#


Back

సాధక గీత

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు

రంగభూమి


వేదాంత విజ్ఞాన రంగంలో భగవద్గీత కున్న ప్రచారం మరి దేనికీ లేదు. అన్నీ తెలిసిన పండితుల దగ్గరి నుంచీ ఏమీ తెలియని పామరుల దాకా దాని నభిమానించే వారే, ఆబాల గోపాల మందరికీ అది శిరోధార్యమే. మహాభారతంలో ఇది గాక ఇంకా ఎన్నో ఉన్నాయి గీతలు. హంస గీత- బుభు గీత-బ్రాహ్మణ గీత- అనుగీత- ఒకటేమిటి- చాలా ఉన్నాయి. వాటికి తోడు సనత్సుజాతీయ మోక్ష ధర్మాల లాంటి ఘట్టాలు కూడా ఏమంత తక్కువవి కావు. అయినా దీనికి వచ్చిన ప్రఖ్యాతి వాటికి రాలేదు.

ఏమి కారణం. సకల వేదార్ధ సార సంగ్రహ మది. వేదంలో చెప్పిన ప్రవృత్తి నివృత్తి ధర్మాలు రెండూ చోటు చేసుకొన్నాయందులో. ప్రవృత్తి అంటే కర్మ భక్తి సమాధులు. నివృత్తి అంటే కేవలం జ్ఞానం. భగవద్గీతలో నాలుగూ కనిపిస్తాయి మనకు. అంతవరకేగాదు _నాలుగింటినీ _సమన్వయించటంలో ఉంది దాని గొప్పతనం. అది ఎలా గని అడగవచ్చు. పేరుకు పద్దెనిమిది అధ్యాయాలని విభజించినా అన్ని అధ్యాయాలలో చెప్పిందీ నాలుగే యోగాలు. ఈ నాలుగూ మరలా రెండే. “లోకేస్మిన్‌ద్వివిధా నిష్టా పురా ప్రోక్తామయార్జున” అని స్వయంగా చెప్పుకొన్నాడు కృష్ణ భగవానుడు. ఈ లోకానికి  రెండే రెండు యోగాలు బోధించాడటతాను. అవి ఒకటి జ్ఞానం. _ మరొకటి యోగం. యోగ మంటే కర్మ అని అర్ధం. అప్పటికి జునమూ - ఆ - కర్మా - ఇవి రెండే భగవాను డుపదేశించింది. ఇవి రెండూ కూడా ఇంకా కొంత లోతుకు దిగి చూస్తే మరలా ఒక్కటే: దీనికి కూడా భగవానుడి ఆమోద ముద్ర ఉంది. ఏకయ్‌సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి సపశ్యతి. జ్ఞాన కర్షులూ రెండూ నిజాని కొక్కటే - అవి రెండూ ఒక్కటేనని గ్రహించిన వాడే ధన్యుడని చాటుతాడు. ఇలాంటి సమన్వయం భగవద్గీతలో తప్ప మరెక్కడా కనిపించదు మనకు.

అంతే కాదు. ఇలాంటి సమన్వయ జ్ఞానంతోపాటు విజ్ఞానాన్ని కూడా ప్రసాదించటం గీతలోని మరొక విశిష్టత. జ్ఞానం వేరు. విజ్ఞానం వేరు. విజ్ఞానమంటే శాస్త్ర జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోటం.. “జ్ఞానం తేహమ్‌సవిజ్ఞానమ్‌- జ్ఞాన్‌విజ్ఞాన నహితమ్‌” అని అక్కడక్కడా భగవానుడు సెలవిచ్చిన మాటలలో అంతరార్థ మిదే. ప్రస్థానత్రయంలో అసలు నిదిధ్యాసనకు ప్రాధాన్యమిచ్చేది భగవద్గీత. నిదిధ్యాసనమంటే అనుభవమే. అనుభవమనేది ఎప్పుడూ ప్రత్యక్షమేగాని పరోక్షం గాదు. మిగతా ప్రాపంచిక పదార్థాల లాగా బ్రహ్మభావం కూడా మానవుడికి ప్రత్యక్షంగానే అనుభవానికి వస్తుందనీ - అది సాధించే మార్గం కూడా అతి సులభమనీ - చాటించే ధైర్య మొక్కగీతకే చెల్లు, ప్రత్యక్షావ గమమ్ ధర్య్వమ్ - సుసుఖమ్‌కర్తు మవ్యయమ్‌” అని గీత ఇచ్చిన హామీ. ఇదే తదుపదేశ లక్ష్యం కూడా.

