#
Back

Page 23

వేదాంత పరిభాషా వివరణము


ఉక్తి/ఉక్త : ఉక్తి అంటే చెప్పటం. మాటాడటం. ఉక్తమంటే చెప్పబడిన విషయం. అది మంచి మాట అయితే సూక్తి. లేదా సూక్తం. Wellsaid statement. Great utterance.కాకపోతే దురుక్తం Ill పనికిరాని మాట. 'ఉక్తానుక్త దురుక్త చింతనం వార్తికం' అని వార్తికానికి నిర్వచనం చేశారు పెద్దలు. అక్కడ దురుక్త మంటే చెడ్డమాట అని కాదు అర్థం. కొరతపెట్టి చెప్పినమాట అని.

ఉక్థ : వైదికమైన ప్రయోగం. ఉక్తమనే భావం.

ఉచిత : యుక్తమైనది. తగినది. Proper. Befitting. శాస్త్రోచితమంటే శాస్త్రానికి అనుగుణమైనదని భావం.

ఉచ్చయ : పోగుకావటం. పోగు. సమూహం. రాశి Heap. అధికమవటం అని కూడా అర్థమే. సముచ్చయమనే మాటలో తెలుస్తుంది ఈ విషయం. జ్ఞాన కర్మ సముచ్చయ. జ్ఞానమూ కర్మ రెడూ కలిపి పట్టుకోవటమని భావం. అభ్యుచ్చయమని కూడా ఒక మాట ఉంది. బాగా కలుపుకుంటూ రావటం Gather అని భావం.

ఉచ్చావచ : ఉచ్చమంటే మేలు. అవచమంటే కీడు. హెచ్చు తగ్గులని శబ్దార్థం. అన్ని భావాల కలగాపులగమని గౌణార్థం. Secondary sense.

ఉచ్ఛిత్తి/ఉచ్ఛేద : తెగిపోవటం. విచ్ఛిన్నం కావటం. వినాశం. Break. Destruction. ఉదాహరణకు నిద్రలో ఆత్మజ్ఞానం అనుభవానికి రాకపోతే అది అక్కడికి ఉచ్ఛిన్నమైందని భావించడం సహజం. కాని వాస్తవంలో అది అక్కడ ఉంది. వస్తుసిద్ధమైనా బుద్ధి సిద్ధం కాలేదు గనుక దానికి ఉచ్ఛేదమని భ్రాంతి చెందుతున్నాము.

ఉచ్ఛ్వాస : లోపలికి పీల్చే గాలి. దీనికే అపానమని నామాంతరం. దీనికి భిన్నంగా బయటికి వదిలేగాలి నిశ్వాసం. ప్రాణమని దానికి మరొకపేరు.

ఉత్కర్ష : పైకి లాగటం. ఆధిక్యం. ఎక్కువ. ప్రాధాన్యం అని అనేకార్థాలు ఉన్నాయి. దీనికి వ్యతిరేక పదం నికర్ష లేదా అపకర్ష.

ఉత్క్రమ : పైకి పోవటం. దాటిపోవటం. ప్రాణోత్క్రమమంటే ప్రాణ వాయువు శరీరాన్ని విడిచి నిష్క్రమణ చెందటం. అది కపాలరంధ్రం ద్వారా జరిగితే ఉత్తమ లోకాలు లభిస్తాయని, మిగతా శరీర రంధ్రాల ద్వారా అయితే అధో లోకాలు ప్రాప్తిస్తాయని శాస్త్రవచనం.

ఉత్సర్గ : వదిలేయటం. సృష్టిచేయటం.Creation. సామాన్య సూత్రమని General rule కూడా ఒక అర్థముంది.

ఉత్తర : దాటిపోవటం. To pass by. To Transcand. ఉత్తరణమని కూడా దీనికే మరొకపేరు. రెండు పదార్థాలలో మేలైన దానికి కూడా ఉత్తరమని పేరు Better between the two.

ఉత్తీర్ణ : దాటిపోయినవాడని ముఖ్యార్థం. లక్షణార్థంలో సంసార సాగరాన్ని దాటిపోయిన సిద్ధపురుషుడని భావం. తీర్ణుడని కూడా పేర్కొనవచ్చు. 'స్వయం తీర్ణః పరాన్‌ తారయతి' అని ఒక న్యాయముంది. తాను తరించి మరొకరిని తరింపచేయాలట. అలాంటి సిద్ధపురుషుడికి తీర్థంకరుడని కూడా పేరు పెట్టారు.

