#
Back

Page 28

వేదాంత పరిభాషా వివరణము


కకుదం : చిహ్నం. సంకేతం. Sign. Token. గుర్తు.

కంచుక : చొక్కా. అంగీ. Shirt. రవికె. కప్పు. ఆచ్ఛాదనం. పాముకుబుసం. ధాన్యపు పొట్టు. జీవుని అవిద్యా కామాదులైన పాశాలు, బంధాలు అని కూడా అర్థమే.

కఠ : కృష్ణయజుర్వేదంలో ఒక శాఖ. కఠోపనిషత్తు ఈ శాఖకు చెందినదే. కఠవల్లి అని కూడా పేరు దానికి. యముడికి, నచికేతుడికీ జరిగిన సంవాదం. మృత్యు విషయమంతా దీనిలో చక్కగా చర్చించబడింది.

కంఠోక్త : ఎవరో చెబితే విని చెప్పినది గాక తనపాటికి తాను తన నోటితో పలికిన మాట. స్వయంగా బుద్ధిపూర్వకంగా చెప్పినది బహిర్గతం చేసినది కనుక దీనికి ప్రామాణ్యం వేరుగా వెతకనక్కరలేదు అని భావం.

కణ : కణము, అణువు Atom. అల్పం, లేశం అని కూడా అర్థమే. Smallest Particle.

కణాద : షడ్దర్శన కారులలో ఒకడు. అతడు ప్రతిపాదించిన సిద్ధాంతం వైశేషికం. పంచభూతాల తాలూకు మొట్టమొదటి రూపం విశేషం. అంటే వాటివాటికి ప్రత్యేకించి ఉన్న గుణం. ఆ విశేషాలే ద్వ్యణుకాది క్రమంలో స్థూలంగా మారి పృథివ్యాది భూతాలేర్పడ్డాయంటారు. విశేషాలకే పరమాణువులని పేరు. కనుకనే ఈ దర్శనానికి వైశేషికమని, పరమాణు సిద్ధాంతమని, అణువాదమని పేరు వచ్చింది. ఇది స్థాపించిన వాడు కణాదుడు. కణములంటే అణువులు. అద అంటే భక్షించేవాడు. కణాలే సృష్టికి మూలకారణమని, దానినే నెమరు వేసుకునే వాడని పరిహాసం చేస్తూ ఇతరులు ఆయనకు పెట్టిన మారు పేరిది. ఇతని వైశేషికానికి జతగా ఏర్పడింది గౌతముని న్యాయ దర్శనం. రెండూ కలిపి తర్కశాస్త్రం. Indian logic అని పేర్కొంటారు భగవత్పాదుల లాంటి శాస్త్రజ్ఞులు.

కపిల : కపిల మహర్షి. భాగవతంలో వచ్చే కపిలుడు కాడు. ఆయన విష్ణ్వంశ సంభూతుడు. సగర పుత్రులను దహించిన వాడు. దేవభూతికి యోగ ముపదేశించిన కర్దముని పుత్రుడు కూడా కాడు. మరెవడు? సాంఖ్యదర్శనకారుడు. మహాభూతాల దగ్గరినుంచి శబ్ద స్పర్శాదుల వరకు తత్త్వాలు ఇరవైనాలుగేనని లెక్కపెట్టి చెప్పాడు. ఇరవై ఐదవవాడు పురుషుడని కూడా పేర్కొంటాడీయన. ఇలా పంచ వింశతి తత్వాల సంఖ్య నిర్ణయించి చెప్పాడు కనుక సాంఖ్యమని అతని సిద్ధాంతానికి పేరు వచ్చింది. దీనికి నిరీశ్వర సాంఖ్యమని కూడా పేరు. కపిలుడు ఈశ్వరుణ్ణి అంగీకరించడు. ప్రధానం లేదా ప్రకృతివల్లనే Premordial matter ప్రపంచమంతా పరిణమించింది, అదే కర్త అని వాదిస్తాడు. కనుక దీనికి ప్రధాన కారణవాదమని, పరిణామవాదమని కూడా Theory of Evolution నామాంతరం. నిరీశ్వరుడైన కపిలుడు సత్కార్యవాది. కణాదుడిలాగా అసత్కార్య వాది కాడు. అంటే కార్యమేర్పడక పూర్వముందని చెబుతాడేగాని లేదని చెప్పడు. కారణంలో అవ్యక్తమై ఉంటుంది దాని కార్యం. అదే తరువాత పరిణమించి కార్యమవుతుందని ఇతని ప్రతిపాదన.

