#
Back

Page 65

వేదాంత పరిభాషా వివరణము


సద్భావ : మంచిభావమనే గాదు ఉండటం. ఉనికి Existance అనికూడా అర్థమే. అస్తిత్వమనే మాటకిది పర్యాయం.

సదాఖ్యా : సత్‌ అనే పేరు గల దేవత. అది నామరూపాత్మకం కాదు. సర్వ సామాన్యమైన అస్తిత్వం, చైతన్యం. దానికి దేవత అని ఉపనిషత్తులో నామకరణం చేశారు. ప్రపంచానికంతా ఇదే మూలం. ప్రపంచ స్వరూపం కూడా ఇదే.

సకృత్‌ : అంటే ఒకసారి అని అర్థం. Once. ఒకసారి ఏ రూపంలో ఉన్నదో ఆ రూపం మారకుండా ఉండటం కూడా సకృత్తే. Constant. 'సకృత్‌ విభాతం' అని చైతన్యానికి ఒకపేరు. ఎప్పుడూ అలాగే ప్రకాశిస్తూ ఉండేదని అర్థం.

సంగ/సక్తి : తగులుకోవటం, లగ్నమైపోవటం. Estanglement. సంసారంతో జీవుడు తన్మయత్వం చెందటం. కర్మఫలంమీద దృష్టి ఉండటం కూడా సంగమే, సక్తే. Attachment. అదే జీవిత సమస్యకు మూలకారణం.

సగుణ : గుణాలతో కూడినదని అర్థం. సత్వరజస్‌ తమోగుణాలే గుణాలిక్కడ. అవే నామరూపక్రియలు. తద్రూపంగా ఆత్మచైతన్యం భాసిస్తే అది సగుణం. Qualified. అలాకాక తనపాటికి తాను ఉండిపోతే అది నిర్గుణం. Unqualified.

సందర్భ : కూర్పు. Compilation అని అర్థం. గ్రంథం కూడా ఇలాంటిదే. గ్రథనమంటే కూర్పు. కనుకనే అది గ్రంథమైనది. సందర్భమంటే గ్రంథమనే అర్థం. కానీ లాక్షణికంగా ప్రస్తావన అని, ప్రకరణమని అర్థమేర్పడింది.

సంశయ : సందేహమని అర్థం. విశయం అని కూడా ఒక మాట ఉంది. మూడింటికి అర్థమొక్కటే.

సందేహ : సంశయమనే అర్థం.

సద్యోముక్తి : జీవించి ఉండగానే కలిగే ముక్తి. జ్ఞానోదయమైన వెంటనే కలుగుతుంది గనుక దీనికి సద్యోముక్తి అని పేరు వచ్చింది. ముక్తి అనేది ఒక అనుష్ఠానం ద్వారాగానీ, యోగాభ్యాసం ద్వారాగానీ కలిగేది కాదని అద్వైతుల సిద్ధాంతం. దానికి కారణం కేవలం ఆత్మజ్ఞానమే. కనుక జ్ఞానమెప్పుడు ఉదయిస్తే అప్పుడే ముక్తి కలిగి తీరాలి. దీనికే సద్యోముక్తి అని పేరు Immediate Emancipation. అలాకాక సగుణోపాసన ద్వారా అభ్యసిస్తూ పోతే అది వెంటనే కలగదు. మరణానంతరం సత్యలోకానికి వెళ్ళి అక్కడ మరలా నిర్గుణాభ్యాసం చేసి పొందవలసి ఉంటుంది. దానికి క్రమముక్తి అని పేరు పెట్టారు.

సత్సంగ : సత్పదార్థమైన పరమాత్మతో సంబంధం. అలాటి ఆత్మజ్ఞులతో సంబంధం కూడా సత్సంగమే.

సంధ్యం : సంధిలో వచ్చేది. జాగ్రత్తుకు, సుషుప్తికి మధ్యలో ఏర్పడేది. స్వప్నావస్థ అని అర్థం.

సంధి/సంధా : రెండింటి కలయిక. సంధానమని కూడా రూపాంతరం. అభిసంధి అంటే ఉద్దేశించటమని అర్థం. సత్యాభిసంధి, అనృతాభిసంధి అనే మాటలు పూర్వమే వచ్చాయి. సత్యమైన పరమాత్మ నుద్దేశించి పయనించేవాడు సత్యాభిసంధి. అనృతమైన సంసార వాసనలతో వెళ్లేవాడు అనృతాభిసంధి.

