#
Back

Page 56

వేదాంత పరిభాషా వివరణము


వంశ : కులం గోత్రం అన్వయం. సంప్రదాయం కూడా. Tradition. గురుశిష్య పరంపరకు వంశమని పేరు. బ్రహ్మజ్ఞానం ఒకరివల్ల ఒకరికి సంక్రమించటం వల్ల వంశమన్నారు. ఒకే ఒక్క జ్ఞానధనం దానివాళ్ళ కందరికీ సంక్రమించటం లేదా అన్వయించటం. 'సర్వాస్యాపి బ్రహ్మవంశ్యత్వాత్‌' అని భగవత్పాదుల సూక్తి. మానవులందరూ బ్రహ్మవంశానికి చెందిన వారేనట. అంటే ఒకే ఒక బ్రహ్మతత్త్వం ప్రతివాడి మనస్సులో వాడు గుర్తించినా గుర్తించకున్నా చోటు చేసుకొనే ఉంది. కనుక ప్రతివాడు దానికి వారసుడే.

వయున : మార్గం - దిశ - దారి అని అర్థం. 'విశ్వాని దేవ వయునాని పశ్యన్‌' అని ఉపనిషత్తు. విశ్వాని అంటే సమస్తమైన, వయునాని మార్గాలు, పశ్యన్‌ చూస్తూ వెళ్ళిపోతాడట ఉపాసకుడు తన మార్గంలో.

వర : శ్రేష్ఠమైన. వర కానిది అవర. నికృష్టమని అర్థం. 'ప్రాప్య వరాన్‌ నిబోధత.' బ్రహ్మజ్ఞానం వరులైన అంటే ఉత్తములైన ఆచార్యుల వద్ద అభ్యసించాలట. అంతేగాని 'న నరేణ అవరేణ ప్రోక్త.' అవరుడైన అనధికారియైన ఆచార్యుడు ప్రవచనానికి పనికిరాడన్నది శాస్త్రం. వరమంటే వరించేది, కోరేదని కూడా అర్థమే. 'యమే వైషవృణుతే తేన లభ్యః' ఎవడు తత్త్వాన్ని వరిస్తాడో, కోరుకుంటాడో వాడికే అది లభ్యం.

వర్ణ : బ్రహ్మక్షత్రాది జాతులు రంగు రూపమని కూడా అర్థమే. బహుశా ఒకానొకప్పుడు ఈ రూపాన్ని బట్టే వర్ణవిభాగ మేర్పడి ఉండవచ్చు. అంతేకాదు వరణమే వర్ణం. వరణమంటే ఆవరించటం. వాటి ఉపాధిని ఆవరించిన లక్షణాలు గుణాలు. వీటిని బట్టి కూడా ఏర్పడవచ్చు. 'గుణకర్మ విభాగశః' అని శాస్త్రమే చాటుతున్నది.

వర్గ : కలయిక, గుంపు, ముఠా. ధర్మార్థ కామాలు మూడు కలసి ఒకటి. త్రివర్గమని పేరు దానికి. త్రిగుణాలతో సంపర్కం మూడింటికి ఉంది. పోతే నాల్గవదైన మోక్షమే అపవర్గం. ఏ ముఠాలోనూ చేరదని అర్థం. కారణం అది గుణాతీతమైన తత్త్వం.

వర్చస్‌ : దీప్తి-కాంతి Lustre. వేదాధ్యయనం వల్ల కలిగితే అది బ్రహ్మ వర్చస్సు అన్నారు. బ్రహ్మమంటే ఇక్కడ వేదమని అర్థం. బ్రహ్మజ్ఞానంవల్ల కలిగినా అది బ్రహ్మవర్చస్సు. అది మరీ గొప్పది. వర్చస్కం అని మరియొక మాట ఉన్నది. దానికి అన్నం తాలూకు స్థూలమైన రూపం. పురీషమని అర్థం చెప్పారు శాస్త్రంలో.

వృత్తి : తిరగటం. Turn. చుట్టుకోవటమని. Volve.దాత్వర్థం. బ్రాహ్మణాది వర్ణాలకు విధించిన ధర్మాలు వారివారి వృత్తులు Duty conduct. అది కాక మనస్సులో కలిగే ఆలోచనలన్నీ వృత్తులే. Ideas function of the mind. చిత్తవృత్తులని పేరు వీటికి. ఇవి ప్రాపంచికమైతే సవికల్పం. బంధానికే దారితీస్తాయి. పారమార్థికమైతే నిర్వికల్పం. మోక్షానికి తోడ్పడతాయి. ఆత్మాకార లేదా బ్రహ్మాకార వృత్తి అంటారు దీనినే. వృత్తి అంటే జీవనమని కూడా Livelihood మరియొక అర్థం. వ్యవహారమని behaviour  ఇంకో అర్థం.