అయితే ఇది ఇంత బహిరంగ సత్యమై - అందుకోట మింత సులభమైతే ప్రతివారి అనుభవానికీ రావాలిగదా - ఎందుకు రావటంలేదని ప్రశ్న వస్తుంది. దానికి కారణం మానవ మనోదర్చణానికి పట్టిన మాలిన్యమే. కాబట్టి దానిని శుద్ది చేసుకోటానికి మొదట కర్మయోగమూ - శుద్ది అయిన తరువాత ఏకాగ్రత కోసం సమాధియోగమూ- ఆ తరువాత ఒక ఆలంబన కోసంగా భక్తియోగమూ - అలవరచుకోవాలనీ - ఆ పిమ్మట వా వాటన్నిటి ఫలితంగా ఆత్మజ్ఞాన ముదయిస్తే - అది చివరకు విజ్ఞానరూపమైన అనుభవంగా మారుతుందనీ - ఒక చక్కని భూమికాక్రమాన్ని నిర్దేశిస్తుంది గీత! దీనితో పరస్పరం విరుద్ధంగా కనిపించే సాధన మార్గాలన్నీ ఏకరూపంగా మారి అంతా బ్రహ్మాత్మానుభవంలో పర్యవసానం చెందుతాయి. దీనిస బట్టి లోకంలో ఎవరి అంతస్తుకు తగినట్టు వారు తమ కనువైన మార్గాన్ని అనుసరిస్తూ పోవచ్చు. ఒక్కసారిగా అందరూ జ్ఞానాన్ని అందుకోలేరు. మానవులలో ఉత్తములుంటారు, మధ్యములుంటారు. మందు లుంటారు. అతి మందు లుంటారు. అందరినీ దృష్టిలో పెట్టుకొనే గీత అందరికీ అన్ని మార్గాలు బోధించిందీ. అవే కర్మ భక్తి సమాధి యోగాలు. భగవానుడే అంటాడొకచోట, మమ వర్త్మాను వర్తంతే - మనుష్యాః పార్థ సర్వశః. ఎవరేది పట్టుకొని పోయినా మొత్తాని కందరూ నా మార్గంలో ఉన్నవారేనని 'చాటుతాడు. అయితే ఒక పెద్ద హెచ్చరిక ఏమంటే ఇవన్నీ సాధకుల సౌకర్యం కోసం చెప్పినవే. గాని సాక్షాత్తుగా ప్రతి ఒక్కటీ ఇందులో మోక్షపదవికి తీసుకు పోతుందని భ్రాంతి పడరాదు. సాక్షా న్మోక్ష ప్రదాయక మొక్క జ్ఞానమే. అది వెంటనే లభించక పోతే దానికివి పరంపరయా indirect సాధనాలు. జ్ఞానముదయిస్తే ఇక వీటి కస్తిత్వం లేదు. సర్వమ్ ‌కార్మఖిలమ్ ‌పార్థజ్ఞానే పరిసమాప్యతే, సర్వయోగాలూ జ్ఞాన యోగంలో పరిసమాప్తం కావలసిందే నంటుంది గీత.

ఇలాంటి సకలజన హి తైషిణి అయినది భగవద్గీత. ఇంత శాస్త్రార్ధ సంప్రదాయాలతో కూడింది గనుకనే దాన్ని శాస్త్రంగానే మనం భావించాలని బోధిస్తారు శంకర భగవత్పాదులు. ఆయన అలాగే దర్శించి వ్యాఖ్యానించారు దాన్ని. అది అతి లోకమైన అత్యద్భుతమైన వ్యాఖ్య. దాని వెలుగులో తీర్చిదిద్దినదే ప్రస్తుతమీ నా తెలుగు వ్యాఖ్య. దీనికి నేను సాధక గీత అని పేరు పెట్టడం కూడా సాభిప్రాయమే. వేదాంతంలో సాధన అనే దేమిటి - అది ఎలా సాగించాలని ఎందరో అడుగుతుంటారు నన్ను గీతలో ఉంది - చూచుకోండని సలహా ఇచ్చినా అది ఆ మహారణ్యంలో ఎక్కడ ఎలా ఉందో గుర్తించలేక తికమక పడుతుంటారు. అంచేత సాధన మార్గానికి సంబంధించిన శ్లోకాల నన్నింటినీ ఏర్చి ఒక వరుసలో చేర్చి వాటి అర్ధాన్ని వివరించి చెప్పటం మంచిదని తోచింది నాకు అందుకోసమే ఈ కృషి.

