మార్పును తెలుసుకొనేది వేరొకటి కావలసి వస్తుంది. కనుక అది మారేది కాదు. మారేది కాకపోతే మరణించేది కూడా కాదు. కాబట్టి చైతన్య మనేది నిత్య సిద్ధం. దానికి గోచర మయ్యే శరీర మనః ప్రాణాధికమైన ప్రపంచమంతా ఇక అనిత్యమే. వీటికే ఆత్మానాత్మలని పేరు పెట్టారు వేదాంతులు. ఆత్మ అమృతం. అనాత్మ మృతం.

ఇందులో మృతమైన అనాత్మనే ఆత్మ అని భ్రమపడుతున్నాము మనమంతా. శరీరాది సంఘాతాన్నే గదా మనం నేను-నేను-అని అభిమానించి వ్యవహరిస్తున్నాము. ఎప్పుడీ తాదాత్మ్య బుద్ధి Identify పెట్టుకొన్నామో అప్పుడీ శరీరం పోగానే మనమూ పోవలసి వస్తున్నది. అంటే దాని మరణాన్ని మన కారోపణ చేసుకొంటున్నాము! ఇది ఆత్మ ఏదో అనాత్మ ఏదో వివేచన చేయకపోవటం వల్ల కలుగుతూ ఉన్న అనర్థం.

ఈ అనర్థం పోగొట్టుకొని పురుషార్ధాన్ని చేపట్టాలంటే మరలా మన మీ అనాత్మ సంఘాతం నుంచి మన ఆత్మను వేరు చేసుకొని చూడాలి. చూస్తే అది మన స్వరూపమే. కాబట్టి అదే నేననే అసలైన ఆత్మ జ్ఞానముదయిస్తుంది. ఉదయిస్తే అది అమృతమైన తత్త్వం కాబట్టి ఈ శరీరాదులు నశించినా నేను నశించకుండా చైతన్య రూపుడనై ఎప్పుడూ నిలిచి ఉంటాననే భావ మేర్పడు తుంది. అలాంటప్పుడిక భీష్ముడేమిటి -ద్రోణుడేమిటి-నీవేమిటి-నేనేమిటి. ఎవరున్నాపోయినా మనకు దిగులు లేదు. పోయేదక్కడ శరీరాదులే గాని ఆత్మ గాదు.

ఇదుగో ఇలాంటి ఆత్మా నాత్మా వివేచనకే సాంఖ్యమని. పేరు. దీనివల ఆత్మ జ్ఞాన మలవడితే అది పండ. పండ గలవాడే పండితుడు. పండితుడైన వాడికి వీడు 'బ్రతికున్నాడు-వీడు మరణిస్తున్నాడనే భేద దృష్టిలేదు. ఆత్మ దృష్టితో చూస్తే ఎవ్వడూ నిజంగా మరణించటం లేదు. అందరూ అమృతులే. ఇక విషాదం దేనికి. అలాంటి పాండిత్యం లేని వాడికే విషాద మనేది. కాబట్టి సాంఖ్య బుద్ది నలవరుచుకొని పండితుడవై మనవాళ్ళూ మనమూ ఎప్పటికైనా మరణిస్తా మేమోననే భయాన్ని వీడి నిర్భయంగా బ్రతకమని భగవానుడి ఉపదేశం.