#


Back

ప్రస్థానత్రయము

మానవ జీవితానికి పట్టుకొన్న ఒకే ఒక సమస్య విషాదం. దాన్ని పోగొట్టుకొనే మార్గమేమిటా అని చాలా దూర మాలోచించారు మన పెద్దలు. వారే మహర్షులు. వారు ధ్యానంలో కూచుని దర్శించిన సత్యమే ఉపనిషత్తుల రూపంగా వెలువడింది. ఈశావాస్యం మొదలు బృహదారణ్యకం వరకూ పది ఉపనిషత్తుల సారమూ అదే. అది ఉన్నదున్నట్లు ఆకళించు కోలేక వాదోపవాదాలు బయలుదేరితే వాటిని సమన్వయించి చూపాడు మరలా బాదరాయణుడనే ఆచార్యుడు. ఆయన రచించినవే బ్రహ్మ సూత్రాలు. ఉపనిషత్తుల మీద సాగించిన విచారణ కాబట్టి దీనికి వేదాంత మీమాంస అని కూడా పేరు. ఈ రెండింటి మూలంగా మానవుడు గ్రహించిన సిద్ధాంతాన్ని తన దినచర్యలో దృష్టాంతం చేసుకోవాలంటే అది చూపటానికి వచ్చింది భగవద్గీత.

ఇప్పుడీ మూడింటికీ కలిపి ప్రస్ఠానత్రయమని పేరు పెట్టారు మన ప్రాచీనులు. ప్రస్థానమంటే విషాదమనే సమస్యను తొలగించుకొనే మార్గం. విషాదం సమస్య అయితే మోక్షమనేది దానికి పరిష్కారం. పరిష్కార మార్గం ఒకటే అయినా అది అంచెలవారీగా ప్రయాణంచేసి అందుకోవాలి సాధకుడు. అవి మూడు భూమికలు. ఒకటి శ్రవణం. ఉన్నదంతా ఒకే ఒక ఈశ్వర చైతన్యం. అదే మన స్వరూపం. అంతకు మించి ప్రపంచమనేది వేరుగా లేదు - అని వేదంతుల సిద్ధాంతం. అది ముందు ఉపనిషత్తుల ద్వారా మనం శ్రవణం చేసి గ్రహించాలి. మరి చరాచర ప్రపంచ మొకటి మన చుట్టూ ప్రతిక్షణమూ చూస్తున్నాము గదా. దీనివల్లనే గదా మనకీ బాధలన్నీ. అలాంటప్పుడిదంతా పరమాత్మే నని ఎలా అర్ధం చేసుకోవాలనే సందేహ మేర్పడితే దాన్ని బ్రహ్మ సూత్రాల ద్వారా మననం చేసి పోగొట్టుకోవాలి మనం. అప్పుడు సంశయం పోయి అంతా ఈశ్వరుడేననే నిశ్చయ ఙ్ఞాన ముదయిస్తుంది. అయితే అది మానసికమే గాని ఆ అద్వైత భావం జీవితంలో అనుభవానికి వస్తుందా అని సందేహం. దానికి జవాబిస్తుంది మూడవది భగవద్గీత. ఆ జవాబే నిదిధ్యాస. నిదిధ్యాస అంటే ఏది చూసినా పరమాత్మేననే దృష్టి వదలకుండా చూడటం.

ఇలా శ్రవణ మనన నిదిధ్యాసలనే మూడు దశలలో ప్రయాణం చేస్తే చాలు. చివరకు విషాదమనే సమస్య తప్పకుండా పరిష్కారమయి మోక్షమనే మహాఫలం సిద్ధించి తీరుతుంది. కనుకనే మూడింటికీ కలిపి ప్రస్థాన త్రయమనే పేరు సార్థకంగా పెట్టారు శాస్త్రఙ్ఞులు. కనుక జీవిత గమ్యమైన పురుషార్థమందుకోవాలంటే ప్రతి భారతీయిడికీ ఈ ప్రస్థానత్రయమనేది చదివి అర్థం చేసుకోవలసిన బాధ్యత ఉంది. ఒక్క భారతీయులకే గాదు. ఆ మాటకు వస్తే ప్రపంచ మానవులందరికీ ఇది కర్తవ్యమే. సందేహం లేదు. ఎందుకంటే అందరికీ ఉన్న సమస్యే సంసార బంధమనేది. అందులో నుంచి బయట పడాలంటే ఇక ఏ లౌకిక విద్యలూ కళలూ పట్టుకొన్నా సుఖం లేదు. ఏదో కొంత ఙ్ఞానమందిస్తాయే గాని పరిపూర్ణమైన ఙ్ఞానాన్ని అనందాన్నీ ప్రసాదించలేవవి. సావిద్యా యా విముక్తయే అన్నారు. ఏది జన్మతారకమో అదే విద్య అంటే. అది ఈ ప్రస్థాన త్రయం ద్వారా మనకు లభించే బ్రహ్మ విద్యే గాని మరేదీ గాదు. అంచేత అలాంటి బ్రహ్మవిద్య మానవుడికవి ఎలా బోధిస్తున్నాయో సంగ్రహంగా తెలుసుకుందా మిప్పుడు.

