#
Back

Page 41

వేదాంత పరిభాషా వివరణము


పక్వ : బాగా పండిపోయినది. పరిపాకానికి వచ్చినది Mature. Perfect. జ్ఞానం పరిపక్వమైతేనే మోక్షప్రాప్తికి దారితీస్తుంది.

పంక్తి/పాంక్త : ఒక వరుస. శ్రేణి Order. బంతి అని తెలుగుమాట. దీని తద్భవమే. ఒజ్జబంతి. మేలుబంతి అని ప్రయోగం. అయిదు అని ఒక అర్థం. పంచ అన్నా పంక్తి అన్నా ఒక్కటే. పంక్తి నుంచి వచ్చిందే పాంక్తం. అంటే అయిదు విషయాల మూలంగా ఏర్పడింది ఈ సంసారం. ఒకటి ఆత్మ. అంటే ఇక్కడ జీవాత్మ అని అర్ధం. రెండు దార (భార్య) మూడు పుత్ర. సంతానం. నాలుగు విత్త. ధనం. ఐదు కర్మ. కర్మాచరణ. సంసార ప్రవృత్తికంతా కారణ మీ పంక్తే కాబట్టి సంసారానికి పాంక్తమని పేరు. పంక్తి అంటే పది అని కూడా అర్ధముంది. రెండు ఐదులు కలిసింది గదా పది. పంక్తి కంఠుడు. పది శిరస్సులు కలవాడు. పంక్తి రథుడు పది రథాలు గలవాడు దశరథుడు.

పక్తి : పాకమని అర్ధం. 'కషాయ పక్తిః కర్మాణి. జ్ఞానంతు పరమాగతిః' కర్మలన్నీ పక్తి అంటే పాకానికి వస్తేగాని జ్ఞానమనేది ఉదయించదు. కర్మలు పాకానికి రావడమంటే కషాయం తొలగిపోవాలి. కషాయమంటే కర్మ వాసనలు, మాలిన్యం అని అర్థం.

పక్ష : పక్షి రెక్క. Wing. పక్షములు కలది గనుకనే అది పక్షి అయింది. భాగమని కూడా అర్థమే. Part. Portion. శుక్లపక్ష. కృష్ణపక్ష. వాదంలో ఒకటి పక్షం. మరొకటి ప్రతిపక్షం. Positive. Negative.

పక్షపాత : ఒక పక్షంలో పడిపోవటం. Partiality.  దాన్నే అభిమానించటం.

పంచత్వ : పంచభూతాలలో శరీరం కలిసిపోవటం. మరణమని అర్ధం.

పంచీకరణ : అయిదుగా తయారుచేయటం. పంచభూతాలను ఒక్కొక్కటి రెండు భాగాలు చేసి అందులో ఒక భాగం మరలా నాలుగు చేసి మిగతా నాలుగింటిలో ఒక్కొక్క అంశాన్ని కలుపుతూ పోవటం. అలా కలిపితే దాని అర్ధభాగం మిగతా నాలుగూ కలిసి ప్రతిఒక్క భూతమూ పంచభూతాత్మకమే అవుతుంది. ఇదే సృష్టి ప్రణాళిక. దీనివల్లనే అపంచీకృతమైన సూక్ష్మభూతాలు పంచీకృతమై స్థూల ప్రపంచంగా మారటం జరుగుతున్నది.

పంచభూత : పృథివీ జలమూ తేజస్సూ వాయువూ ఆకాశమూ అనే ఈ ఐదింటికీ Five elements పంచభూతాలని పేరు. భూతమంటే అభూతమైన శక్తి మూర్తీభవించి కనిపించటమని Unmanifest being manifest అర్థం.

పంచతన్మాత్ర : పంచభూతాల సూక్ష్మమైన అంశలు. వాటి గుణాలు. శబ్ద స్పర్శ రూప రస గంధాలు.

పండా/పండిత : 'పండా ఆత్మ విషయా బుద్ధిః.' ఆత్మజ్ఞానమే పండా అనే మాటకర్థం. అది కలవాడు పండితుడు. ఆత్మజ్ఞాని. 'పండితాః సమదర్శినః.' సర్వమూ ఆత్మస్వరూపమేనని సమానంగా దర్శించేవాడు.

