#
Back

Page 57

వేదాంత పరిభాషా వివరణము


వామనీ-భామనీ : అక్షి పురుష విద్యకు విశేష కోణాలు. అది అన్ని కోరికలనూ సాధకుడికి అందిస్తుంది కాబట్టి వామని - అన్ని తేజస్సులనూ వ్యాపించి వెలుగుతుంది గనుక భామని.

వామకేశ్వరి : వమనాత్‌ వామా. విశ్వాన్నంతా వమనం చేసేది వ్రెళ్ళగక్కేది వామ. పరమేశ్వరుని మాయాశక్తి. ఆవిడే ఈశ్వరి. వామకేశ్వరి. క్రియాశక్తి. ఆయన దక్షిణామూర్తి జ్ఞాన స్వరూపుడైతే, ఆమె వామ క్రియా స్వరూపిణి.

వాక్య : ఒక సంపూర్ణమైన అర్థమిచ్చే పద సమూహం. ఇది లౌకికమని అలౌకికమని రెండు విధాలు. లౌకికం ఆయా రచయితల గ్రంథాలలో లోకుల వ్యవహారంలో కనిపించేది. ఇది పౌరుషేయ మంటారు. అలౌకికం వేద శాస్త్రాలలో కనిపించేది. అది పారమార్థికమైన సత్యాన్ని చెప్పేది కనుక అలౌకికం అపౌరుషేయం. తత్త్వమసి మొదలైన మహావాక్యాలు ఇలాంటివి.

వాసనా : చిత్తవృత్తులే మనస్సులో బాగా పేరుకొనిపోతే వాటికి వాసనలని పేరు Impressions. సంస్కారాలని కూడా పేర్కొంటారు. ఇవే బహు జన్మలనుంచి ప్రోగు చేసుకున్న సంచిత కర్మ. వర్తమాన జన్మలో వృత్తులుగా పరిణమించాయి. ఇవి మరలా బలం పుంజుకొని వాసనలౌతాయి. వృత్తి సంస్కార చక్రమన్నారు యోగ శాస్త్రజ్ఞులు. ఇది ఒక విషవలయం. సంసారానికిదే మూలం గనుక కారణ శరీరమని దీనికి పేరు వచ్చింది. దీనికి జవాబు ఈశ్వర వాసన ఒక్కటే. 'ఈశా వాస్య మిదమ్‌ సర్వం.' ఈశ్వర వాసన అనే శుభవాసన ఈ ప్రాపంచకమైన అశుభ వాసన లన్నింటికీ ప్రహాణకం.

వికల్ప/వికార : ఒక వస్తువు అనేక విధాలుగా భాసిస్తే అవి దాని వికల్పాలు లేదా వికారాలు The forms of a substance or changes.

విశేష : విశేషాలన్నా వికల్పాలే. వికారాలే. అన్నీ ఒకదానికొకటి పర్యాయాలు. సామాన్యానికి Universal  అని, విశేషానికి Particular అని భాషాంతరం. నామరూప క్రియలన్నీ విశేషాలే. సామాన్య రూపమైన సచ్చిత్తులే నామరూపాది విశేషాలుగా భాసిస్తున్నవి. వీటిద్వారా గోచరిస్తున్నది ఆ సామాన్యమే. ఇవి దానికి కేవలం ఉపాధులు ళీలిఖిరిబి.

వికల : సకలానికి వ్యతిరేకి. కళలంటే భాగాలు. అంశలు. ఎక్కడికక్కడ అవి విడిపోతే అలాంటి పదార్థం వికలం deformed  ఖండమని అర్థం.

వికృత : Changed మారిపోయినది. రూపాంతరం చెందినది. ప్రపంచమంతా చైతన్యవికారమే. దాని వికృతమైన రూపమే.

విక్రియా : వికారమనే మాటకు పర్యాయమే synonym.

వికాస : విస్తరించటం expansion. చైతన్య వికాసమే సృష్టి. విలాసమన్నా అర్థమిదే.

