#
Back

Page 36

వేదాంత పరిభాషా వివరణము


దృక్‌/దృష్టి : చూపు. అది కంటి చూపైనా కావచ్చు. మనోదృష్టి అయినా కావచ్చు. మనోదృష్టి మరలా రెండు విధాలు. ప్రాపంచికం. పారమార్థికం. ప్రాపంచికం విశేష దృష్టి. పారమార్థికమైతే సామాన్య దృష్టి. సాక్షిభావం. ఆత్మచైతన్యమే దానికి లక్ష్యం. ఆత్మదృష్టి అంటే ఆత్మజ్ఞానమే.

దృశ్య : దానికి గోచరించే నామరూపాలన్నీ దృశ్యం. యద్దృశ్యం తన్నశ్యం అన్నారు పెద్దలు. మనం చూచేదంతా నశించేదే. నశించనిది దృశ్యం కాదు. అదృశ్యం ఆత్మ స్వరూపమెప్పుడూ అదృశ్యమే.

దృగ్‌ద్దృశ్య వివేక : ఇలాంటి దృశ్యం నుంచి అదృశ్యమైన దృక్‌ను వేరు చేసుకునే విధానమే వివేకమంటే. వివేచనకే Discrimination వివేకమని పేరు. దృశ్యలక్షణాలకు విలక్షణంగా దృగ్రూపమైన ఆత్మను వేరు చేసి పట్టుకోవటం.

దేహళీదత్తదీప : దేహళి అంటే కడప. కడప మీద పెట్టిన దీపమని అర్థం. అలాటిది మనస్సులోని బ్రహ్మాకార వృత్తి. ఆ దీపం లోపల వెలపల చీకటిని ఒకేమారు పోగొడుతుంది. ఈ వృత్తి కూడా ఆత్మను అనాత్మను రెండింటినీ ఆవరించిన చీకటిని అజ్ఞానాన్ని త్రోసిపుచ్చుతుంది. అప్పుడు సామాన్య రూపంగా రెండూ కలిసి ఒకే ఒక ఆత్మ అని గుర్తించగలం. విశేషంగానే తేడా. సామాన్యమైతే తేడా లేదు.

దైవాసుర : దేవతలు రాక్షసులు. ఎక్కడో లేరు వీరు. మనలోనే మన మనస్సులో కలిగే శిష్టదుష్ట భావాలు. మొదటిది ఆత్మదర్శనానికైతే రెండవది అనాత్మ జగత్తుకు దారితీస్తుంది. మొదటిది సత్త్వగుణాత్మకమైతే రెండవది రజస్తమో గుణాత్మకం.

దోష : లోపం. Defect. తర్కంలో దోషమంటే హేత్వాభాస. Fallacy. సరియైన హేతువాదానికి నిలవని లక్షణం. ఇలాంటి దోషాలేవీ లేనిదే సత్యం. ఏ మాత్రమున్నా అది అనృతం. 'నిర్దోషం హి సమం బ్రహ్మ.' ఆత్మస్వరూపం నిర్దోషం. నామరూపాది కల్మషం ఏదీ లేదందులో. దానికి భిన్నంగా ప్రపంచమంతా దోషభూయిష్ఠమే. సత్వరజ స్తమో గుణాలు మూడూ దోషాలే. గుణాతీతమైనదే నిర్దోషం. అది ఆత్మచైతన్యమే.

ద్యౌః/దివి/దివం : 'పృథివీ అంతరిక్షం ద్యౌః' ఇవి మూడూ భూమికలు. మొదటి భూమికలో మనమున్నాము. దీనిపైది అంతరిక్షం. దానిపై నున్నది ద్యౌః. అదే దివి. దివం. త్రిదివమని కూడా అంటారు దాన్ని. మూడింటిలో మూడవదని అర్థం. అదే ఆకాశం. సూర్యమండలానికి అతీతం. దానికే స్వర్గమని కూడా నామాంతరం. The celestial region.

