#
Back

Page 55

వేదాంత పరిభాషా వివరణము

లక్షణ/లక్ష్య : లక్షించేది. సూచన చేసేది. ఫలానా అని పట్టి ఇచ్చేది. That which indicates or signifies. లక్షణమంటే లక్ష్యం తాలూకు స్వరూపమంతా వర్ణించి చెప్పేది definition.చెప్పేటప్పుడు అవ్యాప్తి అతివ్యాప్తి అసంభవమనే మూడు దోషాలు దొర్లకూడదు. లక్షణం తటస్థమని స్వరూపమని రెండు విధాలు. బ్రహ్మానికి స్వరూపం సత్యజ్ఞానానంతాలు. తటస్థం సృష్టి స్థితి లయాలు. వీటిద్వారా లక్షితమైన బ్రహ్మమేదో అది లక్ష్యం. లక్ష్యమంటే లక్షణంచేత వర్ణించబడేది. తర్కంలో లక్షణమంటే నిర్వచనమనే అర్థం.

లక్షణా/లాక్షణిక : వాక్యార్థం కుదరకపోతే ఆశ్రయించే రెండవ మార్గం. దీనివల్ల చెప్పబడేది లాక్షణిక లేదా లక్ష్యార్థం. సింహోదేవదత్తః అనే చోట సింహశబ్దం ఇక్కడ దానికి పరాక్రమవంతుడని రెండవ అర్థం చెప్పాలి. secondary meaning. అలాగే తత్త్వమసి వాక్యంలో త్వం పదానికి శరీరాదులు కాక ప్రత్యక్చేతనమని చెప్పాలి అర్థం. తత్‌ పదానికి బ్రహ్మచైతన్యమని చెప్పాలి. అప్పుడే జీవబ్రహ్మ ఐక్యం చెల్లుతుంది.

లఘు/లాఘవ : తేలిక. సులభమైన మార్గమని అర్థం. ఒక సూత్రం వర్తింప చేసేటప్పుడు ప్రక్రియా లాఘవాన్ని పాటించాలని పెద్దల నిర్ణయం. అలా కాకుంటే గౌరవమనిపించుకుంటుంది. ఇక్కడ లాఘవమంటే సులువుగా చెప్పటం, సంగ్రహంగా చెప్పటం. గౌరవమంటే డొంక తిరుగుడుగా దూరదూరంగా చెబుతూ పోవటం. గౌరవం కంటే లాఘవాన్నే శాస్త్రజ్ఞులు ఎక్కువగా పాటిస్తారు.

లాభ : మనకేదైనా కావలసినది ప్రాప్తించటం. అది ద్వైతంలో అయితే క్రొత్తగా వచ్చి చేరవలసినది. భౌతికంగా ఏర్పడేది. అద్వైతంలో లాభమంటే అలాంటిది కాదు. ఆత్మజ్ఞానం ఇక్కడ లాభం. క్రొత్తగా ప్రాప్తించేది కాదు ఆత్మ. ముందు నుంచి ఉన్నది. మహా అయితే మరచిపోయిన దాని స్వరూపాన్ని సాధకుడు గుర్తు చేసుకోవడమే జరుగుతుంది. ఆ మాటకు వస్తే ప్రాపంచికమైన మిగతా లాభాలేవీ అసలు లాభాలే కావు. ఎలా వచ్చాయో అలా తొలగిపోయే ప్రమాదముంది. ఆత్మలాభం అలాగ తొలగిపోయేది కాదు. కనుకనే గీతలో 'యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః' అని స్పష్టంగా చాటి చెప్పారు.

లింగ : గుర్తు. చిహ్నం Sign. Token. శివతత్త్వాన్ని సూచించే సంకేతం కనుక శివలింగమని పేరు వచ్చింది లోకంలో. 'లీనం గమయతీతి లింగం.' గుప్తమైన రహస్యాన్ని బయటపెట్టేది కనుక లింగమని పేరు సార్థకమయింది. మనస్సు ప్రాణం ఇలాంటివే. పరిపూర్ణమైన జ్ఞానక్రియా శక్తులకు ఇవి అపరిపూర్ణమైన సంకేతాలు. కనుకనే లింగ శరీరమన్నారు వీటిని వేదాంతులు. వీటికి తోడు పంచప్రాణాలు పంచతన్మాత్రలు పంచేంద్రియాలు కలిస్తే మొత్తం 17. సప్తదశకం లింగం అని శాస్త్రజ్ఞుల మాట. 17 సూక్ష్మమైన అంశాలతో కూడిన శరీరం కనుక లింగ శరీరమని సూక్ష్మశరీరమని దీనికి పేరు.

