#
Back

Page 61

వేదాంత పరిభాషా వివరణము


శక్తి/శక్య : పరమాత్మ తాలూకు మాయాశక్తి. మాయ. ప్రకృతి. శక్తి. ఐశ్వర్యం. అవ్యక్తం. అవ్యాకృతం. అక్షరం అని చాలా పేర్లున్నాయి దీనికి. ఇది సాంఖ్యుల ప్రధానం లాంటిది కాదు. ప్రధానం స్వతంత్రమైతే ఇది పరతంత్రం. అంటే పరమాత్మ నాశ్రయించి ఉండేది. పరాస్యశక్తిః. ఆత్మచిద్రూపమైతే ఇది సద్రూపం. దీనిద్వారానే ఆయన సృష్టి స్థితి లయాదులను చేయగలుగుతాడు. జ్ఞానమే పరమాత్మ. ఇచ్ఛాక్రియా రూపంగా ప్రసరించే ఆయన ప్రసరణే శక్తి. పరా పశ్యంతి మధ్యమా వైఖరీ అని నాలుగు భూమికలలో ప్రసరిస్తుందది. ప్రసరించకపోతే పరారూపంగా అది నిర్గుణం. నిశ్చలం. ప్రసరిస్తే సగుణం. చలనాత్మకం. శక్తి, శక్తిమంతులు రెండూ వేరుగావు. ఏకమే మరలా. కారణం రెండూ నిరాకారమే గనుక.

శంకా : సందేహం Doubt. ఆశంక అని కూడా నామాంతరం. ఒక సిద్ధాంతం మీద పూర్వపక్షం చేయటం. Raising a point of order.

శబ్ద : ధ్వని Sound.  పదం Word. శాస్త్రంకూడా శబ్దమే. Verbal evidence వేదమని అర్థం. ప్రమాణాలలో ఇది ఒక ప్రమాణం. అపౌరుషేయం కనుక ప్రత్యక్షానుమానాల కంటే ప్రబలమైనదంటారు. శబ్దార్థాలే నామరూపాలు. చెప్పేది శబ్దం. చెప్పబడేది అర్థం. Expression. అది మానసికమైన వృత్తి కావచ్చు. వాగ్వ్యాపారమూ కావచ్చు. ప్రపంచమంతా శబ్దమే. అది చెప్పే అర్థం పరమాత్మే ! ఇది పరావాక్కయితే The Supreme word అది పరమార్థం. The supreme meaning.

శమ : ఉపశమించటం. తగ్గిపోవటం. స్తిమితం. అంతరింద్రియ నిగ్రహం Control of mind  శమాది షట్కంలో మొదటిది.

శబల : రంగురంగుల. సగుణంగా మారిన పరమాత్మ. ఈశ్వరుడని అర్థం. శబల బ్రహ్మమని పేర్కొంటారు దీన్ని. కార్యబ్రహ్మమని కూడా దీనికే మరొకపేరు. కారణ రూపమైతే అది బ్రహ్మం లేదా పరమాత్మ. కార్యరూపమైతే అదే శబలం, కార్యం లేదా సగుణం. అదే ఈశ్వరుడు.

శరీర : దేహం శీర్యతే ఇతి శరీరం. శీర్ణమై పోయేది గనుక దీనికీ పేరు ఏర్పడింది. ఏది సడలి జీర్ణమై పోతుందో అది. ఆవరించేది. కప్పివేసేది అని కూడా అర్థమే. Cover, sheath. చైతన్యాన్ని కప్పే ఉపాధులన్నీ శరీరాలే. Medium. అవిద్యా కామకర్మలు మూడూ మూడు శరీరాల కిందికే వస్తాయి. అవిద్య కామం నిరాకారమైనా అవి మన ఆత్మను కప్పివేస్తున్నాయి కనుక ఒకటి కారణ శరీరం, మరొకటి సూక్ష్మశరీరం అని పిలవబడుతున్నాయి. కర్మ స్థూలమైన శరీరంగా, సాకారంగా కనిపిస్తూ ఉన్నది. అన్నీ చేస్తూ ఉన్న పని ఒక్కటే. అది మన స్వరూపాన్ని సంపూర్ణంగా మనకు చూపక మరుగుపుచ్చటం.

