#
Back

Page 49

వేదాంత పరిభాషా వివరణము


భంగ : నశించిపోవటం. నివృత్తి. ఆవరణ భంగమంటే ఉపాధి తొలగిపోవటం. ముఖ్యంగా అవిద్య అనే మొదటి ఉపాధి. అది తొలగిపోతే మిగతావన్నీ వాటిపాటికవే భంగమై పోతాయి.

భద్ర : క్షేమం. కుశలం. శుభం. శ్రేయస్సు. మోక్షం. అన్నింటికీ వాచకమే. చివరకు బ్రహ్మతత్త్వమే అన్నిటికన్నా భద్రమైనది. కనుకనే 'భద్రం కర్ణేభిః శృణుయామ' అని మహర్షులు చాటిచెప్పారు. భద్రం పరమాత్మ అయితే క్షుద్రమీ ప్రపంచం. కనుకనే అసతోమా సద్గమయ అని వాపోవటం.

భయ : Fear. అసుర గుణాలలో ఒకటి. సంసార భయం. 'ద్వితీయాద్వైభయం భవతి.' రెండవ దున్నప్పుడే మనకు భయం ఏర్పడుతుంది. అశాంతి తాపత్రయం కలుగుతాయి. అద్వితీయమైన తత్త్వాన్ని పట్టుకుంటే ఏ భయమూ లేదు. అభయమే. అభయమే మోక్షం.

భవితవ్యతా : ఏది జరగలవలసి ఉందో అది భవితవ్యం. దాని భావమే భవితవ్యత. Destiny. అనివార్యమైన పరిస్థితి.

భాతి : భాసించడం. Appearance దీనికి జతమాట అస్తి. Existance. అస్తి అంటే సత్యమని, భాతి అంటే విజ్ఞానమని అర్థం. ఏది ఉందో ఏది నిత్యమూ తనపాటికి తాను ప్రకాశిస్తున్నదో అది బ్రహ్మం. ఇవి రెండే పరమాత్మకున్న లక్షణాలు. వీటిద్వారానే దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి.

భావ : ఒక ఆలోచన. మనసులో కలిగే ఒక వృత్తి. Idea. ఒక పదార్థమని కూడా పేర్కొనవచ్చు. Substance or category. భావమంటే ఉండటం. అయిపోవటం కూడా. Being or becoming.

భవ : ఉండటం. సత్త్వం. జన్మ. సంసారం.

భవబంధ/భవరోగ : జన్మే ఒక బంధం. అదే ఒక వ్యాధి అని అర్థం.

భవనాశ : జన్మబంధ నివృత్తి Liberation from the cycle of birth and death.

భావనా : ఒకదాన్ని నిత్యమూ ఆలోచిస్తూ ఉండడం. భావించటం. ఒకదాని గుణం మరొకదానికి పట్టించటం కూడా భావనే. బ్రహ్మభావన అంటే బ్రహ్మతత్త్వాన్ని ఆలోచించటం. బ్రహ్మంగా మారిపోవటం. బ్రహ్మగుణాన్ని తనలో నింపుకోవటం. వైద్య పరిభాషలో ఇది ప్రసిద్ధమైన మాట. భావన జీరకం, భావన అల్లం అంటే ఆ రెండు పదార్థాలకూ ఆరోగ్యాన్ని ప్రసాదించే గుణాన్ని మిగతా మూలికల ద్వారా సంక్రమింప జేయటమని భావం.

భావివృత్తి : జరగబోయే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వర్ణించటం. ఉదా. 'ఓదనం పచతి.' అన్నం వండుతున్నాడు. అన్నమిప్పుడు లేదు. ఇప్పుడున్నది బియ్యం. అది వండితే అన్నమవుతుంది.

బ్రహ్మభావనా : ముందు చెప్పినట్టు బ్రహ్మమే నేనని భావన చేస్తూ పోతే బ్రహ్మమే కాగలడు జీవుడు. 'సదా తద్భావ భావితః' అని గీత చెబుతున్నది. భ్రమర కీట న్యాయంగా నిరంతర భావన చేసే జీవుడు బ్రహ్మసాయుజ్యం పొందటంలో ఆశ్చర్యంలేదు. అద్వైతంలో అనుష్ఠానం లేదు. ఆలోచనే అనుష్ఠానం. కనుక భావన వల్లనే బంధం అయితే భావన వల్లనే తుదకు మోక్షం కూడా ఫలిస్తుంది.

