#
Back

Page 63

వేదాంత పరిభాషా వివరణము


షట్క : ఆరు అంశాల సముదాయం. శమాది షట్కమన్నప్పుడు శమ, దమ, ఉపరతి, తితిక్షా, శ్రద్ధా, సమాధానమని ఆరు అంగాలున్నాయి అందులో. అలాగే గీతలో ప్రథమ షట్కం ఆరు అధ్యాయాలు. ద్వితీయ షట్కం ఆరు. తృతీయ షట్కం మరొక ఆరు. అన్నీ కలిసి 18 అధ్యాయాలు. ఆరుగా విభజించటంలో ఆ ఆరింటిలో ఒకే ఒక విషయం వర్ణించబడుతున్నదని భావం.

షడ్గుణ/షాడ్గుణ్య : ఆరు గుణాలు, జ్ఞానమూ, ఐశ్వర్యమూ, బలమూ, వీర్యమూ, తేజస్తూ, శక్తీ ఇవి ఆరు షడ్గుణాలు. వీటికే షాడ్గుణ్యమని పేరు. భగమని కూడా దీనికొక నామం. అలాటి భగమున్నవాడే భగవాన్‌. ప్రవృత్తి, నివృత్తి, భూతసృష్టి, లయమూ, ధర్మమూ, అధర్మమూ ఈ ఆరుకూడా షాడ్గుణ్యమే నంటారు. ఇవి ఉన్నవాడు కూడా భగవానుడే. ఈ ఆరు ఆయనకు నిత్యసిద్ధం.

షడ్వర్గ : అరిషడ్వర్గమని కూడా పేర్కొంటారు దీన్ని. ఆరు దోషాలతో కూడిన వర్గమిది. అవి మనకు గర్భశత్రువులు. ఒకటి కామం, రెండు క్రోధం, మూడు లోభం, నాలుగు మదం, అయిదు మోహం, ఆరు మాత్సర్యం. మొదటి మూడే అసలు ఉన్న దోషాలు. తర్వాత చెప్పిన మూడూ, ఈ మూడే ముదురుపాకాన పడితే కనిపించే లక్షణాలు. ఇందులో దేవతలకు కామం, మానవులకు లోభం, దానవులకు క్రోధం నైజగుణాలని వర్ణించింది శాస్త్రం. ఎక్కడో లేరు దేవదానవులు. కామమూ, క్రోధమూ కూడా మానవులలో చోటు చేసుకున్న దోషాలు. కనుక ఆ రెండు జాతులమీద నెపంపెట్టి పూర్వమెప్పుడో పితామహుడు చేసిన మహోపదేశమిది.

షడధ్వ : ఆరు మార్గాలని అర్థం. ఇది తంత్ర గ్రంథాలలో ఇలా వర్ణించారు. పదం, మంత్రం, వర్ణం, భువనం, తత్వం, కళ. ఇవి ఆరూ షడథ్వాలట. ఇందులో మొదటి మూడు విమర్శాత్మకమైతే, మిగతా మూడు ప్రకాశాత్మకం. వీటిద్వారా వాటిని గ్రహించాలని తాత్పర్యం. అద్వైతంలో షడధ్వాలు షడూర్ములే. వాటిని క్రమంగా అతిక్రమించి పోగలిగితే ఈశ్వర సాయుజ్యం అప్రయత్నంగా సిద్ధిస్తుంది.

షట్చక్ర : ఆరు చక్రాలు. మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ. ఇవి ఆరూ మన శరీరంలోనే నాభిస్థానం నుంచి భ్రూమధ్యం వరకు ఆరోహణ క్రమంలో వ్యాపించి ఉన్నాయి. మొదటి అయిదూ పంచభూతాలకు సంకేతాలు. ఆరవది మాయాశక్తి స్థానం. పోతే దాన్నికూడా దాటి ఆరోహించిన వాడికి దర్శనమిచ్చే చక్రం ఏడవది సహస్రారం. అక్కడ శివశక్తి సాయుజ్యాన్ని అనుభవానికి తెచ్చుకోగలడట ఉపాసకుడు. ఇది ఉపాసనామార్గం. యోగమార్గం. అద్వైతజ్ఞానమార్గం కాదు. అద్వైతంలో ఇలాంటి ఆరోహణ లేదు. వారు చెప్పే ఆరోహణ కార్యం నుంచి కారణానికి చేసే ప్రయాణం. అదికూడా ప్రతి ఒక్క కార్యాన్నీ దాని పైకారణలో లయం చేసుకుంటూ చివరకు కార్యకారణ పరంపరనంతటినీ అకార్యమైన, మూలకారణమైన పరమాత్మ చైతన్యంలో కలుపుకోవటమే సాధనమార్గం.

షడూర్మి : ఊర్మి అంటే తరంగం. ఇలాంటి తరంగాలు ఆరింటిని చెప్పారు పెద్దలు. సముద్రంలో తరంగాల లాగే సంసార సాగరంలో ఇవి పైకి పొంగిన దోషాలు. ఇందులో మొదటి రెండూ జరామరణాలు. అవి స్థూల శరీర ధర్మాలు. రెండవ జత క్షుత్‌పిపాసలు. సూక్ష్మశరీర లక్షణాలు. మూడవ జంట శోకమోహాలు. కారణ శరీర గుణాలు. మొత్తంమీద శరీర మనః ప్రాణాలనే ఉపాధులకు చెందినవేగాని ఇవి తద్విలక్షణమైన ఆత్మ తత్త్వానికి సంబంధించినవి కావు.