శరణ : Refuge. Shelter. ఇల్లని, ఆశ్రయమని అర్థం. అంతేగాక ఒక ప్రయోజనం కోసం ఒకరికొకరు అధీనమై పోవటం. అన్నింటికన్నా అతీతమైనది ఈశ్వరతత్వం కనుక దానికి ప్రతి ఒక్క జీవుడూ అధీనమైతే శాశ్వతమైన మోక్షప్రయోజనాన్నే పొందగలడు. 'మామేకం శరణం వ్రజ' అని భగవద్గీతే చాటుతున్నది. దీనికే ప్రపత్తి అని నామాంతరం.

శ్రద్ధా : విశ్వాసం. ఒక దానిమీద అచంచలమైన దృష్టి. నమ్మకం. Faith. సాధన మార్గంలో ఇది చాలా ప్రధానమైనది. విషయం తెలిసిన తరువాత ఏర్పడే లక్షణం కాదు. విషయ జ్ఞానం కోసం ముందుగానే ఉండవలసిన లక్షణమని మన పెద్దలమాట. 'శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం' అని గీతావచనం. అతిసూక్ష్మమైన రహస్యాన్ని శ్రద్ధ ఉంటేగాని గ్రహించలేము. కాబట్టి గ్రహించిన తరువాత శ్రద్ధ ఏర్పడటం కాదు. శ్రద్ధ ఉంటే మనస్సు విషయం మీద ఏకాగ్రత కలిగి ఉంటుంది. దానివల్ల చెదిరిపోక ఒకే విషయాన్ని గుర్తించే సామర్థ్యం ఏర్పడుతుంది. అప్పుడే విషయజ్ఞానం మనకు లభిస్తుంది. ఇదీ క్రమం.

శాంతి : శమమనే అర్థం. శాంతి మూడు విధాలు. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధి దైవికాలు. మూడు తాపాలకు మూడు శాంతులు. అంటే ఉపశమించే మార్గాలు. Sedatives.

శాండిల్య : ఒక మహర్షి. మత ప్రవర్తకుడు. పాంచరాత్రమనే వైష్ణవ సిద్ధాంతాన్ని లోకానికి బోధించినవాడు. నాలుగువేదాలు చదివికూడా తృప్తిలేక, శాంతిలేక అయిదు రాత్రులలో భగవదారాధన చేసి సాధించిన విద్య కనుక దీనికి పాంచరాత్రమనిపేరు.

శాసన/శాస్త్ర : శాసించి చెప్పటం శాసనమైతే అలా శాసించి బోధించే గ్రంథం శాస్త్రం Scripture. శబ్దప్రమాణమైన వేదమని అర్థం. సహేతుకంగా నిరూపించే గ్రంథమే శాస్త్రం. హేతు దృష్టాంతాలు రెండింటి ద్వారా విషయాన్ని బోధిస్తుంది ఏ శాస్త్రమైనా. ఇందులో హేతువు అనుమాన ప్రమాణం. దృష్టాంతం ప్రత్యక్ష ప్రమాణం. మొదటిది పండితులకు, రెండవది పామరులకు ఎక్కువ ఆకర్షకమైనవి. కనుక పండిత పామరుల నిద్దరినీ సన్మార్గంలో పెట్టడానికి శాస్త్రమే ఎప్పటికైనా తోడ్పడుతుంది. ప్రత్యక్షాదులకు అతీతమైన సత్యాన్ని బయటపెట్టడానికే వచ్చింది శాస్త్రం. ఇది భౌతికం కాదు. భౌతికమైన శాస్త్రాలు పురుషబుద్ధి జన్యాలు. బుద్ధికి పరిపూర్ణత లేదు. గనుక ఈ శాస్త్రాలన్నీ పరిపూర్ణమైన సత్యాన్ని మనకు చెప్పలేవు. పోతే మనస్సు కతీతమైన సమాధి దశలో కూచుని మహర్షులు దర్శించిన సత్యాలే గ్రంథస్థమైనవి కాబట్టి వేదమనే శాస్త్రమే అపౌరుషేయం. అది పరిపూర్ణం కనుక జీవిత సమస్యను పరిష్కరించటానికి అదే సమర్థం కనుక సాధకుడు అచంచలమైన విశ్వాసంతో వేదశాస్త్ర వాఙ్మయం చేసిన బోధనాలకించి అటు ధర్మమో, ఇటు బ్రహ్మమో దేనినో ఒకదానిని సాధించటంవల్లనే జీవితగమ్యాన్ని అందుకోగలడు.

