అద్వైత వేదాంత పరిభాష
పంచత్వం : మరల పంచభూతాలలో కలిసిపోవటం. మరణమని అర్థం. మొదట పంచభూతాలు పంచీకృతమై శరీర మేర్పడింది. కనుకనే ప్రారబ్ధం తీరిన తరువాత మరలా పంచ భూతాత్మకంగానే మారిపోవాలిది.
పంచీకరణ : పంచభూతాలనూ ఒక్కొక్కటీ రెండేసి భాగాలు చేసి అందులో ఒకదాన్ని మరలా నాలుగు చేసి ఒక్కొక్కదాన్ని మిగతా భూతాలలో కలిపితే అది పంచీకృతమవుతుంది. అప్పుడే స్థూల ప్రపంచ సృష్టికి ఆస్కారం.
ప్రకరణ :Context. సందర్భం. ప్రస్తావించటం.Commencement.
ప్రాకరణిక : ప్రస్తావించబడ్డ విషయం. ఒక సందర్భానికి చెందినది.
ప్రాకృత : ప్రకృతికి సంబంధించినది. స్వాభావికమైనది
Natural. సంస్కారం లేనిదని కూడా అర్థమే. Uncultivated. చదువు సంధ్యలు లేక మామూలుగా
బ్రతికేవాడని కూడా అర్థమే. Ordinary Person పామరుడు.
ప్రాణ : ప్ర+అన. జీవం Life. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలని ఇవి ఐదు విధాలు. వీటికే పంచ ప్రాణాలని పేరు.
ప్రాతిభాసిక : ప్రతిభాసించేది. ఇది స్వప్నంలో అనుభవానికి వచ్చే ప్రపంచం. వ్యావహారికమైతే జాగ్రత్తులో, పారమార్థికమైతే సుషుప్తిలో. పోతే ప్రాతిభాసికం అనేది స్వప్నంలోనే దర్శనమిస్తుంది. జాగ్రత్తులోనే పుట్టలోని సర్పం పారమార్థికమైతే రజ్జువులోని సర్పం ప్రాతిభాసికం.
ప్రాతిస్విక : దేనిపాటికది.Individual.
Particular. ప్రతి ఒక్కదానికీ చెందినదని అర్థం.
ప్రాతీతిక : ప్రతీతమయ్యే పదార్థం. Apparant. వాస్తవం కానిది. కేవల మాభాస.
ప్రాదేశిక : ఆయా ప్రదేశాలకు మాత్రమే చెందినది.
Restricted to a Place. చాలా పరిమితమైనదని అర్థం.
ప్రాప్తి : ఒక పదార్థానికి ఉత్పత్తి తరువాత చెప్పవలసిన క్రియ. ఆప్తి అని కూడా పేర్కొంటారు. ఘటం ఉత్పన్నమైన తరువాత దానిని ఇంటికి తెచ్చుకోవటం లాంటిది. అంతేగాక ఒక సిద్ధాంతం ఒక చోట ప్రాప్తిస్తున్నదా లేదా అని చెప్పటంలో
కూడా ఈ మాట కనపడుతుంది. అంటే అన్వయించటమని అర్థం. Application. ఒకటి లభించటం కూడా ప్రాప్తి క్రిందికే వస్తుంది.
ప్రాప్త : ఏది ప్రాప్తిస్తుందో అది. ప్రారబ్ధం కొద్దీ మానవుడి అనుభవానికి వచ్చే సుఖదుఃఖాదులు. లేదా యోగముంటే కలిగే అనుభవం.
ప్రాప్తప్రాప్తి : అద్వైతంలో రెండే రెండున్నాయి రహస్యాలు. ప్రపంచం లేకున్నా ఉన్నట్టు కనిపిస్తున్నది. కనుక దీనిని మరలా లేదని భావించటమే దీనిని త్రోసిపుచ్చటం. దీనికి పరిహృత హరిహారమని పేరు. అలాగే బ్రహ్మం ఉన్నా మనం లేదని భావించి మరలా దాన్ని ఉన్నదని అనుభవానికి తెచ్చుకుంటున్నాము. దీనికి ప్రాప్తప్రాప్తి అని పేరు.
ప్రబల : బలమైనది. సమర్ధమైనది. Efficient. ప్రమాణాలలో ఒకదానికంటే ఒకటి ప్రబలమైనప్పుడు అంతవరకూ సత్యమని నమ్మినది ప్రమాణాంతరం చేత ఆభాస అయిపోతుంది. ఏది ప్రబలమో అదే ప్రమాణంగా తీసుకోవలసి ఉంటుందని అర్థం.
ప్రాబల్య : సామర్థ్యం. పైన చెప్పుకున్న ప్రమాణాలలో ప్రబలమైన దానికున్న లక్షణం.