ఉపనిషత్తులు

1. ఈశావాస్యం

ఉపనిషత్తులు ప్రధానమైనవి పది అని పేర్కొన్నాము. ఈ పదింటిలో మొదటిది ఈశావాస్యం. ఈశావాస్యమిదగ్ం సర్వం. ఈ ప్రపంచమంతా ఈశ్వర చైతన్యంతో నిండి పోయిందని చాటుతున్నదీ ఉపనిషత్తు. అందుకే ఆపేరు వచ్చింది దీనికి. వాస్తవంగా ఇది పరమాత్మ స్వరూపమే అయినా అలా కనపడటం లేదీ ప్రపంచం. నామరూపాత్మకంగా కనిపిస్తున్నది. అలా కనిపిస్తున్నంత వరకూ దీనివల్ల బాధలు తప్పవు. అంచేత ప్రతి ఒక్కటీ కేవల మున్నదనే స్ఫురణే తప్ప మరే విశేషమూ లేదనే దృష్టి అలవరచు కోవాలి మనం. ఎక్కడ ఉందా స్ఫురణ. తదంతరస్య. ఎక్కడా అనే ప్రశ్నే లేదు. ప్రతి దాని లోపలా వెలుపలా సొమ్ములలో బంగారంలాగా వ్యాపించి ఉంది. బంగారమనే దృష్టి వదలకుండా ఆభరణాలు చూచినట్టే ఈశ్వర చైతన్య దృష్టితో చూడాలి ప్రతి ఒక్కటీ.

అయితే అలాటి ఙ్ఞానం పెట్టుకొని కూచుంటే దినచర్య ఎలా చేయాలి మనం. పరవాలేదు. ఏవంత్వయి. మనో వాక్కాయాలతో ఏ పనిచేస్తున్నా ఆ దృష్టి పెట్టుకొనే చేయవచ్చు. అప్పుడీ కర్మ ఆ ఈశ్వర స్పృహ కడ్డు రాదు. అది మానసిక స్ఫురణ. ఇది భౌతికమైన చర్య. శత్రుత్వం లేదు రెంటికీ. ఙ్ఞానమే ఈ కర్మలనే ప్రణాళిక ద్వారా బయటపడి ప్రసరిస్తున్నట్లు చూడవచ్చు. ఙ్ఞానం కనపడదు. అది చేసీ కర్మ కనపడుతుంది. కనపడే ఈ కర్మ ఏదో కాదు. దీని వెనకాల ఆ ఙ్ఞానమే ఉందనే అవగాహన ఉంటే చాలు. ఇది ఎలాంటిదంటే ఒక బల్బు వెలుగుతుంటుంది. ఒక ఫాను తిరుగుతుంటుంది. ఇవి కనపడుతుంటాయి మనకు. కాని వీటికి ప్రేరణ నిచ్చే విద్యుచ్ఛక్తి కనపడదు. పైకి కనపడక పోయినా దాని క్షేత్రంలోనే ఇవి పనిచేస్తున్నట్టు - అదే వీటి ద్వారా బయట పడుతున్నట్టు దర్శించటం లేదా మనం. అలాగే ఇదీ.

అలా దర్శించాలంటే ఈ ఆకారాలకూ వ్యాపారాలకూ Forms and Functions వెనకాల ఉన్న ఆ నిరాకారమైన ఆత్మ చైతన్యాన్ని ఒక విద్యుచ్ఛక్తిలాగా అవగాహన చేసుకొనే శక్తి ఉండాలి మానవుడికి. అది కలిగే వరకూ కొంతకాలం ఆ నిర్గుణమైన తత్వాన్ని సగుణంగా ధ్యానం చేస్తూ పోవాలి. దీనికే ఉపాసన అని Meditation పేరు. అలా చేస్తూ పోతే మనసు బాగా నిర్మలమూ ఏకాగ్రమూ అవుతుంది. చివర కవసానంలో ఆ భావమే మనసులో నిలచి సాధకుడు తన ప్రాణశక్తిని సూర్యశక్తిలో ప్రవేశపెట్టి దాన్ని కూడా భేదించుకొని సత్యలోకం దాకా ప్రయాణం చేస్తాడు. అక్కడ నిర్గుణ ధ్యానం చేసే చతుర్ముఖ బ్రహ్మ, ఆయన చుట్టూ ఉన్న వసిష్ఠాది మహర్షులతో పాటు తానూ ఆ శిక్షణ పొంది చివరకు నిరాకారమైన ఆ తత్వాన్ని తన స్వరూపంగా భావన చేసి తరించగలడు. ఇదీ ఈశావాస్యం మనకు చేసే బోధ.

ఇందులో రెండు భాగాలున్నాయి. ఉత్తమాధికారి అయితే ఇహంలోనే అంతా నిర్గుణమైన తత్వమేనని స్వానుభవానికి తెచ్చుకొని ఇక్కడే ముక్తుడవుతాడు. మధ్యమాధికారి Mediocre అయితే జీవితాంతమూ సగుణంగా ధ్యానించి మరణానంతరం ధ్యానబలంతో పరలోకానికి వెళ్ళి అక్కడ ఙ్ఞాన మలవరచుకొని తరిస్తాడు. మొదటిది సద్యోముక్తి. రెండవది క్రమముక్తి.

