#
Back

Page 69

వేదాంత పరిభాషా వివరణము


హవన : అగ్నిహోత్రంలో హోమం చేయటానికి పేరు. ఇది భౌతికం కావచ్చు. ఆధ్యాత్మికమూ కావచ్చు. మొదటిది బహిర్యాగమైతే రెండవది అంతర్యాగం. Spiritual sacrifice. అగ్నిహోత్ర మిక్కడ ఆత్మచైతన్యమే. హవనం చేయవలసినది ఆజ్యమూ దధి ఇలాంటివి కావు. మానసికమైన వాసనలు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః అని గీతా శ్లోకం.

హనన/హంతా/హత : హననమంటే వధించటం. హంత వధించేవాడు. హత వధింపబడినది. ఆత్మ ఎప్పుడూ ఈ మూడింటితోనూ సంబంధం లేనిదే. ఎవడైనా హననం చేశాడంటే అది ఆత్మను కాదు. దాని ఉపాధి అయిన శరీరాన్ని. 'ఆత్మ హనో జనాః నహినస్తి ఆత్మనా' ఆత్మానం అనేచోట ఆత్మను హత్య చేయటమనే మాట కూడా వినిపిస్తుంది. కాని అది వాస్తవంగా హత్య చేయటం కాదు. ఒక హతమైన పదార్థం మనకు మరలా ఎలా కనపడదో అలాగే యావజ్జీవమూ మనకు మన ఆత్మస్వరూపం కనపడకుండా మరుగుపడి పోయింది. కాబట్టి మరుగు పడటమనే అర్థంలో హననమని, హత్య అని మాటలు ప్రయోగించింది శాస్త్రం.

హాన/ఉపాదాన : వదిలేయటమని, పట్టుకోవటమని అర్థం వీటికి. ప్రపంచంలో వదిలేయ వలసినది అనర్థం. దానికి ప్రతిగా పట్టుకునేది ఉపాదానం. సుఖాన్ని పట్టుకుంటూ దుఃఖాన్ని వదిలేస్తాడు మానవుడు. హానోపాదానాలు అంటే ఇవే.

హేయ/ఉపాదేయ : కాని ఆత్మవిషయంలో ఇలాంటి హానోపాదానాల కవకాశం లేదు. ఎందుచేతనంటే సర్వవ్యాపకం కాబట్టి అది ఉపాదేయం కాదు. దగ్గరకు తీసుకునేది కాదని అర్థం. మన స్వరూపమే కాబట్టి హేయం కాదు. త్రోసిపుచ్చేది కాదని భావం. కనుకనే ఆత్మ అంటే అహేయం. అనుపాదేయం అని వర్ణిస్తారు వేదాంతులు.

హేతు : కారణమని అర్థం Cause. హేతువాదమంటే కార్యకారణ సంబంధం చూపుతూ ప్రతివాదితో వాదించటం. Argumentation. అప్పుడే ఒక సత్యాన్ని నిరూపించగలం.

హేత్వాభాస : హేతువులాగ పైకి కనపడేది. లోతుకు దిగిచూస్తే ప్రతివాది చూపిన హేతువు తేలిపోతుంది. ఇలాంటి దానికి హేత్వాభాస False reasoning అని పేరు.

హేతు/హేతుమత్‌ : హేతువు. అలాంటి హేతువు కలిగిన దానికీ ఉండే పరస్పర సంబంధం. కార్యకారణ సంబంధం అనే మాటకిది పర్యాయపదం. Cause and effect relationship.

హోమ : అగ్నిహోత్రంలో ఆహుతి చేయటం. దేవతలను మంత్ర పూర్వకంగా ఆహ్వానించటమని అసలైన అర్థం. కనుకనే ఆహుతి, ఆహావ అనే రూపాలు ఏర్పడ్డాయి. ఆహుతి అంటే ఆహూతి అనే దాని రూపాంతరమే. హ కారమే స కారంగా మారటం మూలాన హోమమనే దానికి సోమమనే మరొక పర్యాయ పదం కనిపిస్తుంది. స కార హ కారాల విపరిణామమిది.

హరణ/హృత : తీసుకుపోవటం. ప్రక్కకు తప్పించటం. అలా తప్పింపబడినది హృతం. అజ్ఞానమనేది ఆత్మస్వరూపాన్ని అలాగే హరించింది. దానిచేత మన స్వరూపం హృతమైంది కనుకనే ఉన్నదున్నట్టు పట్టుకోలేకపోతున్నాడు మానవుడు. అజ్ఞానేన అపహృతం జ్ఞానం అని శాస్త్రం చాటిచెపుతున్నది. హరించేది కనుకనే మాయాశక్తికి హ్రీ అనే పేరు పెట్టారు పెద్దలు. దానికి మారుగా శ్రీ అని మరొక నామం కూడా ఉంది మాయాశక్తికి. ఆత్మను శ్రయించేది అంటే అంటి పట్టుకునేది కనుక శ్రీ. మొదటిది అవిద్యారూపమైతే రెండవది విద్యారూపం.

