#
Back

Page 51

వేదాంత పరిభాషా వివరణము


మంగళ : శుభం. మంచి సత్ఫలితం. 'మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని చ శాస్త్రాణి ప్రధంతే' అని పెద్దల మాట. మంగళంతో ఆరంభమై దానితోనే అంతం కావాలట ఏ శాస్త్రమైనా. మంగళకరమైన శబ్దాలు రెండే వారి దృష్టిలో. ఒకటి ఓంకారం. రెండు అధ. కనుకనే అధ యోగానుశాసనం, అధాతో బ్రహ్మజిజ్ఞాసా అని శాస్త్రజ్ఞులు ప్రారంభిస్తారు తమ శాస్త్రాన్ని. హరిః ఓం అని ముందు ఓంకారంతో ప్రారంభమై చివరకు ఓం తత్‌సత్‌ అని అంతమవటం కూడా కనిపిస్తుటుంది తరచూ.

మజ్జన : మునిగిపోవటం. స్నానం చేయటం. శివాద్వైతుల భాషలో అనాత్మ జగత్తులో ఆత్మ మునిగిపోవటం మజ్జనం. జ్ఞానోదయమై మరలా పైకిలేస్తే అది ఉన్మజ్జనం అంటారు వారు. Merge and Emerge.

మతి/మత/మనః/మను : మతి అన్నా మనస్సన్నా ఒకటే. మననం లేదా ఆలోచించే సాధనమేదో అది. Thinking Faculty.మననం చేసేది గనుక మనస్సయింది. సృష్టిలో ఇది ఒక్కటే మానవుడి విశిష్టత. వాసనా జ్ఞానాన్ని Instinct మించిన వివేచనా జ్ఞానమిది. Reason. అలా మొదట ఆలోచించినవాడు మనువు. The first thinker of human race. ఆయన సంతతి కనుక మనమంతా మనుజులం. మనుష్యులం. మానవుల మయ్యాము. ఇలాంటి ఈ మనస్సుతో ఏది ఆలోచిస్తామో అది మతం. Thought. మతం కానిది అమతం. అదే ఆత్మ. దాన్ని మాత్రం మనస్సు ఆలోచించలేదు. కారణం అది మనస్సుకు కూడా సాక్షి.

మద : గర్వం మత్తు. అరిషడ్వర్గంలో ఇది ఒక అ. మనపాలిటికి. కామ క్రోధ లోభాలు ముదిరితే మద మోహ మాత్సర్యాలుగా మారుతాయి.

మదామద : మదించినది. మదించనిది. ప్రవృత్తి నివృత్తులు రెండూ కలిగినది. ఆత్మస్వరూపమని అర్థం.

మథన : మథించటం. బాధించటం. బాగా మథించేదేదో అది ప్రమథ. ప్రమథ గణమంటే మనస్సులో కలిగే ఆలోచనలు. వీటిద్వారా మనలను వేధిస్తుంది గనుక మనస్సు ప్రమాథి అని చాటింది గీత.

మధువిద్యా/మధుబ్రాహ్మణ : మధు అంటే తియ్యనిది. తేనె. మధ్వద అంటే అలాంటి తేనెను తినేదని అర్థం. లాక్షణికంగా చెబితే తీయని తేనె ఏదోగాదు జీవుణ్ణి నిత్యమూ ఆకర్షించే ఈ జగత్తే ఆ మధువు. మధువును అదనం చేసి మధ్వదు డనిపించుకోక ఈ జీవుడు దానిని సూదనం చేసి అనగా నిర్మూలించి మధుసూదనుడు కావలసి ఉంది. మధువంటే సారభూతమైన పదార్థమని కూడా అర్థమే. Essence. ప్రపంచం జీవుడికి ఉపకరిస్తుంది గనుక మధువు. ప్రపంచానికి జీవుడూ తోడ్పడుతాడు గనుక వీడూ దానికి మధువే. ఇలా పరస్పరం ఉపకార్యోపకారక సంబంధం రెంటికీ అనాది సిద్ధం. ఇలాంటి సంబంధాన్ని చెప్పే విద్యకే మధు విద్య అని మధు బ్రాహ్మణమని పేరు వచ్చింది. ఇది బ్రహ్మవిద్యకు ఆలంబనం. ఎలాగంటే జీవ జగత్తులు రెండూ ఒకదానికొకటి సాపేక్షం. Relative. కనుక నిరపేక్షమైన Absolute తత్త్వమొకటి వీటి కాధారభూతమైనది ఉండి తీరాలి. అదే బ్రహ్మం. ఇది దానికి ద్యోతకం Indication మాత్రమే.