ఉత్తమ : అన్నింటిని దాటిపోయినది. శ్రేష్ఠమైనది. Supreme. మంద మధ్యమ అధికారుల కంటే పైస్థాయి నందుకొన్న సాధకుడు. Aspirant.

ఉత్థాన : పైకి లేవటం. బయట పడటం.

ఉత్థిత : అలా పైకి లేచినవాడు The person who has risen above సంసారంలో పడకుండా బయట పడ్డవాడని భావం.

ఉత్పత్తి : పుట్టుక, జన్మ, సృష్టి, ఉత్పత్తి వినాశాలంటే జనన మరణాలు. చతుర్విధ క్రియలలో మొదటి దశ.

ఉత్ప్రేక్ష : ఊహ. భావన.Imagination. Inference. పరమాత్మ తత్త్వాన్ని సాధనచేసి స్వయంగా దర్శించాలేగాని చేయకుండా కేవలం ఇలాగలాగని ఊహించేది కాదు. ఉత్ప్రేక్షకు అవకాశం లేదక్కడ. తుదకు ప్రపంచ వ్యవహారమే మనమూహించి తెలుసుకునేది కాదు. కనుకనే అనిర్వచనీయ మన్నారు దీన్ని. ఉన్నదున్నట్టు గ్రహించాలంటే ఉత్ప్రేక్షకాదు. ఉపదేశం కావాలి మానవుడికి.

ఉత్సూత్ర : ఒక సూత్రాన్ని అనుసరించక దాని పరిధిని మించి అర్థం చెప్పటం. సూత్రకారుని హృదయాన్ని బట్టి భాష్యకారుడప్పుడప్పుడు సూత్రంలోని శబ్దాలను వదిలేసి శాస్త్రానుసారంగా దాని అర్థాన్ని వివరించి మనకు చెబుతుంటారు. దీనికి ఉత్సూత్ర భాష్యమని పేరు.

ఉదయ : ఉదయించటం. పైకి రావటం. To rise. కలగటం. జన్మించటమని కూడా అర్థం చెప్పవచ్చు.

ఉదర : కడుపు. కుక్షి అని ముఖ్యార్థం. లోపలి భాగమని లాక్షణికార్థం. ఇవి రెండూగాక ఉత్‌+అర = ఉదర. అరమంటే కొంచెం. ఉత్‌ అంటే ఏ కొంచెమో అని అర్థం చెప్పారు ఉపనిషత్తులో. బృహదారణ్యకంలో 'ఉదరమంతరం కురుతే' అని ఒక మాట ఉంది. బ్రహ్మస్వరూపంలో ఉదరం అంటే ఏ కొంచెమైనా అంతరం తేడా చూస్తే అది మనకు భయోత్పాదకమేనట.

ఉదాన : పంచవాయువులలో నాలుగవది. శరీరంలోనుంచి జీవుణ్ణి అవసానంలో పైకి తీసుకుపోయేది. అంతేగాక బ్రతికివున్న కాలంలో ఎక్కిళ్ళు మొదలైనవి సృష్టించేది.

ఉదాసీన : ఊరక ఉండిపోవటం. పైన కూచుని చూస్తూ ఉండటం. Supervision అధ్యక్ష అనే మాటకిది పర్యాయపదం. 'ఉదాసీనవ దాసీనః' అని పరమాత్మను వర్ణిస్తుంది గీత. ఉదాసీనుడిలాగ కూచునేవాడే పరమాత్మ అట. అంటే ఏ పనీచేయక ఏ ఫలమూ అనుభవించక సాక్షిగా ఉన్నవాడని భావం. మానవుడు కూడా తన కర్తృత్వ భోక్తృత్వాలను వదలుకొని ఈశ్వరుడిలాగా ఉదాసీనుడై ఉంటేనే మోక్షం ప్రాప్తిస్తుందని ఇందులో దాగి ఉన్న భావం.

ఉదాహరణ : ప్రస్తుత విషయం బాగా బోధపడకపోతే దానిని చక్కగా వివరించటానికి తీసుకువచ్చే మరొక విషయం. ఉత్‌ ఆ హరణ మరొక చోటునుంచి తేవటమని అక్షరార్థం. దృష్టాంతం Illustration. తార్కాణమని భావం. Example పేర్కొనటమని కూడా ఒక అర్థముంది. Mention. జగదీశ్వరులకున్న సంబంధం రజ్జు సర్పాలకున్న సంబంధం లాంటిదే. ఇలాంటి ఉదాహరణల ద్వారా ఈశ్వరుని సత్యత్వం, ప్రపంచ మిథ్యాత్వం మనకు చక్కగా తెలిసిపోతుంది.

