#
Back

Page 34

వేదాంత పరిభాషా వివరణము


తటస్థ : తటంమీద ఉన్నవాడు. తటమంటే తీరం. Bank of a river. మధ్యస్థుడు. ఉదాసీనుడు అని అర్థం. స్వరూపమని, తటస్థమని లక్షణం రెండు విధాలు. ఒక పదార్థాన్ని సాక్షాత్తుగా ఫలానా అని వర్ణిస్తే స్వరూప లక్షణం. అలాకాక దాని కార్యం ద్వారా సూచిస్తే తటస్థ లక్షణం. పరమాత్మకు ఇవి రెండూ వర్తిస్తాయి. సచ్చిద్రూపుడని చెబితే స్వరూపం. నామరూప క్రియలకు అధిష్ఠానమేదో అది అని చెబితే తటస్థం. సృష్టి ప్రవేశాదుల వర్ణన అంతా ఇదే.

తత్‌ : అది అని అర్థం. వేదాంతపరంగా తత్‌ అంటే ఆ ఈశ్వరుడు అని అర్థం. అంటే పరోక్షంగా ఉన్నదని భావించే అఖండ చైతన్యం.

త్వం : నీవు అని అర్థం. అంటే అపరోక్షంగా మన అనుభవంలో ఉన్న జీవుడు లేదా జీవాత్మ.

తత్త్వమసి : తత్‌ త్వం. అది నీవు. అసి ఒకటే అయి ఉన్నావు. Thou are that. జీవేశ్వరులనే పదార్థాలు రెండూ రెండు గావు. ఉపాధులలోనే తేడా. స్వరూపమైన చైతన్యంలో కాదని, ఉపాధులు కేవలమాభాసే గనుక ఆత్మజ్ఞానంతో వాటిని అందులో లయం చేసుకొని చూస్తే రెండూ కలిసి ఏకైకమైన తత్వమేనని వాక్యార్థం. ఇది ఛాందోగ్యోపనిషత్తులో వచ్చే ఒకానొక మహావాక్యం. ఉపదేశ వాక్యమంటారు దీనిని. శ్వేతకేతువనే తన కుమారుడికి తండ్రియైన ఉద్దాలకుడు చేసిన బోధ ఇది. జీవేశ్వరైక్యాన్ని స్పష్టంగా బోధిస్తుంది ఈ వాక్యం. దీని వాచ్యార్థం సృష్టి ప్రవేశాది వర్ణన అయితే లక్ష్యార్థం శుద్ధ చైతన్యరూపంగా ఇద్దరూ ఒకే ఒక అఖండ స్వరూపమని చెప్పటం.

తత్త్వం : తస్యభావః తత్త్వం. ఆయా పదార్థాలకు ఎడబాయకుండా ఉన్న లక్షణం లేదా స్వభావమని అర్థం. జీవతత్త్వమంటే జీవుడి స్వభావం. ఈశ్వర తత్త్వ మంటే ఈశ్వరుడి స్వభావం. యాధాత్మ్యం. The real nature  సతత్వమని కూడా దీనిని పేర్కొంటారు.

తత్త్వజ్ఞాన : మనం చూస్తూ ఉన్న ఈ ప్రపంచ స్వభావం ఏమిటో లోతుకు దిగి విచారణ చేస్తూ పోతే దాని ఫలితంగా ఏర్పడే యధార్థమైన జ్ఞానమేదో అది. ప్రపంచం ప్రస్తుతం మనకు నామరూపాత్మకంగా భాసిస్తున్నది. ఇది ఆపాతతః భాసించటమే గాని లోతుకుదిగి చూస్తే ఇది నామరూపాత్మకం కాదు. సచ్చిదాత్మకమైన పరమాత్మేనని, అదే మన అజ్ఞాన వశాత్తూ ఇలా రూపాంతరంలో భాసిస్తున్నదని తేలిపోతుంది. ఇలా తేల్చుకొనే జ్ఞానమే తత్త్వజ్ఞానం. ఇదే జీవిత పరమార్థానికి దారితీసే జ్ఞానం. దీనికి భిన్నమైనదంతా తత్త్వజ్ఞానం కాదు. మిథ్యా జ్ఞానమే False Notion.

