• హోమ్
  •  
  • గురించి
  •  
  • ప్రవచనములు
  •  
  • గ్రంధములు
  •  
  • సంప్రదించండి
  •  
  • Youtube
  •  
  • English
  •  

అద్వైత వేదాంత పరిభాష

ఆ



ఆ : ఆది మొదలుకొని లేదా అంతవరకని దీనికి రెండర్థాలు ఉన్నాయి. ఆగర్భ అన్నప్పుడు పుట్టుక మొదలుకొని అని అర్థం. ఆబ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మవరకు అని అర్థం. 'ఆసుప్తేః ఆమృతేః కాలం నయేత్‌ వేదాంత చింతయా.' నిద్రపోయేవరకూ మరణించేవరకూ వేదాంత చింతనతో కాలం గడపాలట. ఆ అంటే అన్నివైపుల అనీ అర్థమే. ఆపూర్యమాణం అన్నివైపులా నిండి ఉన్నదని అర్థం. ఆ అనే మాటకు వ్యతిరేకార్థం కూడా కనిపిస్తుంది. మోచనమంటే వదలుకోవటం. ఆమోచనమంటే ధరించటం.

ఆకర : మూలస్థానం origin. ఒక భావాన్ని ఎక్కడినుంచి పట్టుకోచ్చామో ఆ source.

ఆకస్మిక : దేనివలన కలిగిందో చెప్పలేకపోతే అది ఆకస్మాత్తు. అలా ఆకస్మాత్తుగా జరిగే దానికి ఆకస్మికమని పేరు. accidental నిర్ణిమిత్తమని, ఉన్నట్టుండి జరిగేదని అర్థం. ప్రపంచ సృష్టి అలాగే జరిగిందంటారు భౌతికవాదులు. అలాకాదు అభౌతికమైన ఆత్మ స్వరూపంవల్లనే జరిగిందంటారు వేదాంతులు.

ఆకాంక్షా : దీనికేమిటి కారణం. దీనికేమిటని అడుగుతూ పోవటం enquiry జిజ్ఞాస. తెలుసుకోవాలనే కోరిక. అన్వేషించటం. లోకంలో పదార్థాలన్నింటికీ ఒక దానితో ఒకదానికి ఇలాంటి ఆకాంక్ష తప్పదు. ప్రతిదీ సాకాంక్షమే. relative నిరాకాంక్షం absolute ఒక ఆత్మతత్త్వమే. ఆకాంక్ష నివృత్తి అయితే జ్ఞానమక్కడికి సమాప్తమవుతుంది. అదే పరిపూర్ణ జ్ఞానం.

ఆకార/ఆకృతి : రూపం. మూర్తి Form. Shape. నామరూపాల్లో రెండవదానికి పర్యాయం. లోపలిది నామమైతే, దానికనుగుణంగా బాహ్యమైన పదార్థం రూపం. ఫలానా విధమని కూడా అర్థమే 'ఏవమాకారా వృత్తిః' ఈ విధమైన ఆలోచన. ఒక విషయానికి సంబంధించినదని కూడా అర్థమే. గృహాకార. సుఖాకారా. గృహాదులకు సంబంధించిన ఆలోచన అని అర్థం.

ఆకాశ : పంచభూతాలలో ఒకటి. సృష్టిక్రమంలో మొదటిది. లయ క్రమంలో కడపటిది. అవకాశమిచ్చే స్వభావం కలది space. దీని గుణం శబ్దం sound  అది వినపడేదే కానక్కరలేదు. కేవలం స్పందరూపంగా vibration  ఉన్నదీ శబ్దమే. నీ, నా మధ్య ఆకాశమే లేకుంటే శబ్దం ప్రసరించదు. వాయువువల్ల కదా అంటావు. వాయువుకేది ఆధారం. ఆకాశమే. ఆకాశమంటే లాక్షణికార్థంలో secondary sence పరమాత్మ అని అర్థం. ఆ పరమాత్మ తాలూకు మాయాశక్తి కూడా ఆకాశమే. 'ఆ సమంతాత్‌' అంతటా 'కాశతే ప్రకాశతే' వ్యాపించినదేదో అది ఆకాశం. సర్వవ్యాపకత్వం నిరాకారత్వం సూక్ష్మత్వం వరకు ఆకాశానికి ఉన్న గుణాలే చైతన్యానికి చెప్పవచ్చు. కాని వీటికి అదనంగా నేననే స్ఫురణ self awareness  మాత్ర మాకాశానికి లేదు. అది చిదాకాశమైతే ఇది జడాకాశం. కనుకనే చిద్రూపమైన ఆత్మ ఈ జడమైన ఆకాశానికి కూడా కారణమయింది.

