• హోమ్
  •  
  • గురించి
  •  
  • ప్రవచనములు
  •  
  • గ్రంధములు
  •  
  • సంప్రదించండి
  •  
  • Youtube
  •  
  • English
  •  

అద్వైత వేదాంత పరిభాష

ద



దక్ష/దక్షిణ : సమర్థమైన Efficient.  కుడివైపు Right. దక్షిణ దిక్కు.

దక్షిణాక్షి : జీవచైతన్యం నేత్రంలో అందులోనూ దక్షిణ నేత్రంలో స్ఫుటంగా ప్రకాశిస్తుందని శాస్త్ర వచనం. దీన్ని ఉపాసించే విద్యకు అక్షిపురుష విద్య అని పేరు వచ్చింది.

దక్షిణామూర్తి : అర్ధనారీశ్వర విగ్రహంలో దక్షిణ భాగంలో ఉన్న రూపం పరమేశ్వరుడు. జ్ఞానస్వరూపమైన పరమాత్మ. 'జ్ఞాన శక్త్యవతారాయ దక్షిణామూర్తయే నమః.' వటవృక్షం క్రింద దక్షిణాభిముఖంగా కూచుని మహర్షులకు ఉపదేశించాడు గనుక దక్షిణామూర్తి అని పేరు వచ్చిందని కూడా పేర్కొంటారు. దీనికి వ్యతిరిక్తమైనది వామ. ఆవిడ ఆయన అర్ధాంగి అయిన మాయాశక్తి. ఆయన జ్ఞానశక్తి అయితే ఆవిడ క్రియాశక్తి. రెండూ కలిస్తే సృష్టి. అమ్మవారికి కూడా దక్షిణామూర్తి అని ఒక నామముంది. అప్పుడు శివశక్తులు రెంటికీ భేదం లేదని మనం గ్రహించవలసి ఉంటుంది.

దత్తాత్రేయ : అత్రిమహర్షికి దత్తమైన వాడు. త్రిమూర్తులు ముగ్గురూ కలిసి అనసూయ కిచ్చిన మాటను బట్టి వారే అత్రికి దత్తమైనారట. కనుకనే దత్తాత్రేయునికి మూడు ముఖాలు కనిపిస్తాయి. ఆయన దగ్గరున్న నాలుగు శునకాలూ ఏవో కావు. నాలుగు వేదాలే. వెనకాల ఉన్న గోవు బ్రహ్మజ్ఞానమే. అవధూత సార్వభౌముడీ దత్తాత్రేయుడు. పరశురామునికి, కార్తవీర్యార్జునుడికీ ఇలాంటి యోగసాధకులందరికీ ఉపదేశమిచ్చిన మహనీయుడు. వైదిక తాంత్రిక విద్యా ప్రవర్తకుడు. చంద్రుడికి దుర్వాసుడికీ సహోదరుడు.

దండ/దండి : దండమంటే ఇంద్రియ మనోదమనం. Control over inner and outer organs.  అది గలవాడు దండి. దండనం చేసేవాడని అర్ధం. సన్యాసి. త్రిదండి అని కూడా అతనికే నామధేయం.

దమ/దమన/దమయంతీ : బాహ్యేంద్రియ నిగ్రహం. అంతరింద్రియ నిగ్రహమైతే అది శమం. శమదమాలంటే అంతర్బహిరింద్రియ నిగ్రహమని అర్థం. శమాది షట్కంలో దమమనేది రెండవది. అది చేస్తూ ఉండడం దమనం. అలాగే సృష్టినంతా దమనం చేసే ఒక మహాశక్తి ఉంది. ఆ మహాశక్తికే దమయంతి అనిపేరు.

దంభ : మోసం. నెపం. మిష Deceit. లోపల ఒకవిధంగా ఉంటూ పైకి మరొక విధంగా కనిపించటం. లేనిపోని డచ్చాలు కొడుతూ పోవడం. అసుర గుణాలలో ఇది ఒకటి. ఆత్మజ్ఞానానికి ప్రతిబంధకం.