సజాతీయ : ఒకే జాతికి సంబంధించిన. జీవుడు ఈశ్వరుడు సజాతీయులు. అంటే చైతన్యరూపంగా ఇద్దరూ ఒక్కటే. సజాతీయ భేదం లేదు. లోకంలోనైతే ఇలాంటి భేదం అనివార్యంగా ఉండి తీరుతుంది. ఒక వృక్షానికి సజాతీయం మిగతా వృక్షాలు. ఒక మానవుడికి మిగతా మానవులు. పరమాత్మ విషయంలో మరొక ఆత్మ అనే ప్రశ్న లేదు గనుక సజాతీయ భేదం అక్కడ తొలగిపోతుంది. అంతా ఏకజాతీయమే.

సనాతన : మొదటి నుంచి ఉన్నది. ఎప్పటికీ నిలిచేది. Eternal. పరమాత్మే గాదు జీవాత్మకూడా సనాతనుడేనని శాస్త్రం చాటుతున్నది. 'జీవభూతః సనాతనః' అని భగవద్గీత.

సన్నికర్ష/సామీప్యం : Nearness, Close contact. సన్నిహిత సంబంధం అని అర్థం. ఇంద్రియాలకు వాటి విషయాలకు ఇలాంటి సన్నికర్ష ఏర్పడినప్పుడే ప్రత్యక్షజ్ఞానం ఉదయిస్తుందంటారు. దీనికి వ్యతిరిక్తమైన మాట విప్రకర్ష.Distance.

సన్న్యాస : Renunciation. త్యాగం అని అర్థం. వదలుకోవటం. అంతేకాదు బాగా ఉంచడమని కూడా అర్థమే. Well place. అనాత్మభావాన్ని వదలుకుంటూ మనస్సును ఆత్మస్వరూపంలో నిలిపి ఉంచటమని భావం. అప్పటికి రెండర్థాలు సరిపోతాయి. ఇది జిజ్ఞాసువుకైతే ఆశ్రమ సన్న్యాసం. జ్ఞానికైతే పరమహంస
పారివ్రాజ్యం. దీనికే పరమార్థ సన్న్యాసమని పేరు. ఇది కేవలం మానసికం. బాహ్యమైన వేష భాషలతో నిమిత్తం లేదు. కాషాయ కమండల్వాదులు కూడా అక్కరలేదు. అది వైకల్పికం.

సపక్ష : అనులోమమైన పక్షం. ప్రతిలోమమైతే విపక్షం.

సంపత్తి : ఒక పదార్థం ఉన్నదున్నట్టు కాక మన భావన కనుగుణంగా దాన్ని భావన చేస్తూ పోతే కొంతకాలానికి అది మనకు ఆ రూపంలోనే దర్శనమిస్తుంది. ఉపాసకులు ఆత్మస్వరూపాన్ని అలాగే భావన చేస్తారు. అది వాస్తవం కాదు. వారి మానసికమైన కల్పన. దీనికే సంపత్తి అని పేరు. దీనికి భిన్నంగా ఆత్మతత్వాన్ని ఉన్నదున్నట్టు దర్శించటానికి ఆపత్తి అని పేరు పెట్టారు వేదాంతులు. ఏదీ కొరత లేకుడా అన్నీ సంపూర్ణంగా ఉండటం, కలిసిరావటం కూడా సంపత్తి అనే అంటారు.

సంప్రత్తి : గృహస్థుడు ధ్యానాభ్యాసానికి కాని, జ్ఞానాభ్యాసానికి గాని కృషి చేయటం కోసం తన గృహస్థాశ్రమాన్ని వదులుకొనే సందర్భంలో తనకు సంబంధించిన దంతా తన పుత్రులకు అప్పజెప్పటానికి సంప్రత్తి అని పేరు. The Handover. To entrust.

సప్రతిపక్ష : ప్రతిపక్షంతో కూడినది. ద్వంద్వాలని కూడా అర్థం. సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, పుణ్యపాపాలు ఇవన్నీ ఒకదానికొకటి సప్రతి పక్షాలు Opposites.

