#
Back

Page 64

వేదాంత పరిభాషా వివరణము


సః : వాడు అని శబ్దార్థం. పరమాత్మ. అహం అంటే నేననే జీవాత్మ. ఇవి రెండూ వేరుగావు ఒక్కటేనని బోధిస్తున్నది సోహం అనే మంత్రం. సః అహం వాడే నేను. లేదా అహం సః. నేనేవాడు. ఇలా చెప్పటం మూలాన ఇద్దరిలో ఉన్న దోషం తొలగిపోయి చైతన్యమనే ఒకే ఒక గుణం మిగిలిపోతుంది. అదే వాంఛనీయం సాధకుడికి. సోహం అనే మంత్రంలోనే సకార హకారాలు లోపిస్తే ఓం అనే మంత్రం ఏర్పడిందంటారు.

సకల : కల అంటే భాగం. Part. కలలతో కూడినది సకలం. Whole. చైతన్యం నామరూపాలతో కలిస్తే అది సకలం. అలాకాక వాటిని తనలో కలుపుకుని శేషిస్తే నిష్కలం లేదా అకలం. A whole without parts.

సంకుల : కలిసిపోవటం. ఏకమై పోవటం. ఏది ఏదైనది స్పష్టంగా తెలియని విషయం.

సంకర/సంకీర్ణ : Mixture. కలయిక. తిలతండుల న్యాయంగా రెండు పదార్థాలు ఒకదానితో ఒకటి కలిసిపోవటం. సాంకర్యమన్నా ఇదే అర్థం. వర్ణ సంకరమంటే చాతుర్వర్ణ్యం తేడా లేకుండా ఏకం కావటం. సంకరం చెందినది సంకీర్ణం. ఖరినిలిఖి.

సంకల్ప : వికల్పం కానిది.Combination. Synthesis. వికల్పమంటే వేర్వేరుగా మారటం. Division or analysis. అప్పటికి సంకల్పమంటే నిర్వికల్పం అని అర్థం. మనసులో కలిగే ఆలోచన కూడా కావచ్చు. Idia. 'సంకల్ప వికల్పాత్మకం మనః. ఏకం కావటం, అనేకం కావటం మనసుకున్న లక్షణం. ఒకే ఒక భావముంటే అది సంకల్పం. చెదరిపోయి అనేక భావాలు ఏర్పడితే అది వికల్పం. కర్మానుష్ఠానంలో సంకల్పం చెప్పుకోమని ఒక మాట ఉంది. అంటే నీవే ప్రయోజనం కోసం ఈ కర్మ ఆచరిస్తున్నావో దాన్ని గుర్తు చేసుకోమని భావం.

సంకీర్తన : చెప్పటం. బోధించటం. ప్రచారం చేయటం. Propagation. శ్రవణ, మనన, నిది, ధ్యాసనల వరకూ నాకు సంబంధించినదైతే, నా అనుభవాన్నే పదిమంది జిజ్ఞాసువులకు పంచిపెడితే అది సంకీర్తనం. మొదటిది విచారమని, రెండవది ప్రచారమని vision and missionపేర్కొంటారు పెద్దలు. నామసంకీర్తనమని ఒకమాట ఉంది. భక్తి మార్గంలో తన ఇష్టదైవతానికి చెందిన నామాన్ని అనుక్షణమూ ఉచ్చరిస్తూ పోవటమని అక్కడ భావం. ఏదైనా ఏకాగ్రతతో భావించటంగానీ, పలకటంగానీ, ప్రచారం చేయటంగానీ సంకీర్తనమే.

సంకేత : చిహ్నం. గుర్తు, Sign, Symbal. ఒక సత్యాన్ని సూచించేది. నామ రూపాత్మకమైన ప్రపంచమంతా ఇలాంటి ఒక సంకేతమే. ఇది నామరూప రహితమైన తత్త్వాన్ని బయట పెడుతున్నది. సంకేతమెప్పుడూ తనపాటికి తాను అసత్యమే. కానీ అది సూచించేది మాత్రం సత్యం. సత్యాన్ని సూచించే లక్షణముంది కాబట్టి తద్రూపేణా అది కూడా సత్యమే అని భావించవచ్చు. సత్యాన్ని చేరేంతవరకూ దీన్ని నిమిత్తంగా చేసుకుని చేరిన తరువాత అందులోనే దీన్నికూడా కలుపుకొని చూడాలంటారు అద్వైత వేదాంతులు. అంటే నామరూపాలు పరమాత్మను చేరేవరకూ మన కాలంబనాలు. వీటిద్వారానే దాన్ని దర్శించాలి. ఎంతెంత దాన్ని దర్శిస్తూ పోతే అంతంత ఇవి తమ అస్తిత్వాన్ని కోల్పోయి, చివరకు పరమాత్మ రూపంగానే మనకు సాక్షాత్కరిస్తాయి. అప్పుడు ఈ సంకేతం కూడా అసత్యం కాదు. సత్యమే.

