#
Back

Page 32

వేదాంత పరిభాషా వివరణము

చ : మరియు and. also అదేకాక ఇంకొకటి కూడా. 'జ్ఞానం విజ్ఞానం చ' అంటే జ్ఞానమే కాక విజ్ఞానం కూడా అని అర్థం.

చక్ర : చక్రం. Wheel. ఎడతెగకుండా తిరుగుతూ పోయేది. సంసార చక్రం. శరీరంలోని షడ్చక్రాలు కూడా. మూలాధారం నుంచి సహస్రారం వరకు సప్తచక్రాలున్నాయి శరీరంలో. సప్తగిరి క్షేత్రం కూడా ఒక సంకేతమే నంటారు తద్జ్ఞులు. ఆరుకొండలు దాటి ఏడవకొండ చేరితే అది సహస్రారం. అలాగే నొక్కులతో కనిపిస్తుందది. అందులో ఉన్న వేంకటేశ్వరుడు సాక్షాదీశ్వరుడే. ఇలాంటి భావనతో స్వామి దర్శనం చేయగలిగితే జీవేశ్వరైక్యం సిద్ధించకపోదు.

చక్షుస్‌ : చూచేది. కన్ను. మనస్సు కూడా. జ్ఞానం కూడా కావచ్చు. జ్ఞానచక్షుస్సు అనే వర్ణిస్తారు పెద్దలు. 'జ్ఞాన దీర్ఘేణ చక్షుషా' అని మాట.

చతుర్థ : నాలుగవది. The fourth. తురీయావస్థ. సమాధి. 'చతుర్థం శివమద్వైతం మన్యంతే' అని మాండుక్యవచనం. పరమాత్మ స్వరూపమే అది.

చరాచర : చరించేది. కదిలేది. జంగమం. దీనికి భిన్నమైనది అచరం. కదలనిది. స్థావరం. ప్రపంచమంతా చరాచరాత్మకమే State and dynamic.

చరణ : చరించడం. ఆచరించడం. చేయటమని అర్థం.

చరిత/చరిత్ర : ఆచరించబడినది. నడవబడినది. ధర్మం కావచ్చు. అధర్మం కావచ్చు. conduct good and bad.

చరమ : అన్నిటికన్నా చివరిది. పురుషార్థాలలో చరమమైన పురుషార్థం మోక్షమే. అదే పరమమైనది కూడా. కారణం జీవిత సమస్యకు పరిష్కార మక్కడే లభిస్తుంది మానవుడికి. అవసానం కూడా చరమమనే మాటకు అర్థమే. చివరి దశ అని భావం.

చర్చా : చర్చించటం. మీమాంస. విచారణ. Discussion. Discourse.

చర్య : పని. కర్మ. ఆచారం. అనుష్ఠానం. అమలు పరచటం.Implementation.

చయన : పోగుచేయటం. Collection. యజ్ఞమని కూడా అర్థమే. అక్కడా యాజకుడు యజ్ఞ ద్రవ్యాలన్నీ ప్రోగు చేయవలసి ఉంటుంది.

చలాచల : కదులుతూ ఆడుతూ ఉండే లక్షణం. మనస్సెప్పుడూ ఇలాంటిదే. సంకల్ప వికల్పాత్మకంగా ఎప్పుడూ ఇది చలిస్తూనే ఉంటుంది. సాధకుడైనవాడు దీనిని అదుపులో పెట్టుకోవాలి. యోగులైతే నిరోధించమని సలహా ఇస్తారు. జ్ఞానులు నిరోధం ఒప్పుకోరు. దానికి మారుగా సజాతీయమైన బ్రహ్మాకార వృత్తిని అనులోమంగా చూస్తూ పొమ్మంటారు. ఎప్పుడెప్పుడు మనస్సు చలిస్తుందో అప్పుడది ప్రారబ్ధమని భావించి మరలా తమ బ్రహ్మనిష్టలో తాము ఉండడమే జ్ఞాని చేయవలసిన పరిశ్రమ. గౌడపాదులవారు జీవన్ముక్తుడు కూడా చలాచల నికేతుడే కనుక చలించి నంత మాత్రాన బెదరిపోరాదు, అది ప్రారబ్ధ లక్షణమని భావించి మరలా అచలమైన ఆత్మను దర్శిస్తూ కూర్చోమని, అదే సాధన అని సలహా ఇచ్చారు.