ప్రామాణిక : ప్రమాణ సిద్ధమైనది.
Authoritative. Authentic.
ప్రాయ : తరచుగా. బాహుళ్యం. Frequency.
ప్రాయిక : బహుళమైనది. తరచుగా ప్రాప్తించేది. ఆనందమయ అన్నప్పుడు మయ అనే ప్రత్యయం తరచుగా ఆనందం అనుభవించే అర్థాన్ని మాత్రమే చెబుతుంది గాని పరిపూర్ణమైన అనుభవాన్ని కాదని సిద్ధాంతం చేశారు భాష్యకారులు.
ప్రాయశ్చిత్త : ఒక దోషంగాని, పాపంగాని చేసిన తరువాత పశ్చాత్తాపపడి దానికి తగిన పరిహారం చేసుకోవటానికి ప్రాయశ్చిత్తమని పేరు. దీనివల్ల పాపక్షయమవుతుందని నమ్మకం. పుణ్యకార్యాలు చాలావరకూ ఇలాంటి దృష్టితోనే సాగిస్తారు లోకులు.
ప్రాయణ : ప్ర+అయన. బయలుదేరి పోవటం. ప్రయాణం.
ఇది జీవితంలో చేసేదికాదు. అవసానంలో అంటే మరణమని అర్థం. Departure from the world.
ప్రారబ్ధ : ప్రారంభించబడినది. త్రివిధ కర్మలలో ఒకటి. పూర్వజన్మలలో చేసినది వ్యక్తమై మనకీ వర్తమాన జన్మనిస్తే అలాటి కర్మకు ప్రారబ్ధమని పేరు. సంచితం నుంచి తయారవుతుంది కాబట్టి దీనికీ పేరు వచ్చింది. జీవన్ముక్తులను కూడా వదలిపెట్టదిది. 'ప్రారబ్ధం భోగతోనశ్యేత్' అనుభవంతో సమాప్తం కావలసినదే. వాడు పామరుడైనా పండితుడైనా అనుభవించిగాని దాని బాకీ తీర్చుకొనలేడు.
ప్రాసంగిక : ప్రసంగం అంటే సందర్భానికి తగినది
ప్రాసంగికం. అంతేకాదు ప్రస్తుత విషయానికి అనుబంధంగా చెప్పుకునేది కూడా Accidental.
Supplementary.
ప్రేక్షా : దృష్టి. ఆత్మజ్ఞానం.
ప్రేక్షావత్ : అలాంటి దృష్టి కలవాడు. మేధావి. ముఖ్యంగా ఆత్మజ్ఞాని అని అర్థం.
ప్రేత : ప్రయాణమై పోయినవాడు. Departed Soul. మరణించిన జీవి. ఇహంలో కాకున్నా పరంలో ఎక్కడో తప్పకుండా ఉంటాడని కర్మఫలశేషం అనుభవించటం కోసం మరలా జన్మించి తీరుతాడని ధర్మపురుషార్థం మనకు చెప్పే రహస్యం.
ప్రేత్య : దేహాత్మాభిమానం వదలుకొని దానిలోనుంచి బయటికి రావటం. జీవన్ముక్తి అంటే ఇదే. దేహం లేకపోవటం కాదు. ఉన్నా దానిని నేను అని అభిమానించక పోవటమే. 'ప్రేత్య అస్మాత్ లోకాత్ అమృతా భవంతి.' లోకమంటే ఇక్కడ దేహమని అర్థం. దీనిలో నుంచి బయటపడ్డవాడు అమృతుడౌతాడని ఉపనిషత్తు ఘంటాపథంగా చెబుతున్న మాట. ప్రేత్య అంటే ఇక్కడ బయటపడి అని అర్థం.
ప్రేప్సా : 'ప్రాప్తు మిచ్ఛా.' ఒకటి పొందాలనే కోరిక. దీనికే కామమని ఆస్థ అని గర్థి అని పేరు పెట్టారు. అవిద్యవల్ల తనకు భిన్నమైన జగత్తు కనిపిస్తే కామం దాన్ని పొందే ప్రయత్నం మనచేత చేయిస్తుంది. ఇదే కర్మకు దారితీసి సంసారబంధం ఏర్పడింది జీవుడికి.
ప్రేయస్ : ప్రియ Positive. ప్రేయస్
Comparative ప్రియమైన దానికన్నా చాలా ప్రియమైనది అని అర్థం. ప్రాపంచికమని లాక్షణికార్థం. ఈ ప్రపంచ విషయాలు
మనకు ప్రియమైనవే కాని హితమైనవి కావు. మొదట మేలుగా కనిపించి తరువాత కీడు చేసేది ప్రియం. మొదట కీడుగా కనిపించి పోనుపోను మేలు చేసేది హితం. ప్రియమే ప్రేయస్సు. పోతే దీనికి భిన్నంగా హితమైనదేదో అది శ్రేయస్సని పేర్కొన్నారు. ప్రేయస్సు ప్రాపంచికమైతే శ్రేయస్సు పారమార్థికం.