2. కేనోపనిషత్తు

అయితే ఈ సాకారమైన ప్రపంచమే గదా మనకు కనిపిస్తున్నది. దీనికి వెనకాల ఒక నిరాకారమైన ఈశ్వర చైతన్యమున్నదా అని సందేహం. ఉన్నదని గట్టిగా చెబుతున్నది కేనోపనిషత్తు. కేనేషితంపతతి - మనసు దగ్గరి నుంచీ మన ఈ శరీరమనే ఉపాధి ఏమి. దీనికి బాహ్యంగా చూచే ఈ చరాచర ప్రపంచమేమి - ఇవి రెండూ ఇలా కనిపిస్తున్నాయంటే వీటి వెనకాల చేరి నడుపుతున్న దొక దివ్యశక్తి. అది వీటిలాగా అపరిపూర్ణం కాదు. పరిపూర్ణమైన ఙ్ఞానం. పరిపూర్ణమైన శక్తి. అదే ఈశ్వరుడు. అది లేకపోతే ఇవి లేవు. అంతే కాదు. నిరాకారమైన అదే తన శక్తి ప్రభావం చేత సాకారమైన ఈ పిండాండ బ్రహ్మాండాల రూపంలో గోచరిస్తున్నది.

అది మన మర్ధం చేసుకోవాలంటే కేవలం దీన్ని మాత్రమే చూస్తూ దీనితోనే వ్యవహరిస్తూ పోతే సరిపోదు. మన ప్రతి ఆలోచనలో - ప్రతి మాటలో ప్రతి చేష్టలో ఈ విశేషాలన్నింటిలో - పరచుకొని ఉన్న ఆ సామాన్య స్వరూపాన్నే Universal దర్శిస్తూ పోవాలి. కంటితో గాదు. మనస్సుతో. నిరాకారం గదా. ఎలా చూడటమని ఆశ్చర్యపడనక్కరలేదు. నిరాకారమైన ఆకాశాన్ని ఎలా చూస్తున్నావు నీవు. పోతే సుఖమూ దుఃఖమూ భయమూ ఉత్సాహమనే భావాలకు కుడా ఒక ఆకారమంటూ లేదు గదా. వాటినెలా అనుభవించ గలిగావు. అలాగే చూడవచ్చు. చూచే అవకాశమెంతైనా ఉంది.

అసలు మన మనస్సు కున్న సామర్ధ్యాన్ని మనం గుర్తించటం లేదు. అది సవికల్పంగానూ పని చేస్తుంది. నిర్వికల్పంగానూ చేస్తుంది. సవికల్పమంటే ఇదీ అదీ అని సవివరంగా తేడాగా చూడటం. అలాకాక అంతా కలిపి ఒకే ఒక అఖండమైన పదార్ధంగా చూస్తే అది నిర్వికల్పం. ఒక చెట్టును చూచేటపుడిది బోద ఇది కొమ్మ ఇది ఆకు ఇది కాయ అనీ చూడవచ్చు. లేదా దూరాన్నుంచి ఒకే ఒక సమిష్టి పదార్ధంగానూ చూడవచ్చు. ఈ సమిష్టికే సామాన్యమని పేరు. ఇందులో దాని విశేషాలన్నీ కలిసిపోయి ఏకంగా ఉంటాయి. అలాగే ప్రస్తుతమీ మనస్సనీ ప్రాణమనీ ఇంద్రియాలనీ ఇలా వేర్వేరుగా గాక ఇదంతా కేవలమొక ఉందనే స్ఫురణే గదా అని భావిస్తూ పోయా మనకోండి. అది నిర్వికల్పమైన దృష్టి.

ఈ దృష్టి బలపడే కొద్దీ అది నిరాకారం కాబట్టి అందులో ఈ సాకారమైన శరీరం లీనమయి పోయి నిరాకారమైన చైతన్యంగా మనమిందులో నుంచి బయటపడే అవకాశముంది. ప్రతి విశేషంలో దాన్ని దర్శించినప్పుడే అలా జరుగుతుంది. భూతేషు భూతేషు విచిత్య ధీరాః - ప్రేత్యాముష్మాల్లోకాదమృతా భవంతి. ప్రతి పదార్ధంలో నిరాకారమైన ఆ భావాన్ని భావిస్తూ పోతే ఈ శరీరంలో నుంచి బయటకి వచ్చి బ్రతికుండగానే మన మమృతత్వాన్ని పొందగల మంటుందుపనిషత్తు. మృతులమై కూడా అమృతులమే మనం. భౌతికంగా మృతులం. ఆధ్యాత్మికంగా అమృతులం. Immortal.

ఈ గొప్ప భావాన్నే ఒక కథ ద్వారా బయట పెట్టిందుపనిషత్తు. కథలన్నీ సత్యాన్ని బోధించే సంకేతాలు symbols మాత్రమే. సత్యం పరమాత్మ. అది ఏమిటో అగ్నికీ వాయువుకీ అర్థం కాలేదట. అంటే మనస్సుకూ ప్రాణానికని అర్థం. ఆ మనః ప్రాణాలు దేని కుపాధులో అలాటి జీవచైతన్యమే దేవేంద్రుడు. దానికి కూడా ప్రయత్నం లేకుండా అనుభవానికి రాలేదది. అందుకే ఇంద్రుడు కూడా కళ్ళు మూసుకొని ధ్యానించవలసి వచ్చింది. అప్పుడు ఉమా రూపంగా ఒక దేవత సాక్షాత్కరించి అతనికి మార్గం చూపింది. అది మనసులో కలిగే బ్రహ్మాకార వృత్తి The idea of the Reality. అదే ప్రమాణం బ్రహ్మమనే ప్రమేయాన్ని చూడటానికని ఉపనిషత్తు సందేశం.