ద్రవ్య : తార్కికులు పేర్కొనే సప్త పదార్థాలలో మొదటిది. Substance. ఏడు పదార్థాలు లేవు. ద్రవ్యమొక్కటే పదార్థం. దానికి సంబంధించినవే గుణకర్మ సామాన్య విశేష సమవాయ అభావాలనే మిగతా ఆరూ అని సిద్ధాంతం చేశారద్వైతులు. ఆ ద్రవ్యం కూడా భౌతికమే. చైతన్యానికి విషయమే. Object to consciousness. అజ్ఞానంవల్ల దానికి వేరుగా భాసిస్తున్నది. దాని జ్ఞానమేర్పడితే అందులోనే ఇది కరిగిపోతుంది. అప్పుడంతా ఆత్మస్వరూపమే. అనాత్మ లేనేలేదు. అలా కరిగే స్వభావమున్నందు వల్లనే 'ద్రవతీతి ద్రవ్యం' అని పేరు వచ్చింది అంటారు వారు.

ద్వంద్వ : రెండు. జత. జంట. సప్రతిపక్షాలివి.Opposites to each other. సుఖదుఃఖాలు, జనన మరణాలు ఇలాంటివి. ఇవే సంసారమంతా. వీటిని దాటిపోతే నిర్ద్వంద్వం లేదా అద్వంద్వం. Absolute. అదే సాయుజ్యం. కైవల్యం.

ద్వయ : ద్వంద్వానికి పర్యాయం. రెండనే భావం. ద్వైతమన్నా ఇదే. ఇది కానిది. అద్వయం. అద్వైతమని అర్థం. అనాత్మ అంతా ద్వయమైతే ఆత్మ అద్వయం. అద్వయమైన ఆత్మే ద్వయమయి కనిపిస్తున్నదని వేదాంతుల మాట. అదే ఈ సంసారం.

ద్వైత : ద్వి+ఇత. ద్వీత. ద్వీతమే ద్వైతం. రెండుగా మారి కనిపిస్తున్నది అని అర్థం. అద్వైతం తప్ప మిగతా మతాలన్నీ ద్వైతమతాలే. Dualism. జీవ జగదీశ్వరులకు భేదం చెప్పేవే. మూడింటికీ ఆత్మ స్వరూపంగా అభేదం చెబుతుంది గనుక ఒక్క వేదాంతమే అద్వైత మతం.

ద్వార : ప్రవేశ నిర్గమాల కవకాశమిచ్చేది Gateway for entrance and exit.వేదాంతంలో ప్రమాణమని, అవకాశమని, మార్గమని అర్థం. పట్టుకునే ఆధారం. ఆలంబనం. ఉపాయం. Support or Aid.అది లేకుంటే గమ్యాన్ని చేరే మార్గంలేదు. అనుభవానికి తెచ్చుకునే మార్గమే ద్వారం. ప్రమాణమని కూడా దీనికి నామాంతరం.

ద్వైరూప్య : 'ద్విరూపస్య భావః.' రెండు రూపాలు కలిగి ఉండడం. Dualism.

ధనః : 'దధాతీతి ధనం.' ఏది కలదో, ఏది ఉన్నట్టు తోస్తున్నదో, ఏది పట్టుకుని ఉంటుందో అది. ప్రపంచమంతా ఈ దృష్టితో చూస్తే ధనమే. 'కస్యస్విద్ధనం.' ఆత్మకు చెందిన ధనమిది. ఆత్మధన్య లేదా ధనవా. ఆత్మస్వరూపమైతే ఈ అనాత్మ ప్రపంచం దాని విభూతి. అదే దాని ధనం. ఆత్మజ్ఞాని ఈ ధనాన్ని కోరనక్కరలేదు. కారణం ఇది అతని ఐశ్వర్యమే. అంటే తన స్వరూపమే విస్తరించి కనపడుతున్నది. కనుక కోర నక్కరలేదు. స్వరూపంగా అను సంధానం చేసుకుంటే సరిపోతుందని భావం.

ధర్మ : 'ధారయతి ధార్యతే. ఇతి ధర్మః' ఏది జీవుడు ధరిస్తాడో అంటే నాది అనుకొని ఆచరిస్తాడో, ఆచరిస్తే ఏది వాడిని అదృష్టరూపంగా ధరించి ఉంటుందో అది ధర్మం. దేహపాతానంతరం మాసిపోకుండా లోకాంతర జన్మాంతరాలకు తీసుకెళ్ళి ఫలానుభవం ఇస్తుంది ఇది. అనుకూలమైతే ధర్మం. ప్రతికూలమైతే అధర్మం. విధిచోదితమైన కర్మ ధర్మం. లౌకికంగా చేస్తే కర్మ. శాస్త్రోక్తంగా చేస్తే ధర్మం. Duty enjoined by the scripture. ధర్మమంటే ఆయా పదార్థాలకుండే గుణాలని కూడా Properties అర్థమే. 'సర్వధర్మాన్‌ పరిత్యజ్య' అంటే శాస్త్రోక్తమైన ధర్మాలే కాదు. ప్రపంచ ధర్మాలైన నామరూపాలను కూడా అని అర్థం. త్రిగుణాలు కూడా ధర్మాలే. సర్వధర్మాన్‌ అంటే గుణత్రయాన్ని కూడా కాదని త్రోసిపుచ్చి నిర్గుణమైన మామేకం అంటే ఏకైకమైన ఆత్మతత్త్వాన్నే శరణం వ్రజ ఆశ్రయించమని సాధకుడికి గీత ఇచ్చే సలహా.