చాతర్వర్ణ్య : నాలుగు వర్ణాలు. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు. త్రిగుణాల కలగాపులగం వల్ల స్వాధ్యాయాది కర్మలవల్ల ఇవి ఏర్పడ్డాయని చెబుతారు. 'గుణకర్మ విభాగశః' అని గీతావచనం. సత్వం ప్రబలమై రజస్సు తగ్గితే బ్రాహ్మణుడు. రజస్సు అధికమై సత్వం తక్కువైతే క్షత్రియుడు. రజస్సు ప్రబలమై తమస్సు బలహీనమైతే వైశ్యుడు. తమస్సు ప్రబలమై రజస్సు తగ్గిపోతే శూద్రుడు. కాగా ఆధ్యాత్మికంగా దీనికి మరొకలాగ అర్థం చెప్పుకోవచ్చు. మన శరీరంలో మనస్సే బ్రాహ్మణుడు. ప్రాణం క్షత్రియుడు. ఇంద్రియాలు వైశ్యుడు. శరీరం శూద్రుడు. దీనిని బట్టి క్రింది నుంచి మీదికి ప్రయాణం చేస్తూ పోతే శరీర దృష్టిని ఇంద్రియ దృష్టిలో, ఇంద్రియ దృష్టిని ప్రాణదృష్టిలో, ప్రాణదృష్టిని మనోదృష్టిలో లయం చేసుకుని చివరకు మనస్సుకు కూడా అతీతమైన ఆత్మదృష్టిని అలవరచుకోవటమే ఇందులో ఇమిడి ఉన్న అంతరార్థమని మనం గ్రహించవలసి ఉంది.

చాతురాశ్రమ్య : నాలుగు ఆశ్రమాలని అర్థం. బ్రహ్మచర్యం. గార్హస్థ్యం. వానప్రస్థం. సన్యాసం. ఇవి కూడా ఆధ్యాత్మికంగా చూస్తే బాల్య యౌవన వార్థక్య అవసానాలేనని మనకు స్ఫురిస్తుంది. ఇదంతా అంతకంతకూ మన అద్వైత సాధనకు తోడ్పడే వ్యవహారం.

చాతుర్మాస్య : ఆషాఢం నుంచి ఆశ్వయుజం వరకు శ్రీమన్నారాయణుడు క్షీర సాగరంలో యోగనిద్ర పోయే సమయం. ఈ నాలుగు మాసాలు గురుపరంపరలో ఆదిగురువైన నారాయణుడికి విశ్రాంతి సమయం గనుక లోకంలో సన్యాసాశ్రమం స్వీకరించిన గురువులందరూ సంచారం చేయకుండా ఒకచోట స్థిరంగా ఉండి బ్రహ్మవిచారం సాగించవలసి ఉంటుంది.

చాంద్రాయణవ్రత : చంద్రుని గమనాన్నిబట్టి భోజన నియమం కలిగి ఉండడం. శుక్లపక్షంలో పాడ్యమి నుండి పూర్ణిమ వరకు ఒక్కొక్క ముద్ద ఎక్కిస్తూ మరల కృష్ణపక్షంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకూ తగ్గిస్తూ పోవటం. పోతే ఆధ్యాత్మికంగా తగ్గించవలసినది పదిహేను కళలు. ఎక్కించవలసినది వాటికి అనులోమంగా మానసిక శక్తులు. మనస్సులో ప్రాపంచికమైన భావాలు ప్రతిలోమమైతే పారమార్థికమైనవి అనులోమం. ఈ పదిహేనూ అంతకంతకూ వదులుకుంటూ వీటి బదులు ఆ పదిహేనింటినీ అలవరచుకోవలసి ఉందని దీని అంతరార్థం.

చార్వాక : ఇది ఒక నాస్తిక దర్శనం. Atheism. Materialism. లోకాయత దర్శనమని దీని అసలు పేరు. బృహస్పతి దీనికి మూలపురుషుడు. కనుక దీనిని బార్హస్పతమని కూడా పేర్కొంటారు. వీరికి దేహమే ఆత్మ. అంతకుమించి ఆత్మలేదు. సుఖమే స్వర్గం. దుఃఖమే నరకం. మరణమే మోక్షం. జీవుడు లేదు. జన్మాంతరాలు లేవు. లోకమంతా వ్యాపించింది గనుక ఇది లోకాయత మతమైంది. చారువాక అందరికీ ఆకర్షకమైన మాటలు కాబట్టి చార్వాక దర్శనమయింది. పాశ్చాత్య దేశంలో Epicurus అనేవాడు ఈ చార్వాకుడికి సహాధ్యాయుడే. అతని మతం కూడా ఇలాంటి నాస్తిక మతమే.

