#
Back

Page 30

వేదాంత పరిభాషా వివరణము


గణ : గుంపు. సమూహం. నామరూపాలు. సంసారం. దీనికి పతి గణపతి. జీవుడని అర్థం. ప్రమథ గణాలంటే వీడిచుట్టూ ఉన్న పాంచభౌతిక పదార్థాలు. నామరూపాలే అవి. మానవుణ్ణి బాగా మథించేవి లేదా వేధించేవని భావం. ప్రకృతి గుణాలే గణాలు. సత్వరజ స్తమస్సులు.

గతి : గమనం. పోవటం. నడవటం. దశ state. అవస్థ. ఇంతేగాక జ్ఞానమని కూడా ఒక అర్థముంది. అనన్య ప్రోక్తే గతి రత్ర నాస్తి. ఇక్కడ అగతి అని విరిచి చెప్పారు. అగతి అంటే జ్ఞానం లేకపోవటం. సమర్థుడైనవాడు బోధిస్తే జ్ఞానం లేకుండా పోదని భావం. 'సాకాష్ఠా సా పరాగతిః.' అంటే అవగతియే గతి అని భాష్యంలో వర్ణించారు. అవగతి అంటే జ్ఞానమే. అద్వైతంలో జ్ఞానమే అనుభవం.

గత : గడచిపోయిన కాలం. విషయం. Past.

గతాగత : గడచిపోయినది. గడవబోయేది. past and future. అవేవో గావు జనన మరణాలు. దీనివల్లనే సంసారయాత్ర నిరంతరం సాగిపోతుంటుంది. అంతేగాక ఎప్పుడూ రాకపోకలు సాగించటం కూడా గతాగతమే.

గతానుగత : ఒకడు పోయిన మార్గంలోనే మరొకడు వెళుతూ ఉండడం. 'గతానుగతికో లోకః.' లోకమంతా గొర్రెదాటుగా ముందుగా సాగిపోతూ ఉంటుందని ఒక లోకోక్తి. ఎవరికీ విచారణ లేకుండా గ్రుడ్డిగా వెళ్ళిపోతున్నారని భావం.

గత్యంతర : ప్రస్తుతం మనకున్న మార్గంతప్ప మరొక మార్గమేదైనా ఉంటే అది గత్యంతరం. Another way.

గంతా/గంతవ్య/గమ్య : ఒక గమ్యంవైపు ప్రయాణం చేసేవాడు లేదా సాధకుడు గంత. అతడు ప్రయాణించి అందుకొనే స్థానం గమ్యం లేదా గంతవ్యం. Destination.ఆధ్యాత్మ మార్గంలో సాధకుడని సాధనమని వాడికి లభించే సిద్ధి అని అర్థం చేసుకోవలసి ఉంటుంది.

గమ/గమనం : ఆ ముందు జేరిస్తే ఆగమం. రావటం. గురుశిష్య పరంపరగా అందుకొనే అనుభవమని అర్థం. అవ ముందు చేరిస్తే అవగమ. అనుభవమని అర్థం. అను ముందు చేరిస్తే అనుగమ. ప్రతి ఒక్క విశేషంలో దాని సామాన్యం చొచ్చుకొని పోవటమని అర్థం.

గమక : ఒక గమ్యాన్ని ఫలానా అని మనకు సూచించేది. దాన్ని చేర్చేది సంకేతమని సూచకమని సాధనమని పేర్కొనవచ్చు. Means.

గంధ : వాసన. స్పర్శ. లేశం. అనాత్మ గంధం కూడా లేని ఆత్మ స్వరూపం. దానికి అగంధవత్‌ అని పేరు పెట్టింది ఉపనిషత్తు. 'సుగంధిం పుష్టివర్ధనమ్‌.' ఆత్మ గంధం సర్వత్రా వ్యాపించిన నామరూపాలద్వారా పయనిస్తే మరలా ఆత్మనే చూపుతాయి. దాన్నే చేరుస్తాయి అని భావం.

గర్భ : ఉదరం. లోపలి భాగం. హిరణ్యగర్భ. హిరణ్యమంటే స్వయం ప్రకాశమైన ఆత్మచైతన్యం. అది తనలో గుప్తంగా ఉన్నవాడు హిరణ్యగర్భుడు. జీవుడు. సమష్టి జీవుడు. బ్రహ్మదేవుడు.

గర్వ : మనోబుద్ధి చిత్తాహంకారాలు. ఈ నాలుగింటికీ అంతఃకరణ చతుష్టయమని పేరు. ఇందులో సంకల్ప వికల్పాలు మనస్సుకు. నిశ్చయం బుద్ధికి. సంవేదనం చిత్తానికి. గర్వం అహంకారానికి లక్షణాలట. గర్వమంటే నేను అని తన స్థితిని తాను బలపరుచుకుంటూ చెప్పే వ్యవహారం selfdom.

గహన : విషమం. అర్థం కానిది. అంతుపట్టనిది. సంసారమని లాక్షణికార్థం.

గహ్వర : బాగా లోతైనది. Deep. Unfathomable. గంభీరమైనది. మానవ హృదయం. సంసారం.

గాఢ : మునిగిపోయినది అని అక్షరార్థం. బాగా లోతుకుదిగి తీవ్రంగా కృషిచేసి పట్టుకొన్నది కూడా. సంసారంతో గాఢమైన బంధం ఏర్పడిందంటే అలాగ స్థిరపడిన బంధమని అర్థం.

గాత్ర : శరీరం. Body.

గాణపత్య : గణపతిని దేవతగా ఆరాధించే మతం. షణ్మతాలలో ఇది ఒక మతం. భగవంతుడి షాడ్గుణ్యంలో బలమనే గుణాన్ని ప్రధానంగా తీసుకుని ఆవిర్భవించిన మతమిది. వీరు గణపతి ఉపాసకులు. గాణపత్యమని కూడా ఈ మతానికి మరొకపేరు.

