#
Back

Page 33

వేదాంత పరిభాషా వివరణము

జ : జన్మించినది. ఏర్పడినది. జగత్‌ అని అర్థం.

జక్షత్‌ : భక్షించటం. అనుభవించటం అని అర్థం.

జగత్‌ : 'జాయతే ఇతి జం గచ్ఛతి ఇతి గం.' రెండూ కలిస్తే జగత్‌ పుట్టేది పోయేది ఇలాంటి స్వభావం కలది. ప్రపంచమని అర్థం.

జఘన/జఘన్య : వెనుకభాగం. క్రిందిది. తగ్గురకమైనది. దిగువనున్నది. నికృష్టం. అధమం. 'జఘన్య గుణ వృత్తిస్థా అధో గచ్ఛంతి తామసాః' జఘన్య గుణం అంటే తమోగుణం కలిగినవారందరూ అథోలోకాలకు వెళ్లిపోతారని గీతా శ్లోకం.

జంగమ : స్థావరానికి వ్యతిరేక పదం. ఎప్పుడూ కదులుతూ పోయేదని శబ్దార్థం. Mobile.

జడ : చేతనం కానిది. ప్రాణం లేనిది. జ్ఞానం లేనిది. Inanimate. Insenscient.

జన్యజనక సంబంధ : పుట్టేది జన్యం. పుట్టించేది జనకం. ఈ రెండింటికీ ఉన్న సంబంధం. కార్యకారణ సంబంధమని మరొకమాట. The relation between cause and effect.  ప్రపంచమంతా జన్యజనకాత్మకమే.

జన/జనిమత్‌/జంతు : మూడింటికీ అర్థమొకటే. జన్మించినది ప్రాణి. జీవం. The living being.

జన్మ/జని/జనుస్‌ : జన్మ, పుట్టుక. Birth.

జరామరణ : ముసలితనం. మరణం. ఇవి రెండూ స్థూల శరీర లక్షణాలు. Decay and Death. షడూర్ములలో ఇవి మొదటి రెండు.

జరాయుజ : జరాయువు అంటే గర్భకోశం. అందులోనుంచి జ పుట్టిన ప్రాణి. పశువులు మనుష్యులు ఇద్దరూ జరాయుజాల క్రిందికి వస్తారు.

జప : ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ పోవటం Chanting of a hymn.

జల్ప : ఏదో ఒకమాట గొణగటం. స్పష్టంగా వినపడకుండా మాటాడటం. వాగటమని కూడా అర్థమే. Chat.

జహద/జహ/ల్లక్షణ : ఒక అంశాన్ని వదిలేస్తూ మరొక అంశాన్ని పట్టుకునే లక్షణం. 'సోయం దేవదత్తః' అన్నప్పుడు వాడే ఈ దేవదత్తుడని వాక్యార్థం. ఇందులో అప్పుడు చూచిన వాడికి ఇప్పుడు చూచే దేవదత్తుడికి కాలక్రమంలో కొన్ని గుణాలు మారిపోయి కొన్ని అలాగే నిలిచి ఉంటాయి. మారినవాటిని మనం వదిలేయాలి. పోల్చుకోగల వాటిని పట్టుకోవాలి. అప్పుడిద్దరు కారు. దేవదత్తుడనేవాడు అప్పుడైనా ఇప్పుడైనా ఒకడేనని అనుభవానికి వస్తుంది. అలాగే తత్త్వమసి అన్నపుడు తత్‌పదార్థమైన పరమాత్మలో త్వం పదార్థమైన జీవాత్మలో పరిచ్ఛిన్నత్వం పరోక్షత్వం అనే విరుద్ధ ధర్మాలు మనస్సుకు తెచ్చుకోక చైతన్యమనే సామాన్య ధర్మాన్ని మాత్రమే పట్టుకుని ఇద్దరూ ఏకమనే జీవబ్రహ్మ ఐక్యాన్ని భావించటమే దీని ప్రయోజనం.

జాగ్రత్‌/జాగర/జాగరిత : జాగ్రదవస్థ. మెలకువ. Wakeful state. అవస్థా త్రయంలో ఇది మొదటి దశ.

జాత : జన్మించినవాడు Born. సమూహమని కూడా ఒక అర్థముంది. వస్తుజాతమంటే వస్తు సమూహం.