తత్త్వశాస్త్ర : అలాంటి తత్త్వాన్ని మనకు బోధించే ప్రమాణం ప్రత్యక్షం కాదు. అనుమానమూ కాదు. పోతే శాస్త్ర ప్రమాణమే ఇచ్చట మనకు ప్రమాణం. శాస్త్రమంటే సత్యమేదో దాన్ని శాసించి మనకు చెప్పేది. ఇది మానవుడు తన బుద్ధిబలంతో సృష్టించిన భౌతిక వైజ్ఞానిక శాస్త్రాలలాంటి శాస్త్రం కాదు. అవి కేవలం పౌరుషేయమైతే ఇది అపౌరుషేయం. Super human. ఒకానొకప్పుడు మహర్షులు సమాధి దశలో దర్శించిన సత్యమే శాస్త్రరూపంగా అవతరించింది. కనుక అదే మనకు మరలా అలాంటి అనుభవాన్ని ప్రసాదిస్తుంది. కనుక ఉపనిషత్తులే నిజమైన శాస్త్రం. తత్త్వాన్ని చెప్పేది గనుక తత్త్వశాస్త్రం. దీనికి ఆగమమని కూడా మరొక నామధేయం. The spiritual science. Meta Physics.

తత్త్వదర్శి : శాస్త్రం బోధించిన సద్గురువులు తన కుపదేశించిన అలాంటి తత్త్వాన్ని ఎవడు శ్రవణ మననాలతోనే గాక నిదిధ్యాసనా బలంతో అనుభవానికి తెచ్చుకోగలడో వాడికి తత్త్వదర్శి అని పేరు. తత్త్వాన్ని ముఖాముఖిగా దర్శించేవాడని అర్థం. దర్శించటమంటే తనకు వేరుగా ఒక దృశ్యాన్ని చూచినట్టు చూడటం కాదు. దాన్ని తన స్వరూపంగానే ఆకళించుకోటమని అర్థం.

తత్త్వాన్యత్వ : తత్త్వమంటే అది. అన్యత్త్వమంటే అది కానిది. ప్రస్తుతం మనం చూచే ఈ ప్రపంచమంతా నామరూపాత్మకంగానే మనకు కనిపిస్తున్నది. ఇది కేవల మాభాసే. వాస్తవం కాదు. వాస్తవంలో ఇది సచ్చిద్రూపమే. అయినా అలా గోచరించటం లేదు. దాని దృష్ట్యా చూస్తే ఇది తత్త్వమే. అలాకాక ఇప్పుడున్నట్టుగా చూస్తే అన్యత్వమే. ఇంతకూ తత్త్వమా అన్యమా ఏదీ నిర్ణయించలేము. కనుక ఒక్కమాటలో చెబితే అనిర్వచనీయ Inexplicable మన్నారు దీన్ని. తత్త్వాన్యత్వాభ్యాం అనిర్వచనీయే నామరూపే అని భాష్యవచనం.

తద్జ్ఞ : తత్‌ అంటే అది. పరమార్థమని భావం. జ్ఞ అంటే గుర్తించిన వాడు పరమార్థం ఏమిటో దానిని చక్కగా గ్రహించినవాడని అర్థం. అంతేకాదు. ఏ విషయమైనా ఉన్నదున్నట్టు గ్రహిస్తే వాడికి తద్జ్ఞుడనే పేరు. దానివాడని అర్థం.

తద్గుణ సంవిజ్ఞాన : దాని గుణాలతోసహా దాన్ని ఫలానా అని గుర్తించి పట్టుకోవటమని అర్థం. సృష్టి స్థితి లయాలనేవి ప్రపంచానికి గుణం. దీనిద్వారా ప్రపంచాన్నే గాక దీనికి మూలకారణమైన ఈశ్వరుణ్ణికూడా గుర్తించవచ్చు. దీన్ని ముఖ్యార్థంలో Primary  అయితే దాన్ని లక్ష్యార్థంలో.

తద్గుణసార : ఆత్మచైతన్యం వాస్తవంలో ఈ శరీరాది ఉపాధులమేరకే లేదు. దీనితో దాని కేలాటి సంబంధం లేదు. అయినా మానవుడి బుద్ధిలో వచ్చి ఆ చైతన్యం కర్మవశాత్తూ ప్రవేశించింది. అప్పటి నుండీ దీని గుణాలే దానికి సంక్రమించి కర్తృత్వ భోక్తృత్వాలకు లోనై కూచుంది. తద్గుణ అంటే బుద్ధి గుణాలు. అదే సారం. అంటే ఆత్మకు స్వభావమై పోయింది. కనుకనే తద్గుణ సారమని దాన్ని పేర్కొనటం. సారమంటే ప్రమాణమని కూడా ఒక అర్థం. మరల ఈ గుణాలనే ఆధారం చేసుకొని తన స్వస్వరూపమేదో దాన్ని వెతుక్కుంటూ పోవటానికి కూడా ఈ బుద్ధే దోహదం చేస్తుంది. కనుక అది ఒక విధంగా కీడైతే మరొకవిధంగా మేలని భావించవచ్చు.

