#
Back

Page 48

వేదాంత పరిభాషా వివరణము

బంధ : కట్టుపడటం. జీవుడు సంసారంలో వచ్చి ఇందులో పడిపోవటం. అజ్ఞానమే దీనికి కారణం. ఆత్మజ్ఞాన మబ్బితేనే దీనినుంచి మోక్షం. బంధానికి వ్యతిరిక్తమైనది మోక్షమే. బంధం Bondage. మోక్షం Liberation.

బద్ధ : సంసార బంధంలో బద్ధుడైనవాడు. జీవుడు.

బర్హణ : నలగగొట్టటం. లయం చేయటం.

బల/బాల/బాల్య : బలమంటే వీర్యం. సామర్థ్యం. ఇది వేదాంతంలో ఒక విశేషార్థంలో ప్రయోగిస్తారు. బాల్యం పాండిత్యం నిర్విద్య అనే చోట బలం కలవాడే బాలుడు. బాలుడి భావమే బాల్యం. బలమంటే అనాత్మ భావాన్ని లేకుండా చేసుకునే సామర్థ్యం. అది కలవాడే బాలుడు. అంతేగాని కుర్రవాడని కాదు అర్థం. జ్ఞానబలమే బలమని భావం.

బహిః/బాహ్య/బహిర్ముఖ : అంతర్‌ అనే మాటకు వ్యతిరిక్తమైన మాట బహిః వెలపల, బయట అని అర్థం. శరీరానికి వెలపల ఉన్నదంతానని అర్థం చెబుతారు. వాస్తవంలో శరీరానికే కాదు. శరీరం లోపల కూడా మనస్సులో కనిపించే భావాలన్నీ బాహ్యమే. కాబట్టి బహిర్ముఖ అనే మాట మన జ్ఞానానికి నామరూపాలను గమనించటమని అర్థం. అది మనసులోనైనా బహిర్ముఖమే. శరీరం వెలపల అయినా బహిర్ముఖమే. అధిష్ఠాన దృష్టే అంతర్ముఖం. ఆరోపిత దృష్టే బహిర్ముఖం. దృష్టి నంతర్ముఖం చేసుకోవటమే సాధన అన్నారు శాస్త్రంలో. దీని భావమేమిటి. మనస్సు లోపల శరీరం వెలపల మనకు భిన్నంగా తోచేదంతా మన స్వరూపమేనని దానిని మన స్వరూపంలోనే స్వరూపంగానే చూడటానికే అంతర్ముఖ దృష్టి అని అర్థం చెప్పుకోవలసి ఉంది.

బహుధా : అనేక రూపాలుగా ఏకధా బహుధా చైవ దృశ్యతే. జలచంద్రవత్‌ తరంగాలలో చంద్రబింబం లాగా పరమాత్మ ఒకే ఒక తత్త్వమైనా ఆయా ఉపాధులలో బహుధా ప్రకాశిస్తున్నాడట.

బాధ/బాధక/బాధిత : క్లేశం. కష్టమని కాదు అర్థం. శాస్త్రంలో బాధ అంటే ఒకటి కొట్టుబడి పోవడం. Contradiction. వస్తువెప్పుడూ బాధితం కాదు. దాని ఆభాసే అలా బాధితమై పోయేది. రజ్జువు వస్తువు కాబట్టి అది అబాధితం. పోతే దానిమీద కల్పితమైన సర్పం వస్తువుకాదు. ఆభాసే గనుక దానికి బాధ తప్పదు. అలాగే ఆత్మ అనేది ఎప్పుడూ అబాధితమే. దానికి బాధకం మరేదీ లేదు. మరేదైనా అని చెప్పామంటే అది అనాత్మ జగత్తేకదా. అది ఆత్మ తాలూకు ఆభాసే. కనుక ఆభాస వస్తువుకు బాధకం కాదు. మీదు మిక్కిలి వస్తువే ఆభాసను బాధించి దానికి బాధకమవుతుంది.