వృత్త : Conduct ప్రవర్తన. ఆంతరమైతే గుణం Character. బాహ్యమైతే చేష్ట. మండలమని కూడా అర్థమే Circle. గతం, అతీతం అనే అర్థంలో కూడా ప్రయోగిస్తారీమాట That which is past.

వృతి : ఆవరించటం - కప్పటం. అలా కప్పకపోతే నిర్వృతి మోక్షమని భావం. వృతి ఏదో కాదు ఆవిద్యే. ఇది అనాదినుంచి మన చైతన్యాన్ని ఆవరిస్తూ వచ్చింది. ఆవరణమని కూడా దీనికే పేరు. ఆత్మజ్ఞానంతో కాని ఆవరణ భంగమై మోక్షాన్ని పొందలేడు మానవుడు.

వర్తమాన : ప్రస్తుతం. ఉంటున్నది Present. ఎప్పుడూ ఉంటున్నది కూడా Everpresent. బ్రహ్మస్వరూపం సదా వర్తమానమన్నారు భాష్యకారులు. సచ్చిత్తులు సచ్చిద్రూపంగా ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది కాదు. కనుక భూతభవిష్యత్తులనే స్పర్శ లేదు దానికి. దానికి గోచరించే జ్ఞేయ ప్రపంచమే మారుతుంది గాని దానిని గమనించే జ్ఞానం మారదు. కనుక అది వర్తమాన స్వభావం. దీనినిబట్టి రేపు మరణానంతరం కూడా అది స్థిరంగా ఉంటుందని పెద్దలిచ్చిన హామీ.

వ్రత : ఒక నియమం. Principle scruple. ధర్మపురుషార్ధానికే కాదు బ్రహ్మసాధనలో కూడా వ్రతమనేది ఆవశ్యకం. దృఢవ్రత అని సాధకుడికి పేరు. శ్రవణ మననాదులు నియమ నిష్ఠలతో చేసినప్పుడే ఫలసిద్ధి అతడికైనా.

వసు : ధనం - బంగారం. ఉత్తమం, శ్రేష్ఠమని కూడా అర్థమే. వసుమతి, వసుంధర అంటే రత్నగర్భ, భూమి. వసు మనస్సు అంటే మంచి మనస్సు. వసించేది కూడా వసువే. వాసుదేవ అంటే 'వసతి దీవ్యతి అస్తి భాతి.' పరమాత్మ అని అర్థం. వసు రుద్ర ఆదిత్యులలో మొదటిది వసువనే దేవత. అది ఏదో కాదు భూదేవతే.

వసిష్ఠ : 'వసు వసీయస్‌ వసిష్ఠ.' వసువనే విశేషణానికి తరతమ భావం చెప్పేటప్పుడు చివరి రూపం వసిష్ఠ The best అని అర్థం. అలాంటి వ్యక్తికి వసిష్ఠుడని పేరు. వశిష్ఠుడని అంటారు చాలా మంది. అది శబ్దస్వరూప జ్ఞానం అంతగా ఒంట బట్టక అనే మాట.

వశ/వశిత్వ : వశపడటం-అధీనం కావటం. యోగసిద్ధులలో వశిత్వమనేది ఒక సిద్ధి. సమస్త పదార్థాలనూ తన వశంలో ఉంచుకొనే శక్తి ఇది. ఆణిమాది అష్టసిద్ధులలో ఇది ఒక సిద్ధి అని అద్వైతులు కూడా అంగీకరించారు.

వస్తు/వస్తువత్‌ : 'వసతీతి వస్తు.' ఏది ఉందో అది Present. సత్‌ సత్యమని కూడా పేర్కొంటారు. వస్తువెప్పుడూ మరొక నిమిత్తం మీద ఆధారపడదు. దానికి స్వతసిద్ధంగా ఉండే స్వభావం ఉంటుంది. ఇలాటిది కేవలం ఆత్మస్వరూపమే. అది స్వతఃప్రమాణం. దాని అస్తిత్వానికి వేరే ప్రమాణమక్కరలేదు. కనుక అసలైన వస్తు వాత్మ స్వరూపమే. లోకంలో పదార్థాలన్నింటిని మామూలుగా మనం వస్తువులనే పేర్కొంటాము. ఈ దృష్టితో చూస్తే అవి వస్తువులు కాదు. వస్తువు తాలూకు ఆభాసలే అని అర్థం చేసుకోవాలి.