చికీర్షా/చికీర్షిత : చేయగోరటం. చేయగోరిన విషయం.

చిత్‌/చితిః : చైతన్యం Consciousness. Self awareness. స్ఫురణ. నేనున్నాననే భావం. ఇదే ఆత్మ. చైతన్యమే దాని స్వరూపం. ఆత్మచైతన్యమని పేర్కొనటం కొయ్యబొమ్మ అనటం లాంటిది. రెండూ ఒకటే వాస్తవంలో. అయినా వ్యావహారికంగా వచ్చిందీ మాట.

చిత్త : అంతఃకరణ చతుష్టయంలో మూడవది. సంవేదనాత్మకం చిత్తం. Feeling centre. ప్రత్యేకించి చెప్పకపోతే సామాన్యంగా మనస్సనే అర్థం.

చేతస్‌ : చేతన కలిగినది. మనస్సని అర్థం. జ్ఞానమని కూడా అర్థమే. 'సుచేతాః' అంటే మంచి జ్ఞానం కలవాడని భావం.

చేతనా చేతన : ఇక్కడ చేతనమంటే ప్రాణమూ కావచ్చు. జ్ఞానమూ కావచ్చు. వేదాంతులు చేతనమంటే జ్ఞానమున్నదే అని పేర్కొంటారు. చేతనా చేతనములంటే జ్ఞానమున్నదీ లేనిదీ అని అర్థం చెప్పాలి Sencient and insencient.

చింతా : ఆలోచన. ప్రస్తావన. విచారణ. Discussion. ధ్యానం Reflexion. Meditation.

చింత్య : మనస్సుతో ఆలోచించగలిగినది. Thinkable. ప్రపంచమంతా నామరూపాత్మకం గనుక చింత్యమే. నామరూప రహితమైనది గనుక ఆత్మ. ఇలా చింత్యం కాదు. అచింత్యమని వేదాంతుల మాట.

చీర్ణ : ఆచరించబడినది. చరితమని అర్థం. చేయబడినది. చీర్ణవ్రత అనగా వ్రతమును ఆచరించినవాడు.

చైతన్య :   Consciousness. స్ఫూర్తి. స్ఫురణ. జ్ఞానం. అద్వైతుల మతంలో చైతన్యమంటే ప్రాణం కాదు. జ్ఞానం Awareness.

చితి/చేత్య : చితి అంటే చైతన్యం లేదా జ్ఞానం. ప్రకాశమని మరొకపేరు. ఆ ప్రకాశంలో ఏది ప్రకాశిస్తుందో అది చేత్యం.Object.

చోదనా : ప్రేరణ. పురమాయించటం. Goad. విధించటం. Enjoining. అలా చేయకు ఇలాగే చేయమని శాసించి చెప్పటం. విధి అని దీనికి పర్యాయపదం. 'చోదనా లక్షణః అర్థః ధర్మః' అని ధర్మ శబ్దానికి లక్షణం చెప్పారు. చోదన ప్రధానమైన దేదో అది ధర్మమట.

చోద్య : శాసించబడిన, విధించబడిన విషయం. ప్రశ్నించవలసినదని కూడా అర్థమే. To be questioned.

చ్యుత : జారిపడినది. స్వరూప స్థితి నుంచి తొలగినది. ఇదే జీవభావం. తొలగలేదని గ్రహిస్తే అచ్యుత Unfallen. ఇదే ఈశ్వర భావం.

ఛత్రిన్యాయ : పదిమంది ఛత్రాలు ధరించి వెళుతుంటే అందులో ఒకడికి ఛత్రం లేకపోయినా అందరినీ కలిపి ఛత్రి అని పేర్కొటారు. అలాగే జీవేశ్వరులిద్దరూ శరీరంలో ఉండి కర్మఫలం అనుభవిస్తున్నారని చెప్పినా జీవుడేకాని ఈశ్వరుడు అనుభవించడం లేదు. లేకున్నా 'ఋతం పిబంతౌ సుకృతస్య లోకే.' ఇద్దరూ కర్మఫలం అనుభవిస్తున్నారని శాస్త్రంలో ఉన్నమాట. ఇది ఛత్రిన్యాయంగా తీసుకోమన్నారు వ్యాఖ్యాతలు. అంటే ఛత్రం లేనివాడికి కూడా ఛత్రి అని పేరు వచ్చినట్టు కర్మఫల మంటకపోయినా ఈశ్వరుణ్ణి కూడా జీవుడితో జతచేసి వర్ణించారని భావం.