కర్తా/కరణ/కర్మ/క్రియా : కర్త అంటే ఒక పని చేసేవాడు. జీవుడు. కరణమంటే వాడా పని చేయటానికి తోడ్పడే సాధనం. Instrument. లేదా పనిముట్టు. కర్మ. దాని ద్వారా వాడు చేసే పని. అదే క్రియ అన్నా అర్థం. The agent. The implement. The work. దానివల్ల ఏర్పడే ఫలితాన్ని అనుభవించేవాడు మరలా ఈ కర్తే కనుక జీవుడికి కర్త భోక్త అని పేరు వచ్చింది. చేసేటపుడు కర్త. అనుభవించేటప్పుడు భోక్త. కరణానికే ఇంద్రియమని పేరు. అది బాహ్యమైతే చక్షురాదులు, వాగాదులు. అభ్యంతరమైతే ప్రాణం, మనస్సు, మనోవాక్కాయాలు మూడింటికీ త్రికరణాలని పేరు. వీటివల్ల సాగించే కర్మ మూడు విధాలు. ప్రారబ్ధం ఆగామి సంచితం. వర్తమానంలో అనుభవించేది ప్రారబ్ధం. భవిష్యత్తులో అనుభవించబోయేది ఆగామి. అనుభవానికింకా రాక భూతకాలానికి సంబంధించి పోగయిన కర్మ సంచితం. ఇంతేగాక కర్మ అనేది మరోవిధంగా చూస్తే రెండు వర్గాలుగా మనం దాన్ని విభజించవచ్చు. శాస్త్రం విధించిన కర్మ ఒకటి. లౌకికంగా మనం ప్రతిదినమూ మన ఇష్టానుసారంగా చేస్తూ పోయే కర్మ ఒకటి. ఇది లౌకిక కర్మ అయితే అది శాస్త్రీయ కర్మ. లౌకిక కర్మ ప్రియమే గానీ మనకు హితం కాకపోవచ్చు. అదే శాస్త్రీయంగా ఆచరిస్తే ప్రియమూ, హితమూ రెండూ అవుతుంది. శాస్త్రీయ కర్మలు విధులు కావచ్చు, నిషేధాలు కావచ్చు. ఇందులో నిషేధాలను నిర్మొహమాటంగా వదిలేయాలి. విధులలో నిత్యనైమిత్తికాలను విధిగా ఆచరించాలి. కామ్యాలను కోరికలుంటే ఆచరించటం లేకుంటే మానేసినా ప్రమాదం లేదు. నిత్యనైమిత్తికాలను మానేస్తే ప్రత్యవాయమనే దోషం వచ్చిపడుతుంది.

కృతి : పని అని అర్థం. కర్మ క్రియ కృతి అనే మూడు ఒకే అర్థాన్ని బోధిస్తాయి. ఇది సుకృతి కావచ్చు. దుష్కృతి కావచ్చు. రెండవ జాతిని విడిచి మొదటి జాతి కృతులనే ఆచరించాలి సాధకుడు.

కం : సుఖమని అర్థం. కంబ్రహ్మ ఖంబ్రహ్మ అని ఉపనిషత్తు బ్రహ్మతత్త్వాన్ని వర్ణించింది. కం అంటే సుఖం. ఖం అంటే ఆకాశం. కేవల సుఖం లౌకికం. కేవలం ఆకాశం జడం. రెండూ కలిపి పట్టుకుంటే ఆకాశంలాగా విస్తరించిన బ్రహ్మానందం.

కలా : ఒక శకలం. ఒక భాగం. ఒక ముక్క. ప్రాణం మొదలు నామంవరకూ పదహారు ఇవి. మొత్తం అనాత్మ. ప్రపంచమంతా ఈ పదహారే. షోడశ కళలని పేరు వీటికి. వీటితో కలిపి పట్టుకుంటే ఆత్మసకలం. వాటిని లయం చేసి పట్టుకుంటే నిష్కలం లేదా అకలం. Indivisible. కళాప్రళయ మార్గమేదో గురూపదేశంవల్ల గ్రహించాలని ప్రశ్నోపనిషత్తులో భాష్యకారుల ఉపదేశం.

కలిల/కల్క : కల్మషం, పాపం, కళంకం. Sigment, Impurity, Mark త్రిగుణాత్మకమైన సంసారమంతా కలిలమేనని శాస్త్రజ్ఞుల మాట.

కల్పనా : సహజంకానిది తయారుచేయటం. క్రొత్తగా సృష్టించటం. ఆభాస appearence. రజ్జువులో సర్పాన్ని చూడడం లాంటిది.

కళ్యాణ : శుభం. మంచి. 'పుణ్యం కళ్యాణకృత్‌' అంటే పుణ్యాత్ముడని అర్థం.

కళ్యాణచరణ : మంచి పని చేసినవాడు పుణ్యాత్ముడు.

కపూయచరణ : కపూయమంటే పాపం. పాపకర్మ చేసినవాడు పాపాత్ముడని అర్థం.

