#
Back

Page 54

వేదాంత పరిభాషా వివరణము


రజస్‌ : గుణత్రయంలో మొదటిది. సృష్టికి మూలమిది. ప్రకృతి గుణాలలో చేరుతుంది. రజస్సు వల్ల సృష్టి, సత్త్వం వల్ల స్థితి, తమస్సు వల్ల లయం. సంసారమంతా దీనితోనే నిండిపోయింది. ధూళి, మాలిన్యం అని కూడా ఒక అర్థం.

రచనా : సమకూర్చడం, నిర్మించడం అని అర్థం. ఒక క్రమంలో తయారుచేస్తే దానికి రచనా అని పేరు. Order. ముఖ్యంగా వేదాంతంలో జగద్రచన. 'రచనా నుపపత్తేః' అని బ్రహ్మసూత్రాలలో ఒకసూత్రం. ప్రపంచ సృష్టికి అచేతనమైన పరమాణువులు గానీ, ప్రకృతిగానీ కారణం కాదు. వాటికి ఇంత పెద్ద రచన చేసే శక్తి లేదు. చేతనమైన పదార్థానికే ఆలోచించి రచించే ప్రణాళిక ఉంటుంది అని వేదాంతులు దీనినొక కారణంగా తీసుకుని అద్వైత వాదాన్ని సమర్ధించారు.

రంజన/రాగ : రంజనం చేసేది రాగం. రంజనమంటే బుద్ధిని అంటిపట్టుకుని కలుషితం చేసేది. అభిమానమే అది. అదే రాగం. Attachment. ప్రపంచ వాసనలు ఒక రంగు అద్దినట్టుగా మనస్సుకు పట్టి పోతాయి కాబట్టి రాగమన్నారు. రాగద్వేషాలనే ద్వంద్వంలో మొదటిది.

రతి/రత : అభిలాష. ఆసక్తి. తాదాత్మ్యం చెందటం. Indulgence.అలాంటి గుణమున్నవాడు రతుడు.

రాధన : ఆరాధనమనే అర్థం. Worship. ఆరాధించే జీవులందరికీ రాధకులని పేరు. పరమాత్మ తప్ప మరెవ్వరూ పూర్ణత్వమున్నవారు కాదు గనుక పురుషు లనిపించుకోరు. స్త్రీ ప్రాయ మితరం జగత్‌ అన్నారు. కనుక రాధా అంటే స్త్రీ పురుష భేదం లేకుండా ఆరాధన చేసేవారందరూ రాధలే.

రమణ/రామా : రమించటం. విహరించటం. మానవ హృదయంలో పరమాత్మ రమిస్తున్నాడు గనుక రమణుడు, రాముడు. అలాగే ఒక సిద్ధపురుషుడు తనలోనే తాను రమిస్తుంటాడు. అలాంటివాడికి ఆత్మా రాముడని పేరు.

రమణీయ చరణా : పుణ్యకర్మలు చేసినవారు. అలాంటి వారు ఉత్తమ గతులు పొందుతారు. కపూయ చరణకు ఇది వ్యతిరేక పదం.

రస : ఎక్కువ అభిలాష. ఆస్వాదించటం. వృత్తి వాసనగా మారటం. Impression. రసవర్జం. 'రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే.' ఇక్కడ రసమంటే వాసన అనే అర్థం. ఆనంద స్వరూపమైన పరమాత్మకు కూడా రసమనే పేరు. 'రసోవైసః' ఆయన ఆడే జగన్నాటకమంతా రాసక్రీడ క్రిందికి వస్తుంది.

రహస్య : రహస్సుకు సంబంధించినది. Secret. తనకు మాత్రం తెలిసి మరొకరికి అంతుపట్టని అనుభవమని అర్థం. ప్రతి రహస్యమూ స్వానుభవైక వేద్యమే. ఇతరుల కందించేది కాదు. ఆత్మస్వరూపం ఇలాంటిది. దాని జ్ఞానం ఎవడు సంపాదిస్తే వాడిదే. జిజ్ఞాసువైన వాడు శుశ్రూష చేసి వాడివల్ల పొందినా అది కూడా వాడివరకే గనుక మరలా రహస్యమే. రాజవిద్యా రాజగుహ్యమని గీతలో చెప్పిన గుహ్యమనే మాట ఈ రహస్యమే.

రై/రాతి : ధనమని అర్థం. 'రాతిః దాతుః పరాయణం.' ఆత్మానుభవం పొందిన వాడికీ ప్రపంచమంతా తన ధనమే.