ఇది ఇంతకు ముందే వ్రాసి ప్రకటించిన గ్రంథం. అప్పట్లో ఒక వంద శ్లోకాలు మాత్రమే తీసుకొని వివరణ వ్రాశాను. అది ఉండగా మరలా ఇది వ్రాయవలసిన అవసరం లేదు వాస్తవానికి. అయితే అందులో ఒక పెద్ద ఇబ్బంది ఏర్పడింది. ముద్రాపకుల అనవధానం వల్ల ఆ గ్రంథంలో ఎన్నో అచ్చు తవ్పులు దొర్లాయి. ఒక్కొక్కచోట అక్షరాలూ - పదాలూ - వాక్యాలే ఎగిరి పోయాయి. అచ్చు కూడా అంత బాగాలేదు. ఒకటి రెండు చోట్ల కాగితాలే తిరగబడ్దాయి. దీనికి తోడు శ్లోకాలకు క్రమ సంఖ్య ఇవ్వలేదు. మూలంలోని సంఖ్యాక్రమాన్నీ చూపలేదు. ఇన్ని అవకతవకలతో ఆ పుస్తక మొకరు చదవాలన్నా కష్ట మని పించింది. వారి కివ్వాలన్నా నాకు సిగ్గనిపించింది.

అంచేత ఇలాంటి కొరత తీర్చి మరలా దాని నున్నంతలో చక్కగా తీర్చిదిద్ది సాధక లోకాని కంద జేయాలనే సదుద్దేశంతో ప్రస్తుత మీ గ్రంథాన్ని నేను ప్రచురించ వలసి వచ్చింది. ఎలాగూ పునః ప్రయత్నం తప్పలేదు గదా అని ఆ నూటికి తోడు మరి ఒక పదహారు శ్లోకాల నేనిందులో చొప్పించి మొత్తం నూట పదహారుగా మీ కందిస్తున్నాను. నూట ఎనిమిదంటే ఒక అర్జముంది గాని - నూట పదహారేమిటని ప్రశ్న రావచ్చు. దాని కన్నా చాలా పెద్ద అర్జమే ఉంది ఇందులో. ఛాందోగ్యోపనిషత్తులో ఒక మాట ఉంది, మానవుణ్ణే ఒక యజ్ఞంగా భావించి వాడి జీవితకాల మంతా మూడు సవనాలుగా విభజించారట. మొదటిది ప్రాతస్సవనం. అది బాల్యం. రెండవది మాధ్యందిన సవనం. అది యౌవనం. మూడు సాయం సవనం. వార్దక్యం. మూడింటికీ మామూలు యజ్ఞంలో మాదిరే మూడు ఛందోనియమాలున్నాయి. మొదటి దానికీ అనుష్టుప్పు ఛందస్సు. రెండవ దానికి త్రిష్టుప్పు. మూడవ దానికి జగతి. ఇందులో అనుష్టుప్పు కిరవయి నాలుగక్షరాలైతే - త్రిష్టుప్పుకు నలభయి నాలుగైతే - జగతికి నలభయి ఎనిమిది. ఇవి బాల్యం ఇరవయి నాలుగు సంవత్సరాలకూ - మధ్యకాలం నలభయి నాలుగింటికి - వార్దక్యం నలభయి ఎనిమిదింటికీ - సంకేతాలుగా భావించమన్నారు. అప్పటికి మొత్తం మన ఆయుర్దాయం నూరుగాదు, నూట పదహారవుతుంది.

ఈ నూట పదహారు వత్సరాలు మానవుడొక పవిత్రమైన యజ్ఞంగా భావించి ఉపాసిస్తే ఆయురారోగ్యాదులే గాక పరమపద ప్రాప్తికి కావలసిన ఉత్తమ జ్ఞానం కూడా లభిస్తుందట. అందుకే నేమో పెద్దలకు సమ్మానం చేసే టప్పుడు మనం నూట పదహార్లు సమర్పించటమనిపిస్తుంది. ప్రస్తుతం నూట పదహారు గీతా శ్లోకాల నెన్ను కోవటంలో నా ఉద్దేశం కూడా ఇదే. నూట పదహారు శ్లోకాలూ నూటపదహారు జీవితాబ్బాలకు సంకేతంగా భావించాను నేను. జీవేమ శరద శృత మన్నట్టు నూటపదహా రేండ్లు మనం బ్రతకాలని - బ్రతికిన బ్రతుకు మరలా వృధా కాకుండా ఒక్కొక్క శ్లోక మొక్కొక్క విలువైన జీవిత వర్షంగా భావించి అధ్యయనం చేయాలని - చేసి తరించాలనే నిగూఢమైన అభిసంధి Intention ఉంది నాకు. అందుకే ఈ సంఖ్యాను సరణం.