కవి : 'కవతే కవయతి పశ్యతి వర్ణయతీతి కవిః.' ఎవడు దర్శిస్తాడో, దర్శించిన సత్యాన్ని మరలా వర్ణించి చెప్పగలడో వాడు కవి. ద్రష్ట. seer స్రష్ట  creater. 'క్రాంత దర్శీ కవిః' అన్నారు. దేశకాల అవధులను దాటి చూడగలవాడు. వాడే ఋషి కూడ. మొట్టమొదటి కవి పరమాత్మ. 'కవిర్మనీషీ పరిభూః స్వయంభూః' అని శాస్త్రవచనం. మొదటి కవి ఈశ్వరుడైతే తరువాత కవి జీవన్ముక్తుడైన మానవుడు.

కలి/కలుష/కల్మష : పాపం, కళంకం, మచ్చ. మరొకదానితో కలిసి అంటుపడటం. నామరూపాలే శుద్ధమైన చైతన్యానికి కాలుష్యం. దానిని వదలుకొంటే అది నిష్కల్మషం.

కాకు : వక్రంగా మాటాడటం. అన్యాపదేశంగా చెప్పటం. లోపల ఉన్న భావాన్ని మరోవిధంగా బయటపెట్టటం.

కాఠక : కఠోపనిషత్తు అని అర్థం.

కాండ : కొమ్మ కాడ వేదశాఖ. విధికాండ ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని వేదంలో మూడు భాగాలు.

కామ : కోరిక. కోరబడ్డ పదార్థంకూడా. అవిద్యా కామకర్మలనే మూడు పాతకాలలో ఇది రెండవది. సూక్ష్మశరీర లక్షణమిది. జీవుడి స్వరూపమిదే అసలు. చతుర్విధ పురుషార్థాలలో రెండవది కూడా. అక్కడ కామమంటే స్త్రీ పురుష విషయం. మామూలుగా అయితే కేవలం కర్మఫలంమీద ఆసక్తి మాత్రమే ambition. నిష్కామకర్మ అంటే అలాటి ఆసక్తి లేని కర్మ.

కామ్యకర్మ : శాస్త్రం విధించిన కర్మలలో మొదటిది నిత్యం, రెండవది నైమిత్తికం, మూడవది కామ్యం. కామ్య అంటే ఒక కోరిక పెట్టుకొని చేసుకొనే కర్మ. ఇది చేసి తీరాలనే నిర్బంధం లేదు. చేస్తే చేయవచ్చు, కోరిక లేకుంటే మానేయవచ్చు. జ్ఞాని మాత్రం తప్పకుండా దీనిని మానివేయవలసి ఉంది.

కాయ : శరీరం. ఒకచోట పోగైనది constituted అని అర్థం. పంచీకృతమైనది ఈ శరీరం. సాధారణంగా స్థూలశరీరం. నికాయమని కూడా compilation కొన్ని మతాలవారు పేర్కొంటారు.

కారణ : ఒక కార్యమేర్పడటానికి ముందున్న పదార్థం cause. ఉపాదానమని, నిమిత్తమని, సహకారి అని మూడు విధాలు ఇది. మట్టిలాగా అచేతనమైన దుపాదానం material cause. కుమ్మరిలాగా చేతనమైనది నిమిత్తం. senceient. సారెలాగా తోడ్పడేది సహకారి. మూడూ కలిస్తేగాని కార్యమనేది ఏర్పడదు. ఇవి మూడూ ద్వైతులకు వేరువేరు. మూడూ కలిసి ఒక్కటే అద్వైతులకు. పరమాత్మే ప్రపంచమనే కార్యానికి ఉపాదానం. ఆయనే నిమిత్తం. ఆయనే సహకారి. జ్ఞానంద్వారా నిమిత్తం శక్తిద్వారా ఉపాదానం. సంకల్పంద్వారా సహకారి. అవిద్యా రూపమైన కారణ శరీరమని కూడా అర్థమే.

కార్య : కారణం ద్వారా ఏర్పడే ఫలం. effect. కారణం పూర్వమైతే కార్యం ఉత్తరం. లేదా అపరం. subsequent కార్యకారణ సంబంధమే సృష్టి అంతా. హేతుఫలాలని కూడా వర్ణిస్తారు వీటిని. వీటి సంబంధం అవినాభావి inseperable. కారణం లేని కార్యం లేదు. కార్యంలేని కారణం లేదు. రెండూ అన్యమని చూస్తే సంసారం. ఏకమని చూస్తే సాయుజ్యం. ఏకమంటే కారణాన్ని కార్యంగా కాదు. కార్యాన్ని కారణంగా. ఇదే అద్వైత భావం.