బీజనిద్రా : బీజమంటే విత్తనం. Seed. మూలమని కూడా అర్థమే. Source. అజ్ఞానమే మూలం సంసారానికి. కనుక అదే బీజం. దీనివల్ల ఏర్పడిందే సంసారవృక్షం. కనుక ఇది నిజంగా బీజమేనన్నా చెల్లే విషయమే. బీజ నిద్ర అంటే ఈ అజ్ఞానం వదలకుండా ఎన్నో జన్మలనుంచి నిద్రపోతున్నాడీ జీవుడు. 'బీజనిద్రా యుతః ప్రాజ్ఞః' కారణ శరీరమే ఈ నిద్ర. కారణ శరీరమేదో కాదు అజ్ఞానమే. కనుక అవిద్య, అజ్ఞానం, బీజ, నిద్ర, ఇవన్నీ ఒకదాని కొకటి పర్యాయాలే.

బుద్ధి/బుధ/బుద్ధ : నిశ్చయాత్మకమైన అంతఃకరణం బుద్ధి. అది చేసే ఆలోచన జ్ఞానం కూడా బుద్ధే. అలాటి జ్ఞానం కలవాడు బుధుడు. అజ్ఞాన నిద్ర వదలి మెళకువ తెచ్చుకున్నవాడు కనుక అతడే బుద్ధుడు. బుద్ధి ఒక్కటే ఆత్మతత్త్వాన్ని గ్రహించటానికి ఏకైక సాధనం. బుద్ధిగుహలోనే పరమాత్మ చైతన్యం వచ్చి ప్రవేశించిందని శాస్త్రం చెబుతున్నది. అంటే అర్థం బుద్ధిలో కలిగే పరమాత్మ తాలూకు ఆలోచనే దాన్నిచేర్చే సాధనమని, దాన్ని ఆలంబనం చేసుకోమని, అదే గమ్యాన్ని చేరుస్తుందని తాత్పర్యం. 'దృశ్యతే త్వగ్య్రయా బుద్ధ్యా' అని కఠోపనిషత్తు స్పష్టం చేస్తున్నది ఈ విషయం.

బోధ : మెళకువ. జ్ఞానోదయం. Awakening. ఇలాంటి బోధ కలవాడే బుధుడు లేక బుద్ధుడు.

బృహదారణ్యక : ఇది చాలా పెద్ద ఉపనిషత్తు. 'అహం బ్రహ్మాస్మి' అనే ఆఖరి మహావాక్య మిందులోనిదే. జనక యాజ్ఞవల్క్య సంవాదమనే మిషతో బ్రహ్మవిద్యా బ్రహ్మానుభవమూ బ్రహ్మాండంగా వర్ణించిందీ ఉపనిషత్తు. సిద్ధాంత సాధనానుభవాలు మూడూ పరిపూర్ణంగా లభిస్తాయి ఇందులో.

భగవాన్‌ : జ్ఞాన ఐశ్వర్య బల వీర్య తేజశ్శక్తులు. ఈ ఆరింటికీ షాడ్గుణ్యమని, భగమనీ పేరు. ఇవి సంపూర్ణంగా ఉన్న చైతన్యం భగవానుడు. ఆయనకీ ఆరుగుణాలూ సహజం.

భాగవత : ఆ భగవత్తత్త్వానికి చెందినది. దానిని భజించే భక్తుడు భాగవతుడు.

భాగ/భాగ్య/భాగధేయ : వాటా. భాగం. దైవం వారివారికి పంచిపెట్టిన కర్మఫలం Providence. అని అర్థం.

భాగీ : వాటా కలవాడు ఒక పక్షంలో చేరినవాడు. దాని ఫలంలో స్వామ్యమున్న వాడు. Partner.

భాగత్యాగ : తత్త్వమసి లాంటి మహావాక్యానికి అర్థం చెప్పేటప్పుడు పదార్థ జ్ఞానం అంతకుముందుగా చెప్పుకోవలసి ఉంటుంది. తత్త్వం పదార్థాలలో ఒక భాగాన్ని త్యాగం చేసి ఒక భాగాన్ని మాత్రం పట్టుకోవాలట. త్యాగం చేయవలసింది ఉపాధి వర్గం. దగ్గర ఉంచుకోవలసింది కేవల చైతన్యం. అప్పుడే జీవబ్రహ్మైక్యం సిద్ధిస్తుంది. జహదజహల్లక్షణ అన్నా ఇదే.