గాథా : గానం చేయబడినది. శ్లోకమని అర్థం.

గాయత్రీ : 'గాయంతం త్రాయతే ఇతి.' గానం చేసే వాడిని కాపాడేది గాయత్రీ మంత్రం. ఇది ఒక ఛందస్సు. Metre. ఆ ఛందస్సులో బంధించిన మంత్రమిది. కనుక మంత్రానికి ఆ పేరు వచ్చింది. 24 అక్షరాల మంత్రమిది. విశ్వామిత్రుడు దీనికి ద్రష్ట. బ్రహ్మవిద్యకిది ఆలంబనం. పరమాత్మ దీనికి స్వరూపం. సాయుజ్యంలోనే దీనికి వినియోగం. సవిత నుపాసిస్తున్నట్టు పైకి కనిపించినా ఆ సవిత ఎవరో కాదు స్వప్రకాశ శీలుడైన పరమాత్మే.

గార్హపత్య : గృహపతి అంటే గృహస్థుడు. యజమానుడు. House holder. వాడికి సంబంధించినది గార్హపత్యం. గృహస్థాశ్రమమని అర్థం. నాలుగు ఆశ్రమాలలో ఇది రెండవది.

గార్హపత్యాగ్ని : ఇక్కడ గృహమంటే శరీరం. దీనిని పాతి కాపాడేది గృహపతి. శరీరంలో ఉన్న జఠరాగ్ని. అదే మన ఆరోగ్యాన్ని చక్కగా నిలబెడుతున్నది. ఆకలి లేకుంటే ఆహారం రుచించదు. ఆహారం లేకుంటే బ్రతుకులేదు. ఈ గృహపతికే గార్హపత్యమని పేరు. ఇది ఉష్ణగుణంతో కూడినది గనుక అగ్నిలాంటిది. appetite.

గార్హస్థ్య : గృహస్థాశ్రమం. గృహంలో అంటే శరీరంలో, స్థ అంటే ఉన్నవాడు జీవుడు. వీడి భావం గార్హస్థ్యం అని లాక్షణికమైన అర్థం.

గార్గీ : బృహదారణ్యకంలో వస్తుందీ పాత్ర. ఈవిడ గర్గ గోత్రంలో జన్మించినది గనుక ఈ పేరు వచ్చింది. ఒక గొప్ప బ్రహ్మవాదిని. యాజ్ఞవల్క్యునితో చాలాదూరం వాదించిన వ్యక్తి. ఆయన మహత్వాన్ని తాను అర్థం చేసుకొని పదిమందికీ చాటిన మహనీయురాలు.

గీతా : గానం చేయబడినది. భగవద్గీత అని కూడా అర్థమే. భగవంతుడైన కృష్ణపరమాత్మచే గానం చేయబడినది గనుక దానికా పేరు సార్థకమైనది.

గీతి : ఋగ్వేదం మంత్ర ప్రధానమైతే, యజుర్వేదం వచన రూపమైతే, సామం గీతి ప్రధానమైనది. గీతి అంటే గానం. సామగానమనే మాట ప్రసిద్ధమే గదా. అదే సంగీతానికంతటికీ మూలమంటారు.

గుణ : ద్రవ్యం తాలూకు ధర్మం. Quality. Property of a substance. పృథివికి గంధమనేది గుణం. సత్వ రజ స్తమస్సులనే ప్రకృతి గుణాలు కూడా కావచ్చు. నామరూప క్రియలు కూడా ఆ మాటకు వస్తే గుణాలే. వీటితో కలిసినదైతే ఆత్మ సగుణం. కలవనిదైతే నిర్గుణం. ఇందులో నిర్గుణం స్వరూపమైతే సగుణం విభూతి. గుణమంటే అప్రధానమైనదని కూడా Secondary ఒక అర్థముంది. ప్రధానమైతే ముఖ్యమని అప్రధానమైతే గుణమని పేర్కొంటారు శాస్త్రంలో.

గుప్త : దాచబడినది. గోప్యమైనది. రహస్యం secret. ఆత్మస్వరూపం ఇలాంటిదే. దాన్ని ప్రకటన చేసుకోవలసిన బాధ్యత ప్రతి మానవుడికీ ఉంది. అప్పుడే జీవిత సమస్యకు పరిష్కారం చేసుకోగలడు.

గురు : బరువైనది. పెద్దది. ఆచార్యుడని కూడా అర్థం. వేదం వేదాంతం రెండూ శిష్యులకు బోధించేవాడెవడో వాడు. Teacher. Preceptor.

గురూపదేశ : యోగ్యుడైన గురువు యోగ్యుడైన శిష్యుడికి చేసే బోధ. ముఖ్యంగా అన్నిటికన్నా రహస్యమైన బ్రహ్మతత్వాన్ని శిష్యుడి అనుభవానికి తెచ్చే ప్రబోధం. దీనికే సంప్రదాయమని, ఆగమమని పేరు Intuition.

గురుపరంపర : ఒక గురువు నుండి శిష్యుడు అతని నుండి ప్రశిష్యుడు ఇలాగ బ్రహ్మోపదేశం అందుకుంటూ వచ్చే మార్గానికి పరంపర అని పేరు. గురు వంశమని కూడా పేర్కొంటారు దీనిని Tradition. గురుశిష్య సంప్రదాయమని భావం.

గరిమా : గురుత్వం. గురుభావం. అణిమాది అష్టసిద్ధులలో ఒకటి. ఉన్నట్టుండి బరువెక్కిపోవటం.