ధాతు : ధరించి ఉన్నది ఏదో అది. That which holds. శరీర ఇంద్రియ మనః ప్రాణాదులు అన్నీ ధాతువులే. ముఖ్యంగా మనస్సే ధాతువు. ధాతు ప్రసాదమంటే మనః ప్రసాదం. చిత్తశుద్ధి అని అర్థం. దానివల్లనే జ్ఞానోదయం మానవుడికి.

ధారణా : ధరించటం. 'దేశ బంధః చిత్తస్య ధారణా.' అని పతంజలి అన్నాడు. మనసు నొకా నొక లక్ష్యంమీద నిలపటం. అష్టాంగ యోగంలో ఇది ఆరవ భూమిక. దీని తరువాత ధ్యాన సమాధులనేవి రెండు భూమికలున్నాయి. ధారణ ధ్యానానికి, ధ్యానం సమాధికి దారితీసి యోగసిద్ధిని ప్రసాదిస్తాయి అని యోగుల నమ్మకం.

ధారా : ప్రవాహం. అవిచ్ఛిన్నంగా సాగిపోవటం.Current. Continuity. . తైలధారలాగా ధ్యానం సాగాలంటారు. విజాతీయ భావం రాకుండా సజాతీయభావం

నిలిచి ఉండటం. ధారావాహికమని కూడా పేర్కొంటారు. కత్తివాదరకు The edge of a knifeకూడా ధార అని పేరు. క్షురస్య ధారా. అంత సూక్ష్మమైనది పదునైనదట మోక్షమార్గం.

ధీః ధీర ధీమత్‌ : ధీః అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి. ఆత్మాకార వృత్తి. అది కలవాడు ధీరుడు. ధీమంతుడు. జ్ఞాని అని అర్థం.

ధృతి/ధైర్య : అలాంటి ధీరుడికున్న పట్టుదల. Perseiverance. 'ముంజాదివ ఇషీకాం ధైర్యేణ.' ఆకు మడచి దాని ఈనెపుల్లను ఇవతలికి లాగినట్టు శరీరం నుంచి ఆత్మతత్త్వాన్ని వేరుచేసి పట్టుకోవాలట. దీనికి ధైర్యం కావాలంటుంది ఉపనిషత్తు. ఆత్మానాత్మ వివేక సామర్థ్యమే వేదాంతంలో ధైర్యమనే మాటకర్థం.

ధ్వంస : నశించిపోవటం. Extinction. అభావాలు నాలుగింటిలో రెండవది. ప్రధ్వంసా భావమని కూడా పేర్కొంటారు. అంతకు ముందున్న పదార్థం లేకుండా పోవడమని అర్థం.

ధ్యాన : Meditation. ఏకతానత అని వర్ణించారు యోగశాస్త్రంలో. ప్రత్యయైకతానతా ధ్యానం అని పతంజలి. ఒక భావాన్ని అలాగే ధారా వాహికంగా సాగిస్తూ పోవటం. అదే ఏకతానత. అదే ధ్యానం. సజాతీయ భావ ప్రవాహం. సంతాన కరణం అని దీనికే పేరు పెట్టారు అద్వైతులు. జ్ఞానాన్ని సంతానమంటే పొడిగిస్తూ పోవటమని భావం. అంటే ఆత్మాకార వృత్తిని అలాగే నిలుపుకోవటం అన్నమాట.

ధ్యాతృ ధ్యేయ ధ్యాన : ధ్యానించేవాడు ధ్యాత. Meditator. అతడు దేన్ని ధ్యానిస్తున్నాడో అది ధ్యేయం. The Target. ఇరువురికీ మధ్య నడిచే వ్యవహారం. రెండు కొసలనూ కలిపే వంతెన లాంటిది ధ్యానం. The process.