#
Back

Page 29

వేదాంత పరిభాషా వివరణము


కారక : కారణం కార్యంగా మారటానికి తోడ్పడే సామగ్రి కర్తృకారకం మొదలుకొని అధికరణ కారకం వరకు చాలా ఉన్నాయి ఇవి. ఒక ఫలితం లేదా కార్యం ఏర్పడాలంటే కర్త కరణ క్రియ మూడూ అవసరం. ఇందులో కరణమనే దాన్ని కారకమని పేర్కొంటారు. క్రియకు కావలసిన సామగ్రి అని చెప్పవచ్చు.

కారికా : అర్థసంగ్రహ కారిక కారిక. ఒక విషయాన్ని విస్తరంగా కాక సంగ్రహంగా ఒక శ్లోకరూపంలో వర్ణించి చెబితే దానికి కారిక అని పేరు. ఇది ఒక రకమైన వ్యాఖ్యానం. మాండూక్య కారిక లిలాంటివే. ఆ ఉపనిషత్తు తాత్పర్యాన్ని సంగ్రహంగా బోధించే శ్లోకాలు. అద్వైత విజ్ఞానమంతా మూటకట్టి మనకందించిన రత్న శలాకాలు.

కాల : కాలం Time. యముడు, మృత్యువని కూడా అర్థమే. 'కలయతీతి కాలః' ఏది గణిస్తుందో లెక్కిస్తుందో, ఏది తనలో కలుపుకుంటుందో అది కాలం. పరమాత్మ అయినా కావచ్చు. 'అత్తా చరాచర గ్రహణాత్‌' కాలస్వరూపుడై చరాచర సృష్టినంతటినీ తనలో లయం చేసుకొంటాడాయన. 'కాలోస్మి లోక క్షయ కృత్‌' అని ఆయనే కంఠోక్తిగా చాటాడు గీతలో.

కాలీ : అలా లయం చేసుకొనే ఆయన. మాయాశక్తి. క్రియాశక్తి అని కూడా దీనికి పేరు.

కాష్ఠ : అవస్థ State. దిశ Direction. అవధి Culmination. 'సాకాష్ఠా సా పరాగతిః' అని కఠోపనిషత్తు మాట. ఇక్కడ కాష్ఠ అంటే చివరి దశ, చివరి స్థితి.

కులాయ : పక్షి గూడు Nest. శరీరమని కూడా అర్థమే. ఇదీ గూడు లాంటిదే. దీనిలో కాపురమున్న చిలక జీవుడు.

కుల : గుంపు. సమూహం. గృహం. మాతృకులం, శ్వశురకులం, దేవకులం అని వ్యవహారం. దేవకుల మంటే దేవుడున్న గృహం. శరీరమని కూడా ఒక అర్థం ఉంది. కులాంతస్థా అని దేవీ నామం. నామరూపాత్మకమైన ప్రపంచం కూడా కులం. అకులమంటే అశరీరం. నిష్ప్రపంచమైన ఆత్మతత్త్వం మాత్రమే.

కుశల : క్షేమం, సమర్థం, శుభం, శ్రేయస్సు, మోక్షం, నేర్పుకలవాడని Skilful కూడా అర్థమే.

కుశాగ్ర : కుశమంటే దర్భపోచ. అగ్రమంటే మొన. దర్భమొనలాగా పదునైన బుద్ధి.

కుహక/కుహనా : కపటం, వంచన, అసత్యం False, మోసం, కృత్రిమం.

కూట/కూటస్థ : సమూహం. మోసం. అసత్యం, మిథ్య. మాయ. అలాంటి మాయను అధిష్ఠించిన పరమాత్మ ప్రత్యగాత్మ కూటస్థుడు. సాక్షి రూపమైన ఆత్మచైతన్యమని అర్థం. అచలమైన తత్వం. కూటస్థ మచలం ధ్రువం.

కృత : తయారైనది. కృత్రిమం. నామరూపాదులన్నీ కృతమే. 'నాస్తి అకృతః కృతేన. కృతమైన పదార్థంతో అకృతాన్ని పట్టుకోలేము. కృతమంటే ఇక్కడ అనిత్యమైన సంసార భావాలు. అకృతమంటే త్రిగుణాతీతమైన నిత్య వస్తువు ఆత్మ.

కృతాకృత : చేసినది చేయనిది అని అర్థం. కర్మ చేస్తే కృతం. చేయకుంటే అకృతం.

