#
Back

Page 62

వేదాంత పరిభాషా వివరణము


శుక్ల/శుచి/శుభ్ర : తెల్లని స్వచ్ఛమైన. వెలుగుబాట. ఉపాసనాకాండలో జ్యోతిర్మార్గం. దేవయానం. దేవలోకాలు చేర్చేది. శుచిత్వమనేది అంతశ్శుద్ధి, బాహ్య శుద్ధి రెండూ కూడా. ఇవి రెండూ శుద్ధి చెందితే దైవసంపదలో అది ఒక సంపద.

శుద్ధ : శుచి, శుద్ధ అంటే నిర్మలం. నిష్కల్మషం. చిత్తానికి పట్టిన వాసనలు క్షాళితమై పోవటం.

శుభవాసనా : మంచి దైవసంపద. మంచి భావాలు వాటి తాలూకు సంస్కారాలు మనస్సులో నిలిచిపోవటం. ఇది అశుభ వాసనకు జవాబు చెప్పి సాధన మార్గానికి ఎంతైనా తోడ్పడుతుంది. జ్ఞానోదయమైతే ఈ శుభవాసనలు కూడా ఒక ప్రతిబంధకమే. అవి కూడా ఈశ్వర వాసనగా మారిపోవలసి ఉంటుంది.

శుశ్రూషా : శ్రోతుమిచ్ఛా. Desire to hear. వినాలనే కోరిక. వేదాంత శ్రవణాభిలాష. దీనికోసం గురుకులంలో చేసే పరిచర్య కూడా శుశ్రూషే. Service to the teacher. కనీసం శుశ్రూష అయినా లేకపోతే జ్ఞానం అలవడదు. ఇది శ్రవణానికి దారితీస్తే, అది మననానికి తర్వాత ధ్యానానికి తోడ్పడగలవు.

శూద్ర : చాతుర్వర్ణ్యంలో నాలుగవ వర్ణం. సంస్కారంలేని వ్యక్తి అని అర్థం. ఆ మాటకు వస్తే ప్రతి ఒక్క మానవుడూ 'జన్మనా జాయతే శూద్రః' అని పేర్కొన్నారు. జన్మతః ప్రతివాడూ శూద్రుడే. తరువాత విద్యావినయ సంపన్నుడైతేనే సంస్కార వంతుడవుతున్నాడు. దానికి ద్విజత్వమని పేరు. ద్విజ అనగా రెండుమారులు జన్మించిన వాడని అర్థం. మొదటి జన్మ భౌతికమైతే, రెండవది వైజ్ఞానికం. జానశ్రుతి అనే క్షత్రియుడు బ్రహ్మవిద్య నేర్చుకోవటానికి రైక్వుడనే యోగీశ్వరుడి దగ్గరికి వచ్చాడట. అప్పుడతడు శూద్ర అని అతణ్ణి సంబోధించాడు. క్షత్రియుడు శూద్రుడెలా అవుతాడు అని ప్రశ్న వచ్చింది. దానికి భాష్యం వ్రాస్తూ భగవత్పాదులిలా అన్నారు. 'శుచా ద్రవతీ ఇతి శూద్రః' శుక్‌ అంటే శోకం. సంసార తాపత్రయం. దాన్ని భరించలేక ద్రవతి పరుగెత్తి వచ్చాడట ఆ జానశ్రుతి. కనుక ఇక్కడ శూద్ర అనేమాట వర్ణాన్ని చెప్పటంలేదు. మానవుడి జిజ్ఞాసను సూచిస్తున్నది. జిజ్ఞాస ఉన్నంతవరకూ మనలో ఉండేది శూద్రత్వమే. దానికి తగిన చికిత్స ఆధ్యాత్మికంగా చేసుకొన్నప్పుడే మనమందరమూ బ్రాహ్మణుల మవుతాము. అంటే బ్రహ్మవంశానికి చెందుతామని తాత్పర్యం. 'సర్వస్యాపి బ్రహ్మవంశ్యత్వాత్‌' అని భగవత్పాదులు చెప్పిన మాట అప్పుడే అక్షరాలా సార్థకమవుతుంది.

