#
Back

Page 26

వేదాంత పరిభాషా వివరణము


ఋజు : సరిగా. చక్కగా. Straight. right. అలాంటి భావానికి ఋజుత్వం లేదా ఆర్జవం అని పేరు. righteousness.  నిజాయితీ. దైవగుణాలలో ఇలాంటి ఆర్జవం ఉండి తీరాలి.

ఋత : ఋ అనే ధాతువుకు దర్శించటం, చూడటమని అసలైన అర్థం. దాని భూతకాలిక కర్మార్థక విశేషణమే Past passive participle ఋతమనే శబ్దరూపం. ఋతమంటే అప్పటికి చూడబడినది Seen. Visualised అని అర్థం. అలా చూచినప్పుడే అది సత్యమని చెప్పవలసి ఉంది. కనుక ఋతమంటే సత్యమని అర్థం చెప్పారు. ఋతం కానిది అనృతం. అంటే అసత్యం Flase అని అర్థం. పోతే ఋ అంటే చేయటమని కూడా అర్థం. ఋతమంటే చేయబడినది. కర్మ. పని. కర్మఫలం కూడా. ఋతం పిబంతౌ సుకృతస్యలోకే అని శ్వేతాశ్వతరం. ఇందులో మొదట చెప్పిన అర్థమే ఎక్కువగా వాడుకలో ఉన్న అర్థం.

ఋషి : ఋ అంటే దర్శించటమని కదా చెప్పాం. అలా దర్శించగలవాడే ఋషి. ద్రష్ట. ఐలిలిజీ. దర్శించటమంటే కళ్లతోనని కాదు మనోనేత్రంతో. మనస్సనేది దైవమైన చక్షుస్సు అని పేర్కొన్నది ఉపనిషత్తు. సన్నిహితమైనవే కాక దూరమూ పరోక్షమూ విప్రకృష్టమూ అయిన సృష్టి రహస్యాలను కూడా ఆకళించుకోవటమే ఇక్కడ దర్శనం. Transandental vision. కనుకనే 'క్రాంత దర్శీ ఋషిః' దేశకాల వస్తువులనన్నింటినీ అతిక్రమించి చూడగలవాడే ఋషి అని ఋషి శబ్దానికి లక్షణం చెప్పారు శాస్త్రజ్ఞులు. అలాంటి మహర్షుల మాటలే శబ్ద ప్రమాణమైన వేదంగా అవతరించింది లోకంలో. నుక అది అన్నింటికన్నా ప్రబలమైన ప్రమాణం మనకని అద్వైతుల సిద్ధాంతం.

ఋద్ధి : అధికము. పరిపూర్ణము. పుష్కలమని Abundance అర్థం. దీనికి సమ్‌ అనే ఉపసర్గ Prefix ముందు చేరితే సమృద్ధి అని రూపమేర్పడుతుంది. దానికీ ఇదే అర్థం.

ఋణ : ఒక వ్యక్తికి మరొక వ్యక్తి బాకీ పడటం. Debt. అప్పు. శాస్త్రంలో ఇది మూడు విధాలు. పితౄణం. ఋషి ఋణం. దైవ ఋణం. దీనినే ఋణత్రయమని వర్ణిస్తారు. పుత్రులను కని మొదటిది, వేదాధ్యయనంతో రెండవది, యజ్ఞయాగాదులతో మూడవది తీర్చుకోవాలని అంటారు.

ఋతంభరా : ఋతమంటే తాను చూసిన సత్యం. మహర్షులు సమాధిలో దర్శించిన సత్యమని అర్థం. అప్పుడు వారి మనస్సంతా దానితోనే నిండి ఉంటుంది. ఋతాన్ని భరించిన ప్రజ్ఞ గనుక దానికి ఋతంభరా ప్రజ్ఞ అని పేరు.ఏక : సంఖ్యానంలో Enumeration ఇది మొదటి సంఖ్య. ఒకటి అని అర్థం. అద్వితీయమని కూడా. ఏకోనారాయణ. అంటే మరొకరు లేరని. రెండవది లేదని అర్థం.Only. Alone. ఒకదానితో ఒకటి కలిసి పోవటానికి కూడా ఏకమనే పేరు union. Merger.

ఏకతాన : ధారావాహికంగా ఒకే లక్ష్యంమీద ప్రసరించేది.

ఏకాత్మ : ఆత్మానాత్మలు రెండూ కలిసి ఒకే ఒక ఆత్మ స్వరూపమైతే అది ఏకాత్మ. The subjective unity. ఆ మాటకు వస్తే జీవేశ్వరులు ఇద్దరూ చైతన్యస్వరూపులే. కనుక అనేకం కాదు. రెండూ కలిసి ఏకాత్మే.

ఏకాత్మభావ : జీవజగదీశ్వరులు అనే త్రిపుటి సంపుటీకృతమై అంతా ఒకే ఒక చైతన్య స్వరూపంగా అనుభవానికి వస్తే అది ఏకాత్మభావం. నేను తప్ప మరేదీ నాకు భిన్నంగా లేదనే అనుభవం.