అయితే ఒక సందేహం రావచ్చు చాలా మందికి. గీతలో నుంచి మీరెన్ని శ్లోకాలైనా తీసుకోవచ్చు. ఎన్ని తీసుకొన్నా ఒక వరసలో తీసుకొనాలిగదా. వరస తప్పిస్తే మీకు ప్రతిపాద్యమైన విషయంలో క్రమమెలా సరిపోయింది - అని. వాస్తవమే. మూలంలో కచ్చితంగా అలాంటి క్రమం పాటించి ఉంటే సరిపోయేది కాదు. కాని అధ్యాయ విభాగం మినహా విషయ ప్రతిపాదనలో అంతకచ్చితమైన పరిపాటి Order లేదు మూలంలో కర్మ భక్తి యోగ జ్ఞానాదులన్నీ కలగా పులగం చేసి వ్రాసిన ఘట్టాలెన్నో ఉన్నాయి. ఒక విషయం వర్ణిస్తున్నప్పుడే విషయాంతరాన్ని ప్రస్తావించటం కూడా జరిగింది. ఒక విషయమే మాటిమాటికీ చెప్పడం కూడా కద్దు. అసలు అధ్యాయ విభాగంలో కూడా అంతక్రమం కనిపించదు. సాంఖ్యం తరువాత కర్మా - కర్మ తరువాత మరలా జ్ఞానమూ - కర్మసన్వ్యాసం తరువాత ఆత్మా సంయమమూ జ్ఞాన విజ్ఞానం తరువాత మరలా అక్షర పర బ్రహ్మమూ- ఇలా ఎంతో వ్యుత్క్రమమం కనిపిస్తుంది. పోతే సాంఖ్యం - జ్ఞానం - విజ్ఞానం- పురుషోత్తమ - క్షేత్రజ్ఞ- ఇవన్నీ చెప్పే విషయ మొక్కటే. ఒక విధంగా పునరుక్తి ఇది.

అయితే ఎందుకింత గందరగోళ మేర్చడిందని అడుగుతారేమో. గందరగోళం కాదిది. మన వేదాంత గ్రంథాల విధానమే ఇది. ఉపనిషత్సం ప్రదాయాన్నే గీత కూడా అనుసరించింది. అందులో సాధకులకు, - అన్ని అంతస్తులలో ఉండే వారికీ- అన్ని మాటలూ చెప్పవలసి ఉంది. వాటికి మరలా పరస్పర సంబంధం చూపవలసి ఉంటుంది. ఏది బోధించదలిస్తే దాన్ని ప్రశస్తమని వర్ణించవలసి ఉంటుంది. అన్నింటిలోనూ పరమ ప్రధానమైనది మరలా సూచించవలసి ఉంటుంది. మొత్తానికి దేనికది తెగగొట్టినట్టుగాక అన్ని జీవిత సత్యాలను కలిపి ఒక ముద్దగా చేసి అందించటమే భారతీయ తత్త్వశాస్త్ర సంప్రదాయం.

ఈ రహస్యం తెలియకపోతే అంతా మనపాలిటికి గంగదరగోళంగానే కనిపిస్తుంది. ఇదుగో ఇది నూటికి నూరుపాళ్ళూ గ్రహించిన మహానీయుడు జగద్గురు శంకర భగవత్పాదులొక్కరే. మిగతా వారంతా గీతనొక పుక్కిటి పురాణమని భావిస్తే ఆయన దానినొక గొప్ప శాస్త్రంగా భావించారు. శాస్త్రీయమైన మార్గంలో వ్యాఖ్యానించారు. శాస్త్ర దృష్టినొక కరదీపికగా ధరించి పయనిస్తుంటే అల్లిబిల్లిగా అల్లుకొన్న ఆ లతా గుల్మ మార్గంలో ఆయనకు దారులు స్పష్టంగా అన్యోన్య విలక్షణంగా కనిపించాయి. ఏ శ్లోక మే ప్రకరణం Context లోనిదో - ఏ ప్రకరణమే అధ్యాయం లోనిదో - ఏ అధ్యాయాని కే అధ్యాయాంతరం సంబంధించిందో మొత్తం శాస్త్రాని కాద్యంతాలేవో అసలు శాస్త్ర ప్రతి పాదితార్ద మేమిటో - అత్యద్భుతంగా వివరించారాయన. ఒక విధంగా చెబితే పాణినీయాష్టాధ్యాయిని భట్టోజీ దీక్షితులు సిద్ధాంత కౌముదిగా మలిచినట్టు మలచారాయన.