ఛత్రచ్ఛాయా : ఛత్రం తెరిచి పట్టుకుంటే దానిక్రింద ఛాయ కనపడుతుంది. అదే ముడిస్తే కనపడదు. అలాగే ఒక నిమిత్తముంటేనే దానివల్ల ఏర్పడుతుందొక నైమిత్తికం. నిమిత్తం లేకపోతే నైమిత్తికం లేదు. ఇప్పుడీ సంసారం అజ్ఞానమనే నిమిత్తం వల్లనే వచ్చి పడింది. అది తొలగిపోతే ఇది కూడా చెప్పకుండా శెలవు తీసుకుంటుంది అంటారు వేదాంతులు. దీనికోసం చెప్పిన ఉదాహరణమే ఛత్రచ్ఛాయ.

ఛద్మన్‌ : నెపం. మిష. మోసం. Pretext. Deceit.

ఛందస్‌ : వేదం. రహస్యాల నెన్నింటినో ఛాదనం చేసింది గనుక ఛందస్సు అని పేరు వచ్చిందట. మరలా అంతర్‌దృష్టితో చూచి మానవుడు దాన్ని గ్రహించవలసి ఉంటుంది. అనధికారులకు అందకుండా చేయటానికే ఇలా ఛాదనం చేయవలసి వచ్చింది మహర్షులు. ఛందో జ్ఞానం కలవాడెవడో వాడికి ఛాందసుడని పేరు.

ఛంద : కోరిక. స్వచ్ఛంద. తన ఇచ్ఛానుసారం అని అర్థం. Will.

ఛల : మోసం. కపటం. మరుగు. నెపం.Conceit guise.

ఛాందోగ్య : ఇది పది ఉపనిషత్తులలో తొమ్మిదవది. అష్టాధ్యాయీ అని దీనికి మరొక నామధేయం. ఇందులో ఎనిమిది అధ్యాయాలున్నాయి. మొదటి ఐదూ ఆయా విద్యలు లేదా ఉపాసనలను వర్ణిస్తాయి. ఆరు ఏడు ఎనిమిది మూడధ్యాయాలు పరవిద్య అయిన జ్ఞానాన్ని ప్రస్తావిస్తాయి. ఛందస్సును ఇలా గానం చేస్తూ పోయిన మహర్షులకు ఛందోగులని పేరు. వారి ప్రవచనం గనుక దీనికి ఛాందోగ్యమని పేరు సార్థకంగా ఏర్పడింది. తత్త్వమసి మహావాక్యం ఇందులోని ఆరవ అధ్యాయంలో వస్తుంది. తొమ్మిదిమార్లు ప్రశ్న వేశాడు శ్వేతకేతువు. తొమ్మిదింటికి తొమ్మిది సమాధానాలు చెప్పి అతనికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు ఉద్దాలకుడు. తత్త్వమసి మహావాక్యం తొమ్మిదిమార్లు వినిపిస్తుంది ఈ ఉపనిషత్తులో. బృహదారణ్యకం తరువాత పరిమాణంలో గుణంలో రెండింటిలో ఇది చాలా గొప్ప ఉపనిషత్తు.

ఛాయా : నీడ. ఆభాస. కల్పన అని అర్థం. ప్రతిబింబమని కూడా అర్థమే.

ఛాయాత్మా : అసలైన ఆత్మకాక మానవుడి మనస్సులో ప్రతిఫలించిన దాని ఆభాస. దీనికే చిదాభాసుడని మరొకపేరు. ఆకాశంలో ఎగిరిపోయే పక్షి నీడ నేలమీద పడుతుంది. దానికున్నట్టే దీనికీ నామరూపక్రియలు కనిపిస్తుంటాయి. ఇది అది కాదు. అది వస్తువైతే ఇది ఆభాస. ఇది ఆభాస అయినా వస్తువును చూడటానికి తోడ్పడుతుంది. ఇదే మన నేత్రంలో ఉన్న పాప. దానినే చూచి అసలైన ఆత్మగా భావించాడు విరోచనుడు. ఇంద్రుడు మొదట అలా బ్రాంతిపడి కూడా తరువాత తరువాత ప్రజాపతి బోధనందుకుని ఇది ఛాయాత్మేనని గ్రహించి తద్ద్వారా అసలైన ఆత్మ దర్శనం చేయగలిగాడట.