కృతకృత్య/కృతార్థ : చేయవలసినది చేసినవాడు Accomplished. కృతార్థుడన్నా ఇదే అర్థం. 'ఏతత్‌కృత్వా బుద్ధిమాన్‌ స్యాత్‌ కృతకృత్యశ్చ భారత.' ఈ సాధన చేస్తే కృతకృత్యుడు. ఇక చేయవలసినది ఏదీ లేని వాడవుతాడు అని చాటుతున్నది శాస్త్రం.

కృతక : కృత్రిమం. అసత్యమని అర్థం.

కృతి : కార్యం. పని చేయటమని, సృష్టించటమని అర్థం.

కృత్స్న : సమస్తం. అన్ని. అంతా. 'కృత్స్న కర్మ కృత్‌' అన్ని పనులు చేసిన వాడని అర్థం.

కృత్‌ : ఒక పని చేసేవాడు Doer. Worker. కర్త అని అర్థం.

కృతాంత : యముడని ఒక అర్థం. పని ముగిసిపోవటమని మరొక అర్థం. శాస్త్రమని ఇంకొక అర్థం.

కృపణ : కృశపణ అనే మాటలో శవర్ణం లోపించి కృపణ అనే రూపమేర్పడింది. తక్కువ ధనమున్న వాడని అర్థం. అలాంటివాడు ఎప్పుడు జాలిపడవలసిన వాడే. కనుక కృపణుడంటే శోచనీయుడని Pitiable శాస్త్రంలో లాక్షణికంగా ఒక అర్థం ఏర్పడింది. 'ఏతదవిదిత్వా యః ప్రైతి స కృపణః' ఈ విషయం తెలియకుండా ఎవడు మరణిస్తాడో వాడు కృపణుడు, శోచనీయుడని ఉపనిషత్తు చాటిన విషయం.

కార్పణ్య : కృపణుడి భావమే కార్పణ్యం. Pitiability. 'కార్పణ్య దోషోప హత స్వభావః' అని గీతా వచనం.

కేవల/కైవల్య : మరొకటి ఏదీ లేకుండా తనపాటికి తానే ఉన్నది. ఆత్మ. సజాతీయ విజాతీయ స్వగతభేద రహితమైన తత్త్వం. దాని భావం కైవల్యం. కేవలత్వం. ఏకత్వం అద్వైతం మోక్షం శివః కేవలోహం

కేనోపనిషద్‌ : ఉపనిషత్తులలో ఇది రెండవది శరీరాదులుగాని చరాచర పదార్థాలుగాని ఇలా నడుస్తున్నాయంటే ఏది వెనకాల చేరి వీటిని నడుపుతున్నది అని ప్రశ్న వేసి దానికి సమాధానం ఇచ్చిన ఉపనిషత్తు ఇది. దీనికి పదభాష్యమని వాక్యభాష్యమని రెండుగా భాష్యం రచించారు భగవత్పాదులు.

కైతవ : కితవుని భావం. కితవుడంటే మోసగాడు. అప్పటికి కైతవమంటే మోసం. నెపం. కపటం. కల్తీ. 'ధర్మః ప్రోజ్ఘిత కైతవః' కల్తీ లేని ధర్మం. అనన్యభక్తి. భాగవతం చెప్పే ధర్మమిదే.

కోశ : కత్తి పెట్టే ఒక Sheath. ఒక వస్తువును కప్పి ఉంచేది Cover. శరీరంలో ఉండే పంచకోశాలు. అన్నమయం నుంచి ఆనందమయం వరకు ఇవి అయిదు. వీటి అయిదింటిలో ఆత్మచైతన్యం మరుగుపడింది. ఇవి దానికి ఉపాధులు. వీటిని దానిలో క్రమంగా లయం చేసుకొని చూస్తే పరిశుద్ధమైన పరిపూర్ణమైన ఆత్మ సాక్షాత్కరిస్తుంది. వీటిమూలంగానే అది పరిచ్ఛిన్నమై భాసిస్తున్నది. ఇదే సంసారం.

కోవిద : ఓ కోవిదలో ఓకారం లోపించగా ఏర్పడిన రూపమిది. అసలైన స్వరూపాన్ని గుర్తించిన ప్రజ్ఞాశాలి. అభిజ్ఞుడు అని అర్థం.

కోష్ఠ : లోపలి భాగం, కుక్షి The innter portion, జఠరగోళం.

కౌశల : కుశలశ్య భావః - నేర్పని అర్థం. Skill 'కర్మసు కౌశలం' ఆత్మభావనతో చూస్తూ కర్మలు చేస్తున్నా అవి మనలను బంధించవు. అదే కౌశలం.