జాతి : జన్మ. Birth. పుట్టటం. వర్గం Class. మనుష్యజాతి. సామాన్యమని కూడా మరొక అర్థం. Genus. జాతి వ్యక్తి అంటే సామాన్య విశేషాలు. గోత్వమనేది జాతి అయితే గోవనేది వ్యక్తి. ఒకటి Universal, మరొకటి Particular జీనస్‌ అండ్‌ స్పీసీస్‌ అని కూడా పేర్కొంటారు తార్కికులు.

జామితా : కలిసిపోవటం. మేళనం. జామి అంటే జత. జంట. దాని భావం జామితా. 'న మంత్రాణాం జామితా అస్తి.' మంత్రాలు దేనిపాటికవే ఒకే అర్థం చెబుతున్నా ఒకదానితో ఒకటి చేర్చి పట్టుకోరాదట. పునరుక్తి దోషం మంత్రాలకు లేదని భావం.

జాయా : భార్య. పురుషుడు మరలా రేతోరూపంగా స్త్రీ గర్భంలో ప్రవేశించి జన్మిస్తాడు గనుక అలాంటి జన్మకు హేతుభూతమైన భార్యకు జాయా అని పేరు వచ్చింది.

జాల : వల Net.  కిటికీ window సమూహం Group. అంతేగాక మోసం. కపటం. మాయ. Deceit అని కూడా అర్థమే. ఇంద్రజాలం. పరమాత్మ మాయాశక్తికి కూడా జాలమనే మాట వర్తిస్తుంది.

జ్యాయస్‌ : రెండింటిలో పెద్దదైన దానికి జ్యాయస్‌ అని పేరు. Bigger btween the two. 'జ్యాయాన్‌ ఆకాశాత్‌.' ఆకాశం కంటే పెద్దది చిదాకాశం. అదే ఆత్మ స్వరూపం. ఇది జడమైతే అది చైతన్యగుణం కూడా అదనంగా ఉన్నది గనుక దీనికన్నా పెద్దదని తీర్మానం.

జ్యోతిస్‌ : వెలుగు. ప్రకాశం. జడ ప్రకాశమే కాదు. చైతన్యం కూడా. అదీ ప్రకాశమే. ప్రకాశమంటే ఇక్కడ అగ్నిలాగ సూర్యునిలాగ వెలుగుతూ పోవటం కాదు. స్ఫురించటం. ప్రతి ఒక్కటీ ఉందనే స్ఫురణ. The Awareness of oneself and the things around him. ఇది జడమైన జ్యోతికి లేదు. కనుకనే 'జ్యోతిషామపి తత్‌జ్యోతిః' అని చైతన్యాన్ని వర్ణించింది శాస్త్రం. అంతర్జ్యోతి అని కూడా The inner light  దీనిని వర్ణిస్తారు.

జిజ్ఞాసా : జ్ఞాతుమిచ్ఛా. తెలుసుకోవాలని కోరిక. బ్రహ్మ జిజ్ఞాసా. బ్రహ్మ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలనే తహతహ. Desire to explore the ultimate విచారణ అని కూడా పేర్కొనవచ్చు. Enquiry of the truth.

జిజ్ఞాసు : అలాంటి జిజ్ఞాస లేదా ఆసక్తి కల సాధకుడు. The aspirant. The enquirer.

జిన/జైన : జినుడంటే మహావీరుడు. అతడు స్థాపించిన మతం జైనం. దిగంబర దర్శనమని కూడా దీనికి నామాంతరం. ఈ మతంలోని తీర్థంకరులందరూ దిగంబరులే. సత్యం కేవలం నగ్నమైనదేననే భావాన్ని కలిగించటానికే ఈ వేషమని కొందరి వ్యాఖ్యానం.

జీవ/జీవాత్మ : ప్రాణం Life. ప్రాణమున్న పదార్థం కూడా. Living being. దేహం మేరకే పరిమితమై అదే నేనని తాదాత్మ్యం Identity  చెందిన ఆత్మచైతన్యం. దీనికే జీవాత్మ అని పేరు. కర్తృత్వమూ భోక్తృత్వమూ దీని లక్షణాలు. చేసేవాడూ అనుభవించేవాడే జీవుడు. దీనికి విలక్షణమైన సాక్షి చైతన్యానికి పరమాత్మ అని పేరు.

జుగుప్పా : గోప్తు మిచ్ఛా. దాచిపెట్టుకోవాలని కోరిక. ఒకటి నీకు అన్యమని అక్కర లేనిదని చూచినప్పుడే ఆ భావమేర్పడుతుంది. కనుక అసహ్యించుకోటమని కూడా ఈ మాటకు అర్థం వచ్చింది.