పతి : 'పాతీతి పతిః' కాపాడేవాడు. అధిపతి Owner. గృహపతి. House Holder. గణపతి, నామరూపాది ఉపాధుల మీద పెత్తనం చెలాయించేవాడు. పశుపతి. పశువులంటే జీవులు. ఈ పశుగణానికంతటికీ అధిపతియైన ఈశ్వరుడని అర్థం.

పద/పాద : పాదం. కాలు Leg అని ఒక అర్ధం. 'పద్యతే ఇతి పాదః' పొందే సాధనం. అప్పుడిది ఉపకరణమవుతుంది. పొందబడే స్ధానం కూడా అని చెబితే గమ్యమవుతుంది. The means and also the end. ఒకటి గమకం. మరొకటి గమ్యం. నాలుగవ భాగమని కూడా Quarter అర్థమే. ఆత్మను చతుష్పాత్‌ అని వర్ణించింది మాండూక్యం. నాలుగు పాదాలున్నాయట ఆత్మకు. జాగ్రత్‌ ఒకటి. స్వప్నం రెండవది. సుషుప్తి మూడవది. పోతే తురీయమైన సమాధి నాలుగవది. మొదటి మూడూ గమకం. అంటే చేర్చే సాధనాలు. నాలుగవది గమ్యం. చేరబడే స్థానం. 'పాదోస్య సర్వాభూతాని.' నాలుగింటిలో ఒక భాగమీ వ్యక్తమైన ప్రపంచం ఆత్మకు. మిగతా మూడూ అవ్యక్తం. అమృతం. Unchanged. పదమంటే స్థానం Abode  అని కూడా అర్థమే. పరమం పదం. The highest Abode.

పర : అన్యమైనది. తనది కానిది. Another. ఇహం కానిది పరలోకం. రెండు విషయాలలో రెండవది. మొదటిది పూర్వం. రెండవది పరం. Second between the two. కార్యకారణాలలో కారణం పూర్వమైతే కార్యం పరం. Subsequent. అంతేకాదు. అన్నిటికన్నా అతీతమైనదని కూడా అర్ధమే. పరతఃపరః పరమాత్మ అని అర్థం. The supreme being. సమాసంలో ఉత్తర పదంగా ప్రయోగిస్తే అదే లోకమని కూడా అర్ధం వస్తుంది. తత్‌పర అంటే అదే ధ్యేయంగా కలవాడని భావం.

పరమ : అన్నిటికన్నా ఉత్తమమైనది. Superior. పరమం పదం. The topmost.

పరమాత్మ : పరమమమైన ఆత్మ. అంటే నిర్గుణమైన ఈశ్వర తత్వం. జీవుడు శరీరం మేరకే ఉన్నవాడు గనుక జీవాత్మ. The individual soul. శరీర బంధం లేనివాడు గనుక ఈశ్వరుడు పరమాత్మ. The Universal soul. పరమమంటే ఇక్కడ ఉపాధులను దాటిపోయిన తత్త్వమని భావం.

పరావర : ముందు వెనుకలు. మంచిచెడ్డలు. ఉచ్చనీచలు. అంతేకాదు, పైది క్రిందిది అని కూడా అర్థమే. నిర్గుణం సగుణం రెండు రూపాలు. ఆత్మ అనాత్మ రెండూ కలిసి పరావరం. తత్త్వమెప్పుడూ ఏకపక్షం కాదు. పరావరమది. అంటే స్వరూప విభూత్యాత్మకంగా అఖండమైన పదార్ధం. 'తస్మిన్‌ దృష్టే పరావరే' అని కఠోపనిషత్తు చాటుతున్నది. పరమూ అవరమూ రెండూ ఆత్మస్వరూపమే నట. అప్పుడే అది అఖండమైన అద్వైత విజ్ఞానమవుతుంది.

పరాపర : పరమూ అపరమూ. పైది క్రిందిది. రెండూ కలిసి ఒక్కటే అని భావం. పరావరలాంటిదే ఇదికూడా.

పరంపరా/పరంపరయా : ఒక వరుస Series. ఒక దానికొకటి చేరి గొలుసుకట్టుగా సాగిపోవటం. Tradition. సంప్రదాయమని కూడా అర్ధమే. సాక్షాత్తుగా కాక చాటుమాటుగా దూరదూరంగా చెప్పదలచిన అంశాన్ని చెబితే పరంపరయా అని వర్ణిస్తారు శాస్త్రంలో. క్రమంగా By gradation అని భావం.