ప్రేరణ : చోదన. పురికొల్పటం. పురమాయించటం. శాస్త్రం చెప్పిన విధులన్నీ ప్రేరణలే. ముందుకు త్రోయటమని కూడా అర్థముంది. ఏదో ఒక మహాశక్తి లోపల కూర్చుని మనస్సు మొదలైన వాటన్నిటిని ప్రేరణ చేస్తే అవి వాటివాటి విషయాల మీద పోయి వాలుతున్నాయని చెబుతున్నది శాస్త్రం.
ప్రోక్త : ప్రవచనం చేయబడినది. Taught.
బోధించబడినది. Instructed.
పారిప్లవ : పైపైన తేలిపోవటం అని శబ్దార్థం. కాగా కర్మచ్ఛిద్రాలని కొన్ని ఉన్నాయి. యజ్ఞయాగాదులలో ఒక కర్మ చేస్తున్నప్పుడు ఏర్పడే విరామానికి ఛిద్రమని
Gap. Interval. పేరు. అలాంటప్పుడు ధార్మికమైన ఆధ్యాత్మికమైన బోధలెవరైనా చేస్తుంటే వినటం ఒక అలవాటు. అది ఆయా కథల రూపంగా చెప్పినా శ్రవణం చేసినా వాటికి పారిప్లవాలని శాస్త్రం పెట్టిన సంజ్ఞ. అసలు విషయాని కదనంగా పైపైన చెప్పుకొనే ఉదంతం కాబట్టి దీనికీ పేరు సార్థకంగా ఏర్పడింది.
ప్రశ్నోపనిషత్తు : పది ఉపనిషత్తులలో ఇది నాలుగవది. ఇందులో ఆరు ప్రశ్నలు వస్తాయి. ఆరుగురు మహర్షులు వేస్తారు. పిప్పలాదుడనే బ్రహ్మవేత్త ఆరింటికీ ఆరు సమాధానాలిస్తాడు. ఆరవది బ్రహ్మానుభవానికి సూటిగా దారిదీసే ప్రశ్న. దానికి ఆయన ఇచ్చినది కూడా అంత సూటియైన సమాధానమే. షోడశకళ పురుష తత్త్వాన్ని నెపంగా చేసుకొని నడుస్తుందీ ప్రశ్నోత్తర సరణి. ఇలాంటి ప్రశ్నల మూలంగా తత్త్వనిర్ణయం జరిగింది కాబట్టి దీనికి ప్రశ్నోపనిషత్తని నామధేయం.
పాంచభౌతిక : పంచభూతాలకు చెందినది. వాటితో తయారైనది.
ఫ
ఫల : ఒక కర్మకుగాని జ్ఞానానికి గాని కలిగే ప్రయోజనం
Result. ఫలితం. Consequence కర్మ ఫలమంటారు. లేదా జ్ఞానఫలమంటారు. కర్మఫలం స్వర్గాదిలోక ప్రాప్తి అయితే, జ్ఞానఫలం సాక్షాత్తూ మోక్షమే. భాష్యకారులు దీనికొక చమత్కారమైన
అర్థం కూడా చెప్పారు. 'ఫల్గుతయా లీయతే ఇతి ఫలం.' ఫ అంటే ఫల్గు అని ల అంటే లయమని అర్థమట. ఫల్గు అంటే నిరుపయోగమై, లయమంటే నశించిపోయేది. అంటే ఒక జీవన్ముక్తుడు లౌకికంగా ప్రారబ్దం కొద్దీ ఏ కార్యం చేసినా అది నిరుపయోగమే. ఎప్పటికప్పుడు నశించేదే. అతనికి బంధాన్ని ఇవ్వదు. వాడి విషయంలో అది నిష్ఫలమని భావం.
ఫల్గు : ముందు చెప్పినట్టుగా ఫల్గు అంటే
వ్యర్థం. నిష్ప్రయోజనం Effectless. Useless.
ఫణితి : మాట. శబ్దం. చెప్పటం. చెప్పే బాణి.
Expression. Style.
అ
ఆ
ఇ
ఈ
ఉ
ఊ
ఋ
ఏ
ఐ
ఓ
ఔ
క
ఖ
గ
ఘ
చ
జ
త
ద
ధ
న
ప
ఫ
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
క్ష
Page 48
Back
Next