#




Back

Page 25

వేదాంత పరిభాషా వివరణము


ఉపలంభ/ఉపలబ్ధి : ఒక విషయాన్ని తెలుసుకోవటం. గుర్తించటం. అది మనకు పట్టుబడటం. ఒక విషయం మనకు లభించటం లేదా దొరకటం. Availability.. అలా కాకుంటే అనుపలబ్ది Non-availability. Absence.

ఉపశమ : ఉపశమించటం. తగ్గిపోవటం. విరమించటం. ఆగిపోవటం. ప్రపంచోపశమమని పరమాత్మను వర్ణించింది శాస్త్రం. ప్రపంచమనే భావం ఎక్కడ పూర్తిగా తొలగిపోతుందో అదట పరమాత్మ స్వరూపం. తాపత్రయం జీవుడికి తొలగిపోవటం కూడా ఉపశమమే.

ఉపసదన/ఉపసత్తి : దగ్గరకు వెళ్ళడం Approach. సమీపించటం. ముఖ్యంగా శిష్యుడు గురువుగారిని సమీపించి వారి దర్శనం చేసుకోవటం. దీనినే గురూపసదన మంటారు.

ఉపసర్జన : ప్రధానమైన అంశంకాక Main దానికి తోడ్పడే అప్రధానమైన అంశం. Subsidiary. Accessary.

ఉపస్కార : అసలు విషయానికి ఉపకరించేది. తోడ్పడేది. దానికి అలంకార ప్రాయమైనది.

ఉపస్థ : గోప్యేంద్రియం. స్త్రీ పురుషులకు ఇద్దరికీ సంబంధించినది. కర్మేంద్రియాలలో ఐదవది. దీని గుణం ఆనందమన్నారు శాస్త్రంలో.

ఉపస్థాన/ఉపస్థిత : దగ్గరకు వెళ్ళి ఉండటం. సామీప్యం. సన్నిధి Presence. అలాంటి సన్నిహితుడైనవాడు ఉపస్థితుడు Present. ఉపస్థానమంటే ఉపాసన. ఉపస్థితుడంటే ఉపాసకుడు అని కూడా అర్థమే.

ఉపహిత : ఒక ఉపాధిలో Medium చేరి ఆ మేరకే ఆగిపోయినది. పరిమితమైనది. మనస్సులో చేరి అక్కడికే పరిమితమైన జీవచైతన్యం. దీనికి ఉపహిత చైతన్యమని పేరు.

ఉపాధి : ఆవరించినది. కప్పివేసినది. నామరూపాలు చైతన్యాన్ని కప్పి తగ్గించి చూపుతున్నాయి. చైతన్యం వాటిద్వారా ప్రసరిస్తుంటుంది. ఈ ఆవరణమూ ద్వారమే ఉపాధి. శరీరాదులిలాంటివే. వస్తువు కాభాస ఉపాధి. అదే దాన్ని కప్పుతుంది. అదే దాన్ని విప్పిచూపుతుంది. కప్పితే ఆవరణం. విప్పితే ద్వారం.

ఉపాయ : కలవటం. కలిపేది. మార్గం. సాధనం. Helper. Means. దీనికి భిన్నమైనది అపాయం. విడిపోవడమని అర్థం.

ఉపేయ : ఉపాయం సాధనమైతే ఉపేయం గమ్యం. End. చేర్చేది ఉపాయమైతే చేరేది ఉపేయం. జ్ఞానముపాయం. జ్ఞేయమైన బ్రహ్మతత్త్త్వం ఉపేయం సాధకుడికి.

ఉపాంగ : అంగమంటే ప్రధానమైన అంగికి తోడ్పడేది. దానికి మరలా తోడ్పడేది ఉపాంగం.

ఉచ్ఛూన : పైకి ఉబ్బినది. ఈ ప్రపంచమంతా శివతత్త్వం నుంచి ఇలా పైకి ఉబ్బి కనిపిస్తున్న పదార్థమే. దీనిని మరలా శివస్వరూపంగా భావించాలి మనం. అప్పుడిది చదునై శివాత్మకంగా మారుతుంది. అదే శివసాయుజ్య మంటారు శివాద్వైతులు.

