#
Back

Page 38

వేదాంత పరిభాషా వివరణము


నను : ఒక ఆశంక చేసే ముందు వచ్చేమాట. 'నన్వాత్మై వాస్తి నాన్యత్‌. తత్కథం అయ మనాత్మా ప్రతీయతే.' ఉన్నదొక ఆత్మే కదా. మరి ఈ అనాత్మ ఎక్కడిది. మరి, కదా, అనే సందర్భంలో ప్రయోగిస్తారీ పదం.

నంద : ఆనంద అని కూడా అనవచ్చు. సుఖమని అర్థం. అది లౌకికం కావచ్చు. అలౌకికం కావచ్చు. విషయ జన్యమైతే లౌకికం. Physical.విషయి జన్యమైతే అలౌకికం. Spiritual. అలౌకికమే శాశ్వతం. దానికి బాహ్యమైన ప్రతీక లౌకికం. 'విజ్ఞానమానందం బ్రహ్మ' అన్నారంటే అక్కడ అలౌకికమైన సుఖమని అర్థం. ఆనందమక్కడ గుణంగాదు. స్వరూపమే. అది శరీరంలో వ్యక్తమైతే ఆనందం కాదు. ఆనందమయం.

నయ : కొనిపోవటం. To take away. న్యాయం. పద్ధతి. విధానం. Reason. Method.

నర : 'న రీయతే. లీయతే. ఇతి నరః.' ఎవడు నశించడో వాడు జీవుడని అర్థం. జీవుడెప్పటికీ చావడు. కర్మఫలమనుభవిస్తూ ఉండవలసిందే. ఈ కర్మ అనేది ఎప్పుడూ చేయక తప్పదు. దానికి కారణం కామం. దానికి అవిద్య. అవిద్య తొలగిపోతేనే నరత్వం పోయేది. అప్పుడు నరుడుకాడు. వాడు నారాయణుడే. అప్పు డసలే మరణం లేదు వాడికి. కనుక వ్యావహారికంగా నరుడు బ్రతికే ఉంటాడు. పారమార్థికంగా నారాయణుడై బ్రతికే ఉంటాడు. ఇంతకూ మరణమనేది ఎప్పుడూ లేదని వేదాంతుల సిద్ధాంతం. మరణం లేదు వాడికి. కనుక వ్యావహారికంగా నరుడు బ్రతికే ఉంటాడు. పారమార్థికంగా నారాయణుడై బ్రతికే ఉంటాడు. ఇంతకూ మరణమనేది ఎప్పుడూ లేదని వేదాంతుల సిద్ధాంతం.

నహి : హేతువు చూపి కాదని త్రోసిపుచ్చటం. ఇందులో హి అనేది హేతువును చెప్పే మాట. న అనేది నిరాకరించటం. కాదు కదా అని అర్థం. 'నహి సగుణో నిర్గుణశ్చ ఏక ఏవ ఆత్మా భవితు మర్హతి.' సగుణం నిర్గుణం రెండూ ఒకే కాలంలో ఒకే ఆత్మకు ఉండే లక్షణాలు కావుకదా.

నాక : కం అంటే సుఖం. అకం అంటే దుఃఖం. న అకం అంటే దుఃఖం కాదు సుఖమని మరల అర్థం వస్తుంది. రెండు వ్యతిరేకపదాలు ఒక అవ్యతిరిక్తమైన అర్థాన్నే బోధిస్తాయి. ఇంతకూ నాకమంటే దుఃఖంతో ఏ మాత్రమూ సంసర్గం లేని స్వర్గాది సుఖాలని అర్థం. నాకమంటే స్వర్గమే అని మీమాంసకుల వాదం కాదు బ్రహ్మానంద రూపమైన మోక్షమని వేదాంతుల నిర్ణయం.

నాళ/నాళీ/నాడీ : గొట్టమని అర్థం. pipe. లోపల బోలు లేదా ఖాళీగా ఉన్న పొడవైన పదార్థం. మన శరీరంలో నాడులన్నీ ఇలాంటివే. 72వేల నాడులున్నాయని శాస్త్రజ్ఞుల మాట. రక్తం ప్రవహిస్తుంది వాటిలో లోపల ఖాళీగా ఉండడం మూలాన్నే రక్తప్రసరణకు అవకాశమేర్పడింది. వీటిలో ముఖ్యమైన నాడి సుషుమ్న. ఇడ పింగళ అనే రెండింటి నడుమ ఉంటుందది. దానిద్వారా ప్రాణశక్తిని పైకి తెచ్చి కపాలభేదం చేసుకొని వెళ్ళిపోతారట యోగులు, ఉపాసకులు. జ్ఞానులు మాత్రం అలా భౌతికంగా ప్రయాణం చేయరు. అసలు ప్రయాణమే లేదు వారికి. శరీరమిక్కడే పడిపోతుంది. శరీరమంటే స్థూలమేగాదు. సూక్ష్మము కారణము కూడా. కారణమంటే అవిద్యే కదా. అది బ్రహ్మవిద్యా బలంతో నిర్మూలమైంది. కనుక ప్రయాణం చేయటానికి ఉపాధే లేదు. ఉపాధులన్నీ ఆభాసే గనుక ఇక్కడే వస్తురూపమైన వాడి ఆత్మ చైతన్యంలోనే ప్రవిలయమై స్వరూపంగానే నిలిచిపోతాడు జ్ఞాని.