శుంగ : శుంగమంటే అంకురమని అర్థం. అంకురం బీజం నుంచి ఏర్పడుతుంది. బీజం దానికి కారణం. అంకురం దానికి కార్యం. దీన్నిబట్టి శుంగమంటే లాక్షణికంగా కార్యమని అర్థం వచ్చింది. Effect తేజస్సుకు జలమూ, జలానికి పృథివీ శుంగం. మరలా వీనికి వ్యతిరిక్తంగా పృథివిని బట్టి జలం, జలాన్ని బట్టి తేజస్సునూ, తేజస్సును బట్టి దానికి మూలమైన సత్పదార్థాన్ని వెతుకుతూ పోవాలట సాధకుడు. అప్పుడే ఈశ్వరసాయుజ్యం. అందుకే ఉపనిషత్తులో 'అన్నేన శుంగేన ఆపోమూల మన్విచ్ఛ అద్భిః సోమ్య శుంగేన తేజోమూల మన్విచ్ఛ. తేజసా సోమ్య శుంగేన సన్మూల మన్విచ్ఛ' అని స్పష్టంగా చాటిచెప్పారు. అంటే పృథివీ, జలమూ, తేజస్సూ అంచెలవారీగా దాటిపోయి చివరకు సత్పదార్థాన్నే అందుకొని ముక్తుడై పోవాలి మానవుడు. దీనికి ఆధారం ఈ భూతాలే కాబట్టి ఇవి ఒకదాని కొకటి శుంగం. అంటే కార్యం. కార్యాన్నిబట్టే కారణాన్ని అన్వేషించటం మోక్షానికి సాధనం.

శేముషీ : పాండిత్యమని అర్థం. బ్రహ్మాండమైన మేధాశక్తి. అది ప్రాపంచికం కారాదు. దాన్ని పారమార్థికంగా త్రిప్పగలిగితేనే శాశ్వత ఫలదాయకం.

శేవధి : నిధి లేక నిక్షేపమని అర్థం. Treasure. ఇది భౌతికమైనా కావచ్చు. ఆధ్యాత్మికమైనా కావచ్చు. భౌతికమైతే ధనం, ఆధ్యాత్మికమైతే జ్ఞాన ధనం. అది పరమాత్మ స్వరూపమే. అదే ఎప్పటికైనా మనం ఆర్జించవలసిన నిధి.

శేష/శిష్ట : మిగులు Residue. నామరూపాలన్నీ నేతినేతి అని కొట్టుబడిపోతే చివరకు మిగిలేది శిష్టం లేదా అవశిష్టం. అదే బ్రహ్మతత్త్వం.

శోధన : పనికిరాని దాన్ని త్రోసిపుచ్చటం. శుద్ధిచేయటం. తత్వమసి అనే వాక్యంలో తత్పదార్థ త్వంపదార్థాలకున్న మాలిన్యం పరోక్షత్వ మొకదానికి పరిచ్ఛిన్నత్వ మొకదానికి. అవి రెండూ త్రోసిపుచ్చితే మిగిలిన చైతన్యం రెంటికీ ఒక్కటే. చైతన్యరూపంగా వాటికి అఖండత్వం ఏర్పడితే దాన్ని వాక్యార్థం అంటారు. Synthesis. ఇలాంటి వాక్యార్థాన్ని అందుకోవాలంటే పదార్థాలు రెండూ శుద్ధి అవ్వాలి. అంటే మాలిన్యాన్ని కడిగివేయాలి. నామరూపాలే మాలిన్యం. వాటిని కడిగివేయడమే పదార్థ శోధనం.

శోక : వేడెక్కడమని శబ్దార్థం. లాక్షణికంగా దుఃఖం. విషాదం. షడూర్ములలో మనస్సుకున్న రెండు దోషాలూ ఒకటి మోహం, అజ్ఞానం. రెండు శోకం. దానివల్ల కలిగే తాపం. శోకమోహాలని ఇవి రెండూ కారణశరీర లక్షణాలు.

శ్రద్ధా : తత్త్వజిజ్ఞాసువులకు కావలసిన అతిముఖ్యమైన గుణం. 'శ్రద్ధా మాతేవ పాతి' అని పతంజలి మాట. ఒక తల్లిలాగా శ్రద్ధ సాధకుని సిద్ధి పొందేవరకూ కాపాడుతూ పోతుందట. అందుకే శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానమన్నారు. శ్రద్ధ అంటే విశ్వాసం. దానివల్ల కలిగే ఏకాగ్రత. ఒక విషయాన్ని ఎలాగైనా సరే అందుకోవాలనే పట్టుదలకే Perseverence  శ్రద్ధ అని పేరు. Utmost faith. శమాది షట్కంలో ఐదవదిది. దీని అనంతరం ఆరవది సమాధి.