భర/భార : బరువు. తూకం. Weight. Pressure. ఒకదానిపై భరోసా పడటం. భారం మోపటం. నొక్కి చెప్పటం Emphasis అని కూడా అర్థమే.

భూః : భూమి అని ఒక అర్థం. పుట్టటమని మరియొక అర్థం. ఉన్నదని ఇంకొక అర్థం. స్వయంభూః అంటే తనపాటికి తాను ఉన్నది అని. ఒకరిమీద ఆధారపడకుండా స్వతస్సిద్ధమైనదని భావం. Self existent. పరమాత్మ.

భూత : పుట్టిన. ఏర్పడిన. స్వయంభూః అయిన ఆత్మనుండి జన్మించినవి పంచభూతాలు. Elements. శక్తిగా ఉంటే అది దేవత. Energy. వ్యక్తమై బయటపడితే అది భూతం. Matter. భూతమంటే కడచిపోయిన విషయం కావచ్చు. కాలమూ కావచ్చు.

భూతవృత్తి : ఇంతకు ముందరి విషయాన్ని పరామర్శిస్తూ చెప్పే సందర్భం. ఉదా. బ్రాహ్మణ పరివ్రాజక. ఈ పరివ్రాజకుడింతకు పూర్వం బ్రాహ్మణుడు.

భూతి : ఐశ్వర్యం. విభూతి. అనేక విధాలుగా ఉండటం. పరమాత్మ విభూతి ఇలాంటిదే. అదే ఆత్మగానూ అనాత్మగానూ రెండు విధాలుగా భాసిస్తున్నది. ఇందులో ఆత్మగా ఉండటం దాని స్వరూపమైతే అనాత్మగా భాసించటం విభూతి.

భూమా : అన్నిటికన్నా ఉత్కృష్టమైన పదార్థం. చాలా పెద్దదని అర్థం. Summum Bonum. Supreme Reality. అద్వితీయమైన తత్త్వం. పరిపూర్ణమైన చైతన్యమని అర్థం.

భూయస్త్వ/బాహుళ్య : చాలా ఎక్కువగా ఉండటం. Multiplicity. Majority.

భోక్తా/భోగ్య/భోజ్య/భోగ : భోగమంటే అనుభవం. Experience. అది కర్మఫలమైనా కావచ్చు. జ్ఞానఫలమైనా కావచ్చు. మొత్తం మీద అనుభవించటమే భోగం. అలా అనుభవించే జీవుడు భోక్త. The experiencer. అనుభవానికి వచ్చే సుఖదుఃఖాదులు భోగ్యం లేదా భోజ్యం. ఈ ప్రపంచమంతా భోగ్యమైతే జీవుడు దీనికి భోక్త. దీనినే అన్నమని అన్నాదుడని చమత్కారంగా వర్ణించాయి ఉపనిషత్తులు.

భౌమ : భూమికి సంబంధించినది. Earthly. ప్రాపంచికమైనది. దీనికి వ్యతిరిక్తమైనది అభౌమ లేదా దివ్య.  Celestial.

భూమికా : క్షేత్రం. నిలయం. దశ. Stage. అవస్థ. అంతస్తు. Storey. ఆధారం. Base.

భౌతిక : భూతములకు చెందినది. భూతములు Elements అయితే భౌతికం Compound. భూతములన్నీ పోగై ఏర్పడిన చరాచర పదార్థాలన్నీ భౌతికమే.

భ్రంశ/భ్రష్ట : జారటం. పడటం. తొలగటం. Depart or separate చ్యుతి. Fall. ఎవడు అలా జారిపడతాడో వాడు భ్రష్ట. సంసారంలో పడిన జీవుడు.

భ్రమ/భ్రాంతి : ప్రమకు వ్యతిరిక్తమైన పదం. ప్రమ అంటే సరైన జ్ఞానం. right knowledge.  ఉన్నదున్నట్టు గుర్తించటం. అలాకాక ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు గుర్తించటానికి భ్రమ అని పేరు. రజ్జు జ్ఞానం ప్రమ అయితే సర్పజ్ఞానం భ్రమ. ప్రస్తుత మీ ప్రపంచం రజ్జురూపంగా చూస్తే అది పరమాత్మే. దానినే సర్పరూపంగా చూస్తే అది ప్రపంచం. భ్రాంతి అన్నా ఇదే.