ఉన్మజ్జన : శివతత్త్వం దేహంలో ప్రవేశించి ఇక్కడ నిమజ్జన merge మయి కూచుంది. మరలా దీన్ని శివభావనతో చూస్తే సంసార సాగరంలో నుంచి మరల ఉన్మజ్జన emerge మయి శివాత్మకంగా మారగలడీ జీవుడని తాంత్రికుల సిద్ధాంతం.

ఉపాంశు : బిగ్గరగా కాకుండా పక్కవాడికి మాత్రమే తెలిసేలాగా ఉచ్చరించటం. రహస్యంగా ఒకరికొకరు మాటాడుకోవటం. Between two only. The preceptor and the disciple. నాలుగు విధాలైన యజ్ఞాలలో జపయజ్ఞం తరువాతిది ఉపాంశు యజ్ఞం. మంత్రోపదేశాలన్నీ ఇలాంటి విధానంలోనే జరుగుతుంటాయి.

ఉపాదాన : దగ్గరకు తీసుకోవటం. దీనికి వ్యతిరేకి అపాదానం. మూడు విధాలైన కారణాలలో ఇది ఒక కారణం.Cause. ప్రకృతి అని కూడా పేర్కొంటారు దీన్ని అద్వైతులు Material cause. ఒక కార్యం ఏ మూలపదార్థం నుంచి ఏర్పడుతుందో అది. కుండ అనే కార్యం మట్టిలోనుంచి వస్తున్నది. మట్టి కుండకు ఉపాదానం. అద్వైతుల దృష్టిలో కార్యం దాని ఉపాదానం కంటే వేరుకాదు. మట్టే కుండగా రూపుదిద్దుకొని కనిపిస్తున్నది. నుక ఉపాదానమూ దాని ఉపాదేయమూ రెండూ అభిన్నమే.

ఉపాసన : ఉప దగ్గరగా, ఆసన కూచోటం. ఏ దేవతను మనసా స్మరిస్తామో దాని మూర్తికి మనసు దగ్గర పడితే దాని కుపాసన అని పేరు. Meditation or worship. ఇది సగుణం, నిర్గుణమని రెండు విధాలు. మొదటిది ధ్యానమార్గమైతే రెండవది జ్ఞానమార్గం.

ఉపేక్షా : అపేక్షకు వ్యతిరేకి. అక్కరలేదని ఉదాసీనంగా చూడటం. తీసుకుంటే ఉపాదానం. వదిలేస్తే హానం. రెండూ కాని మధ్య స్థితి ఉపేక్ష. హానోపాదానాదులు Selection and Rejection రెండూ లేని ఉదాసీనత. ఇదే అద్వైత సాధనలో చేయవలసిన గొప్ప కృషి.

ఉపోద్బలక : ఒకదాన్ని సహేతుకంగా నిలబెట్టడానికి ఇంకా అవీ ఇవీ చెప్పి బాగా బలపరచటం. To strengthen. దోహదం చేయటం. To support.

ఉర్వారుక మివ : దోసకాయ పండిపోతే దాని తొడిమ దానిపాటికదే ఊడిపోతుంది. ఉర్వారుకమంటే దోసపండని అర్థం. దోసపండు తొడిమలాగే జీవన్ముక్తుడి శరీరం కూడా వాడి స్వరూపం నుంచి పక్కకు తొలగిపోతుంది. ప్రారబ్ధం కొద్దీ అంటి పట్టుకున్నా వాడి దృష్టిలో దేహాత్మాభిమానం లేదు గనుక తొలగిపోయినట్టే భావిస్తాడు.