దర్శన : దృష్టి చూపు. మతం School of thought, శాస్త్రం Science, సాక్షాత్కారం Revelation, అనుభవం అని అర్థం. ఆత్మదర్శనమంటే ఆత్మానుభవమే. ఒక్కొక్క మతాచార్యుడు తన దృష్టి కనుగుణంగా ఒక్కొక్క శాస్త్రాన్ని ప్రవర్తింపజేశాడు. అవి ఆరు. వాటికే షడ్దర్శనాలని పేరు. న్యాయం. వైశేషికం. సాంఖ్యం. యోగం. పూర్వమీమాంస. ఉత్తర మీమాంస. శ్రవణమనన నిదిధ్యాసనలు అభ్యాసమైతే వాటి ఫలితంగా ఏర్పడేది దర్శనమన్నారు అద్వైతులు. అంటే తత్త్వసాక్షాత్కారమని అభిప్రాయం.

దశా : జాగ్రదాదులైన అవస్థలు States భూమికలు Stages.

దశమ : పదియవవాడు. పరమానందయ్య శిష్యులలో ఏరుదాటి పోయిన తరువాత ఒకడు కనపడలేదు. వాస్తవంలో పదిమందీ ఉన్నారు. కానీ తన్ను మరచిపోయి మిగతా వాళ్ళను లెక్కపెడుతూ పదవవాడు పోయాడని ఏడుస్తూ కూచున్నారు. అప్పుడెవరో దారిన పోతూ అక్కడికి వచ్చి విషయం తెలుసుకుని పదిమందినీ లెక్కించి చూపాడట. ఇప్పుడా పదవవాడు పోలేదు. కొత్తగా రాలేదు. అక్కడే ఉన్నా అజ్ఞానంవల్ల కనపడలేదు. జ్ఞానోదయమైతే కనిపించాడు. అలాగే ఆత్మస్వరూపం కూడా పరాపర ప్రకృతులు తొమ్మిదింటినీ చూస్తున్నంత వరకూ మనం దర్శించలేము. వాటిని కాదనుకుని పక్కకు త్రోసి చూచినప్పుడే గోచరిస్తుంది దశమమైన మన ఆత్మస్వరూపం. ఈ సత్యాన్ని గుర్తించటానికి ఇది ఒక చక్కని దృష్టాంతం. దశమ స్త్వమసి. తత్త్వమసి. నీవే పదియవ వాడవు. నీవే ఆత్మవని గుర్తుచేసే మహావాక్యమిది. దీనివల్ల పరోక్షంగా జూచిన పదవవాడిని అపరోక్షంగా తానేనని గుర్తించగలడు మానవుడు. అలాగే పరోక్షంగా ఎక్కడో ఉన్నదని భావించే ఆత్మను తన స్వరూపమే నని అపరోక్షంగా చూడగలడు సాధకుడు.

దహర/దభ్ర : చిన్నది. అల్పమైనది. దహరాకాశం అంటే స్వల్పమైన ఖాళీ. Limited space. ఎక్కడ ఉందది. హృదయంలో. ఆ మేరకే పరిమితమై కనిపిస్తుంది మన జ్ఞానం కానీ అది ఆ మేరకే లేదు. ఆకాశంలాగా సర్వత్రా వ్యాపించి ఉంది. హృదయం కేవలం దానికొక ఉపాధి. Medium. ఈ ఉపాధిలో అది వ్యక్తమై Manifest కనిపిస్తుంది. దీనినిబట్టి దాని మహత్త్వాన్ని మనం గ్రహించవచ్చు. ఇది దహరాకాశ మయితే అది మహాకాశం లాంటిది. దహరానికి మరోపేరు దభ్రం. Small. Limited. Congested అని అర్థం.