మాధ్వమత : మధ్వాచారులు ప్రతిపాదించిన దర్శనం. ఇది ద్వైత దర్శనం. జీవజగదీశ్వరులకు ముగ్గురికీ పరస్పర భేదం చెబుతుందిది. భేదమే వీరికి వాస్తవం. పంచ సత్యాలని వీరి సిద్ధాంతం. జీవజగత్తులకు భేదం. జీవజీవులకు భేదం. జగజ్జగత్తులకు భేదం. జగదీశ్వరులకు భేదం. జీవేశ్వరులకు భేదం. ఈ ఐదు భేదాలూ వీరి దృష్టిలో ఐదు సత్యాలే. అభేదవాదమైన అద్వైతానికి వీరు బద్ధ శత్రువులు.

మాధ్యమిక : బౌద్ధులలో ఇది ఒక తెగ. శూన్యవాదులని వీరికి మరొక పేరు. వీరి దృష్టిలో జీవుడు లేడు. దేవుడు లేడు. జగత్తు కూడా లేదు. చివరకు అంతా కలిసి శూన్యమే. Nihilism.

మనీషా : మనస్సును శాసించటం. దానికి అతీతమైన నిర్వికల్పమైన స్థితి. అలాంటి స్థితిని పొందినవాడు మనీషి. The Transcendentalist.

మను/మంత్ర : మనువన్నా మంత్రమన్నా అర్థమొకటే. మనసులో ఆవృత్తి చేసే శబ్దం. అది నోటవస్తే జపమవుతుంది. 'మననాత్‌ త్రాయతే ఇతి మంత్ర.' ఏది మననం చేస్తే మానవుణ్ణి అనర్థం నుంచి తప్పిస్తుందో అది మంత్రమని దానికి వ్యుత్పత్తి. మననం చేసేది గనుక మనువని కూడా దానికి వ్యుత్పత్తి చెప్పారు.

మంద/మధ్యమ/ఉత్తమ : ఆత్మ జ్ఞానానికి అందరూ అధికారులే. అయితే అందులో కర్మవాసనలు వదలనివారు మందులు. ఉపాసనా వాసన వదలనివారు మధ్యములు. జిజ్ఞాస బాగా ఉన్నవారు ఉత్తములు. అధికారి భేదాన్ని బట్టి చేసిన విభాగమిది. గౌడపాదులు బ్రహ్మచర్యాది ఆశ్రమాలు చెప్పక ఈ మూడు అధికారాలనే మూడు ఆశ్రమాలుగా భావించారు. అలాగే వర్ణించి చెప్పారు. మంద మధ్యమోత్కృష్టదృష్టులు మూడే మూడాశ్రమాలని అయన చేసిన విభాగం.

మమకార : అహం మమలని రెండే ఉన్నాయి. అవి ఆత్మజ్ఞానానికి విరోధులు. ఒకటి ఈ దేహమే నేననే అభిమానం. మరొకటి దీనికి బాహ్యమైన పుత్రమిత్ర కళత్ర వస్తువాహనాదులు నావి అనే అనురాగం. ఈ రెండవదే మమకారం. అహంకారం మీద ఆధారపడ్డదీ మమకారం. అహం మిథ్యాత్మ అని, మమ గౌణాత్మ అని పేర్కొంటారు అద్వైతులు. ఈ రెండింటివల్లనే సంసార బంధం. అసలైన ఆత్మ జ్ఞానంతోగాని ఇవి తొలగిపోవు. దానికే ముఖ్యాత్మ సదాత్మ లేదా బ్రహ్మాత్మ అనిపేరు.

మరణ/మృతి : మర్త్య మరణించటం. చావు. శరీరం నుంచి జీవుడు తొలగిపోవటం. అందుకే వీడు మర్త్యుడయ్యాడు. Mortal. చావటమంటే అభావం కాదు బయటికి వెళ్ళిపోడం departure. స్థూలం పోయినా సూక్ష్మమొకటి ఉంటుంది. దాని మూలంగా మరలా జన్మ తప్పదంటారు ఎందుకని. అజ్ఞానమనే కారణ శరీరం కూడా ఒకటుంది కనుక అది ఉన్నంతవరకు రాకపోకలు తప్పవు. అందుకే మరణానికి ప్రయాణమని, యాత్ర అని పేరు పెట్టింది గీత. 'జాతస్యహి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ.' మరలా జీవుడు జన్మించవలసిందే అని చెబుతున్నది శాస్త్రం. దీనిని బట్టి జీవుడు చేసేది ప్రయాణమేగాని మరణంకాదు. మరణం సాకారమైన శరీరానికే. 'జీవాపేతం వావ కిలేదం మ్రియతే న జీవో మ్రియతే' అని ఉపనిషత్తు ఘంటాపథంగా చాటుతున్నది.