క్రతు : యజ్ఞం, భావం, నిశ్చయం, సంకల్పం. 'త మక్రతుః పశ్యతి' సంకల్పం లేనివాడే ఆత్మను ఉన్నదున్నట్టు చూడగలడు. 'యధాక్రతుః తధాకర్మ కరోతి' ఏ భావనతో ఉంటే ఆ పని చేస్తాడు.

క్రమ : అడుగువేయటం, నడవటం, సాగటం, ఒక పద్ధతి, ఒక వరస Order.

క్రాంత : క్రము అనే ధాతువుకు భూతకాలిక ధాతుజ విశేషణం Past participle. దాటిపోయిన, గడచిపోయిన అని అర్థం. Passed.

క్రాంత దర్శి : దేశకాల అవధులను దాటిపోయి సృష్టి రహస్యాన్ని దర్శించే మహనీయుడు.

క్రియాశక్తి : ప్రకృతి, పరమాత్మ జ్ఞానస్వరూపుడైతే ఆయన ప్రకృతి, ఆ జ్ఞానాన్ని చలింపచేసే క్రియాశక్తి. దీనివల్లనే సంసార బంధమేర్పడింది జీవుడికి.

క్రియా/కారక/ఫల : ఒక పని, దానికి కావలసిన సామగ్రి, అది చేస్తే కలిగే ఫలితం. సంసారమంతా ఇదే. దీన్ని చేసేవాడు కర్త అయితే ఫలితమనుభవించే టపుడు వాడే భోక్త అవుతున్నాడు.

క్లేశ : పీడ, బాధ, వేదన. ఇవి వేదాంతంలో మూడు విధాలు. అవే ఆధ్యాత్మికాది తాపత్రయం. యోగశాస్త్రంలో అయిదు విధాలు. అవిద్య, ఆస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు. వీటినే పాశాలని కూడా వర్ణిస్తారు.

ఖ : ఆకాశం. ఇంద్రియం. పరాంచి ఖాని వ్యతృణత్‌ అని కఠోపనిషత్తు. ఖాని అంటే అక్కడ ఇంద్రియాలు అని అర్థం.

ఖగోళ : ఆకాశ గోళం. గ్రహసంచారానికి నిలయమైనది.

ఖసూచి : సాహిత్య గంధం లేక కేవలం వ్యాకరణ పఠనంతోనే తృప్తిపడ్డ వైయాకరణుడు. Grammarian.ఏదైనా ప్రయోగమడిగితే అతడు ఆకాశాన్ని చూపుతాడట. కనుక ఖసూచి అని పేరు వచ్చింది.

ఖేచరీ : యోగులు చెప్పే ముద్రలలో ఇది ఒకటి. దృష్టిని ఆకాశంమీద పెట్టటం. అప్పుడది ఆకాశంలోనే చరిస్తుంటుంది. మరి ఏ భావాలూ మనస్సుకు రావు.

ఖండ : ఒక శకలం. భాగం. ముక్క. పరిమితమైన పదార్థమని అర్థం. Part.

ఖండన : వాదంలో ఒకరి మాటనొకరు కాదని త్రోసిపుచ్చటం.

ఖ్యాన : ఆఖ్యానమని అర్థం. చెప్పటం, వర్ణించటం. Narration. విస్తరించి చెప్పటం. అదే కథ. దీనికి ఉప ముందు చేరిస్తే ఉపాఖ్యాన. కథలో కథ అని అర్థం.

ఖిల : అల్పం. అనుబంధం. Supplement. ఖిలపురాణం అంటే మహా పురాణానికి అనుబంధంగా వచ్చే ఉప పురాణం. ఖిలములన్నీ కలిస్తే అఖిలం. నిఖిలం. సంపూర్ణమని Whole అర్థం.

ఖిల్య : సమష్టిలో ఒక ముక్క. ఒక శకలం. ఖిలమే ఖిల్యం. మన శరీరమంతా ఒక ఖిల్యమట. అమూర్తమైన ఆత్మచైతన్యం మూర్తీభవించి లేదా ఘనీభవించి ఇది ఏర్పడిందని బృహదారణ్యకం వర్ణించింది. ఒక ఉప్పుముద్ద లాంటిదిది. సముద్రజలమే కరడుగట్టి లవణపిండమైనట్టు ఈశ్వర చైతన్యమే ఘనీభవించి శరీరంగా మారిందని మరలా ఇది ఆ చైతన్య సాగరంలోనే ప్రవిలాపనం Melting  చేస్తే తద్రూపంగానే దర్శనమిస్తుందని అక్కడ వర్ణించిన విషయం.

ఖేద/ఖిన్న : బాధపడటం. తాపం పొందటం. సంసారంవల్ల కలిగే వేదన. అది అనుభవించే జీవుడు ఖిన్నుడు.