ఆ గురువుగారు చూపిన రహదారిలో పయనించిన వాడనే నేను. ఎక్కడ ఏ శ్లోకం తీసుకొన్నా - అటూ ఇటూ క్రమం మార్చినట్టు కనిపించినా - నేనను కొన్న విషయం క్రమం ఏ మాత్రమూ మారబోదు. ఇది సాధక గీత కాబట్టి సాధకుల మార్గానికి పనికివచ్చే శ్లోకాలనే ఏరుకొన్నాను. తదనుగుణమైన వరుసలో పేర్చుకొన్నాను. శ్లోకశ్లోకానికీ సంబంధం కలుపుతూ ఒక శృంఖలా రూపంగా వివరిస్తూ వచ్చాను. తన్మూలంగా మాతృకలోని భావక్రమం తప్పదు సరికదా - దాని కింకా ఎంతో అనుకూలంగా కలిసి వస్తున్నది. ఇలా మైనం లాగా ఎటు తీస్తే అటుసాగి వస్తున్నదంటే అది భగవద్గీత సార్వపధీనమైన రచన. భాష్యకారుల అనన్యా దృశ్యమైన వ్యాఖ్యాన కౌశలం. ఈ రెండూ నేత్రాలుగా పనిచేస్తున్నంత దాకా నాకు దారితప్పే భయమేముంది. నాకూ లేదు – నాతో పాటు మీకూ లేదు. భగవద్గీత అంతా బంగారమే కాబట్టి ఎక్కడ ఎంత చేతికి తీసుకొని మనకు కావలసిన సొమ్ము లెలాంటివి చేసినా చేసుకోవచ్చు.

పోతే చివరిమాట నేను చెప్పేదేమంటే అది మీరు శ్లోకాలతో చదివినా సరే. శ్లోకాలు చూడకుండా చదువుతూ పోయినాసరే. మధ్యలో తెగిపోవటమంటూ ఉండదు, శాస్త్ర విషయమంతా అనుస్యూతంగా మనసుకు వస్తుంది. అది కూడా సాధన మార్గాని కనుగుణంగా బోధపడుతూ వస్తుంది. కేవల విషయ జ్ఞానం కంటే సాధనే ముఖ్యంగా భావించాను కాబట్టి దానికనుగుణంగా పోవాలని శ్లోకాలు వ్యాఖ్యానించటంలో కూడా స్వాతంత్ర్యం చాలావరకూ అవలంబించాను. అయితే ఎంత స్వాతంత్ర్యమైనా అది మరలా మొదలు చెడ్డబేరం గాదు. అద్వైత దర్శనమనే కేంద్ర బిందువును వదలకుండా ఎక్కడికక్కడ దానిని స్పృశిస్తూనే ఉంటాను. కాబట్టి సిద్ధాంత సాధన సమన్వయ రూపమైన గ్రంథమిది. Imitation of Christ అనే ఆంగ్ల గ్రంథంలాగా ఇది ఒక క్రొత్త బాణిలో నడచిన అభినవ గీత అనుకోవచ్చు. సహృదయ జిజ్ఞాసువులు దీన్ని జాగ్రత్తగా పఠించి నేనుద్దేశించిన ప్రయోజనాన్ని అందుకోగలిగితే నా శ్రమకు కూడా ఫలాన్ని అందుకోగలను.

సాధయామ స్తావత్‌.

పార్ధాయ ప్రతి బోధితాం భగవతా నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితాం పురాణ మునినా మధ్యే మహాభారతమ్
‌ అద్వైతామృత వర్షిణీం భగవతీ మష్టాదశాధ్యాయినీ
మంబ! త్వా మనుసందధామి భగవద్గీతే! భవద్వేషిణీమ్‌.