3. కఠోపనిషత్తు

మనసు బ్రహ్మాకార వృత్తితో నిండిపోతే చాలు. అవసానంలో ఆ మనససే బ్రహ్మాకారంగా మారి అమృతత్వమనే మోక్ష ఫలం లభిస్తుందని హామీ ఇచ్చింది కేనోపనిషత్తు. అమృతత్వమంటే మరణం లేక పోవటమే గదా. నిజంగానే మరణ మనేది లేకుండా పోతుందా అని మానవుడికి మరలా అనుమానం. ఈ అనుమానంతోనే నచికేతుడనే ఒక ముని కుమారుడు యమలోకం దాకా పోయి సాక్షాత్తూ యమధర్మరాజునే నిలదీసి అడిగాడు. యత్వం పశ్యసి తద్వద - నీవు నిజంగా చూచే చెబుతున్నావా అని అడుగుతాడు.

దానికి యముడు సమాధానమిస్తూ ఆత్మను దర్శించ గలిగితే అది సాధ్యమే నంటాడు. ఆత్మ అంటే ఏమిటి. అది ఎక్కడ ఉంది. సర్వేషు భూతేషు గూఢః - ప్రపంచమంతా వ్యాపించి ఉంది. కాని గుప్తంగా ఉంది. మరి ఎలా పట్టుకోటం. బుద్ధి బాగా పదునెక్కితే అదే పట్టుకోగలదా తత్వాన్ని. అప్పుడు తమలపాకు నుంచి దాని ఈనె బయటకి లాగినట్టు, ఈ నామరూప ప్రపంచం నుంచి వేరు చేసి చూడగలదు ఆత్మ చైతన్యాన్ని. చూస్తే ఆ చైతన్యానికి మరణం లేదు కాబట్టి దాన్ని పట్టుకొన్న ఈ జీవుడికి కూడా లేదు మరణం. ముక్తుడయి పోతాడు.

కాని చెప్పినంత సులభం కాదిది. దానికొక సాధన క్రమముంది. బాహ్యమైన పదార్ధాల నుంచి ఇంద్రియాల దగ్గరికి - ఇంద్రియ వృత్తుల నుంచి మనసు దగ్గరకి - మనస్సు నుంచి అంతకన్నా విశాలమైన మహత్తు దగ్గరికి - దాన్ని కూడా దాటి అవ్యక్తమైన శక్తికీ - ఆశక్తిని కూడా దాటి పూర్ణమైన ఆత్మ చైతన్యానికీ ఎదుగుతూ పోవాలి మానవుడి ఙ్ఞానం. అప్పుడది ఎక్కడి కక్కడ విశేషరూపంగా పరిమితమై పోక సామాన్యరూపంగా వ్యాపిస్తుంది. అందులో ఈ నామరూపాలన్నీ సముద్ర జలంలో తరంగ బుద్బుదాలలాగా చేరిపోతాయి. అన్నీ చేరిపోయినట్టే జనన మరణాలనే భావాలు కూడా ఒక విశేషమే కాబట్టి అవీ ఆ దృష్టిలో లయమయి పోగలవు.

శరీరం ఒక రథం. జీవుడొక రథికుడు. బుద్ధి వీడికి సారథి. ఇంద్రియాలు దీన్ని లాగే గుఱ్ఱాలు. అయితే ఇవి ప్రాపంచిక విషయాలనే మార్గంలో కాక వీటినన్నింటినీ వ్యాపించిన చైతన్య మనే గమ్యాని కభిముఖంగా పయనించాలి. అప్పుడే జీవిత గమ్యమైన మోక్షాన్ని అందుకోటం సులభమవుతుంది. ఇదీ కఠోపనిషత్తు మనకిచ్చే సలహా.

4. ప్రశ్నోపనిషత్తు

ఇది వినటాని కెంత రమణీయంగా ఉన్నా ఇందులో ఏదైనా ఉపపత్తి చూపితే కాని నమ్మకం పుట్టదు సాధకుడికి. ఉపపత్తి అంటే హేతువు Reason. హేతువే కాక దృష్టాంతం కూడా చూపాలి మనకు శాస్త్రం. ఆ బాధ్యత వహిస్తుంది ప్రశ్నోపనిషత్తు. ఆరు ప్రశ్నలు వేశారు ఆరుగురు మహర్షులు పిప్పలాదుడనే బ్రహ్మర్షిని. అందులో మూడు ప్రాణానికీ మూడు మనస్సుకూ సంబంధించినవి. మనస్సులోనే ఙ్ఞానమనేది ఉదయిస్తుంది. అదే అనుభవానికి కూడా నిలయం. మనసు ఙ్ఞానశక్తి అయితే ప్రాణం క్రియాశక్తి. సాధన అంతా క్రియే. కాబట్టి మొదట ప్రాణ విషయం నడచింది. తరువాత ఈ క్రియ ద్వారా మనసులో ఏర్పడవలసిన ఆ ఙ్ఞానమేదో బోధిస్తుందుపనిషత్తు.