హృత్‌/హృదయ : రెండింటికీ హృదయమనే heart అర్థం. శరీరంలో ఎడమవైపు పుండరీక ఆకారంగా ఉన్న భాగం. కానీ హృదయానికీ బుద్ధికీ తేడా లేకుండా రెండింటినీ ఏకంచేసి పేర్కొంటారు వేదాంతులు. దానికి కారణం రెండింటినీ కలుపుతూ ఒకే ఒక సిర కపాలం వరకూ ప్రసరిస్తూ ఉండటమే. తద్ద్వారా రక్తం పైకి వెళ్ళిపోయి దాని బలంతో బుద్ధి పనిచేస్తుంది. కనుక రెండింటికి ఉన్న ఈ అవినాభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఏకంగా వర్ణించటం జరిగింది. హృది అయం అని చమత్కారంగా మరొక అర్థాన్ని చెప్పాయి ఉపనిషత్తులు. హృది అంటే హృదయంలో అయం అంటే ఆ పరమాత్మ జీవరూపంగా వచ్చి కూచున్నాడు. అందుకే హృదయం అనే పేరు సార్థకమయిందని చెబుతారు ఉపనిషదృషులు.

హిరణ్యగర్భ : హిరణ్యమంటే బంగారమని వాచ్యార్థం. బంగారమంటే ఇక్కడ భౌతికమైన లోహమని కాదు. లాక్షణికంగా చెబితే బంగారం జ్ఞానప్రకాశమే. అది గర్భంలో గుప్తం చేసుకున్న వ్యక్తి ఎవడో అతడు హిరణ్యగర్భుడు. కార్యబ్రహ్మమని అర్థం. అంటే పరమాత్మే సగుణ రూపంగా హిరణ్యగర్భుడయ్యాడు. గుణాలు ఆవరించినా అందులో హిరణ్యం అంటే బంగారులాగా ప్రకాశించే చైతన్యం తొంగి చూస్తూనే ఉంది. కనుకనే హిరణ్యగర్భుడనే పేరు వచ్చింది.

క్ష

క్షత/క్షత్త్ర : క్షతమంటే దెబ్బ. కష్టమని కూడా అర్థం. అలాంటి అనర్ధాన్నుంచి ఏది కాపాడుతుందో అది క్షత్త్ర. క్షత్త్రియ జాతి అని అర్థం. ప్రజలను ఆపదల నుండి కాపాడుతున్న వాడు గనుకనే క్షత్ర అని క్షత్రియుడని పేరు వచ్చింది. 'క్షతాత్‌ త్రాయతే ఇతి.' వేదాంతంలో క్షత్ర శబ్దాన్ని పారిభాషికంగా ప్రయోగించటం కూడా చూస్తాము. 'యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవత ఓదనః' ఎవరికైతే బ్రాహ్మణుడు క్షత్రియుడు ఇద్దరూ ఓదనం అంటే ఆహారం అవుతారో అలాంటి ఆత్మ అని అర్థ మీవాక్యానికి. ఆత్మకు ఆ ఇద్దరూ ఆహారం కావటమేమిటి. బాహ్యార్థం చెబితే చెల్లదు. అంతరార్థమే చెప్పాలి. ఇక్కడ బ్రాహ్మణుడంటే మనస్సు. క్షత్రియుడంటే ప్రాణం. ఇవి రెండూ జీవుడి ఉపాధులు. ఈ ఉపాధులు లయమయితే అదే ఆత్మ స్వరూపం. క్షత్ర అనే మాటకిక్కడ ప్రాణమనే అర్థం చెప్పుకోవలసి ఉంటుంది. అది కూడా శరీరానికి
దెబ్బ తగలకుండా కాపాడుతూనే ఉంటుంది. సుషుప్తిలో ఇది మనకు చక్కగా తార్కాణమవుతుంది. అప్పుడు ఈ శరీరం పడిపోకుండా దెబ్బ తినకుండా ఉచ్ఛ్వాస నిశ్శ్వాస రూపంగా రాకపోకలు చేస్తూ కాపలా కాస్తున్నది ప్రాణమేగదా.

క్షర : 'క్షరతీతి క్షరం.' క్షరణమంటే నశించటం. మారిపోవటం. మాసిపోవటం. 'క్షర స్సర్వాణి భూతాని' అంటే సమస్త భూత భౌతిక పదార్థాలూ క్షరమే. అంటే నశించేవే. ఎప్పటికప్పుడు మారిపోయేవే అని భావం. ఇలా క్షరం కానిదేదో అది అక్షరం. అక్షరమైనవి రెండే. ఒకటి అవ్యక్తమైన మాయాశక్తి. రెండవది దానికి అధీశ్వరమైన చైతన్యశక్తి.

క్షేమ : యోగక్షేమాలని జంట పదాలు. 'అలబ్ధస్య లాభః యోగః.' మనకు లేనిది ప్రాప్తించటం యోగం. 'లబ్ధస్య పాలనం క్షేమం.' అలా ప్రాప్తించినది మరలా తొలగిపోకుండా నిలిచి ఉండటం క్షేమం. ఇవే మానవుడు కోరే పదార్థాలు. మనం కోరినా లభించక పోవచ్చు. నిరంతరం అనన్య భక్తితో పరమాత్మను సేవిస్తే 'యోగక్షేమం వహామ్యహం' అని ఆయనే మనకు హామీ ఇవ్వగలడు. ఇదే గీత మనకిచ్చే గొప్ప సలహా.