దేహ : శరీరమని అర్థం. 'దేగ్ధి లింపతి.' ఏదయితే పూసినట్టు కప్పినట్టు కనిపిస్తుందో అది దేహం. మన ఆత్మచైతన్యాన్ని చుట్టూ కప్పివేసి దాన్ని తన భౌతిక గుణాలతో పులిమి పుచ్చుతున్నది. కనుక దేహమనే పేరు దీనికి సార్థకంగా పెట్టారు. ఇదే మన చైతన్యానికి ఉపాధి Limit. స్థూలమని సూక్ష్మమని కారణమని ఇది మూడు రూపాలు. మూడింటినీ తానుగా భావించకపోతే వాడు సదేహ ముక్తుడు. అది కూడా ప్రారబ్ధం దీరి రాలిపోతే విదేహ ముక్తుడు.

దేశిక : 'దిశతీతి దేశికః.' దిశ్‌ అంటే ఊళి To Direct మార్గం చూపటమని అర్థం. దేశికుడంటే అలా మార్గం చూపేవాడు. మార్గమంటే ఇక్కడ మోక్షమార్గం Demonstrator of the spiritual path.

దేశ : Space. ఆకాశమని అర్థం. నామరూపాలు ఎక్కడ కాపురముంటాయో అది దేశం. వాటికి ఇది అధిష్ఠానం.

దేవ/దేవతా/దివ్య : 'దీవ్యతీతి దేవః.' ఏది ఎక్కువగా ప్రకాశిస్తూ పోతుందో అది దేవ. Luminous Body. అదే దేవత కూడా. ప్రకృతి శక్తులని అర్థం. అమూర్తమైతే శక్తి. మూర్తమైతే వ్యక్తి. వ్యక్తమైన దానికి భూతమని పేరు. Formed. దానిలో చేరి అంతర్గతంగా ఉన్న శక్తికే దేవ లేదా దేవతా అని పేరు. భూతం Matter అయితే దేవత అనేది దానిని వ్యాపించిన శక్తే Energy. సూర్యమండలం భూతం. దానిలో ఉన్న ఉష్ణ శక్తి దేవత. దేవతకు చెందినదే దివ్యం. Divine. దేవ అంటే ప్రకాశించే లక్షణమున్నవి చక్షురాదులైన ఇంద్రియ వర్గమని కూడా అర్థమే.

దీక్షా : ఒక వ్రతం. నియమం Principle, పట్టుదల Perceivarance. సద్గురువైన వాడు యోగ్యుడైన శిష్యుడికి ప్రసాదించే అనుభవ జ్ఞానం. 'దీయతే క్షీయతే ఇతి దీక్షా.' ఏది గురువు ఇస్తాడో, దేనివల్ల శిష్యుడి కర్మ పక్వమై క్షీణిస్తుందో అది దీక్ష. Initiation అని దీనినే పేర్కొంటారు. ఇది అనుభవానికి తిన్నగా తీసుకువెళ్ళే విధానం. దృగ్దీక్షా, మంత్ర దీక్షా, సర్వాంగ దీక్షా అని ఇందులో చాలా భూమికలున్నాయి. శ్రీరాముడు హనుమంతుడికి ఈ మూడూ ప్రసాదించాడు. నుకనే అతడు జీవన్ముక్తుడై ఇప్పటికీ నిలిచి ఉన్నాడని ప్రతీతి.

దూషణ : పరమత ఖండనం. దానిలో ఉన్న దోషాలన్నీ బయటపెట్టి అది పనికిరాదని త్రోసిపుచ్చటం.



అ  ఆ  ఇ  ఈ  ఉ  ఊ  ఋ  ఏ  ఐ  ఓ   ఔ  క  ఖ  గ  ఘ  చ  జ  త  ద  ధ  న  ప  ఫ  బ  మ  య  ర  ల  వ  శ  ష  స  హ  క్ష

Page 36


Back Next





     All Rights Reserved by M.Sudhakar  - 9440524168