నాథ : న+అథ. అథ అంటే దానికంటే న దిక్కులేదని అర్థం. అంటే నీవే తప్ప మరి దిక్కులేదనిపించుకునే వాడు. శరణ్యమని Refuse అర్థం. అలాంటి శరణ్యమేదీ లేనివాడు అనాథ.

నవా : ఇదేకాదు. మరొక పక్షంకూడా కుదరదని అర్థం. 'న సుఖం నవా శాంతిః' అన్నప్పుడు సుఖమే కాదు శాంతికూడా లేదని భావం.

నాంతరీయక : అప్రయత్నంగానని అర్థం. Automatic. ఒకటి జరిగితే దానితో పాటు మరొకటి అప్రయత్నంగానే కలిసిరావటం. అవస్థాత్రయం పోతే చాలు. తురీయం అయత్నంగానే సిద్ధిస్తుంది. వేరే ప్రయత్నమక్కరలేదు. అది నాంతరీయకం. ఆంతరీయకమంటే దూరంగా ఉన్నది. మధ్యలో రావలసినది అని శబ్దార్థం. అలాకాక స్వభావ సిద్ధమైతే నాంతరీయకమని పేర్కొన్నారు బహుశా.

నాభి : అరా ఇవ రథ నాభౌ. నాభి అనగా ఒక చక్రానికి మధ్యనుండే ఇరుసు లాంటిది. The hub of a wheel. చక్రంలోని కేంద్రస్థానం. Centre. మానవుడి నాభికూడా. Navel. అది కూడా శరీరానికి కేంద్రమే కదా.

నామ : నామరూపాలనే ద్వంద్వాలలో మొదటిది. నామమంటే పేరని మాత్రమే కాదు. మనస్సులో కలిగే ఆలోచన లేదా వృత్తి. Idea. అది చెప్పేదైతే దానిచేత చెప్పబడే బాహ్యమైన పదార్థం రూపం. Thing. వాచకం వాచ్యం అని కూడా వీటిని పేర్కొనవచ్చు. శబ్దం అర్థమని చెప్పినా చెప్పవచ్చు. The expression and the expressed. ఒక విధంగా నామమే జీవభావం. రూపమే జగద్భావం. ఇవి రెండూ సూక్ష్మమైతే నామరూపాలు. స్థూలమైతే జీవజగత్తులు. సూక్ష్మావస్థలో ఇవి ఈశ్వరుని ఉపాధులు. వీటిద్వారా ఈశ్వరుడు సృష్టి స్థితి లయాదులు చేయగలుగుతున్నాడు. ఇవి ఆయన చైతన్యం కంటే భిన్నమైనవి కావు. వాస్తవంలో దాని ఆభాసలే. కాని జీవుడు అలా చూడలేక సతమతమవుతున్నాడు. అంతవరకూ బంధం తప్పదు. ఎప్పుడు వీటిని ఆచైతన్యరూపమేనని భావిస్తాడో అప్పుడే బంధ విముక్తుడౌతాడు.

నామ : ఇది మరి ఒక శబ్దం. ముందు చెప్పినది నామవాచకమైతే ఇది అవ్యయం. Indeclinable.  అనగా అంటే అని దీని అర్థం. 'ఆత్మా నామ స్వరూపం.' ఆత్మ అంటే స్వరూపం. అర్థాత్‌ అని కూడా దీనికొక పర్యాయపదముంది.

నార : నారమంటే జలం. పంచభూతాలలో ఇది నాలుగవది. దీని తరువాత చెప్పుకునే పృథివి ఐదవది. జలమనేది ఐదింటిలో ఒకటి అయినా ఐదింటికీ ఉపలక్షణంగా కూడా శాస్త్రజ్ఞులు భావిస్తారు. 'ఆపో నారా ఇతి ప్రోక్తాః' ఆపస్‌ అన్నా నారమన్నా జలమే. 'నారావై నరసూనవః.' నరుడంటే జీవుడు. జీవసృష్టికి కారణం పంచభూతాలే కదా. నారమంటే ఇక్కడ భూతపంచకమనే అర్థం.