వాస్తవ : వస్తువుకు సంబంధించిన లక్షణం అంటే నిజంగా ఉన్నదని భావం. Actual.

వాక్‌ : మాట శబ్దం. Word sound. చెప్పేది బయట పెట్టేది. శబ్దం చెబితే అర్థం బయట పడుతుంది. ప్రపంచమంతా ఒక వాక్కు చెబుతుంది. దేన్ని? పరమాత్మను ప్రపంచం ద్వారా పరమాత్మను గుర్తిస్తాము కాబట్టి ఇది వాక్కు అది అర్థం. పరమమైన వాక్కు పరావాక్కు. The greatest word. పరమమైన అర్థం పరమార్థం. The greatest meaning.

వాక్య / వాక్యార్థ : పదాల సముదాయం. యోగ్యతా ఆకాంక్ష ఆసత్తి అనిమూడు షరతులుండాలి దీనకి. ఆ షరతులను పాటించే శబ్ద సమూహానికే వాక్యమని పేరు. Sentence or Statement శాస్త్రంలో వాక్యాలంటే రెండే రెండు ఒకటి అవాంతర వాక్యం. దీనికే పదార్థ జ్ఞానమని పేరు. మరొకటి మహావాక్యం. దీనికే వాక్యార్థ జ్ఞానమని పేరు. మొదటిది రెండవదానికి దారితీస్తే రెండవది మూడవదైన అవాక్యార్థానికి దారి చూపుతుంది. అది ఏదో కాదు అఖండమైన ఆత్మానుభవమే.

వాకోవాక్య : మాటకు మాట అని అర్థం. వాది ప్రతివాదులు ఒకరితో ఒకరు చర్చచేయటం ప్రశ్నోత్తర రూపంగా నడిచే ఈ వ్యవహారానికే వాకోవాక్యమని పేరు వచ్చింది. తర్కశాస్త్రమని అర్థం చెప్పారు వేదాంతులు.

వాచోయుక్తి : మాట పొందిక, మాట నేర్పు, మాటల గారడీ. క్రొత్తగా చెప్పే విషయమేమీ లేదని, కేవలం శబ్దాడంబరమేనని భావం.

వాచ్యార్థ : బాహ్యార్థ Primary meaning. గోడ అంటే ఇటుక సున్నంతో కట్టిన గోడ అనే అర్థం. రూఢి అంటారు. దీనినే ముఖ్యార్థమని, అభిధేయమని కూడా అంటారు. అలా కాక వాడొక గోడ అన్నామంటే అది వాచ్యం కాదు. లక్ష్యం. వట్టి జడుడు, ముగ్ధుడని అర్థం. తత్త్వమసిలో జీవుడు ఈశ్వరుడని చెబితే వాచ్యార్థం. అలాకాక రెండూ శుద్ధచైతన్యమని చెబితే లక్ష్యార్థం.

వానప్రస్థ : వనాలకు ప్రయాణం చేసేవాడని శబ్దార్థం. నాలుగు ఆశ్రమాలలో మూడవది. గార్హస్థ్యం గడచి సన్యాసం తీసుకొనే మధ్యలో చెప్పిన ఆశ్రమం. ఆ రోజులలో భార్యాభర్తలు అరణ్యాలకు వెళ్ళారేమో గాని ఇప్పుడక్కరలేదు. పిల్లలకు కుటుంబ భార మప్పచెప్పి ముసలివాళ్ళిద్దరూ సత్సంగంతో జీవిత శేషం చక్కగా గడప గలిగితే చాలు. అదే వానప్రస్థం. అలా గడుపుతూ ఇద్దరిలో ఒకరు కాలం దీరిపోతే అదే సన్యాసం. కుచేలుడు అలాగే చేసి తరించాడు భాగవతంలో.

వ్రాత్య : సంస్కారహీనుడికి వ్రాత్యుడని పేరు. అలాంటి వాడికి ఉత్తమగతులు లేవని శాస్త్రం చెబుతున్నది. కాని ఉపనిషత్తులో అగ్ని దేవుడిని వ్రాత్యుడని సంబోధించారు దేవతలు. అక్కడ వ్రాత్యుడంటే సహజంగానే పరిశుద్ధుడని వేరే సంస్కార మతనికి అక్కరలేదని భావమట.

వాద : వాదించటం. ఒక సత్యాన్ని నిలబెట్టడానికి చేసే చర్చ. Debate or discussion. ప్రతివాదిని ఖండించటమే ధ్యేయం కాదు. సత్యాన్ని ప్రతిపాదించటం. 'అర్థ నిర్ణయ హేతుః వాదః' అని భాష్యకారుల సుభాషితం.