సంప్రతిపత్తి : ప్రతిపత్తి అంటే ఒకదాన్ని గురించిన జ్ఞానం, అవగాహన. అందరికీ ఒకే అవగాహన ఏర్పడితే సంప్రతిపత్తి అని పేరు. Agreement. అలా కాకుంటే దానికి విప్రతిపత్తి అని పేరు. Disagreement. యోగులు చెప్పే ధ్యానమనేది వేదాంతులకు సంప్రతిపత్తే. కాని వారు చెప్పే జీవేశ్వర భేదం వీరికి సంప్రతిపత్తి కాదు.

సంప్రత్యయ : బాగా పట్టుకోవటం. నమ్మకం. చక్కగా గ్రహించటం.

సంప్రసాద : బాగా తేరుకోవటం. మాలిన్యం తొలగిపోయి శుద్ధి చెందటం. విశేష వృత్తులే మనస్సుకు పట్టిన మాలిన్యం. సుషుప్తిలో అవి తొలగిపోతాయి. కనుక జాగ్రత్స్వప్న దృష్ట్యా చూచి సుషుప్తిని సంప్రసాదమని పేర్కొన్నారు. అక్కడా కొంత వాసనలు అంటిపట్టుకుని ఉంటాయి. ఆత్మజ్ఞానంతోగాని అవిపోవు. కాబట్టి నిజమైన సంప్రసాదం ఆత్మస్వరూపమే. దాని అనుభవమే అని వేదాంతులు స్పష్టంగా చాటిచెప్పారు.

సంప్రదాయ : ప్రదానం. ప్రదాయమంటే ఒకరికివ్వటం. సంప్రదాయమంటే బాగా అందజేయటం. Initiation. గురువు తన జ్ఞానాన్ని శిష్యుడికి అందజేస్తాడు. అతడు మరొక శిష్యుడికి. ఇలా సాగిపోతే అది గురు శిష్య సంప్రదాయం. పరంపర Tradition  అని కూడా మరొకపేరు.

సంపరాయ : పరలోకం. ఇహం కానిది. A other world. 'న సంపరాయః ప్రతిభాతి బాలం' అని ఉపనిషత్తు చాటుతున్నది. బాలుడంటే కేవలం లౌకికంగా బ్రతికే మానవుడు. వాడికి ఇహం తప్ప పరమనేది స్ఫురించదు. వాడి దృష్టిలో అది లేనేలేదు అని భావం.

సంబంధ : కలయిక. Relation. రెండు పదార్థాల కేర్పడేది. అది రెండే విధాలంటారు శాస్త్రజ్ఞులు. సంయోగం, సమవాయం. రెండూ పదార్థాలైతే గదా అందులో ఒకటే వాస్తవం. రెండవది ఆభాస. కనుక సంబంధం కాని సంబంధం. అది సంయోగం కాదు, సమవాయమూ కాదు. కేవలం తాదాత్మ్యమే అని పేర్కొంటారు అద్వైతులు. సంబంధమనే మాట సాధన చతుష్టయంలో కూడా ఒకటి ఉంది. అక్కడ సంబంధమంటే అధికారికి, ప్రయోజనానికి ఉన్న సంబంధం. అంటే వేదాంత శ్రవణం చేసే వ్యక్తికి ఏమిటి కలిగే ప్రయోజనం అని అడిగితే అది మోక్షమేనని జవాబు. ఈ రెండింటికీ ఉన్న సంబంధమేదో అది సాధన మాత్రమే. కనుక సంబంధమంటే సాధన అని అర్థం చేసుకోవచ్చు.

సంబాధ : క్రిక్కిరిసి ఉండటం.

సంభేద : కలయిక. దుఃఖ సంభేదం ఉన్న సుఖం సుఖం కాదని వేదాంతుల మాట. అసంభిన్న మైనప్పుడే అది శాశ్వతమైన, అసలైన సుఖానుభవం.

సంభవ/సంభూతి : పుట్టటమని ఒక అర్థం. అంతేగాక కలయిక అని మరొక అర్థముంది. కుమార సంభవమంటే కుమార జన్మకోసం పార్వతీ పరమేశ్వరులు కలుసుకోవటమని అర్థం చెప్పారు. వేదాంతంలో సంభవమన్నా, సంభూతి అన్నా మూల ప్రకృతి వ్యక్తమైన దశ. Nature Manifest.