నారాయణ : నారములే అయనం అంటే నిలయం అయిన వాడెవడో ఆయన నారాయణుడు. పరమాత్మ పంచభూతాలనే తనకు అధిష్ఠానంగా చేసుకొని ఉన్నాడట. వాస్తవంలో ఇవి ఆయనకు కాదు. ఆయనే ఈ భూత పంచకానికి అధిష్ఠానం. ఇవి కేవలం ఆయనకు ఉపాధి మాత్రమే. అంటే అవ్యక్తమైన ఆ చైతన్యాన్ని వ్యక్తంచేసి చూపే ద్వారం.

నాశ : కనపడకుండా పోవటం. అభావం కాదు. అనుపలబ్ది. Absence. ఒకటి ఉన్నప్పటికీ అది నిష్ప్రయోజనమైతే దానిని నాశమనే పేర్కొనవచ్చు. ఉండి కూడా ఉపయోగం లేదని భావం. గీతలో 'బుద్ధి నాశాత్‌ ప్రణశ్యతి' అని ఒక వాక్యముంది. బుద్ధి నష్టమైతే మానవుడు నశించిపోతాడు అని అర్థం. నశించి పోతాడంటే సర్వనాశనమై పోతాడని కాదు. పురుషార్థానికి యోగ్యుడు కాడని అర్థం చెప్పారు భాష్యకారులు. 'అనాశినో -ప్రమేయస్య' అని మరొకచోట ఉంది. ఇక్కడ నాశమంటే ఎప్పటికీ లేకుండా పోవటం. అలాంటిది ఆత్మకు లేదు. కారణం అది ప్రమేయం కాదు. ప్రమేయం కాకపోతే ఏదీ నశించదు.

నాస్తి/నాస్తిక : న+అస్తి అంటే లేదని అర్థం. వేదానికి ప్రామాణ్యం లేదన్నవాడు నాస్తికుడని మీమాంసకులు అంటారు. అసలు ఈశ్వరుడే లేడని వాదించేవాడు

నాస్తికుడని వేదాంతులు అంటారు. మీమాంసకులు వేద ప్రామాణ్యాన్ని అంగీకరించినా ఈశ్వర సద్భావాన్ని అంగీకరించరు. కనుక వేదాంతుల దృష్టిలో మీమాంసకులు కూడా నాస్తికులే. Atheists.

నికాయ : సమూహం. Collection. శాస్త్రమైనా కావచ్చు. శరీరమైనా కావచ్చు. బౌద్ధుల గ్రంథాలకు నికాయాలని పేరు అంటే వారు చెప్పిన సూత్రాలు సుభాషితాలు అన్నీ కలిపి గుదిగ్రుచ్చి చేర్చిన గ్రంథాలని భావం.

నికేత : స్థానం. ఆశ్రయం. సన్యాసి అయినవాడు పరివ్రాజకుడై ఉండాలి. అంటే ఒకచోట అని నియమం లేక దేశమంతా తిరుగుతుండాలి. ఒకచోట ఉంటే దానిమీద భ్రాంతి ఏర్పడే ప్రమాదముంది. కనుక అనికేతుడై ఉండాలి. అంటే గృహనివాసం లేనివాడని అర్థం. బాహ్యంగా నివాసం లేకపోయినా అంతరంలో మనస్సు స్థిరంగా ఉండాలి. కనుకనే 'అనికేతః స్థిరమతిః' అని గీత హెచ్చరిస్తున్నది.

నిగమ : నిశ్చయమైన జ్ఞానమిచ్చేది అని అర్థం. ఇది ఏదోకాదు. వేదవాఙ్మయం. ఆగమమని కూడా దీనికొక పేరు. గురుశిష్య పరంపరగా వస్తున్న విద్య అని అర్థం.

నిగమన : శాస్త్రరీత్యా నిష్కర్ష చేసి చెప్పటానికి నిగమనమని పేరు. Conclusion. Judgement. తర్కశాస్త్రం చెప్పే పంచావయవ వాక్యంలో Syllogism అయిదవ అంశం. 'తస్మాత్‌ తత్‌ తథా.' అంచేత పర్వతంమీద వహ్ని ఉండి తీరుతుంది. అని ప్రతిజ్ఞాతమైన విషయాన్ని మరలా చాటి చెప్పటం.