విక్షేప : సంక్షేపానికి వ్యతిరిక్తం. చెదరిపోవటం distraction మాయాశక్తికి రెండు ముఖాలు. ఒకటి ఆవరణం. అది చైతన్యాన్ని కప్పి సంకుచితం చేసి చూపుతుంది. ఇదే జీవభావం. రెండవది విక్షేపం. ఇది రెచ్చగొట్టి ప్రపంచాన్ని బయట పెడుతుంది. ఇదే జగద్భావం.

విగ్రహ : సంగ్రహానికి ప్రతిగా చెప్పేమాట. విడిపోవటమని అర్థం. వేరై పోవటం. ఆకారం, మూర్తి, శరీరం, ఉపాధి అని కూడా అర్థమే.

విగాన : సంగానానికి వ్యతిరేకి. సంగానమంటే కుదురుబాటు. చెల్లుబాటు. సరిపడటం. Concordance. విగానమంటే సరిపడక పోవటం Disconcordance.

విచక్షణ : చక్షణమంటే చూడటం. విశేషంగా విమర్శించి చూస్తే విచక్షణం, మంచి చెడ్డలను వివేచన చేయటం discrimination. నిఘాబెట్టి అసలైన తత్త్వాన్ని దర్శించటం కూడా right vision.

విచార : విశేషంగా వివిధరూపాలుగా చరించటం. అన్ని కోణాలనుంచి బాగా పరిశీలించటం, పరిశోధన Enquiry. Investigation. ఆత్మవిచారం, బ్రహ్మవిచారం అంటే ఆ రెండింటి స్వరూపాన్ని చక్కగా ప్రామాణికంగా అర్థం చేసుకోవడమని భావం.

విచికిత్సా : సందేహం. ఏదీ తేల్చుకోలేక పోవటం. సత్యమేదో పట్టుకోవటానికి చర్చ చేయటం.

విచిత్ర : వైచిత్రి Varied. Multiple. పలువిధములైన పలురకాలు. ప్రపంచ మంతా విచిత్రమని అనంతమని వర్ణిస్తారు శాస్త్రజ్ఞులు. ఇవి రెండే దాని లక్షణాలు. అనేక విధాలుగా భాసించటం విచిత్రమైతే ఆ అనేక లక్షణాలు అలాగే ఎడతెగకుండా సాగిపోవటం అనంతం.

విచ్ఛేద : ఎక్కడికక్కడ తెగిపోవటం. ఆగిపోవటం. Break. Gap. నశించి పోవటమని అర్థం. ఇది ప్రపంచ స్వభావమే. విచిత్రమన్నప్పుడు ఎక్కడికక్కడ రంగులు మారవలసినదే కదా.

విజాతీయ : సజాతీయం కానిది hitero genous.  ఒకే జాతికి చెందక వేరు వేరు జాతులకు చెందినది. ఒకదానికొకటి విలక్షణమైనది. ప్రపంచ లక్షణాలు మూడు. సజాతీయ, విజాతీయ, స్వగత. ఇవి మూడు లేనిది పరమాత్మ. జీవుడిలాగా సజాతీయం కాడు. జగత్తు లాగా విజాతీయం కాడు. నిర్గుణం కాదు గనుక స్వగత భేదం లేదు. మూడింటినీ కలుపుకొన్న అఖండ చైతన్యమని భావం.

విజ్ఞాన : విశేష జ్ఞానం. ఇదే జీవభావం. బంధానికి హేతువు. అలా కాక జ్ఞానంలో విశేషమూ విజ్ఞానమే. జ్ఞానం పరోక్షమైతే విజ్ఞానం అపరోక్షం అంటే అనుభవం. 'జ్ఞానవిజ్ఞాన తృప్తాత్మా' అని గీత చాటుతున్నది. విజ్ఞానమంటే స్వానుభవ కరణమని అర్థం చెప్పారు భాష్యకారులు.

విలయ : బాగా లయమై పోవటం. కరిగి కనపడకుండా పోవటం. జ్ఞానికి ప్రపంచం అలా కరిగిపోయి స్వరూపంతో ఏకమౌతుంది. దీనికే ఆత్యంతికమని పేరు. అలా కాక దానిపాటికది జరిగితే ప్రాకృతికం.

విహార : ఆహార విహారా అన్నారు. విహారమంటే అక్కడ ప్రవర్తన అని అర్థం. ఇంద్రియ వ్యాపారమన్నమాట.