బ్రహ్మా : చతుర్ముఖ బ్రహ్మ. హిరణ్యగర్భుడు. సగుణమైన బ్రహ్మతత్త్వం. దీనికే ఈశ్వరుడని కూడా నామాంతరం.

బ్రహ్మ : బృహత్తు - పెద్దది. బృంహణం - అన్నిటినీ ఇముడ్చుకొనేది. బర్హణం తనలో కలుపుకొనేది ఏదో అది. పరమాత్మ నిర్గుణమైన శుద్ధ చైతన్యం. The ultimate reality. మాయాశక్తి ఇందులో ఓతప్రోతమై నిష్క్రియమై ఉంటుంది. అదే సక్రియమైతే బయటికి వచ్చి నిర్గుణమైన బ్రహ్మం సగుణంగా మారుతుంది. అప్పుడది బ్రహ్మకాదు బ్రహ్మా.

బ్రహ్మాండ : ఆకాశం. బ్రహ్మతత్త్వం నుంచి మొట్టమొదట బయటపడ్డ భూతం. అండాకారంగా పెద్దదిగా వ్యాపించి కనిపిస్తుంది గనుక దీనికి బ్రహ్మాండమని పేరు. Macrocosm. దీనిలో చేరినదే అండాండం. అంటే సూర్యచంద్రాది గోళాలు. అందులో సంచరించేవి పిండాండం. అంటే జరాయుజాది శరీరాలు.

బ్రహ్మపురం : మానవశరీరం. పిండాండం. బ్రహ్మచైతన్యం వచ్చి నివసించిన పట్టణం. బ్రహ్మంచేత పూరించబడినది. మరలా దీని నాలంబన చేసుకొనే బ్రహ్మాన్ని చేరవలసి ఉంటుంది జీవుడు. కనుక ఇది పడగొట్టటానికి, పైకి లేపటానికి కూడా సాధనమే.

బ్రహ్మలోక : బ్రహ్మదేవుడి లోకం. సత్యలోకం. కేవల పరమాత్మ అని అర్థం చెప్పుకుంటే అలాంటి తత్త్వాన్ని ఎక్కడ ఆలోచిస్తామో అనగా దర్శిస్తామో అది బ్రహ్మలోకం. లోకంగాని లోకం ఇది. బ్రహ్మచైతన్య ప్రకాశమని అర్థం.

బ్రహ్మభావం : బ్రహ్మసాయుజ్యమని అర్థం.

బ్రహ్మదండం : మేరు దండం. వెన్నెముక Spinal cord.

బ్రహ్మభూయం : బ్రహ్మసాయుజ్యమనే అర్థం.

బ్రహ్మాత్మభావ : జీవాత్మ బ్రహ్మంగా మారిపోవటం. కేవల మాత్మ అయితే దేహమాత్ర పరిచ్ఛిన్నమైన చైతన్యమని భ్రమపడవచ్చు. కేవల బ్రహ్మమైతే పరోక్షమైనా కావచ్చు. బ్రహ్మాత్మమంటే రెండు దోషాలూ తొలగిపోయి అపరిచ్ఛిన్న అపరోక్షమైన అద్వైతానుభవం సిద్ధిస్తుంది. దాన్ని సూచింటానికే రెండూ కలిపి బ్రహ్మాత్మ అని చెబుతున్నది శాస్త్రం. బ్రహ్మమే ఆత్మ. ఆత్మే బ్రహ్మం అని అర్థం. బ్రహ్మమే ఆత్మ అన్నప్పుడు పరోక్షం అపరోక్షమవుతుంది. ఆత్మే బ్రహ్మ మన్నప్పుడు పరిచ్ఛిన్నం అపరిచ్ఛిన్నమవుతుంది. ఇలాంటిదే అద్వైతుల బ్రహ్మానుభవం.

బ్రహ్మానుభవం : ముందు చెప్పినట్టు జీవాత్మను బ్రహ్మదృష్టితో చూచి మరలా బ్రహ్మాన్ని తన ఆత్మరూపంగా అనుభవానికి తెచ్చుకోవటమే అసలైన బ్రహ్మానుభవం.