క్షేప : త్రోసిపుచ్చటం. కాలం గడపటం. Passing time. ప్రారబ్ధం తీరే వరకు ఉపాధి నిలిచి ఉండడానికి క్షేపమని పేరుపెట్టారు. అంతవరకే దానికి అవధి. ఉరిళీరిశి అని అర్థం. 'తస్య తావదేవ చిరం' అనేచోట చిరమంటే క్షేపమని అర్థం వ్రాశారు భాష్యకారులు. అంటే ప్రారబ్ధం తీరేవరకు అని భావం.

క్షోభ : కలతపడటం. చెదరిపోవటం. త్రిగుణాలు సామ్యావస్థలో ఉంటే సృష్టి జరగదు. అవే క్షోభ చెందితే గుణవైషమ్యమేర్పడి సృష్టి జరుగుతుంది. ఈ మాట సాంఖ్యులు చెబితే వైశేషికులు క్షోభకు మరొక అర్థం చెబుతారు. వీరు త్రిగుణాలంటే వారు పరమాణువులు అలా క్షోభ చెందుతాయని వర్ణిస్తారు. Upheaval.

క్షుద్ర : నీచమని గాక అల్పమని కూడా అర్థమే. క్షుద్ర బ్రహ్మాండమంటే బ్రహ్మాండం తాలూకు స్వల్పమైన ప్రపంచం. Micro cosm. పిండాండమని అర్థం. జరాయుజాది శరీరాలు.

క్షమా/క్షాంతి : సహనమని అర్థం. దైవగుణాలలో ఇది కూడా చేరుతుంది. తితిక్ష అని దీనికి మరొక పేరుకూడా పెట్టవచ్చు Endurance.

క్షయ : నశించటం. తగ్గిపోవటం. దీనికి భిన్నంగా ఎప్పటికీ నశించనిదైతే అది అక్షయం. క్షయం ప్రపంచ స్వభావమైతే అక్షయం ఆత్మ స్వభావం.

క్షురధానీ : క్షురమనగా కత్తులు కటారులు. అవి ఎందులో ఉంచుతారో అది క్షురధానీ. మంగలి పొది. ఆత్మస్వరూపాన్ని దీనితో పోల్చింది బృహదారణ్యకం. అనాత్మ సామగ్రి అంతా ఆత్మలోనే తలదాచుకుంటున్నది. దాని సరిహద్దు మించి పోలేదు. అది ఎలాగంటే ఒక క్షురధానిలో క్షురమూ మొదలైన పరికరాలు ఎలా గుప్తంగా ఉంటాయో అలాగేనని వర్ణన.

క్షురస్య ధారా : క్షురమంటే పైన చెప్పినట్టు మంగలి కత్తి. దాని పదును లేదా అంచుకు ధార అని పేరు. సాధనమార్గం అలాంటిదట. కత్తి వాదరమీద నడవటం ఎంత కష్టమో అంత కష్టసాధ్యమని అర్థం. సాధారణంగా నూటికి 99 మందికి అసాధ్యమైతే కావచ్చు కానీ అలంటి అసాధ్యమైన దాని సూక్ష్మం తెలిసినవానికి ఎప్పుడూ సాధ్యమే. 'దృశ్యతే త్వగ్య్రయా బుద్ధ్యా సూక్ష్మయా' అన్నది కఠోపనిషత్తు. బుద్ధికి బాగా పదునుపెట్టే కొద్దీ సూక్ష్మాతి సూక్ష్మమై ప్రకాశిస్తుంది. అలాంటి బుద్ధి బలంతో ఎంత విషయమైనా అసాధ్యమైనా మోక్షసాధన మార్గంలో పయనించగలడు సాధకుడు. పొందగలడు అభీష్టమైన మోక్షఫలం.

క్షేత్ర : పొలం. Farm. Field. పొలం లాంటిదే మన శరీరం కూడా. ఇక్కడా కర్మ జ్ఞాన బీజాలు నాటుతాము. వాటి ఫలం మరలా ఇక్కడే అనుభవిస్తాము. కనుక అసలైన క్షేత్రమీ మానవ శరీరమే నన్నారు వేదాంతులు Human body.

క్షేత్రజ్ఞ : క్షేత్రం జానాతీతి. స్వాభావికమైన ఔపదేశికమైన జ్ఞానంతో ఈ శరీరమనే క్షేత్రాన్ని ఎవడు తనకు విషయంగా Object చూస్తుంటాడో వాడు క్షేత్రజ్ఞుడు. The knower of the body . జీవుడని అర్థం. జీవన్ముక్తుడు కూడా చూస్తాడు దీన్ని. అయితే జీవుడి లాగా కాదు. జీవుడు తానేనని, తనదేనని చూస్తే, జీవన్ముక్తుడు పాము తన కుబుసాన్ని చూచినట్టు తనకు దూరంగా చూస్తాడు.

End