#
Back

Page 53

వేదాంత పరిభాషా వివరణము


యజన/యజ్ఞ/యజమాన : అర్చించటం. భజించటం. పూజించటం. Worship యజనం చేసే క్రియ యజ్ఞం. Sacrifice. అనుష్ఠానం. యజనం చేసేవాడు కర్మిష్ఠుడైన గృహస్థుడు. వాడే యజమానుడు. కర్త. అతడు చేసే యజ్ఞం నాలుగు విధాలు. విధి, జప, ఉపాంశు, మానస. మొదటిది కాయికం. రెండు మూడు వాచికం. నాలుగు మానసికం. మొదటి మూడు బహిర్యాగమైతే నాలుగవది అంతర్యాగం. అదే జ్ఞానయజ్ఞం spiritual sacrifice. యజ్ఞమంటే ఈశ్వరుడని కూడా అర్థం. 'యజ్ఞార్థాత్కర్మణోన్యత్ర' ప్రతికర్మా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలని భావం. ఇవిగాక మామూలుగా గృహస్థుడైన వాడు చేసే యజ్ఞాలు అయిదు ఉన్నాయి. దేవయజ్ఞం. దేవతల కోసం యజ్ఞయాగాదులు, పితృదేవతల కోసం శ్రాద్ధతర్పణాదులు. ఋషులకోసం వేదాధ్యయనాదులు. మనుష్యులకోసం అతిథి సంతర్పణాదులు. భూతములకోసం ధాన్య కణాదులు చల్లటం మొదలగునవి. ఇవి నిత్యమూ చేస్తూ పోవాలి ప్రతిగృహస్థుడు అని ధర్మశాస్త్ర శాసనం. ఇంతేగాక మనోవాక్కాయలతో ప్రతిక్షణమూ మనం సాగించే కర్మకలాపమంతా యజ్ఞమేనని ఒకమాట ఉంది. దీనికి నిలయం మన శరీరమే. ఇది నిత్యమూ చేస్తున్న జీవుడే ఇందులో యజమానుడు. ఇది సక్రమంగా సాగిస్తే సత్ఫలితం. అక్రమంగానైతే దుష్ఫలితం చవిచూడవలసి ఉంటుంది. ఇహంలో తప్పినా పరంలో తప్పదు అలాంటి అనుభవం.

యత్న : Effort. ప్రయత్నం. సాధన. అభ్యాసం. Practice.భౌతిక రంగంలో ఇదెలా ఆవశ్యకమో ఆధ్యాత్మికంలో కూడా అంతకన్నా అనివార్యమైనది. ఈ యత్నం రెండు విధాలు. ఒకటి అభ్యాసం మరొకటి వైరాగ్యం. అనులోమంగా బ్రహ్మ స్వరూపాన్ని గూర్చిన ధ్యానం అభ్యాసమైతే ప్రతిలోమంగా ప్రపంచం తాలూకు ఆలోచనలు అంతకంతకు తగ్గించుకుంటూ పోవటం వైరాగ్యం కిందికి వస్తుంది. రెండూ కలిసి బలంగా సాగితే గమ్యం చేరటం చాలా సులభం.

యాథాతథ్య : ఏది ఎలా ఉండాలో అది అలాగే ఉండడం. యథార్థ స్థితి. వాస్తవమైన స్వరూపం.

యాథాత్మ్యం : వస్తు స్వరూపం. స్వభావం The real nature. తత్వమనే మాటకిది పర్యాయపదం.

యదృచ్ఛా/యాదృచ్ఛిక : Accident. అప్రయత్నంగా ఏర్పడటం. అలా ఏర్పడింది యాదృచ్ఛికం. Accidental. 'యదృచ్ఛా లాభ సంతుష్టః' అని గీత. ఏది దొరికితే దానితో సంతృప్తి చెందాలట సాధకుడు. అలాగే 'యతిర్యా దృచ్ఛికో భవేత్‌' అన్నారు గౌడపాదులు. మోక్షసాధకుడయినవాడు యాదృచ్ఛికుడై జీవితం గడపాలట. అంటే దేని కోసమూ అదే పనిగా ప్రయత్నించకూడదు. అప్రయత్నంగా లభించినదే తన సొమ్మని ఆనందంగా అనుభవిస్తూ పోవాలి.

యంత్ర : యంత్రణ. యమించేది. నియమించబడింది. ఆంతరమైన భావాన్ని బాహ్యమైన ఒక ఉపాధిలో బంధించి చూపటం. A device. diagram. standing for a truth outward. శ్రీచక్రం మొదలైనవన్నీ ఇలాంటి యంత్రాలే. పోతే ఒక విషయం మేరకు పరిమితం చేయటానికి Restrained యంత్రణమని పేరు. నియంత్రణమని కూడా పేర్కొనవచ్చు.

యత్న : ప్రయత్నమని అర్థం. అభ్యాస వైరాగ్యాలే మోక్షసాధన. అదే అద్వైతులు చెప్పే యత్నం.

యతి : యతనం చేసేవాడు. యతనమంటే యత్నం. మోక్షసాధన. ఇంద్రియాలను యమించేవాడు కూడా.

యమ : అష్టాంగాలలో మొదటిది. ఇంద్రియ నిగ్రహం. కాలమనీ యముడనీ అర్థమే. అదికూడా జీవులను నిగ్రహించేదేగదా.