ఎలాగాంటే జనన మరణాదులైన భావాలన్నీ నామరూపాల సంపర్కం వల్లనే కలుగుతున్నాయి. ఈ నామరూపాలనే కళలని పేర్కొన్నది. ఇది ప్రాణం మొదలుకొని నామం దాకా పదహారు. షోడశ కళలని పేరు వీటికి. కళ అంటే ఒక శకలం, ఖండం, అఖండమైన ఆత్మ చైతన్యమే 16 కళలుగా కనిపిస్తున్నది మనకు. వీటితో కలిపి పట్టుకుంటే అది సకలం. అప్పుడు సంసారమే గాని సాయుజ్యానికి నోచుకోలేడు జీవుడు. ఎందుకంటే వీడి బుద్ధీ సకలమే. వీడు చూచే ప్రపంచమూ సకలమే. అంచేత ఈ సకలాన్నే మరలా నిష్కలంగా చూడాలి మనం. అంటే ఎక్కడి నుంచి ఈ కళలు జన్మించాయో అక్కడే వీటిని లయం చేసి చూడాలి. చూస్తే అప్పుడీ ప్రపంచమే పరమాత్మగా మారి దర్శనమిస్తుంది. నదులన్నీ మరలా సముద్రంలో కలిసి సముద్రమనే ఒకే ఒక రూపంగా మారినట్టు ప్రాణేంద్రియాది విశేషాలన్నీ నిర్విశేషమైన ఆత్మ చైతన్యంగా అనుభవానికి రాగలవు. అలాంటప్పుడిక జనన మరణాది చింత ఏముంది. అవీ కళలే కాబట్టి చైతన్యరూపంగా నిష్కళమై అనుభవానికి వస్తాయని ప్రశ్నోపనిషత్తు పరిష్కారం.

5. ముండకోపనిషత్తు

ఇందులో ఉపపత్తి ఏమంటే ఎందులో నుంచి ఒకటి జన్మిస్తుందో అది అందులోనే చివరకు లయమవుతుంది. అసలది జన్మించటం - దాని జన్మస్థానం ఫలానా అని మనకు చూపటానికే. కార్యాన్ని బట్టి కారణాన్ని అందుకోవాలి మానవుడు. అందుకే సృష్టి వాస్తవంగా జరగకపోయినా జరిగినట్టు వర్ణిస్తుంది శాస్త్రం. ఈశ్వరుడు జీవుడిగా వచ్చి శరీరంలో ప్రవేశించక పోయినా నిజంగా ప్రవేశించినట్టే వర్ణిస్తుంది. ఈ సృష్టి ప్రవేశాలు రెండూ వాస్తవం కావు. శాస్త్రం చేసిన కల్పన. కారణమేమంటే ఇవి వాస్తవంగా చూస్తున్నంత వరకూ మోక్షం లేదు మానవుడికి. అలా చూడవద్దని కేవల మాత్మ తాలూకు ఆభాసే. అదే జీవ జగద్రూపంగా భాసిస్తున్నది. వీటి నాధారం చేసుకొని పయనిస్తే ఇవే మనలను ఆ మూలతత్వం దగ్గర చేరుస్తాయని చెప్పటమే శాస్త్ర హృదయం. ఈ భావమిప్పుడు బయటపెడుతున్నది ముండకోపనిషత్తు.

జడపదార్థాల దగ్గరి నుంచి చేతన పదార్థాల వరకూ సమస్తమూ ఆ పరమాత్మ నుంచి అగ్నిహోత్రం నుంచి నిప్పు రవ్వలలాగా చెదిరిపడ్డవే. కనుకనే ఇవి ఆద్యంతాలలో పరమాత్మ స్వరూపమే. మధ్యలో వేరుగా కనపడుతున్నా అదే వీటి స్వరూపం. బ్రహ్మ పశ్చా ద్బ్రహ్మ పురస్తాత్. అంచేత మానవుడు తన ముందూ బ్రహ్మమే తన వెనకా బ్రహ్మమే - పైనా క్రిందా చుట్టూ ఉన్నదంతా బ్రహ్మ చైతన్యమేనని చూడాలి. అదే గొప్ప సాధన. దాని కోసం ప్రణవోధనుశ్శరోహ్యాత్మా - ఓంకారమే ధనుస్సు - మనస్సే అందులో ఎక్కుపెట్టిన బాణం - బ్రహ్మమే దానికి లక్ష్యమని భావించి దాన్నే భేదించి పట్టుకోవాలి మనస్సుతో నిరంతరం. అదే మోక్షదాయకం.

6. మాండూక్యోపనిషత్తు

ఓంకారమంటే అది ఒక శబ్దం. శబ్దమెప్పుడూ అర్థాన్ని చెబుతుంది. సంకేతమే గదా సత్యాన్ని చెబుతుంది. శబ్దం సంకేతం. ఓంకారమనేది అలాటి సంకేతమే. అందులో ’అ’, ’ఉ’, ’మ’ అని మూడక్షరాలున్నాయి. మూడింటికీ మాత్రలని పేరు. మాత్ర అంటే కొలిచేది. ఇందులో ’అ’ జీవుడి జాగ్రదవస్థను - ’ఉ’ స్వప్నావస్థను - ’మ’ సుషుప్తినీ కొలుస్తాయి. అవి కొలుస్తుంటే ఆత్మ చైతన్యం వాటిచేత కొలవబడుతుంటుంది. వాటికి పాదాలని పేరు. స్వతహాగా కొలత లేని ఆత్మ ఈ కొలమానంతో జీవరూపంగా మారి మూడవస్థ లనుభవిస్తున్నది. ఇదే సంసార బంధం. మాత్రలు ఆలోచనలైతే పాదాలు వాటి తాలూకు బాహ్యరూపాలు. Ideas and Things. ఇలాంటి వాచ్యవాచక సంబంధమనే లావాదేవీ ఉన్నంత వరకూ సంసార క్లేశం తప్పదు మనకు.

