• Youtube
    •  
    • English
    •  

రాముడు-కృష్ణుడు



-సభా వేదిక-

దశావతారాలలో రెండే ఉన్నాయి విభవావ తారాలు. రాముడు, కృష్ణుడు. ఒకటి ధర్మానికి మరొకటి మోక్షానికి ప్రతీకలు. అందుకేనేమో భక్తులందరూ చాలా వరకు రాముణ్ణి పట్టుకుంటే - జ్ఞానులైన వారు కృష్ణుణ్ణి భజిస్తారు. మేము అద్వైతులం. మాకు రాముడైనా ఒకటే - కృష్ణుడైనా ఒకటే. ఇద్దరూ భగవదవతారాలే. అందులో జ్ఞానం భగవత్స్వరూపమైతే – ధర్మం దాని విభూతి. ఇక వైరుధ్యమేముంది. ఇది గమనించేనేమో మహాభక్తుడూ మహాజ్ఞాని అయిన పోతన మహాకవి నల్లని వాడు పద్మనయనంబుల వాడని ఒకే మూసలో బోసి ఇద్దరి మూర్తులనూ మన ముందు నిలిపాడు. రెండు పద్యాలలో ఒకటి చక్రవర్తి రూపమైతే వేరొకటి చక్రధారి స్వరూపం. ఆమాటకు వస్తే స్వరూపమే విభూతి. విభూతే స్వరూపం. కనుకనే రామకృష్ణులిద్దరూ నిలబడ్డారొకే వేదిక మీద. దూరంగా గాదు. పక్క పక్కనే నిలుచున్నారు. మౌనంగా మనలను పలకరిస్తున్నారు కూడా. ఏమని. మేమిద్దరమూ అభ్యర్ధులమే. మాలో ఎవరికి వేసినా మీరు ఓఋ వేయవచ్చు. వేస్తే ఇద్దరమూ పంచుకొని ఒకే పదవి నందుకొని కలిసి కట్టుగా పనిచేస్తాము. మమ్ముల నాశ్రయించి బ్రతుకుతున్న మీ కందరికీ సమానంగా శాంతి సౌఖ్యాలు పంచి పెడతా మని హామీ ఇస్తున్నారు. చూడ ముచ్చటగా లేదూ వారి మూర్తి. విన ముచ్చటగా లేదూ వారి మాట. విందామెంత వరకూ నిలబడతారో – నిలబెడతారో ఈ మహానుభావులు తమ వాగ్ధానం.

ఇతి
రామకృష్ణ చరణ ద్వయదాసః
యల్లంరాజ శ్రీనివాసః





                        1.రాముడు

 

 

                        2.కృష్ణుడు








Back Next






     All Rights Reserved by M.Sudhakar  - 9440524168