ఏకాంత : నిర్జన ప్రదేశం. వివిక్తమైన చోటు. అంతేగాక ఒకే ఒక రూపంతో ఎప్పుడూ ఒకేవిధంగా ఉండటం అని కూడా అర్థమే. Uniform. Consistent.

ఏకధా : ఒకే విధంగా. 'ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్‌.' పరమాత్మ స్వరూపతః ఒకటిగానే ఉన్నప్పటికీ విభూతితః బహుధా అంటే అనేక విధాలుగా జలంలో చంద్రబింబం ఎలా భాసిస్తుందో అలా భాసిస్తుంటాడని శాస్త్రం చెబుతున్నది.

ఏకదేశ : ఒక విషయంలో రెండు మూడు పక్షాలు వస్తే అందులో ఒక్కొక్క పక్షానికి ఏకదేశం A part. Aspect అని పేరు. యోగసిద్ధాంతాన్ని అద్వైతులు ఏకదేశంలో సమ్మతిస్తారు. ఏకదేశంలో సమ్మతించరు. అంటే కొన్ని విషయాలు కావలసినవీ. కొన్ని అక్కరలేనివనీ భావం. ఇలాంటి సందర్భంలోనే ఈ శబ్దాన్ని ప్రయోగిస్తారు.

ఏకైక : ఏక+ఏక. ఒకే ఒకటి. రెండవది లేదని అర్థం. బ్రహ్మతత్త్వం అలాంటిదే.

ఏకీయమతం : ఒక విషయం చర్చకు వస్తే అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెబుతూ పోతారు. ఎవరి అభిప్రాయం వారిది. కొంతమంది ఇలా చెబుతారు అనేటపుడు దానిని ఏకీయమతం అని వ్యవహరిస్తారు. ఏకే అని ప్రారంభిస్తారు.

ఏకస్థ : ఒకే ఒక చోట కనిపించటం. ప్రపంచమంతా విశ్వరూపంలో ఒకే ఒక విశ్వేశ్వరుడి మూర్తిలో గోచరించింది అర్జునుడికి. 'ఇహై కస్థం జగత్‌ కృత్స్నమ్‌' అని కృష్ణపరమాత్మే తనలో సమస్తమూ ఉంది చూడమని చెబుతాడు అర్జునుడికి.

ఏజన : కదలటం. చలించటం. స్థానం తప్పటం.

ఏజతి : కదులుతున్నది. 'తదేజతి తన్నైజతి' అని ఉపనిషత్తు. కదిలేదీ పరమాత్మే కదలకుండా నిలిచి ఉన్నదీ పరమాత్మే. రెండు విరుద్ధభావాలూ పరతత్వంలోనే సమన్వయమవుతాయి.

ఏవ : అవధారణార్థంలో వస్తుందీ మాట. అదే మరేదీ కాదు అని అర్థం. ఏకమేవ అద్వితీయం అన్నప్పుడు ఆత్మ ఒక్కటే మరేదీ లేదని అర్థం చేసుకోవలసిఉంది.

ఏవం : ఈ ప్రకారంగా In this way.

ఏకవాక్యతా : ఒకే వాక్యంగా ఉండటం. ముందు చెప్పిన మాట తరువాత చెప్పిన మాట తేడా లేకుండా ఒకదానికొకటి సరిపోవటం.Consistencey. శాస్త్రంలో ఇది చాలా ముఖ్యమైనది. అలా కాకుంటే ప్రామాణికమని అనిపించుకోదు శాస్త్రం Authority.

ఏకాగ్ర :: ఒకే అగ్రం మీద లేదా లక్ష్యంమీద మనస్సు పెట్టడం. చెదరని దృష్టి Concentration. ధ్యానంలో మనసు ఇలా ఏకాగ్రమై ఉండాలి. అప్పుడే ఫలసిద్ధి.

ఏకరూప : ఒకేరూపం. రూపం మారకుండా ఒకే విధంగా ఉండటం. మార్పు లేని లక్షణం. Persistent.

ఏషణా : ఈషణ అని కూడా దీనికి ఒక రూపాంతరం ఉంది. కోరటమని ఒక దానికోసం ఏకరటం లేదా ప్రాకులాడటమని అర్థం. Eager to possess. ఇది మూడు విధాలు. దారేషణ - కళత్రం కోసం ప్రాకులాట. పుత్రేషణ - బిడ్డ పాపలకోసం తాపత్రయం. విత్తైషణ - వారిద్దరినీ పోషించే ధన సంపాదన కోసం ప్రాకులాట. ఏషణాత్రాయ మంటే ఇదే. ఇదే సంసారమంతా.

ఏకసూత్రతా : ఒకే ఒక సూత్రాన్ని కొనా మొదలు పట్టుకొని దానిమీదనే విషయాన్ని నడుపుతూ పోవటం. ముందు వెనుకలకు తేడా రాకుండా ఒకే విధంగా విషయం సాగిపోతే దానికి ఏకసూత్రత అని పేరు. ఏక వాక్యత అనే మాట దీనికి పర్యాయమే. Consistency.