జీవన : జీవుడు చేసే పని. జీవించటం. బ్రతకటం.

జీవన్‌ముక్త : శరీరమనే ఉపాధి ప్రారబ్ధం తీరేవరకు ఉండి తీరుతుంది. ఆ లోపుగా జ్ఞానోదయమైనవాడు జీవన్ముక్తుడు. అయినా ప్రారబ్ధం కొద్దీ శరీరమింకా వాడికి ఉంటుంది కనుక అది తీరేవరకూ వాడు జీవించవలసిందే. ఇలాగ ముక్తుడై కూడా జీవించేవాడికి జీవన్ముక్తుడని పేరు. అయినా శరీరాన్ని తనదిగా భావించ డతడు. పాము కుబుసంలాగ తనకు దూరంగా ఉన్నట్టే చూస్తుంటాడు. కనుక దేహమున్నా ముక్తుడే. ప్రారబ్ధం తీరితే ఈ జీవన్ముక్తేడే శరీర బంధం తొలగిపోయి విదేహ ముక్తుడౌతాడు.

జైమిని : వ్యాసుని శిష్యులలో ఒకడు. ధర్మశాస్త్రకారుడు. పూర్వమీమాంసా ప్రవర్తకుడు. ధర్మమే పురుషార్థమని ఈయన వాదం. ఈశ్వరుడు లేడితనికి. దీనిని బట్టి చూస్తే ఇతడు వేదవ్యాసుని శిష్యుడు కాడు. చరిత్ర జ్ఞానం లేనివారు వీరిరువురికీ సంబంధం కలిపి ఉండవచ్చు. వాస్యునికి శిష్యుడైన జైమిని వేరు. ఈ జైమిని వేరు. ఇతడు మీమాంసా దర్శనకారుడైన ఒక శాస్త్రజ్ఞుడు మాత్రమే అని మనమర్థం చేసుకోవలసి ఉంది. దీనికి ఉపోద్బలకంగా ఒకమాట మనకు బ్రహ్మసూత్రాలలో కనిపిస్తుంది. జైమిని ఈ విధంగా చెప్పాడని తరచుగా బాదరాయణుడనే ఆచార్యుడు అతని పేరు ఉదాహరిస్తాడు. ఈ బాదరాయణుడు వ్యాసుడూ కాడు. అతడు ఉదాహరించిన జైమిని వ్యాస శిష్యుడైన జైమినీ కాడు.

జ్ఞాతా : తెలుసుకొనేవాడు Knower.

జ్ఞాన : తెలుసుకొనే సాధనం Instrument of Knowledge.

జ్ఞేయ : తెలుసుకోబడేది Known. Object of knowledge.

జ్ఞప్తి : జ్ఞానంవల్ల కలిగే ఫలం. వీటినే ప్రమాతృ ప్రమేయ ప్రమాణ ప్రమితి అని కూడా పేర్కొంటారు. జ్ఞానమంటే ఇక్కడ లౌకిక జ్ఞానం Common Sense కాదు. శాస్త్రజ్ఞానం Scientific Sense కాదు. కళాజ్ఞానం Aesthetic sense కాదు. ధర్మ జ్ఞానమూ Religious sense కాదు. ఇవన్నీ విశేష జ్ఞానాలే. ఆయా నామరూపాలకు చెందిన జ్ఞానాలని అర్థం. పోతే వీటన్నింటిని వ్యాపించి తన స్వరూపంగా భావించే జ్ఞానమొకటి ఉన్నది. ఇవి విశేష జ్ఞానమైతే అది సామాన్య జ్ఞానం. ఇవి అనాత్మ జ్ఞానమైతే Objective అది ఆత్మజ్ఞానం. Subjective. ఇవి బంధానికి దారితీస్తే అది మోక్షాన్ని చేర్చే సాధనం. కనుక అలాంటి జ్ఞానమే ఇక్కడ జ్ఞానమని అర్థం చేసుకోవలసి ఉంది. దీనికి భిన్నమైన మన జ్ఞానాలన్నీ వాస్తవంలో జ్ఞానం కాదు. అజ్ఞానం క్రిందికే వస్తాయని ఉపనిషత్‌ సిద్ధాంతం.

జ్ఞానీ : ఇలాంటి ఆత్మజ్ఞానం కలవాడు. బ్రహ్మజ్ఞానాన్ని సాధించిన వ్యక్తి.