ఉద్గీథ : గొంతు పైకెత్తి గానం చేయటం. ఉద్గీతే ఉద్గీథ. వైదికమైన ప్రయోగమిది. ఉద్గానం చేయబడినది ఉద్గీతం. ఓంకారానికి ఉద్గీథమని పేరు. దీనికి సంబంధించిన విద్య ఉద్గీథ విద్య. ప్రణవోపాసన అని నామాంతరం.

ఉద్దేశ : నిర్దేశించడం. పేర్కొనడం Mention. ఉద్దేశమూ, లక్షణమూ, పరీక్షా అని న్యాయశాస్త్రంలో న్యాయానికి నిర్వచనం చెప్పారు. ఒక విషయాన్ని ముందు ఉదాహరించి తరువాత దానికి నిర్వచనం చేసి ఆ తర్వాత ఆ నిర్వచనం చెల్లుతుందో లేదోనని నిరూపించవలసి ఉంటుందట. అప్పుడే శాస్త్రానికి పరిపూర్ణత అని నైయాయికుల మాట. ఉద్దేశమంటే అభిప్రాయం Aim అని కూడా అర్థమే.

ఉద్దేశ్య : ఏది ఉద్దేశిస్తామో అది. The intended. వాక్యంలో ఉద్దేశ్యమని, విధేయమని రెండు భాగాలుంటాయి. బంగారం పచ్చగా ఉంటుందనే వాక్యంలో బంగారమనేది ఉద్దేశ్యం. అంటే దానిని గూర్చి ఏదో మనం చెప్పదలచాము. ఏమిటా చెప్పదలచినది. పచ్చగా ఉండటం. దీనికి విధేయమని పేరు. అంటే ఆ గుణం దానికి విధించి చెబుతున్నాము. వీటినే ఆంగ్లభాషలో Subject అని Predicate అనీ పేర్కొంటారు. మహావాక్యాలకు అర్థం చెప్పటంలో ఈ విభాగం ఎంతో మనకు తోడ్పడుతుంది.

ఉద్ధార : ఒక చోటినుంచి తీసి ప్రక్కన పెట్టడం. పైకెత్తడం. ఆఖరుకు పలకకుండా మౌనం వహించటం కూడా అని అర్థం చెప్పవచ్చు. 'ఉద్ధారః కృతః' అంటే ఒక పుస్తకంలో నుంచి తెచ్చి ఉదాహరించబడినది అని గాని కేవలం మౌనం వహించ బడిందని గాని అర్థం చెప్పవచ్చు.

ఉద్భావన : పైకి తేవటం. ఊహించటం To think aloud. To bring out.

ఉద్భిజ్జ : నేల చీల్చుకుని పైకి వచ్చినది. లతా వృక్ష గుల్మాదులు. నాలుగు భూతరాసులలో ఇది ఒకరాశి. మొదటిది జరాయుజం. రెండవది అండజం. మూడవది స్వేదజం. నాలుగవది ఉద్భిజం.

ఉద్భవ/ఉద్భూత : పైకి వచ్చి కనపడేది Formed manifest. జన్మించినది Born. ప్రకటమైనది.

ఉద్యోగ/ఉద్యమ : ప్రయత్నం Effort. పైకి రావటం. To come up. మోక్షమార్గంలో ఉద్యోగమనేది చాలా ప్రధానమైన విషయం. అది లేకుంటే కృషి చేయలేడు. గమ్యం చేరలేడు మానవుడు.

ఉన్నయ/ఉన్నీత : పైకి తెచ్చుకోవటం. ఊహించటం. భావించటం. అలా ఊహించబడ్డ విషయానికి Inferred ఉన్నీతమని పేరు. ముందు శరీరంలో ఒక చైతన్యకళ ఉందని గుర్తించి సాధకుడైనవాడు ఆ తత్త్వాన్నే ప్రపంచమంతటా వ్యాపింప జేసుకుని చూడాలట. ప్రతిచోటా దాగివున్న సత్యాన్ని ఉన్నయం చేయాలి. అంటే పైకి తెచ్చుకొని దర్శించాలి అని భావం.