షడ్దర్శన : ఆరు దర్శనాలని అర్థం. పూర్వం మహర్షులు అతిమానస దశలో కూచుని సమస్త సృష్టినీ గాలించి, అందులో దాగి ఉన్న రహస్యాలను తమకు తోచినట్టు దర్శించి, వాటిని మరలా గ్రంథ రూపంగా వెలువరించారు. అవి ఆరు. ఒకటి న్యాయం, రెండు వైశేషికం. మూడు సాంఖ్యం. నాలుగు యోగం. అయిదు పూర్వమీమాంస. ఆరు ఉత్తరమీమాంస. ఇందులో మొదటి రెండూ ఆరంభవాదాన్ని, మధ్యలో రెండూ పరిణామ వాదాన్ని బలపరుస్తాయి. పోతే మీమాంస శబ్ద నిత్యత్య వాదాన్ని ప్రతిపాదిస్తుంది. ఉత్తరమీమాంస అయిన వేదాంతం ఆ అన్నింటినీ కొట్టివేసి వివర్త వాదాన్ని మాత్రమే సిద్ధాంతం చేసింది.

షడంగ : నాలుగు వేదాలకూ ఆరు అంగాలు పేర్కొన్నారు పెద్దలు. శిక్షా, వ్యాకరణం, నిరుక్తం, జ్యౌతిషం, కల్పం, ఛందస్సు. ఈ ఆరింటి సహకారంతో వేదాన్ని అభ్యసించినప్పుడే దాని తాత్పర్యమేదో చక్కగా గ్రహించగలడట సాధకుడు. వేదవేదాంగాలని లోకంలో కూడా వ్యవహారం. ఋగ్వేదాదులు వేదాలైతే. వేదాంగా లంటే ఈ శిక్షాదులు. మొత్తం పది. ఈ పదింటికీ మరలా పురాణం, ధర్మశాస్త్రం, మీమాంస, న్యాయవిస్తరం అని మరి నాలుగు తోడైతే మొత్తం చతుర్దశ విద్యలవుతాయి.

షడ్భావ వికార : లోకంలో ఏ పదార్థానికైనా ఏర్పడే మార్పులు ఆరే ఆరు. వికారమంటే మార్పనే అర్థం. 'జాయతే అస్తి వర్థతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి.' పుడుతుంది, ఉంటుంది, పెరుగుతుంది, మారుతుంది. కృశిస్తుంది. నశిస్తుంది. మొదట జన్మ, చివర మరణం, మధ్యలో నాలుగు స్థితి. ఒకవిధంగా సృష్టి స్థితి లయాలే. అందులోనే ఆరూ చేరిపోతాయి. ఈ వికారాలు లేని పదార్థమే లేదు సృష్టిలో. నిర్వికారమైన పదార్థం ఒక్కటే అది ఆత్మస్వరూపం.

షణ్మత : ఆరు మతాలు. శైవం, వైష్ణవం, కౌమారం, శాక్తేయం, సౌరం, గాణపత్యం. వీటి ఆరింటికి షణ్మతాలని పేరు. భగవానుడిలో ఉన్న షడ్గుణాలకు ఇవి సంకేతాలు. వీటిని దేనిపాటికది వేరుగా చూడటం తప్పు. అన్నింటినీ ఏకైకమైన భగవత్తత్వానికి ముడిపెట్టి చూడమని అద్వైతుల సలహా. షడ్దర్శనాలను కూడా షణ్మతాలని పేర్కొనవచ్చు. సాంఖ్యాది దర్శనాలు ప్రతి ఒక్కదానిలో ఒక దోషముంది. అది సవరించగలిగితే అన్నీ కలిసి అద్వైత దృష్టికి తోడ్పడతాయని వేదాంతుల మాట. శంకరులవారు షణ్మత స్థాపన చేశారంటే శైవాది మతాలు, సాంఖ్యాది దర్శనాలను కూడా పరిష్కరించారని అర్థం చెప్పుకోవచ్చు.

షోడశకల పురుష : ప్రాణం మొదలు నామం వరకు చెప్పిన పదహారింటికీ షోడశ కళలని పేరు. కళ అంటే భాగం. శకలం. విశేషం. విశేషాలన్నీ సామాన్య రూపమైన పరమాత్మ చైతన్యంలో నుంచే వచ్చాయని అధ్యారోపం చేసి మరలా వాటిని ఆ పరమాత్మ చైతన్యంలోనే అపవాదం లేదా ప్రవిలాపనం ఖలిజీవీలిజీ చేయటమే షోడశకల పురుష విద్య. పురుష అంటే పూర్ణ స్వరూపమైన ఆత్మచైతన్యమే. కళలన్నీ అందులో నుంచి వచ్చినప్పుడు అది సకలం. అందులోనే మరలా కలిసిపోతే నిష్కలం. సకలం సంసార బంధమైతే నిష్కలం బంధ మోచనం. ప్రశ్నోపనిషత్తులోని ఆరవ ప్రశ్నకు సమాధానంగా చెప్పిన విద్య ఇది.

షోడశీ : మంత్రశాస్త్రంలో షోడశీ అనేది అమ్మవారి నామం. నిత్యాషోడశికా అని లలితా సహస్ర నామాలలో కనిపిస్తుంది. షోడశీ అంటే పదహారవది. మొదటి పదిహేనింటికి పంచదశి అని పేరు. అది హ్రీంకారంతో కూడినది. సంసారానికే దారి తీస్తుందది. పోతే మోక్షానికి తోడ్పడేది ఈ పదహారవదైన వర్ణమే. ఏదో కాదది. శ్రీం అనే వర్ణం. షోడశీ అంటే కర్మానుష్ఠానంలో ఉపయోగించే ఒకపాత్ర. పదహారంచులుంటాయి ఆ పాత్రకు. కనుక దానికి షోడశి అని పేరు పెట్టారు.