లయ : కరగిపోవటం. Melt. చైతన్యం ఘనీభవించి కనిపించటం సృష్టి అయితే అది ద్రవీభవించి శక్తిగా మారటం లయం. అది అప్రయత్నంగా జరిగితే ప్రాకృతం. సాధకుడు ప్రయత్నంతో జరిపితే ఆత్యంతికం. దీనినే మోక్షమని పేర్కొంటారు అద్వైతులు.

లీలా : క్రీడ. విలాసం. వినోదం. ఆత్మ అనాత్మగా భాసించటం దానికొక క్రీడ. ప్రయత్నం లేదు ప్రయోజనం లేదు. స్వభావికం దానికి. 'స్వభావస్తు ప్రవర్తతే' అని గీతావచనం.

లేప/లిప్త : పూయటం అంటటం అని శబ్దార్థం. సాంసారికమైన భావాలన్నీ ఇలాంటివే. అవన్నీ జీవచైతన్యానికి సహజం కాకపోయినా మధ్యలో వచ్చి అంటి పట్టుకొన్నాయి. దీని నిమిత్తంగానే దేహాత్మభావ మొకటి జగదాత్మభావ మొకటి ఏర్పడింది జీవుడికి. దీనితో లిప్తుడయ్యాడు కనుకనే జీవభావం వదలటంలేదు. రాకపోకలు చేయక తప్పటంలేదు. ఆత్మజ్ఞానమే ఎప్పటికైనా జీవభావాన్ని వదిలించి అతనికి స్వస్వభావాన్ని ప్రసాదించేది. కర్మఫలం అంటటానికి కూడా లేపమనే పేరు. అది అంటినవాడు జీవుడైతే అంటనివాడు ఈశ్వరుడు. ఇతడు లిప్తుడు. అతడు నిర్లిప్తుడు.

లోక/లౌకిక : లోకమంటే స్థానం. కర్మఫల మనుభవించే స్థానం. 'లోక్యతే ఉపలభ్యతే ఇతి లోకః' అని వ్యుత్పత్తి. లోకమంటే మరియొక అర్థం తేజస్సు. తేజస్సులో చేసే దర్శనం కూడా లోకమే. ఆత్మలోకమంటే ఆత్మను దర్శించే దశ. ఆత్మప్రకాశమని అర్థం. లోకానికి చెందినదేదో అది లౌకికం. లోకమంటే లోకులు లేక మానవులని కూడా అర్థమే.

లోకాలోక : లోకమంటే తేజస్సు. ఆలోకమంటే తమస్సు. వెలుగునీడలు రెండింటీ కలయిక. ఇక్కడ వెలుగంటే జ్ఞానం. నీడ అజ్ఞానం. ఈ రెండూ మానవుడికి సహజమైన లక్షణాలు. వీటిలో అజ్ఞానం ఎంతెంత తగ్గుతూ పోతే అంతంత జ్ఞానానికి నోచుకొని ప్రగతిని సాధించగలడు.

లోకాయత : లోకమంతా వ్యాపించిన అని అర్థం. ఒకానొకప్పుడు బృహస్పతి అని ఒక భౌతికవాది స్థాపించిన మతం. అతని మతంలో దేవుడికి, పుణ్యపాపాలకు, లోకాంతర జన్మాంతరాలకు ప్రవేశంలేదు. మరణంతో సమస్తం తీరిపోయేదే. ఇది చాలా ఆకర్షకంగా ఉండటం వల్ల అదే చక్కగా నలుగురికి బోధిస్తూ వచ్చేవారట. కనుక ఇతని అనుయాయులందరకూ చార్వాకులని పేరు వచ్చింది. చార్వాక దర్శనమని కూడా దీనికి నామాంతరం. నాస్తిక దర్శనాలలో ఇది అగ్రగణ్యమైనది.

లోప : లోపించటం, జారిపోవటం, కనపడకపోవటం. లోపించిన దానికి లుప్తమని పేరు. జీవుడి జ్ఞానం ఎప్పటికప్పుడు లుప్తమౌతూ పోతే ఈశ్వరజ్ఞానం అలా లుప్తంకాక అలుప్తంగా నిలిచిపోతుందని వేదాంతుల హామీ.