ఆకులత్వ : గందరగోళం confustion అని అర్థం. శాస్త్రంలో ఇది ఒక పెద్ద దోషం. పూర్వాపరాలకు ఎక్కడా అందిక పొందిక లేకపోతే అది ఆకులం. దానివల్ల విషయం తాలూకు అవగాహన స్పష్టంగా ఏర్పడదు. సమర్థుడైనవాడు ఎక్కడికక్కడ సమన్వయించి వ్యాఖ్యానించినప్పుడే ఆకులత్వం తొలగిపోయి విషయం చక్కగా మనస్సుకు వస్తుంది. భాష్యకారులు చేసిన పని అదే.

ఆకూత : అభిప్రాయం. మనస్సులో ఉన్న ఆంతర్యం intention aim or implication  అని అర్థం. కవి హృదయమని మామూలుగా అనే మాట.

ఆంతర/ఆంతర్య : బాహ్యమైన అర్థంతో తృప్తిపడక దీనిలోని దాగి ఉన్న శాస్త్ర హృదయం ఏమిటని తాపత్రయ పడితే దానికి తోచే భావమే ఆంతర్యం.

ఆండజ : అండజమనే దాని అర్థమేదో అదే. అండము నుండి జన్మించిన పక్షి సరీసృపాది ప్రాణిజాతం.

ఆఖ్యాన/ఆఖ్యాయికా : వర్ణించటం. చెప్పటం అని అర్థం. అలా భావన చేస్తూ చెప్పిన కథలకు, గాథలకు ఆఖ్యాయికలని పేరు tale fable, story.

ఆగంతుక : మధ్యలో వచ్చినది. క్రొత్తగా వచ్చి చేరినది. సహజం కానిది. కృత్రిమం, అనిత్యం. విషయ ప్రపంచమంతా ప్రమాణానికి గోచరించిన తరువాతనే ఏర్పడుతున్నది. కనుక ఇది ఆగంతుకమే. ప్రమాణాలకు ముందే సిద్ధించిన ఆత్మ ఇలా ఆగంతుకం కాదు సహజం.

ఆగమ : అంతకుముందు లేక క్రొత్తగా రావటం. ఏది వచ్చినదో అది మరలా పోక తప్పదు. ఆ పోవటానికి అపాయమని పేరు. ఆగమపాయాలు ప్రతి పదార్థానికి స్వభావికం. ఆగమమంటే శాస్త్రమని కూడా అర్థమే. ముఖ్యంగా వేదవాఙ్మయం. దానిని చూచి మరలా కొందరు ప్రజ్ఞావంతులు అలాంటి అనుభవాన్ని అందించే తంత్ర గ్రంథాలు కూడా సృష్టించారు. ఇలాంటి తంత్ర గ్రంథాలకు కూడా ఆగమమని పేరు వచ్చింది. వేదాంతుల అభిప్రాయంలో ఆగమమంటే పరోక్షజ్ఞానమిచ్చే ఉపనిషత్తుల లాంటి శాస్త్రాలు కాక అనుభవజ్ఞాన మందించే గురూపదేశమని అర్థం. intution, or experience.

ఆగ్రహ : పట్టుదల అని అర్థం. సత్యాగ్రహమంటే సత్యం మీద. మిథ్యాగ్రహ మంటే అసత్యం మీద. ఏదైనా ఆగ్రహమే.

ఆగామి : త్రివిధమైన కర్మలలో ఇది ఒకటి. మొదటిది సంచితం. గతానికి సంబంధించినది. రెండవది ప్రారబ్ధం. గతంలో చేసిన దానికి ఫలితంగా వర్తమానంలో అనుభవించేది. మూడవది ఆగామి. వర్తమానంలో చేస్తూ ఉన్నది. భవిష్యత్తులో అనుభవించ బోయేది.

ఆచార/ఆచార్య : ఒక కర్మ ఆచరించటం. అమలు పరచటం. conduct, practice అలాంటి కర్మగాని, జ్ఞానంగాని తాను ఆచరిస్తూ మరి ఒకరిచేత ఆచరింప చేసేవాడు ఆచార్యుడు. గురువు. ముఖ్యంగా బ్రహ్మజ్ఞానమూ, జ్ఞాననిష్ఠా రెండూ కలవాడు. 'ఆచార్యవాన్‌ పురుషో వేద' అలాంటి ఆచార్యుల సహాయంతోనే బ్రహ్మజ్ఞానం అందుకోవాలని పెద్దల సలహా.