తంత్ర : శాస్త్రమని అర్థం. శైవ వైష్ణవాది ఆగమాలు కూడా. పూర్వ మీమాంస అని కూడా అర్థమే. క్రియారూపంగా సాగేదేదో అది తంత్రం. అంతేకాదు అధీనమని కూడా అర్థముంది. స్వతంత్ర - తనమీద తాను ఆధారపడడం. పరతంత్ర - ఇతరుల మీద ఆధారపడడం. ప్రధానమని కూడా అర్థమే. అతంత్రమంటే అప్రధానమని భావం.

తదేకదృష్టి / తదేకధ్యాన : ఒక లక్ష్యంమీద మాత్రమే దృష్టి పెట్టుకుని మరి దేనినీ మనసుకు రానీయక కూచుంటే దానికి తదేకదృష్టి లేదా తదేక ధ్యానమని పేరు. యోగాభ్యాసం కాని జ్ఞానాభ్యాసం కాని చేసే ప్రతి సాధకుడికి ఇది చాలా ముఖ్యం. మనసుతోనే గదా ఏదైనా సాధించవలసింది. ఆ మనసు ఏకంగాక అనేక విధాలుగా పరిగెడితే లక్ష్యాన్ని సాధించలేడు.

తప్యతాపకభావ : ఇది సాంఖ్యుల పరిభాష. తపింపబడేది తప్యం. దాన్ని తపింపజేసేది తాపకం. రజ స్తమో గుణాత్మకమైన భావాలన్నీ మనస్సును తపింప జేసేవే. పోతే దానివల్ల తాపమనుభవించేది సత్త్వగుణాత్మకమైన బుద్ధి. అదే తప్యం.

తపస్‌ : తపించటం. Penance. ఒక లక్ష్యంమీద మనస్సు నిలిపి అలాగే కూచుని పోవటం. అద్వైతంలో ఇది క్రియారూపం కాదు. జ్ఞాన రూపం. 'యస్య జ్ఞానమయం తపః' పరమాత్మ సృష్టిని గూర్చి చేసే ఆలోచన. 'స తపో తప్యత. స తపః తప్త్వా ఇదం సర్వ మసృజత.' బ్రహ్మాండమైన ఆలోచనచేసి ఒక ప్రణాళిక వేసుకొని పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టించాడట. మరలా ఈ జీవుడు కూడా దానికి ప్రతిలోమంగా అలాంటి ఆలోచనే చేసి దీన్ని లయం చేసుకొని తన స్వరూప స్థితిని అందుకోవలసి ఉంది. మనం చేయవలసిన తపస్సు ఇదే.

తథ్య : వాస్తవం. యథార్థం. ఎలా ఉండాలో అలా ఉందని అక్షరార్థం. తథాత్త్వమే తథ్యం. దీనికి వ్యతిరేక పదం మిథ్య.

తన్మయ : ఒకదానితో ఏకమై పోవటం. Identify. తాదాత్మ్యం చెందటం. లౌకికంగా అయితే అది బంధానికి పారలౌకికంగా మోక్షానికి దారితీసే లక్షణం.

తాపత్రయ : మూడు తాపాలని అర్థం. ఆ మూడేవో గావు. ఆధ్యాత్మిక మొకటి. ఆధివ్యాధులు. ఆధిభౌతికమొకటి. చోర వ్యాఘ్రాదులు. ఆధి దైవిక మొకటి. అతివృష్టి అనావృష్టీ ఉత్పాతాదులూ. సంసారమంతా ఈ మూడింటితోనే నిండిపోయింది. తాపత్రాయాత్మకమే మానవ జీవితం. దీనికి విరుగుడు అధ్యాత్మ జ్ఞానమే. కనుకనే శాంతి పాఠంలో మూడుసార్లు శాంతి శబ్దాన్ని ఉచ్చరించటం.