ఇప్పుడీ అవస్థాత్రయం దాటిపోతే గానీ తురీయమనే అవస్థ Fourth Dimension నందు కోలేము. అదే సమాధి అదే మోక్షం. అప్పుడీ మాత్రలూ పాదాలూ ఏమవుతాయి. అవి మనం తురీయ స్థితి నర్ధం చేసుకోవటానికి కల్పించుకొన్న సంకేతాలే. కాబట్టి ఆ స్థితి నందుకొన్న మరుక్షణం అందులో లయమయి పోతాయి. అప్పుడా దశ అమాత్రమనీ అపాదమనీ - మాత్రా పాదాలుగా కనపడేవి రెండూ కలిసి ఏకమయి పోతాయని - వర్ణిస్తుంది ఈ మాండూక్యమనే ఉపనిషత్తు.

దానితో చతుర్ధం శివ మద్వైతం - తురీయమనే ఈ నాలుగవ దశ మానవుణ్ణి శవం గాకుండా శివంగా మారుస్తుంది. కారణమది అద్వైతం. అందులో జనన మరణాది భేదం లేదు. స విఙ్ఞేయః దాన్నే ఎప్పటికైనా అనుభవానికి తెచ్చుకోవాలి సాధకుడు. అది ఎలాగా అని అడిగితే ఏకాత్మప్రత్యయసారం - అన్ని దశలలోనూ ఉన్నదొకే ఒక ఆత్మ చైతన్యమనే అఖండాత్మ భావనే మనకు ప్రమాణం Instrument of Knowledge. దానితోనే పట్టుకోవాలాలి ఆ తురీయావస్థనని బోధిస్తున్నది మనకు మాండూక్యం.

7. తైత్తిరీయోపనిషత్తు

పోతే ఇంతకు ముందుగానే చెప్పామొక మాట. జగత్తుది సృష్టి అని జీవుడిది సృష్టి గాదు ప్రవేశమని. పరమాత్మే జీవరూపంగా వచ్చి శరీరంలో ప్రవేశించాడట. ప్రవేశించి ఈ ఉపాధులతో చేయి కలిపి తన స్వరూపమే తాను మరచిపోయాడు. మరచిపోతేనే వాడు జీవుడు. ఇదే సంసార బంధం. విషాదం. మరలా తన పొరబాటు తాను గుర్తించి తన నిజస్వరూపం వెతుకుతూ పోయి ఈ బంధం వదిలించుకోవటమే సాయుజ్యమీ జీవుడికి. అది ఎలాగో వర్ణించటానికి వచ్చాయి రెండు ఉపనిషత్తులు. మొదటిది తైత్తిరీయం. రెండవది ఐతరేయం. అందులో తైత్తరీయం జీవుడి రాకపోకలెలా వర్ణిస్తున్నదో చూతాము.

తస్మా దేతస్మా దాత్మన ఆకాశః అని ప్రారంభం. ఆత్మ నుంచి ఆకాశం. దాని నుంచి వాయువు. వాయువు నుంచి తేజస్సు. ఇలా వరసగా వచ్చి మానవ శరీరంలో బుధ్ధి అనే గుహలో చేరిపోయిందట అది. బాహ్యంగా ఆకాశాది పంచభూతాలైతే - ఆంతర్యంగా పంచకోశాలు. కోశమంటే ఒక వర Sheath or Cover. అవి మన శరీరంలోనే ఉన్నాయి. పై నుంచి చూస్తే ఆనందమయ కోశం ఆకాశానికి సరిపోతుంది. విఙ్ఞానమయ కోశం వాయువు లాంటిది. మనోమయం తేజస్సుకు. ప్రాణమయం జలానికి. చివరకి అన్నమయం పృథివికి సరిపడతాయి. అవి బ్రహ్మాండం ఇవి పిండాండం. Macro & Micro.

ఇప్పుడీ అన్నమయాది కోశాలలో ఆత్మ చైతన్యమనేది, మూసలో పోసిన పంచదార పాకానికి ఆ మూస రూపం వచ్చినట్టు, ఆ కోశ రూప మేర్పడి అలాగే కనిపిస్తున్నది. వీటిలో నుంచి బయట పడాలంటే ఈ కోశాలు నా ఉపాధులే Media గాని నా స్వరూపం గాదని గుర్తించాలి ఈ జీవుడు. గుర్తించాలంటే శుద్ధ చైతన్యమే తానని దాన్నే మనసుకు తెచ్చుకోవాలి. అదే ఆత్మ భావన. ఈ భావన బలపడే కొద్దీ అన్నమయాది కోశాలను క్రమంగా దాటిపోయి చివరకు ఆనందామయాన్ని కూడా దాటుతూ పోతాడు. దాటుతూ పోతే అవి తన స్వరూపంలో లయమైనట్టు చూడగలడు. అప్పుడు వీటితో పాటు పృథివి మొదలు ఆకాశందాకా ఉన్న పంచభూతాలు కూడా లయం కాక తప్పదు. అప్పుడంతా ఆత్మ స్వరూపమే కాబట్టి జీవేశ్వరులనే తేడా కూడా వెంటనే తొలగిపోతుంది. అదే మోక్షం. ఇదీ తైత్తరీయ సారం.