యక్ష : దేవత లేదా దయ్యం. 'యక్షానురూపో బలిః.' దేని స్థాయిని బట్టి దానికి తగిన ఆహుతి పెట్టడం అని సామెత. పూజింపదగిన గొప్ప పదార్థమని కూడా అర్థమే. 'కిమేత ద్యక్ష మితి' అని దేవతలందరూ భయపడ్డారట. కేనోపనిషత్తు చెబుతున్నది ఒక కథ. దేవలోకంలో దేవేంద్రుడు సభ చేసి ఉండగా కొంత దూరాన ఒక అద్భుతమైన పదార్థం ప్రత్యక్షమైంది. ఏమిటా ఆ యక్షం అని పరిపరివిధాల భావించారట వారు. అక్కడ యక్షమంటే పూజనీయమైన గొప్ప పదార్థమని భావం.

యాగ : యజనం చేసే క్రియ. యజ్ఞం. Sacrifice.

యాత్రా : ప్రయాణం. మరణమని మరొక అర్థం. దేహాన్ని వదలి వెళ్ళిపోవటం. గడపటం కూడా దేహయాత్రా. జీవయాత్రా. Passage of time.

యాతయామ : రాత్రిపక్వమైన ఆహారం అప్పుడే భుజింపక మరుసటి దినానికి దాచిపెట్టడం. అలాంటి ఆహారం సేవించటం తామస గుణమని భగవద్గీత చెబుతున్నది. ఇలాంటి ఆహారానికే యాతయామం అని పేరు. అంటే కొన్ని జాములు గడిచినదని అర్థం.

యోగ : కలయిక. Union. యోగక్షేమాలలో యోగానికి అర్థం 'అలబ్ధస్య లాభః' అని చెప్పారు భాష్యకారులు. మధ్యలో కొత్తగా వచ్చి చేరినదేదో అది యోగం. ఉపాయమని మరియొక అర్థం. సాధనమని ఇంకొక అర్థం. Means. కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం అనేవన్నీ ఇలాంటివే. అవి సాధకుడు ఆశించిన ఆయా ఫలితాలను అతనికి అందజేసే సాధనాలే. పతంజలి యోగశబ్దానికి మరొక అర్థం సెలవిచ్చారు. 'యోగః చిత్తవృత్తి నిరోధః' యోగమంటే మనసులో కలిగే ఆలోచనల నన్నింటినీ నిరోధించడం. అనగా త్రోసిపుచ్చడం. పోతే వేదాంతులు చెప్పే అర్థం వేరు. ఈశ్వర సాయుజ్యమే యోగమని పేర్కొంటారు వారు. అది కూడా సాధించవలసిందంటారు ద్వైతులు. సిద్ధమైన దాన్నే గుర్తించటమంటారు అద్వైతులు. 'జ్ఞానయోగ వ్యవస్థితిః' అని గీతలో ఒక వాక్యమున్నది. అక్కడ యోగమంటే అపరోక్షానుభవమని అర్థం చెప్పారు భగవత్పాదులు. జ్ఞానం పరోక్షమైతే యోగమపరోక్షం. అంటే శాస్త్రజన్యమైన జ్ఞానాన్ని స్వానుభవానికి తెచ్చుకోవటమే యోగమనే మాటకు అర్థం. ఇది చాలా విశిష్టమైన అర్థంగా కనిపిస్తుంది.

యోగీ యుక్త : యోగం సాధించిన వాడు యోగి. The accomplished. యుక్తుడని కూడా అతడికే మరొక పేరు. 'స యుక్తః కృత్స్నకర్మ కృత్‌' అన్ని పనులూ చేయకున్నా యోగం సాధిస్తే చాలు చేసిన వాడేనట. 'యోగీ యుంజీత సతతం.' యోగసిద్ధి కోసం నిత్యమూ అభ్యాసం సాగించవలసిందే యోగి అయినవాడు.

యోగీశ్వర : యోగులందరిలో చాలా దూరం యోగ సాధన చేసి దానిలో పరిపూర్ణత పొందినవాడు. ప్రయత్నంతో మానవుడు యోగీశ్వరుడైతే నిత్యముక్తుడైన పరమేశ్వరుడు యోగీశ్వరేశ్వరుడు.

యోగ్యతా : యోగానికి అర్హత. అంతేకాదు ఒక కార్యం సాధించటానికి తగిన అర్హత, అధికార సంపత్తి. వాక్యంలో మూడు లక్షణాలు అవశ్యంగా ఉండి తీరాలి. మొదటిది ఆకాంక్ష. రెండవది యోగ్యత. మూడవది ఆసత్తి అని వైయాకరణులమాట.

యోజనా : కూర్చటం. కుదర్చటం. సమన్వయించటం. combination, coordination అని అర్థం.

యోగయుక్త : యోగంతో కూడినవాడు. యోగి.

యోగాచార : బౌద్ధులలో ఒక తెగ. విజ్ఞానవాదులని కూడా పేరు వీరికి. బాహ్యప్రపంచం శూన్యమైనా దానికి సాక్షివిజ్ఞానం మాత్రమలా శూన్యం కాదు. కాని క్షణికమని వాదిస్తారు వీరు.

యౌగపద్య : ఒకే మారు ఏర్పడటం. Simultanity.