ఉల్లేఖన/ఉల్లింగన : ఫలానా అని గుర్తించటం, ఉదాహరించటం, ఎత్తిచూపటం, వాగ్రూపంగానే కాక మనసా భావించటం. అనుభవానికి తెచ్చుకోవటం. చేసిన సిద్ధాంతాన్ని తన కన్వయించుకోవటం. తాంత్రికుల భాషలో దీనికి ఉల్లేఖనమనే గాక ఉదాహరణమని కూడా పేరున్నది.



ఊహ : ఊహించటం.Imagination. Inference. తర్కంలో ఒక నిమిత్తాన్ని బట్టి నైమిత్తికాన్ని అర్థం చేసుకోవటం. Determining the fact with the help of some token or symbol.

ఊర్జస్‌ : బలం. వీర్యం. Strength. ఆహారమూ దానివల్ల కలిగే సామర్థ్యమూ రెండింటికీ వర్తిస్తుంది ఇది.

ఊర్ణనాభి : తంతుకీటమని, సాలెపురుగని అర్థం. అది తన నోటిలోని లాలాజలాన్నే ఒక దారంగా పేని దాని ఆధారంతోనే క్రిందికి దిగి వస్తుంది. మరలా దాన్ని లోపలికి తీసుకుంటూ పైకి వెళ్లి పోతుంది. అలాగే పరమాత్మ తనలోని నామరూపాల బలంతోనే ప్రపంచాన్ని సృష్టిస్తూ క్రిందికి దిగివచ్చాడు. మరల దీన్ని తనలోకే చేర్చుకుంటూ అద్వితీయంగా నిలిచి పోతాడని అద్వైతులు వర్ణించే ఉపమానమిది.

ఊర్ధ్వమూల : ఊర్ధ్వమూల మధశ్శాఖమని గీతా శ్లోకం. సంసారమనే అశ్వత్థ వృక్షానికి మూలం ఊర్థ్వదిశగా ఉందట. అది ఏదోగాదు మాయాశక్తితో కూడిన పరమాత్మ చైతన్యమేనని భాష్యం చెప్పారు భగవత్పాదులు. కనుక అసంగ శస్త్రంతో దీనిని ఛేదించి సాధకుడు ఊర్ధ్వముఖంగా ప్రయాణంచేసి ఆ తత్వాన్నే చేరవలసి ఉంటుంది అని దీని ఆంతర్యం.

ఊర్ధ్వోచ్ఛ్వాస : ఎగశ్వాస అని అర్థం. ఉదానవాయువు ఆగకుండా అవసాన కాలంలో పైపైకి వెళుతూ చివరకు శరీరాన్ని వదిలేసి పోతుంది. దీనికే వాడుకలో ఎగశ్వాస అని పేరు.

ఊర్ధ్వగతి : అథోగతికి వ్యతిరిక్తం. సత్కర్మలు, ఉపాసనలు ఆచరించినవారు పితృయానం, దేవయానం చేసి పరలోకాలకు వెళ్ళే మార్గం.

ఊర్ధ్వలోక : కర్మిష్ఠులు, ఉపాసకులు అంతకంతకూ ఉత్తమ లోకాలు చేరి అక్కడ ఉత్తమ భోగాలు అనుభవిస్తారు. అలాంటి లోకాలకు ఊర్ధ్వలోకాలు అని పేరు. స్వర్గాదులు.

ఊర్మి : అల. తరంగం. షడూర్ములని వేదాంతుల పరిభాష ఒకటి ఉంది. తరంగాలలాగా వస్తూ పోతూ ఉండేవి అని అర్థం. అవి ఆరు. అందులో జరామరణాలు రెండు స్థూలదేహానికి చెందినవి. క్షుత్పిపాసలు రెండూ సూక్ష్మదేహానికి పోతే మోహశోకాలు రెండూ కారణ దేహానికి సంబంధించిన దోషాలు. ఇవే షడూర్ములు. వీటిని నిశ్చలమైన సాగరంలాంటి మన చైతన్య సాగరంలో అదిమి వేయగలిగితే అంతా ఆత్మాకారంగా అనుభవానికి రాగలదు.