తమస్‌ : సత్వరజస్తమో గుణాలలో మూడవది. మొద్దులాగ పడి ఉండే లక్షణం. జడత్వం. మనస్సు సత్వమైతే ప్రాణం రజస్సయితే శరీరం తమోగుణాత్మకం. చీకటి అని కూడా అర్థమే. అజ్ఞానమని లాక్షణికమైన అర్థం. 'తమసోమా జ్యోతిర్గమయ.' అజ్ఞాన దశ నుంచి జ్ఞాన జ్యోతివైపు తీసుకెళ్ళమని ప్రార్ధన.

త్యాగ : త్యజించటం. వదలుకోవటమని అర్థం. ఏదైనా ఒక పాత్రుని చూచి మంచి వస్తువతనికి దానం చేస్తే అది త్యాగం. అంతేగాక కర్మఫలాన్ని తన కక్కరలేదని నిష్కామంగా కర్మ ఆచరిస్తూ ఫలంమీద దృష్టి లేకపోతే అది కూడా త్యాగమే. అంతేగాక ఈ సంసారాన్ని నామరూపాత్మకంగా వదిలేస్తూ ఈశ్వరాత్మకంగా దర్శిస్తూ పోతే అదే అసలైన త్యాగం. 'త్యజితైవ హి తత్‌ జ్ఞేయం.' త్యజించేవాడే దాన్ని అందుకోగలడు అని శాస్త్రం మనకు బోధిస్తున్నది.

తిరోధాన : మాయమై పోవటం. అంతర్థానమై పోవటం అని అర్థం. ప్రస్తుతం మానవుడి దృష్టికి పరమాత్మ తత్త్వం తిరోధానమైంది. దీనికి కారణం అనాది నుండి అంటి పట్టుకుని వస్తున్న అతని అజ్ఞానమే. దీనినే తాంత్రికులు మహాశక్తి పంచకృత్యాలలో నాలుగవదని వర్ణిస్తారు. తిరోధానమనే ముఖంతో ఆవిడ మానవుడి బుద్ధిని కప్పివేస్తున్నదట. నిరంతర ధ్యానం కలిగి ఉంటే మరలా అనుగ్రహమనే ముఖంతో దాన్ని విప్పివేసి బ్రహ్మజ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుందట.

తిరస్కార : కప్పివేయటం. కనపడకుండా చేయటం. నిది ధ్యాసనలో కూచున్న అద్వైత సాధకుడికి సజాతీయమైన ఆత్మభావన ఏర్పడుతుంటే మంచిదే. కానీ తరచుగా విజాతీయమైన అనాత్మ వృత్తులు వచ్చి దానిమీద దాడిచేసి కనపడకుండా మరుగు పరుస్తాయి. అలాంటప్పుడు దానికి తిరస్కరణమని పేరు. ఎప్పటికప్పుడు ఆత్మభావన ఏమరకుండా చేస్తే అది మరలా తిరస్కృతమై ఆత్మ నిష్ఠలోనే కూచోగలడు. మొత్తంమీద విజాతీయ భావములచేత అతిరస్కృతమైన సజాతీయ భావననే సాగిస్తూ పోవాలని అర్థం.

తిర్యక్‌ : అడ్డంగా ఉన్న వెన్నెముక కలిగినదని అర్థం. మానవుడికి వెన్నెముక నిటారుగా ఉంటుంది. వాడు సమ్యక్‌. పోతే పశువులకు మృగాలకు అలా ఉండదు. కొన్ని సరీసృపాలకు పక్షులకు కూడా ఉండదు. అక్కడ అది అడ్డంగానే సాగిపోతుంది. కనుక జంతు జాలానికి తిర్యక్కులని పేరు వచ్చింది.

తరణ : దాటిపోవటం. సంసార సాగరాన్ని దాటి బయట పడటమని వేదాంతార్థం.

తీర్ణ : అలా దాటి బయటపడ్డ సిద్ధపురుషుడు.

తీర్థంకర : తీర్థమంటే శాస్త్రమని అర్థమిక్కడ. అలా శాస్త్రాన్ని సృష్టించిన వాడు తీర్థంకరుడు. శాస్త్రకారుడని అర్థం Scientist. ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన దార్శనికుడు.A Prophet.

తర్క : ఆలోచన. ఊహ. Inference.  విచారణ Enquiry. హేతువాదం. Reasoning న్యాయవైశేషికాలు రెండూ కలిసి తర్కశాస్త్రం.Indian Logic అని ప్రసిద్ధి. ఇది తత్త్వజ్ఞానానికి ఉపకరణం Means  కావాలిగాని అపహరణం కాగూడదని వేదాంతుల హెచ్చరిక.