8. ఐతరేయోపనిషత్తు

తైత్తరీయం లాగే ఐతరేయం కూడా జీవుడి రాకపోకలే వర్ణిస్తుంది. కాని తేడా ఏమంటే జీవుడి ఙ్ఞానం బుద్ధిలో ప్రవేశిస్తే ప్రాణం పాద తలం నుంచి లోపలికి వచ్చిందట. తన్మూలంగానే వీడు తన సర్వఙ్ఞతను పోగొట్టుకొని ఇంద్రియాల ద్వారా విశేష ఙ్ఞాన మార్జిస్తూ దానితోనే తృప్తి పడుతుంటాడు. అంతే కాదు. జాగ్రత్తు స్వప్నం సుషుప్తి అనే మూడు దశలు కూడా వాటి వల్లనే అనుభవిస్తుంటాడు. ఈ విశేషానుభవమే సంసార బంధం వీడికి.

మరలా వీడీ బంధం నుంచి బయటపడాలంటే సుషుప్తి అనే మూడవ అవస్థను కూడా దాటిపోవాలి. సుషుప్తి అంటే అఙ్ఞానం. విశేష ఙ్ఞానమే ఇక్కడ అఙ్ఞానమంటే. అది జాగ్రత్స్వప్నాలలో వృత్తి రూపంగా పని చేస్తుంది. సుషుప్తిలో వాసనగా Impression మారుతుంది. వాసనలను భేదించాలంటే విశేష ఙ్ఞానంగాక సామాన్యమైన ఆత్మ ఙ్ఞానం సంపాదించాలి. తన స్వరూపమే తాను చూచే ఈ ప్రపంచమంతా పరుచుకొని ఉన్నట్టు దర్శించాలి. అప్పుడది విఙ్ఞానం కాదు. ప్రఙ్ఞానమవుతుంది. నీవూ, నీవు చూచే చరా చర ప్రపంచమంతా ప్రఙ్ఞానంలోనే ఉంది. అంతా ప్రఙ్ఞాన స్వరూపమే ననే రహస్యమప్పుడు అనుభవానికి రాగలదు. అదే జీవ బ్రహ్మైక్యం. అదే మోక్షం. ఐతరేయ సారమిదే.

9. ఛాందోగ్యోపనిషత్తు

పోతే ఇక రెండుపనిషత్తు లున్నాయి. ఛాందోగ్య మొకటి. బృహదారణ్య మొకటి. ఛాందోగ్యం తత్త్వమసి - నీవు పరమాత్మవేనని మనకు ఉపదేశిస్తుంది. బృహదారణ్యకం అహం బ్రహ్మాస్మి - నేనా పరమాత్మనే అని జీవుడికా ఉపదేశ మనుభవానికి తెస్తుంది. కాని జీవుడికి జగత్తనేది ఇలా కనిపిస్తున్నంత వరకూ నీవు పరమాత్మవేనని చెప్పినా ప్రయోజనం లేదు. కనుక ఐతదాత్మ్య మిదగ్ం సర్వం ఇదంతా కూడా ఆత్మ స్వరూపమేనని దీన్ని ఆత్మ చైతన్యంలో లయం చేసి చూపుతుంది ఛాందోగ్యం. జగత్తులయమైతే చాలు. జీవుడు అప్రయత్నంగా ఈశ్వర స్వరూపుడే అవుతాడు.

కాని జగత్తు ఎలా లయమవుతుంది. జగత్తనేది ఒక కార్యం. అంటే ఒక దాని నుంచి తయారయింది. దేని నుంచి తయారయిందో అది దీనికి కారణం. కారణం కంటే దాని కార్యం వేరుగాదని సిద్ధాంతం. మట్టి కన్నా కుండ వేరు గాదు గదా. బంగారం కన్నా ఆభరణం వేరు గాదు గదా. అలాగే అస్తి-భాతి. ఉన్నదనే స్ఫురణ కంటే లోకంలో ఏ పదార్ధం కాని అన్యంగా లేదు. ఏదైనా ఉన్నట్టు స్ఫురించేదే. ఉందనే స్ఫురణ తీసేస్తే ఆ పదార్ధమే లేదు.

మన మనోభావాల దగ్గరి నుంచి బాహ్యమైన ఆకాశం వరకూ ప్రతిదీ ఉంది స్ఫురిస్తున్నదనేగా చూస్తున్నావు. ఆ ఉండటం స్ఫురించటమే పరమాత్మ. అదే ఆశ్రయ Basis మీ నామరూపాలకు. ఇవేవో స్వతహాగా ఉన్నాయని గాదు. అలా స్వతంత్రంగా ఉన్నది ఆ సచ్చిద్రూపమైన ఆత్మే. అదే ఈ నామరూపాలుగా కూడా భాసిస్తున్నది. ఇవి దాని విభూతి Manifestation. అది వీటి స్వరూపం Substance.