రుచి : పంచభూతాలలో జలానికున్న గుణం. రసమనిగూడా దీనికి నామాంతరం. అభిలాష ఆసక్తి అని కూడా అర్థమే. కాంతి అని ఇంకొక అర్థం కూడా ఉంది.

రూప : నామరూపాలలో రెండవది. Thing corresponding to Idia.నామం Idia. రూపం Thing. ఒకటి లోపల కలిగే వృత్తి. వేరొకటి దానికి గోచరించే బాహ్యమైన విషయం. పంచభూతాలలో తేజస్సుకు గుణం రూపం. రూపమంటే ఆకృతి ఓళిజీళీ అని కూడా అర్థమే.

రూపక : Metaphor. Allegory. మనస్సులో కలిగే భావానికి బాహ్యమైన కల్పన. 'అజా మేకాం లోహిత శుక్లకృష్ణాం' అని శ్వేతాశ్వతరంలో ఒక మేకను వర్ణించింది ఉపనిషత్తు. ఆ మేకలలో ఒకటి జీవుడు. మరొకటి ఈశ్వరుడు. లోహిత శుక్లకృష్ణ వర్ణాలు కలిగిన ఆడుమేక ఏదో కాదు. ప్రకృతి. ఇలా ఆధ్యాత్మకమైన భావం మనకు బాగా మనస్సుకు పట్టాలంటే ఆధిభౌతికమైన రూపకల్పన చేసినప్పుడే ఏర్పడుతుందని మహర్షులు ఎప్పుడో గుర్తించారు. కనుకనే ఇలాంటి భావానికి అనుగుణంగా ఎన్నో కల్పనలు శాస్త్రంలో చేస్తూ వచ్చారు. దీనికే రూపకమని సార్థకమైన పేరుపెట్టారు భాష్యకారులు.

రూఢి/రూఢ : ప్రసిద్ధమైనదని చెప్పటం. ఒక శబ్దానికి వాచ్యార్థం. లోకంలో అందరూ అనుస్యూతంగా వాడుక చేస్తూ వచ్చిన అర్థానికి రూఢమని పేరు. కుడ్యమంటే గోడ. ఇది రూఢార్థం. దీనికే ముఖ్యార్థమని, వాచ్యార్థమని మారుపేరు. దీనిని మరొక అర్థంలో ప్రయోగిస్తే అది రూఢం కాదు. గౌణం లేదా యౌగికం. లక్ష్యార్థమని భావం.

రోచన : రుచి లేదా ఆసక్తి కల్పించటం. ప్రరోచనమని కూడా పేర్కొంటారు. సాహిత్యంలో కథలన్నీ ఇలాంటివే. ఉపనిషత్తులలాంటి శాస్త్రంలో కూడా ఇలాంటివెన్నో దొర్లుతుంటాయి. కల్పనలైనా, అకల్పితమైన సత్యాన్ని మనకు సూచిస్తాయి ఇవి.

రుద్ర/రౌద్ర : శివుడు. 'రోదనాత్‌ రుద్రః' అని దీనికి వ్యుత్పత్తి చెప్పారు. రోదనమంటే ఒక ఘాెష. శరీరంలో మనకెప్పుడూ అది అనాహతంగా ఉండనే ఉంటుంది. గుండెచప్పుడు ఈ రోదనమే. ప్రాణశక్తికే రుద్ర అని లాక్షణికంగా చెప్పుకునే మాట. ప్రాణం కూడా శబ్దం చేస్తూనే ఉంటుంది. వసురుద్ర ఆదిత్యులని పెద్దలు చెప్పే దేవతలెవరో కారు. ఆధ్యాత్మికమైన భాషలో చెబితే వసువు శరీరం. రుద్ర ప్రాణం. ఆదిత్య సూర్యునిలాగా వెలిగిపోయే మన మనస్సే. రౌద్ర అంటే రుద్రుడికి సంబంధించినది. భయంకరమైనదని ఒక అర్థం. అలాంటి దశకూ భావానికి కూడా అదే పేరు.

రాజవిద్యా : విద్యలన్నింటిలో రాజిల్లే విద్య. బ్రహ్మజ్ఞానం.

రాజగుహ్య : అలాంటి జ్ఞానం చాలా రహస్యమైనది. అందుకే రాజగుహ్యం. రహస్యాలలో రహస్యం. అపరోక్షం గనుక ఒకరికి తెలిస్తే మరొకరికి తెలిసేది కాదది. సామూహికమైన వ్యవహారం కాదు బ్రహ్మజ్ఞానం. ఎవరికి వారికి స్వానుభవ సిద్ధం. అనుభవమెప్పుడూ రహస్యమే గదా.