శాస్తా/శిష్య : శాసించి చెప్పే గురువు ఆచార్యుడు. శాస్త అయితే అతనివల్ల శిక్షణ పొందే వ్యక్తి శిష్యుడు. Desciple. శాసింపదగినవాడని అర్థం. శాసించటమన్నా, శిక్షణ అన్నా దండించటం కాదు. సత్యాన్ని నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్టు బోధించటమని అర్థం. Instruction.

శిక్షా/శిక్షణ : శిక్షించటమంటే దండించడమైనా కావచ్చు Punishment ఇదమిత్థమని ఒక సత్యాన్ని ఉపదేశించటమైనా కావచ్చు. శిక్షణ ఇవ్వటమంటే వినయ సంపత్తిని కలిగించటమని అర్థం. Training.

శిష్ట : చక్కగా శిక్షింపబడిన, శిక్షణ పొందిన వ్యక్తి. Well Trained. వినీతుడని కూడా పేరు. సంస్కారవంతుడైన మానవుడు. శ్రుతి, స్మృతి వీటి రెండింటి తర్వాత శిష్టాచారమే ధర్మజ్ఞానానికి ప్రమాణమని ధర్మశాస్త్రజ్ఞులమాట. 'మహాజనో యేన గతః స పంథాః' అని ఒకనానుడి ఉన్నది. పెద్దలందరూ ఏ మార్గంలో పయనించారో ఆ మార్గం పట్టుకునే మనమూ సాగిపోవటం శ్రేయోదాయకం. పెద్దలు ప్రమాణమెలా అయ్యారు అని అడిగితే శ్రుతి, స్మృతి జ్ఞానం వారికి సంపూర్ణంగా ఉండటమే దానికి కారణం. అలాంటి వారెప్పుడూ మార్గం తప్పరు. ఆ నమ్మకం మీదనే మనమూ ఆ మార్గంలో పయనించి సత్ఫలితం పొందగలం.

శివ/శివా : మంచి. మేలు. శ్రేయస్సు. ఎప్పటికీ నిలిచిఉన్న తత్వం కూడా శివమే. చతుర్థం శివమద్వైతమని మాండూక్యోపనిషత్తు తురీయావస్థను వర్ణించింది. శివమంటే పరమాత్మ అనే భావం. శివం కానిదంతా అశివం. శివం చిద్రూపమైన పరమాత్మ అయితే శివా సద్రూపమైన ఆయన మాయాశక్తి. సచ్చిత్తులు రెండూ ఒకే ఒక తత్త్వం గనుక తేడా లేదని వేదాంతుల సిద్ధాంతం.

శీల : స్వభావం.Characterstic feature. Nature. క్రియాశీలం ప్రపంచం. ప్రపంచమంటే అనుక్షణం చలించే స్వభావం కలదని అర్థం.

శ్రీ : ధనం. లక్ష్మి. ఐశ్వర్యం. పరమాత్మ నాశ్రయంచి ఉన్న ఆయన మాయాశక్తి. 'శ్రయతీతి శ్రీః' ఆశ్రయించేదని అక్షరార్థం.

శుక్తికా : ముత్యపుచిప్ప. Oyster. శుక్తికే దూరానికి సూర్యరశ్మిలో వెండి రేకులాగా తళతళ మెరుస్తుంటుంది. వాస్తవం కాదా రజతం. ఆభాస. శుక్తికా రజత న్యాయమంటే ఇదే.