ఇలా అర్ధం చేసుకోగలిగితే జనన మరణాలు కూడా మన స్వరూపమే అయి అమృతత్వమే సిద్ధిస్తుంది మానవుడికి. ఈ రహస్యం శ్వేత కేతువనే కుర్రవాడి కుద్దాలకుడూ - నారదుడనే దేవర్షికి సనత్కుమారుడూ - చివరకు దేవేంద్రుడికి బ్రహ్మ దేవుడూ - బోధ చేశారని చెబుతున్నది ఛాందోగ్యం. దీనికే ’భూమ విద్య’ అని పేరు పెట్టింది. ఎక్కడ ఉందా భూమ The summum Bonum అని అడిగితే సఏవోపరిష్టాత్స ఏవాధస్తాత్ - ఇక్కడా అక్కడా అని తేడా లేదు. సర్వత్ర సర్వదా సర్వరూపాలలో పరుచుకొని ఉన్నదదే. అదే జీవుడి స్వరూపమదే ఈ ప్రపంచ స్వరూపమని బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక రహస్యం మనకుపదేశిస్తుంది ఛాందోగ్యం.

10. బృహదారణ్యకోపనిషత్

దశోపనిషత్తులలో ఆఖరిది బృహదారణ్యకం. ఇది పరిమాణంలోనూ గుణంలోనూ పెద్దది. ఛాందోగ్యం పరోక్షమైన Indirect ఙ్ఞానమిస్తే ఇది అపరోక్షమైన Direct అనుభూతినే ప్రసాదిస్తుంది మానవుడికి. దాన్ని ఒక మాటలో గుప్తం చేసి చెబితే అదే అహం బ్రహ్మాస్మి. నేనే బ్రహ్మం - బ్రహ్మమే నేనని భావం. బ్రహ్మమనేది ఎక్కడో దూరంగా ఉందనే భ్రాంతి పోవాలి మనకు. అది ఎంత దూరమో అంత దగ్గర. యదేహ తదముత్ర. నిరాకారమూ వ్యాపకమూ అయిన ఆకాశానికి దూరం దగ్గర ఏముంది. సర్వత్ర ఉందని చూడటం లేదా మనం. అలాగే అంతకన్నా పెద్దదైన ఙ్ఞానస్వరూపమైన ఆకాశ మాత్మ అనేది. ఇది జడాకాశమైతే అది చిదాకాశం Conscious Space. నన్ను నేను ఎలా ఉన్నా నని చూచుకొంటున్నానో నా చుట్టూ ఉన్న జగత్తును కూడా ఉందనే చూస్తుంటాను. ఈ ఉండటమనే స్ఫురణ ఇప్పుడెక్కడ ఉందంటావు. నా లోపలా వెలపలా అంతటా పరుచుకొనే ఉందా లేదా.

ఇలా ఏది పరచుకొని సర్వ పదార్ధాలలోనూ కనిపిస్తుంటుందో అది సామాన్యం Universal. ఆభరణాలలో బంగారంలాగా. పోతే అది వేటి లోపలా వెలపలా వ్యాపించి ఉందో అవి విశేషాలు. సామాన్య మన్నిటినీ వ్యాపించినట్టు విశేషాలు వ్యాపించలేవు. కాని రెండూ ఎప్పుడూ ఎక్కడబడితే అక్కడ కలిసే ఉంటాయి. కలిసి ఉన్నా మనం ఆయా విశేషాలతోనే సంబంధం పెట్టుకొంటాము గాని అక్కడే ఉన్న సామాన్యంతో పెట్టుకోము. కారణమేమంటే దృశ్య ప్రపంచంలాగా మన దృష్టి కూడా విశేషమే అయి కూచుంది. అందుకే మనమీ శరీర మనః ప్రాణాలనే విశేషాలను నేనని అభిమానించాము. ఆ దృష్టి వదలకుండానే భార్యా పుత్రులనూ వస్తు వాహనాలనూ విశేషాలుగానే చూస్తుంటాము. ఈ విశేష దృష్టి వదలుకోనంత వరకూ మానవుడికి మోక్షం లేదు.

ఒక యాఙ్ఞవల్క్యుడు తన భార్య మైత్రేయికి చేశాడన్నా ఇదే బోధ. ఆ యాఙ్ఞవల్క్యుడే జనక మహారాజు సభలో గార్గి మొదలైన వారికి చేశాడన్నా ఇదే బోధ. ఇవన్నీ కధలు. కేవలం సంకేతాలు. సంకేత మెప్పుడూ సత్యాన్ని బయటపెట్టాటానికే ఉంటుంది. ఇక్కడ ఈ సంకేతాలన్నీ మనకు చాటి చెప్పే సత్యం సర్వమూ పరమాత్మ స్వరూపమే. జీవుడనని భావించే నీ స్వరూపం కూడా అదే. ఇదే ఏకైక సత్యం. ఇదం సర్వం యదయ మాత్మా - అహం బ్రహ్మాస్మి అని రెండు మాటలలో దీన్ని చాటి చెబుతున్నది ఉపనిషత్తు.

అయితే ఇది ఒక్కసారిగా అందుకోగలిగితే వాడుత్తమాధికారి Competent. అలా కాకుంటే శ్రవణ మనన నిది ధ్యాసలనే మూడు భూమికలలో అంచెలవారిగా సాధన చేసి అనుభవానికి తెచ్చుకోమని సాధన మార్గాన్ని కూడా ఉపదేశించిందీ ఉపనిషత్తు. ఇది జీవితంలోనే ప్రయత్నించాలి మానవుడు. నిర్లక్ష్యం చేశాడో ఎంత అనర్ధానికైనా దారి తీస్తుంది. అదే జనన మరణ పరంపర అని కూడా హెచ్చరించింది. ఇదీ బృహదారణ్యక సారం.