ఆజవంజవ : సంసారమని అర్థం. జీవుని వదలకుండా అంటిపట్టుకొని కర్మ ఫలాన్ని అతనిచేత అనుభవింపచేసేది అని శబ్దార్థం.

ఆజానదేవతా : జాన అంటే జన్మ. జన్మతోనే సహజంగా దివ్యత్వం పొందిన జీవులు. వారు స్వర్గ నివాసులు. కర్మభూమిలో సత్కర్మ లాచరించి తత్ఫలితంగా స్వర్గం చేరినవారు కారు. సహజంగానే దేవతాజన్మ ఎత్తినవారు.

ఆజీవ : ఒకదానిమీద ఆధారపడి జీవించేది. to live upon రూపాజీవా. రూపాన్ని ఆధారం చేసుకొని బ్రతికే వ్యక్తి అని అర్థం.

ఆతాన/ఆతత : అన్ని వైపులా వ్యాపించటం. ఎడతెగక సాగిపోయేది. incesant pervasive.

ఆత్మా : నేను అనే భావం. స్ఫురణ consciousness. అదే స్వరూపమీ అనాత్మ ప్రపంచానికంతటికీ. కనుక ఆత్మ అంటే స్వరూపం. self or substance సత్తు ఉండటం. చిత్తు ఉన్నట్టు స్ఫురించటం. ఇవి రెండే దీని లక్షణాలు. ఇవి ఆత్మకే కాక దానికి గోచరించే అనాత్మకు కూడా కన్పిస్తున్నాయి. కాబట్టి ఆత్మానాత్మలుగా భాసించే రెండూ నిజాని కాత్మేనని అద్వైత సిద్ధాంతం. దీనికే ఏకాత్మ, సర్వాత్మ అని పేరు. 'ఆ సమంతాత్‌ తనోతీతి ఆత్మా.' సర్వవ్యాపకమని నిర్వచనం. 'యదాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయనిహ యచ్చాస్య సంతతోభావః తదాత్మేతి ప్రకీర్త్యతే.' ఏది వ్యాపిస్తుందో, వ్యాపించి ఏది గ్రహిస్తుందో, గ్రహించి ఏది కబళించి తనలో కలుపుకుంటుందో, కలుపుకొని ఏది అవిచ్ఛిన్నంగా నిలిచిపోతుందో అది ఆత్మ అని ఆత్మశబ్దానికి పెద్దలు మరొక నిర్వచనం చెప్పారు. అది నేననే జ్ఞానమే. నావరకే అయితే అది స్వరూపం. సర్వత్రా వ్యాపిస్తే విభూతి self and its expanstion. ఇది అద్వైతుల సిద్ధాంతం.

ఆత్మానాత్మ వివేక : ఆత్మ ఏదో అనాత్మ ఏదో రెండింటిని విభజించి తెలుసుకోవటం. దేహేంద్రియాదుల దగ్గర నుంచీ బాహ్యప్రపంచం వరకూ ఈ అనాత్మతో ఏకమై పోయింది అసలైన ఆత్మ. కనుక దానిని దీనినుండి వేరు చేయాలి. ఈ వేరు చేయటానికే సాంఖ్య యోగమని పేరు భగవద్గీతలో. సాక్షిగా భావిస్తే ఆత్మ. సాక్ష్యమైతే అనాత్మ. ఇది రెండింటికీ ఉన్న విభాగం.

ఆత్మజ్ఞాన : ఆత్మ తాలూకు జ్ఞానం. ఆత్మాకార వృత్తి అని అర్థం.

ఆత్మక : స్వరూపంగా కలది. చిదాత్మక అంటే చైతన్యమే తన స్వరూపంగా కలిగినదని అర్థం.



అ  ఆ  ఇ  ఈ  ఉ  ఊ  ఋ  ఏ  ఐ  ఓ   ఔ  క  ఖ  గ  ఘ  చ  జ  త  ద  ధ  న  ప  ఫ  బ  మ  య  ర  ల  వ  శ  ష  స  హ  క్ష

Page 18


Back Next





     All Rights Reserved by M.Sudhakar  - 9440524168