మర్యాదా : ఒక హద్దు. అంతం. limit.

మరీచి/మరుమరీచి : సూర్యరశ్మి. ఆ రశ్మే దూరానికి జలంలాగా భాసిస్తే దానికి మరుమరీచి అని పేరు. Mirage. ఎండమావులు. మరుభూమిలో కనిపించేది కనుక మరుమరీచిక అయింది. ఇది అద్వైతి చెప్పే ఆభాసలలో ఒకటి.

మంత్ర : అక్షరాల సంపుటి. ఏదో ఒక దేవతకు సంబంధించి ఉంటుంది ఈ సంపుటి. ఆ దేవతాశక్తి దానిలో గుప్తమై ఉంటుంది. దానికి అనుగుణంగానే సంపుటీకరించిన అక్షరాలవి. 'మననాత్‌ త్రాయతే.' మననం చేస్తే కాపాడేది గనుక దీనికి మంత్రమని పేరు వచ్చింది. పంచాక్షరీ, అష్టాక్షరీ ఇలాంటివన్నీ మంత్రం క్రిందికే వస్తాయి. మంత్రజపం వల్ల దేవత సాక్షాత్కరిస్తుందని, సాధకుడి కోరికలన్నీ సఫలం చేస్తుందని పెద్దల విశ్వాసం.

మర్శ : స్పృశించటం, తాకటం, తడవి చూడడం, బాగా పరామర్శించడం. ఆ ముందు చేరిస్తే ఆమర్శ. వి ముందు చేరిస్తే విమర్శ. పరా చేరిస్తే పరామర్శ. అన్నీ ఒక దానికొకటి పర్యాయాలే. విమర్శ అనేది క్రియాశక్తి. దీనిచేత విమర్శిస్తూ పోతే శివస్వరూపం ప్రకాశమవుతుంది. అది జ్ఞానశక్తి. ప్రకాశ విమర్శలు రెండూ శైవుల పరిభాష.

మల/మలిన : మాలిన్యం. కాలుష్యం. అశుద్ధి. చిత్తానికి పట్టిన ఆవరణ దోషం. తమోగుణం. మలవిక్షేపాలంటే ఆవరణ విక్షేపాలే. Contraction and distraction మొదటిది మన స్వరూపాన్ని కప్పిపుచ్చేది. రెండవది దాన్ని నామరూపాత్మకంగా రెచ్చగొట్టేది. ఇలాంటి మలంతో నిండిన మనస్సుకు మలినమని పేరు. Impure.

మహత్‌ : సాంఖ్యుల పంచవింశతి తత్వాలలో ఒకటి. అవ్యక్తమైన ప్రధానం నుంచి వచ్చిన రెండవ భూమిక. Premordial Matter. అద్వైతుల భాషలో ఇది అవ్యాకృత సూక్ష్మప్రపంచం. దానికి అధిపతి అయిన జీవుడు హిరణ్యగర్భుడు. అంటే సమష్టి బుద్ధి. Cosmic mind.

మహిమా : అష్టసిద్ధులలో ఇది ఒక సిద్ధి. అణిమ తరువాత రెండవది మహిమ. ఉన్నట్టుండి పెరిగి పెద్దదై పోవటం. Magnifcation. అంతేగాక ఈశ్వరుడికున్న మహత్త్వం కూడా మహిమే. జ్ఞానవిస్తారమని అర్థం. 'స్వ మహిమ్ని ప్రతిష్ఠితః' అని ఉపనిషత్తు వర్ణించింది. పరమాత్మ ఎక్కడున్నాడని ప్రశ్న వస్తే తన మహిమలోనే అంటే తన విస్తారంలోనే ఉన్నాడని అర్థం. దీనికే ఐశ్వర్యమని, విభూతి అని మరి ఒక పేరు.

మా/మాన/మాత్రా : కొలవటం. తూకం వేయటం. ప్రమాణం. Measure. విషయ ప్రపంచాన్ని ఇదమిత్థమని కొలుస్తుంది మన ఇంద్రియం, మనస్సు. కనుక అవి మానం లేదా ప్రమాణం. మాత్ర అన్నా ప్రమాణమే. 'మాత్రాస్పర్శాస్తు కౌంతేయ' అని గీత. ఓంకారంలో మూడు మాత్రలు. అవి ఆత్మలో ఉన్న మూడు పాదాలను కొలుస్తాయి. కనుక మాత్రలని పేర్కొన్నారు. అలా కొలిచే వరకూ ఆత్మ సోపాధికం. Limited. నిరుపాధికమైతే Absolute కొలిచేది లేదు. కొలవబడేది లేదు. అమాత్రం అపాదమన్నారు.