#
Back

Page 27

వేదాంత పరిభాషా వివరణము


ఐకమత్య : ఏకమతం తాలూకు భావం. ఒకే మతం అంటే ఆలోచన కలిగి ఉండటం. Agreement among many minds.

ఐకాంతిక : ఏకాంతంగా ఉన్నది. ఎప్పటికీ తొలగిపోకుండా ఉండేది. Persistent. Abiding  అని అర్థం.

ఐకాత్మ్య : ఏకాత్మ భావం. ఒకే ఒక ఆత్మ లేదా స్వరూపం. విజాతీయ గంధం కూడా లేక అంతా సజాతీయంగా ఏకమైన వస్తుస్వరూపం. జీవేశ్వరులకున్న అవినాభావ సంబంధం. రెండూ రెండు ఆత్మలు కావు. రెండూ కలిసి ఒకే ఆత్మ అని సిద్ధాంతం. అద్వైతుల సిద్ధాంతమిదే.

ఐక్య : ఏకం యొక్క భావం. ఏకమై పోవటం. Merger. జీవబ్రహ్మైక్యం ఇలాంటిదే.

ఐతదాత్మ్య : ఏతదాత్మ భావం. ఇదే ఆత్మ తన స్వరూపమనే భావం. 'ఐతదాత్మ్య మిదగ్‌ం సర్వం.' ఆ సచ్చిద్రూపమైన తత్త్వమే ఈ ప్రపంచానికంతా స్వరూపం. దీనికంటూ వేరుగా ఒక స్వతంత్ర రూపం లేదని భావం.

ఐతిహ్య : ఇతిహాసం. ఇతివృత్తం. కరిరీశిళిజీగి. History. Tradition.  ఇది ఇలాగ ఇంతకు ముందు జరిగిందని చెప్పే మాట. కథ. చరిత్ర. వృత్తాంతం. జరిగిన సందర్భమని Past events భావం. ఇది కూడా కొందరు శాస్త్రజ్ఞులు ఒక ప్రమాణంగా స్వీకరిస్తారు.

ఐదంపర్య : ఇదం పర భావం. దీనికి చెందినదనే అర్థం Belonging to this.

ఐశ్వర్య : ఈశ్వర భావం. ఈశ్వరత్వం. Mastery. Commanding Nature. అన్నింటినీ లొంగ దీసుకోవడం. ఆధిపత్యం. భగవంతుని షడ్గుణాలలో రెండవది. జ్ఞానం మొదటిది. ఇది దాని తరువాతది. ఈ రెండే చాలు. మిగతా రెండూ కలిసి వస్తాయి. ఇందులో జ్ఞానం Planning ప్రణాళిక. అన్నిటినీ గ్రహించే శక్తి ఐశ్వర్యం Execution అమలుపరచడం. గ్రహించిన ప్రతి ఒక్కటీ అమలుపరిచే శక్తి. ఒకటి జ్ఞానశక్తి. మరొకటి క్రియాశక్తి Omni science and omni potence.

ఐంద్రజాలిక : ఇంద్రజాల విద్య ప్రదర్శించేవాడు, గారడీ వాడు Magician, Occultist, ఆకాశంలో గంధర్వ నగరాన్ని సృష్టిస్తాడు వాడు. అది వాస్తవం కాదు. కల్పన. మాయామయం. అలాంటిదే మన జీవితం. ప్రపంచం. ఇది ఒక పెద్ద ఇంద్రజాలమే. దీని కైంద్రజాలి కూడా పరమాత్మే.

ఐహిక : ఇహానికి చెందినది. ఇహమంటే ఈ కనిపించే లోకం. దీనివల్ల కలిగే సుఖదుఃఖానుభవాలన్నీ ఐహికం. దీనికి భిన్నమైనది ఆముష్మికం. అంటే Other world పరలోకమని అర్థం.

ఐకరూప్య : ఏకరూపమనే దాని భావం Uniformity.

ఐతరేయ : ఇతరానికి సంబంధించినది అని అక్షరార్థం. ఉపనిషత్తులలో ఇది ఒకటి. యాజ్ఞవల్క్యుడు క్రక్కితే తిత్తిరి పక్షుల రూపంలో శిష్యులు బయటపెట్టినది తైత్తిరీయం. దానికి ఇతరంగా సూర్యోపాసన చేసి మరలా యాజ్ఞవల్క్యుడు సాధించినది ఐతరేయం. ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం ఇందులోనే కనిపిస్తుంది మనకు. ఋగ్వేదానికి సంబంధించిన ఉపనిషత్తు ఇది.ఓంకార : సోహం అనే మాటలో సకార హకారాలు లోపిస్తే అవి ఓం అయిందంటారు. సః అహం సోహం. వాడే నేను అంటే ఆ ఈశ్వరుడే నేను. నాకూ వాడికీ తేడా లేదని భావం. ఇది అనుభవానికి తెచ్చుకోవటానికి దీన్ని మూడు వర్ణాలుగా విభజించారు. అ+ఉ+మ. అ అనేది జాగ్రదవస్థకూ అందులో ఉన్న విశ్వుడనే జీవుడికీ సంకేతం. ఉ అనేది స్వప్నానికీ తైజసుడికీ సంకేతం. మ అనేది సుషుప్తికీ అందులోని ప్రాజ్ఞుడికీ సంకేతం. సంకేతాన్ని ఉచ్ఛరించేటపుడీ అవస్థాత్రయాన్ని అందులో బందీ అయిన జీవుణ్ణి భావనచేసి కడపట మకారమనే నాదమెక్కడ ఆగిపోతుందో దాన్ని తురీయావస్థగా గుర్తించగలిగితే అప్పుడీ జీవభావమంతా ఎగిరిపోయి జీవుడీశ్వరుడే అనే ఏకాత్మ భావం అనుభవానికి రాగలదు. కనుకనే 'ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరన్‌ మా మనుస్మరన్‌' అని గీత బోధించింది. ఓం అనేది దానికి కేవలమొక ఆలంబనం లేదా ప్రతీక symbol.