బ్రహ్మనిర్వాణం : నిర్వాణమంటే ఆరిపోవటం. దీపమారి పోయినట్టు జీవ చైతన్యం ఆరిపోయిందని చెబితే అది బౌద్ధుల శూన్యవాద మవుతుంది. అద్వైతం శూన్యవాదం కాదు. అది పూర్ణవాదం. కనుక కేవల నిర్వాణం కాక బ్రహ్మనిర్వాణ మనే మాట పేర్కొన్నారు. అంటే జీవచైతన్యం సాధన చేసి బ్రహ్మచైతన్యంలో ఏకమై పోవాలి. ఇక్కడ నిర్వాణమంటే ఆరిపోవటం కాదు. చేరిపోవటం. మోక్షమని అర్థం.

బ్రహ్మాకార వృత్తి : మనస్సుకు కలిగే ఒక వృత్తి విశేషం. వృత్తులకు నిలయమే మనస్సు. అందులో సవికల్ప వృత్తులు ఉదయిస్తాయి. నిర్వికల్ప వృత్తీ ఉదయిస్తుంది. సవికల్పమనేక మయితే నిర్వికల్పం ఏకైకం. బ్రహ్మమేకమే గనుక దానికి సంబంధించి ఏర్పడే చిత్తవృత్తి కూడా తదాకారంగానే ఏకమై ఉదయిస్తుంది. కేవలం సచ్చిదాకారంగా ప్రపంచాన్ని దర్శిస్తూ పోతే అదే నిర్వికల్పమైన సామాన్య రూపమైన బ్రహ్మాకార వృత్తి. ఇదే బ్రహ్మ సాయుజ్యానికి గొప్పసాధన.

బ్రహ్మవాదీ/బ్రహ్మవాదినీ : బ్రహ్మతత్త్వాన్ని గూర్చి ఉపన్యసించే స్త్రీ పురుషులు. కేవలం వర్ణించటమేగాక తాము నమ్మినదీ వర్ణించినదీ మనసా ధ్యానించి అదే తామైపోయిన వ్యక్తులు. అప్పుడే వారి వాదానికి ప్రామాణ్యమేర్పడుతుంది. లేకుంటే అది వాచా వేదాంతమే. ఇలాంటి బ్రహ్మవాది యాజ్ఞవల్క్యుడైతే బ్రహ్మవాదిని గార్గి లాంటిది.

భక్తి/భక్త : భక్తి అంటే భగవంతుని భజించటమని అర్థం. భజించటం అంటే అంటి పట్టుకోవటం. విభజించటానికి ఇది వ్యతిరేకం. భగవంతుని నుండి దూరమై పోవటం. విభజన. Separation. దగ్గర పడటం భజన. Union. ఈ భజన చేసేవాడు భక్తుడు. అతడు సగుణ భక్తుడు కావచ్చు. నిర్గుణ భక్తుడు కావచ్చు. సగుణమైతే భగవంతుని తనకు అన్యంగా భావిస్తాడు. నిర్గుణమైతే తన స్వరూపంగా భావిస్తాడు. స్వరూపంగా భావించే భక్తిని ఇలా వర్ణించారు భగవత్పాదులు. 'యః పశ్యతి యత్‌ శృణోతి, స్పృశతి, వా తత్‌ సర్వం వాసుదేవ ఏవ.' ఏదేది చూస్తామో వింటామో ముట్టుకుంటామో అదంతా సచ్చిద్రూపమైన ఆత్మతత్త్వమేనని 'ఏవం గ్రహావిష్టః.' ఒక దయ్యంలాగా ఆవేశించినవాడు భక్తుడట. ఇదే అనన్యభక్తి.

భక్తి/భాక్త : భక్తి అంటే ఇక్కడ లక్షణ Secondary Sense. Metaphorical. అని అర్థం. గౌణమైన అర్థం. లక్ష్యార్థం. సింహోదేవదత్తః అన్నప్పుడు సింహగుణాలు దేవదత్తుడిలో కనిపించడం. దీనికే భక్తి అని భాక్తమని గుణమని గౌణమని వ్యవహారం. భక్తికి చెందింది భాక్తం. గుణానికి చెందినది గౌణం Metaphorical Sense అని అర్థం.