సంఖ్యాన/సాంఖ్య : లెక్కించటం. లెక్క. ఇన్ని అని లెక్కపెట్టి చెప్పటం. Enumeration. ఇరవై నాలుగు తత్త్వాలని పరిగణించి చెప్పింది గనుక కపిలుడి దర్శనానికి సాంఖ్యమని పేరు వచ్చింది. సంఖ్యానమంటే ధ్యానించటమని కూడా అర్థమే. Meditation. సాంఖ్యమంటే జ్ఞానమని కూడా ఒక అర్థముంది. భగవద్గీతలో సాంఖ్య యోగమనే మాటకు జ్ఞానయోగమనే అర్థం. యోగమని, సాంఖ్యమని రెండు మాటలు వస్తాయి గీతలో. యోగమంటే సమాధికాదు, సాంఖ్యమంటే కపిలుని సాంఖ్యమూ కాదు. యోగానికి అర్థం కర్మ. సాంఖ్యానికి అర్థం ఆత్మజ్ఞానం అని వాటి తత్త్వాన్ని బయటపెట్టారు భాష్యకారులు.

సంక్రమణ/సంక్రాంతి : సంక్రమించటం. ప్రవేశించటం. అన్నమయాది కోశాలలో మొదట ప్రవేశించింది ఆత్మచైతన్యం. అదే మరలా ఒక్కొక్క కోశాన్ని దాటి దాని పైకోశంలో ప్రవేశిస్తూ పోవటానికి సంక్రమణమని పేరు. ఇది వాస్తవం కాదు. భావన. అసలు రాలేదు, పోలేదు ఆత్మ. అది అచ్యుతం. కూటస్థం. ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో అక్కడ అలాగే ఉంది. అది వచ్చి దీనిలో బందీ అయినట్టు మన భ్రమ. ఆ భ్రమే వాస్తవమని చూచాము గనుక సంసార బంధమేర్పడింది. మరలా ఇది భ్రమేకాని ప్రమ కాదని గుర్తిస్తూ పోవటమే అన్నమయం నుంచి ఆనందమయం వరకూ ఆత్మచేయాలని చెప్పే సంక్రమణం. అనాత్మ అంతా ఆత్మేనని గుర్తిస్తూ పోవటమే సంక్రమణ శబ్దార్థమని చాటిచెప్పారు భాష్యకారులు.

సంగ్రహ/సంక్షేప : రెండింటికీ ఒకటే అర్థం. ఒక చోటికి పోగుచేయటం. క్లుప్తంగా ఒక విషయాన్ని బోధించటం. Brevity. 'సంక్షేప విస్తరాభ్యాం' అని భగవత్పాదులు చెబుతుంటారు. ఆత్మవిషయం నిరూపించేటప్పుడు ఎంత విస్తరించి చెప్పాలో మరలా మనకు విసుగు జన్మించకుండా అంత సంగ్రహించి చెప్పటం మంచిదంటారు ఆయన. సూత్రం సంక్షేపమైతే భాష్యం విస్తరం అని కూడా అన్నారు. సంక్షేపానికి వ్యతిరిక్తమైన పదం విక్షేపం. సంగ్రహానికి వ్యతిరిక్తమైనది విగ్రహం.

సంగతి : పూర్వోత్తరాంశాల కొకదానితో ఒక దానికి పొందిక. సాంగత్యం, సమన్వయ, Coherence, Connection మని అర్థం. అయిదు విధములైన వ్యాఖ్యానంలో సంగతి అనేది ఒకటి. అధికరణంలో కూడా ఇది ఒక అంశం.

సంగాన : Concordance. పరస్పర మైకమత్యం. తేడా లేకుండా సరిపడటం. కుదరటం. కుదురుబాటు. పొందిక, Agreement. దీనికి వ్యతిరిక్తమైనది విగానం. Disagreement.

సంచయ/సంచిత : సంచయమంటే పోగు చేసుకోవటం. Gathering. అలా పోగైన కర్మకు సంచితమని పేరు. త్రివిధములైన కర్మలలో మొదటిది సంచితం. అనేక జన్మల నుంచి పోగు చేసుకుంటూ వచ్చిన పుణ్యపాపాది కర్మరాశి. అది గతానికి సంబంధించినదైతే అందులో నుంచి కొంత జారీ అయి వర్తమానానికి వస్తుంది. దానికే ప్రారబ్ధమని పేరు. ఇప్పుడు మరలా చేసుకునేది భవిష్యత్తుకు తయారై ఉంటుంది. దానికి ఆగామి అని నామకరణం.