ఓదన : అన్నమని అర్థం. దధ్యోదనమనే మాటలో తెలిసిపోతుంది. జరగబోయే ఫలితాన్ని ముందుగా మనస్సులో ఉంచుకొని చెప్పటానికిది ఒక ఉదాహరణగా ఇస్తారు. 'ఓదనం పచతి దేవదత్తః.' అన్నం వండుతున్నాడు దేవదత్తుడని అర్థం. వండితే గదా అది అన్నమవుతుంది. వండకముందే అన్నమనటంలో అర్థమేమిటి? అన్నంగా తయారుచేయటానికి యత్నిస్తున్నాడని భావం. దీన్ని భవిష్యద్వృత్తి అంటారు శాస్త్రంలో. సుషుప్తిలో ఉన్న ప్రాజ్ఞుడిలాంటివాడే. వీడిప్పుడు ప్రాజ్ఞుడు కాడు. ప్రజ్ఞాన రూపుడైన ఈశ్వరుడు నేనని భావిస్తే అవుతాడు.

ఓతప్రోత : పడుగు పేకలని అర్థం. అలాగే ఒకదానితో ఒకటి పెనవేసుకుని అల్లుకుపోతే దానికి పేరు. దేహంతో జీవచైతన్యం అలాగే ఓతప్రోతమై కూచుంది. కనుక దీనిని మరలా ఆత్మజ్ఞానంతో విభజించి రెండూ కలిపి ఏకాత్మ తత్త్వంగా గుర్తించటమే మానవుడు చేయవలసిన యత్నం.

ఓకస్‌ : స్థానమని అర్థం. Abode. దివౌకస అంటే దేవతలు. దేవలోకమే ఓకస్సుగా కలవారని అర్థం.

ఓకోవిద : అసలైన స్థానమేదో గుర్తించినవాడు. మర్మజ్ఞుడు. ఓకోవిద అనే మాటలోనే ఓ అనే అక్షరం లోపించి కోవిద అనే రూపమేర్పడింది. రెండింటికీ అర్థమొకటే. అర్థంలో మార్పులేదు.ఔచిత్య : ఉచితం తాలూకు భావం. Property యుక్తియుక్తంగా ఉండడం. సందర్భోచితమైన వ్యవహారం.

ఔత్పత్తిక : ఉత్పత్తి కలిగినది. తయారైనది. సహజం కానిది. Created.

ఔపచారిక : ఉపచారంవల్ల గ్రహించేది. ఉపచారమంటే గౌణార్థం. ondary Sence  లక్షణ. లాక్షణికంగా ప్రయోగించిన విషయానికి ఔపచారికమని పేరు. 'సింహోదేవదత్తః' దేవదత్తుడు సింహమే. సింహగుణాలు కలగినవాడని అర్థం.

ఔపనిషద : ఉపనిషత్తులకు సంబంధించినది. 'ఔపనిషదః పురుషః' ఉపనిషత్తులలో చెప్పిన పురుషుడు. అంటే పూర్ణ స్వరూపమైన ఆత్మ చైతన్యం అని అర్థం. అది ఉపనిషత్‌ ప్రమాణం వల్లనే గ్రహించాలిగాని, వేదంలోని పూర్వభాగమైన కర్మకాండ ద్వారా కాదు.

ఔపదేశిక : ఉపదేశమంటే Intuition తమ అనుభవాన్ని ఇతరుల కందివ్వటం. దానికి సంబంధించిన జ్ఞానం ఔపదేశికం. Secret knowledge. బ్రహ్మానుభవానికి కేవలం ప్రవచనం చేస్తే సరిపోదు. ప్రవచన అనంతరం ఉపదేశించాలి సద్గురువైన వాడు. అప్పుడే జ్ఞానానికి పరిపూర్ణత. పూర్ణానుభవం అదే.

ఔపాధిక : ఉపాధివల్ల ఏర్పడినది. నైమిత్తికమని కూడా పేర్కొంటారు. సహజం కానిది. ఒక విశేషం ద్వారా సంక్రమించినది. Accidental నిమిత్తముంటే ఉంటుంది. లేకుంటే తొలగిపోతుంది. కనుకనే ఇది నిత్యం కాదు.

ఔత్సర్గిక : ఉత్సర్గమంటే సామాన్య సూత్రం. General rule.  దానికి చెందినది ఔత్సర్గికం. ఉత్సర్గమంటే సృష్టికి కూడా వాచకమే. దానికి చెందినది లేదా సృష్టియైనది అని కూడా అర్థం చెప్పవచ్చు.

ఔదాసీన్య : ఉదాసీన భావం. ఎటూ మొగ్గు చూపకుండా మధ్యస్థంగా ఉండి పోవటం. ఉపేక్ష.

ఔర్ధ్వదైహిక : 'దేహపాతాత్‌ ఊర్ధ్వం యత్‌ క్రియతే కర్మ.' దేహపాతమైన తరువాత ఆచరించే క్రియాకలాపం obsequies. అంత్యక్రియలు.