పరాక్‌ : ప్రత్యక్‌ అనే దానికి ఇది వ్యతిరిక్త పదం. వెలపలికి అని అర్ధం. External.

పరాఙ్ముఖ : బాహ్యమైన పదార్థాలవైపు చూచే దృష్టి. బాహ్యమైనవి. ఇంద్రియాలకు మనస్సుకు విషయమైన నామరూపాలు. వాటివైపే మన ఇంద్రియాలు మళ్ళీ ఉన్నాయి. కనుక వాటితోనే వీటికి లావాదేవీ ఏర్పడి వీటన్నిటికి అధిష్ఠానమైన సచ్చిత్తులను చూచే అవకాశం లేకపోయింది. బహిర్ముఖమన్నా ఇలాంటిదే. దీనివల్ల సంసార బంధమే తప్ప అందులో నుంచి మోక్షం లేదు.

పరామర్శ : Reference. ఒక విషయాన్ని విమర్శించటం. తడవటం. ప్రస్తావించటం.

పరాయణ : ఒక విషయం మీదనే దృష్టి పెడితే అది వాడికి పరాయణ మవుతుంది. ఆయన మంటే స్థానం. పరమంటే ఉత్తమమైనది. అన్నిటికన్నా ఉత్తమమైన పదమని భావించి దానినే శరణువేడటం. ధర్మపరాయణ. ధర్మమే జీవిత లక్ష్యం అని భావించేవాడు. మోక్ష పరాయణ. మోక్షమే జీవిత గమ్యమని భావించేవాడు 'తన్నిష్ఠా స్తత్పరాయణాః' అని గీతావచనం.

పరావృత్తి : వ్యావృత్తి అని కూడా దీనికి పర్యాయ పదం. ఒక విషయం నుంచి వెనుకకు మళ్ళటం. ప్రక్కకు తొలగటం. Withdraw. అనాత్మ నుంచి పరావృత్తి చెందితేనే ఆత్మమీద తత్పరత్వ మేర్పడుతుంది.

పరితః : అంతటా. అన్ని వైపులా. In all directions. అభితః అని కూడా అనవచ్చు.

పరస్తాత్‌ : అతిక్రమించిన Transcendant. 'తమసః పరస్తాత్‌' Beyond the Cosmic illusion. అవిద్యాక్షేత్రాన్ని దాటి పోవటమని అర్థం.

పరిగ్రహ : Belonging. మనకు చెందిన పదార్ధాలన్నీ పరిగ్రహాలే. Property. వస్తు వాహనాదులు. భార్య అని కూడా ఒక అర్ధం. ఒకరివల్ల దానం పుచ్చుకోవటానికి కూడా పరిగ్రహమని పేరు. అలా పుచ్చుకోకుంటే అపరిగ్రహం. ఇది దైవగుణాలలో చేరుతుంది.

పరిచ్ఛేద : ఒకచోటికి తెగిపోవటం. అంతమై పోవటం. అలా తెగిపోతే అది పరిచ్ఛిన్నం Limited. నామరూపాలు పరిచ్ఛిన్నం. అవి ఎక్కడికక్కడ వేరువేరై కనపడతాయి. పోతే వాటన్నింటిని వ్యాపించిన ఆత్మతత్వమే అపరిచ్ఛిన్నం. Unlimited.

పరినిష్ఠిత : కదలకుండా ఆగిపోయినది. నిశ్చలమైనది. స్ధిరమైనది. గట్టిగా నిలబడినది. Stable. Established.

పరినిష్పన్న : బాగా తయారైన, ఫలించిన. Finished. Accomplished. మొదటి నుంచీ ఉన్న.

పరిప్రశ్న : అన్నివైపుల నుంచీ ప్రశ్నించటం. 'పరిప్రశ్నేన సేవయా.' ఆత్మ జ్ఞానం సాధించాలంటే అన్ని విషయాలూ అడిగి తెలుసుకోవాలి. లేకుంటే సందేహమనేది పూర్తిగా తొలగిపోదు. సందేహం నిర్మూలమైతే గాని నిశ్చయాత్మకమైన జ్ఞానం కలగదు.