విభూతి యోగము
భగవద్గీత
అక్షరాణా మకారోస్మి - ద్వంద్వ స్సామాసి కస్యచ
అహమే వాక్షయః కాలః - ధాతాహం విశ్వతో ముఖః - 33
గిరా మస్యేక మక్షరమని ముందు చెప్పాడు. అది ఓంకారం. ఇక్కడ అది గాదు. అసలు వర్ణ సమామ్నాయంలోనే Alphabet మొట్టమొదటి దైన అకారాన్ని నేనంటాడు. పోతే పదాలు రెండు మూడు కలిసి ఏక పదమైతే అది సమాసం. అలాటి సమాసాలలో ద్వంద్వ సమాసం నేను. ఉభయ పదార్ధ ప్రధానమైనది ద్వంద్వ మంటారు. సుఖదుఃఖాలు బంధ మోక్షాలు ఇలాంటివి. ఇది ప్రతిపక్ష భావాలను రెండింటినీ కలిపి సమానంగా చూచే దృష్టి నందిస్తుంది కాబట్టి సమ స్వరూపుడైన పరమాత్మ ఇలాటి ద్వంద్వ సమాసమే నేనని పేర్కొనట మెంతైనా సమంజసమైన మాట. పోతే అక్షయః కాలః అవిచ్ఛిన్నమైన కాల స్వరూపుణ్ణి నేను. లేదా కాలానికి కూడా కాలాన్ని నేనని చెప్పినా చెప్పవచ్చు. కాలోస్మి లోక క్షయకృత్తని తరువాత చెప్పబోతాడు కూడా. కాలః కలయతా మని ఇంతకు ముందు వచ్చింది కాబట్టి పునరుక్తి పరిహారం కోసం కాలానికి కాలమని చెప్పటం సబబే. పోతే ధాతా అంటే కర్మఫల విధాత. ప్రాణుల స్వస్య కర్మానుసారం వారికి సుఖదుఃఖాది ఫలాన్ని పంచి పెట్టేవాడు. విశ్వతో ముఖమైన దృష్టి ఉంటే గాని అలా చేయలేడు.
మృత్యు స్సర్వహర శ్చాహ - ముద్భవ శ్చ భవిష్యతాం
కీర్తిః శ్రీ ర్వాక నారీణాం - స్మృతి ర్మేధా ధృతిః క్షమా - 34
Page 335