బుభుత్సా : బోద్ధుమిచ్ఛా. ఒక సత్యాన్ని తెలుసుకోవాలనే కాంక్ష. జిజ్ఞాస అని అర్థం Desire to know. Enquiry.

బుభుత్సు : జిజ్ఞాసు అని అర్థం. తెలుసుకోవాలనే కోరిక కలవాడు.

బ్రహ్మచారీ : బ్రహ్మమంటే ఇక్కడ వేదమని అర్థం. అది చరించటమంటే అభ్యసించటమని అర్థం. అప్పటికి బ్రహ్మచారి అంటే వేదాభ్యాసం చేసేవాడు. వాడికి చెందిన ఆశ్రమం బ్రహ్మచర్యం. వేదాధ్యయనం చేస్తున్నంతవరకూ వివాహం అనేది ఉండదు గనుక బ్రహ్మచారి అంటే అవివాహితుడని కూడా అర్థం ఏర్పడింది. అంతేకాదు. బ్రహ్మతత్త్వంలో నిత్యమూ చరించే జ్ఞాని అని కూడా చెప్పవచ్చు ఒక అర్థం.

బ్రాహ్మణ : బ్రహ్మ బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ వర్ణానికి చెందినవాడు. వీడికి జాతి బ్రాహ్మణుడని పేరు. వర్ణమేగాక వర్ణానికి తగిన కర్మ జ్ఞానాలు కూడా అబ్బితే వాడు ముఖ్య బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞాని అని అర్థం. 'బ్రహ్మజ్ఞానాద్ధి బ్రహ్మణః.'

బ్రహ్మబంధు : బ్రాహ్మణోచితమైన గుణంగాని వృత్తంగాని లేక కేవలం బ్రాహ్మణజాతి మావారనీ, మా బంధువులనీ చెప్పుకుని బ్రతికేవాడు. ద్విజ బంధువని కూడా పేరు వీడికి.

బ్రహ్మవిద్యా/బ్రహ్మజ్ఞాన : బ్రహ్మతత్త్వానికి చెందిన విద్య, జ్ఞానం Philosophy, తత్త్వజ్ఞానం Spiritual Science, ఆత్మజ్ఞానం Self Knowledge కూడా ఇదే. ఆత్మ అన్నా బ్రహ్మమన్నా ఒకటే అద్వైతంలో. నిరుపాధికమైన ఆత్మ బ్రహ్మమే. అపరోక్షమైన బ్రహ్మమాత్మే.

బ్రాహ్మీస్థితి : బ్రహ్మజ్ఞానంలో నిష్ఠ గలిగి ఉండటం. Stability in the spiritual knowledge.

భా/భాన : కాంతి. దీప్తి. ప్రకాశం. జ్ఞానప్రకాశం అని అర్థం. ఆత్మజ్ఞానమే అసలైన ప్రకాశం. 'తమేవ భాంతం అనుభాతి సర్వం. తస్య భాసా సర్వమిదం విభాతి.' అసలైన ప్రకాశం ఆత్మదే. మిగతా అనాత్మ ప్రకాశమంతా దాని సొంతం కాదు. ఆత్మప్రకాశమే. అనాత్మ రూపంగా కూడా ప్రకాశిస్తున్నదని అంటారు అద్వైతులు.

భాష్య : ఆక్షిప్య భాషణా ద్భాష్యం. ఒక సూత్రంలో గాని శ్లోకంలోగాని సంగ్రహంగా చెప్పిన భావాన్ని పట్టుకొని బయటికి లాగి హేతు దృష్టాంతాలతో దాన్ని విపులంగా ప్రతిపాదించే వ్యాఖ్యానానికి భాష్యమని పేరు. పూర్వపక్ష సిద్ధాంత రూపంగా సాగిపోతుంటుందిది. ఇలాంటిదే శంకరుల వారి ప్రస్థానత్రయ భాష్యం.