విధి/విధాన : ఒకటి తప్పక చేయాలని శాసనం. శాసించి చెప్పినది కూడా విధే. అలా చెప్పే శాస్త్రానికి విధానమని పేరు. Scripture.

విద్యా/విద్వాన్‌ : 'వేత్తి అనయా ఇతి విద్యా.' దేని మూలంగా ఒక సత్యాన్ని గ్రహిస్తామో అది విద్య. అది రెండు విధాలు. పర అపర. ఋగ్వేదాది వాఙ్మయమంతా అపర. పోతే అక్షరమైన అద్వైత తత్త్వాన్ని బోధించేదొక్కటే, పర. అది కేవలం బ్రహ్మజ్ఞానమే. ఇలాంటి విద్యనందుకొన్నవాడు విద్వాన్‌. అంటే బ్రహ్మజ్ఞాని అని అర్థం. The realized person. విద్య అంటే బ్రహ్మవిద్యే కాక ఉపాసనకు కూడా పేరుంది. మధువిద్య, పర్యంక విద్య, పంచాగ్ని విద్య అని ఇలాంటివెన్నో విద్యలు ఉపనిషత్తులలో కనపడతాయి. ఆ సందర్భంలో వాటికి ఉపాసన అనే అర్థం చెప్పాలి కాని బ్రహ్మజ్ఞానమని చెప్పరాదు. ఈశావాస్యంలో 'అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృత మశ్నుతే' అనేచోట విద్య అవిద్య అని రెండు మాటలు దొర్లాయి. ఇవి జ్ఞానం, అజ్ఞానమని బోల్తాపడే ప్రమాదముంది. అందుకే అవిద్య అంటే విద్యకానిది కర్మ అని, విద్య అంటే కర్మకంటే హెచ్చుస్థాయిలో ఉన్న ఉపాసన అని అంటే దేవతాజ్ఞానమని అర్థం చెప్పారు భగవత్పాదులు.

వితండా : తన పక్షమేదో స్థాపించకుండా పరపక్షాన్ని ఖండించటమే ప్రధానంగా పెట్టుకున్న వాదం. నిర్హేతుకమైన నిష్ప్రయోజనమైన తర్కం.

వేద/వేదనా : తెలుసుకోవటం, తెలివి, జ్ఞానం. జ్ఞాన బోధకమైన వాఙ్మయం. ఆముష్మికమైన జ్ఞానాన్ని అందించే శాస్త్రం ఋగ్వేదాదులు. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు రెండింటికీ అతీతమైన ధర్మతత్త్వాన్ని, బ్రహ్మతత్త్వాన్ని చెప్పటానికే వచ్చింది వేదవాఙ్మయం. కనుక ఇది వాటి రెండింటికన్నా ప్రబలమైన ప్రమాణంగా భావిస్తారు మీమాంసకులు, వేదాంతులు ఇద్దరూ కూడా.

విత్త : తెలియబడినది. పొందబడినది. జ్ఞానం కావచ్చు. ధనం కావచ్చు.

విదిత : తెలుసుకోబడినది Attained.

వేత్తా/వివేదీ : బ్రహ్మతత్త్వాన్ని బాగా శ్రవణ మననాదులు చేసి ఉన్నదున్నట్టు గ్రహించిన మేధావి.

వితర్క : ఊహించటం. సందేహించటం. పరిపరివిధాల ఆలోచించటం.

విదేహ : దేహం కానిది దేహం లేనిది. ఆత్మస్వరూపం. నిరుపాధికమని అర్థం. రెండు విధాలైన ముక్తిలో రెండవది. ప్రారబ్ధం తీరిపోయిన తరువాత మరలా దేహమనేది రాకపోతే దానికి విదేహముక్తి అని పేరు.

విదుర : అన్ని తెలిసినవాడు All rounder.

విధుర : భార్యలేనివాడు. వీడు ధర్మకార్యాలకు అర్హుడు కాడని పూర్వ మీమాంసకులు, ధర్మానికి కాకపోయినా మోక్షపురుషార్థానికి అర్హత ఉన్నవాడేనని వేదాంతులు అంటారు.