సంజ్ఞా : పేరు. గుర్తు. చిహ్నం. కనుసైగ. అంతేగాక తెలివి, స్పృహ అని కూడా అర్థమే. Consciousness. Sense.   విసజ్ఞ అంటే తెలివి తప్పినవాడని అర్థం. లబ్ధ సంజ్ఞ అంటే మరలా తెలివి వచ్చినవాడని అర్థం.

సంఘాత/సంహత : కూర్పు. Collection. ఒకచోట పోగవటం. మూర్తీభవించటం. Formation. అలా మూర్తీభవించిన పదార్థానికే సంహతమని పేరు. ప్రపంచమంతా ఇలాంటిదే. ప్రతి ఒక్క పదార్థమూ పోగైన పదార్థమే. బాహ్యంగా కనిపించే వస్తు వాహనాలు మాత్రమే కాదు. మన శరీరం, ప్రాణం, ఇంద్రియాలు, మనస్సు కూడా అనేక భాగాలతో కూడి తయారైన పదార్థమే. కనుక ఇది అంతా సంహతమే. Moulded or Constituted. సంహతమెప్పుడూ తనపాటికి తాను స్వతంత్రంగా ఉండదు. దాని ప్రయోజనం అసంహతమైన Unformed తత్త్వాన్ని మనకు గుర్తు చేయటమే. దానిని మనకందివ్వటమే. కనుకనే అసతోమా సద్గమయ అని చాటింది శాస్త్రం. ఈ సంహతం ద్వారా అసంహతమైన ఆత్మతత్వాన్ని అందుకోవలసి ఉంటుంది మనం. అదే సమస్యకు పరిష్కారం.

సంహితా : వేదంలో ఒక భాగం. మంత్రభాగం. మంత్రం శ్లోకరూపం. అవన్నీ కలిసి ఒక సముదాయంగా ఏర్పడితే దానికి సంహిత అవి నామకరణం చేశారు మనపెద్దలు. Compilation.

సంతాన/సంతత : ఒక భావాన్ని పొడిగించటం. Prolongation. సప్తసంతానాలని పేర్కొంటారు మనవారు. ఏడు విధములైన సంతానాలట. పుత్రులు మాత్రమే కాదు సంతానం. తటాక ప్రతిష్ఠ కావచ్చు. ఆరామ ప్రతిష్ఠ కావచ్చు. ఒక కావ్యాన్ని రచించటమైనా కావచ్చు. ఏదైనా ఇందులో సంతానమే. అంటే అది నిర్మించిన వాడి పేరు ప్రతిష్ఠలు అలా పొడిగిస్తూ చిరస్థాయిగా ఉంచేదే. పుత్రుడైనా అలాంటి వాడే గనుక సంతానమని పేరు వచ్చింది. పోతే అద్వైతంలో సంతానకరణ మని ఒక మాట ఉంది. భగవత్పాదులు తరచుగా వాడుతుంటారు. మనకు కలిగిన ఆత్మజ్ఞానాన్ని అలాగే నిలుపుకోవటమని తాత్పర్యం.

సత్‌/సత్య/సత్తా : సత్‌ అన్నా సత్యమన్నా ఉన్నది అని అర్థం. Extent. కలిగిన ఆత్మజ్ఞానాన్ని అలాగే నిలుపుకొంటూ పోవడం. సత్తా అంటే ఉనికని అర్థం. ఎప్పటికీ మారకుండా నిలిచి ఉన్నదేదో అది సత్‌ లేదా సత్యం. అది సాకారం కాదు కేవల జ్ఞానరూపం. కనుకనే సత్తా అన్నా అదే. అంటే అస్తిత్వమన్నమాట. Mere existance. విష్ణునామాలలో సత్తా అని ఒక నామం ఉంది. అంటే విష్ణువు సాకారంగా ఎక్కడో ఉన్నాడని కాదు. నిరాకారమైన భావమే లేదా అస్తిత్వమే విష్ణువు అనే మాటకు అర్థం. అంటే పరమాత్మ స్వరూపం. 'సదేవ సోమ్య ఇద మగ్ర ఆసీత్‌' అని ఉపనిషత్తు. ఈ ప్రపంచమంతా సృష్టికి పూర్వం సద్రూపంగానే ఉందట. అప్పటికి ఆత్మా, అనాత్మా అనే తేడా లేక అంతా సద్రూపమే. అయితే అది స్వతఃప్రమాణం కనుక చిద్రూపం కూడా అదే. సచ్చిత్తులే పరమాత్మ అంటే.