శ్రవణ/శ్రుతి : వినటం. వేదాంత శాస్త్ర బోధ ఆలకించటం. దీనివల్ల అజ్ఞానమనే వ్యాధి తొలగిపోతుంది. ఫలితంగా ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. శ్రుతి అంటే వేదమని కూడా అర్థమే. ఇది అన్నిటికన్నా ప్రబలమైన ప్రమాణం. వేదాంత శ్రవణం చేసేవారికి మొదటి ప్రస్థానం శ్రుతి ప్రస్థానం. రెండవది సూత్ర ప్రస్థానం. మూడవది స్మృతి ప్రస్థానం. మొదటిదానివల్ల అజ్ఞానం నశిస్తే, రెండవదాని వల్ల సంశయ నివృత్తి జరిగితే మూడవదాని మూలంగా విపర్యయమనే దోషం నశించి సద్యోముక్తి లభిస్తుందని అద్వైతుల హామీ.

శ్రౌత : శ్రుతికి సంబంధించినదని అర్థం. ముఖ్యంగా కర్మకాండ. దీనికి తోడు స్మార్త అని ఒక మాట ఉన్నది. వేదచోదితమైన యజ్ఞ యాగాదులు శ్రౌతమైతే స్మృతికారులు బోధించిన షోడశకర్మలు స్మార్తం క్రిందికి వస్తాయి.

శ్రోత్రియ : శ్రుతిని చక్కగా అభ్యసించినవాడు. The vedic Scholar. శ్రుతి జ్ఞానమున్నవాడని అర్థం. వైదిక ఛాందస శ్రోత్రియ ఈ మూడూ పర్యాయపదాలే. పోతే శ్రోత్రియ అనే మాట కేవలం వేదపండితుడనే కాక, వేదాంత పండితుడని కూడా చెబుతుంది. శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం అన్నప్పుడు వేదాంత జ్ఞానం బాగా పుష్కలంగా ఉండి, బ్రహ్మతత్త్వంలో నిష్ఠ కలిగిన వాడెవడో అలాంటి సద్గురువును సేవించమని చాటుతున్నది. కనుక ఈ శబ్దం వేదవేదాంత జ్ఞానమున్న ఇద్దరికీ వాచకమే.

శ్రేయస్‌ : శ్రేయస్సుకానిది ప్రియమైనది ప్రేయస్సు. హితమైనది శ్రేయస్సు. ఒకటి ధర్మపురుషార్థం. మరొకటి బ్రహ్మ పురుషార్థం. జీవిత పరమార్థమైన మోక్షమే శ్రేయస్సు. నిశ్శ్రేయసమని కూడా దీన్ని పేర్కొంటారు. జ్ఞానంవల్లనే సిద్ధిస్తుందిది. అలాకాక అజ్ఞానమింకా వదలక అర్థకామాలే లేదా అభ్యుదయదాయకమైన ధర్మమే గమ్యమని భావిస్తే అదికూడా ప్రేయస్సు క్రిందికే Prosperity వస్తుంది. మోక్షం కాదు Salvation.

శ్లోక : పద్యం. Verse.  ఆ రూపంలో ఉన్న మంత్రవర్ణం. సంహితమని కూడా పేర్కొంటారు దీన్ని. ఋగ్వేదమంతా చాలావరకు శ్లోకరూపంగా నడుస్తున్నది. మంత్రాలన్నీ పద్యభాగాలే. గద్యం మనకు యజుర్వేదంలోనే ఎక్కువగా కనిపిస్తుంది.

శ్లేష/శ్లిష్ట : అతకటం. సరిపోవటం. ఒకదానికొకటి tally  సంవదించటం. అలా సరిపడకపోతే అది శ్లిష్టంకాదు. అశ్లిష్టం అని పేర్కొంటారు శాస్త్రంలో. సందర్భానికి అతికినట్లుండాలి ఏది చెప్పినా. అప్పుడే అది సుశ్లిష్టం.