#
Back

Page 22

వేదాంత పరిభాషా వివరణము


ఇంగిత : ఇంగనమంటే చలించటం. పైకి లేవటం. పొంగటం. మనసులో కలిగే పొంగుకే ఇంగితమని పేరు. ఇంగిత జ్ఞానం ఏ మాత్రమూ లేదని లోకంలో వాడుక. అంటే ఎదుటివాడి మనస్సులో ఏ భావ మేర్పడుతున్నదో తెలియకపోవటమని భావం. జ్యోతిరింగణమంటే మిణుగురు పురుగు. ఒక జ్యోతితో ఎప్పుడూ కదులుతూ పోతుంది. అందుకే ఆ పేరు దానికి వచ్చింది. మనసులో దాగి ఉన్న అభిప్రాయమే ఇంతకూ ఇంగితమనే మాటకర్థం. The intent.

ఇజ్యా : యజించటం. యజ్ఞం చేయటం. Sacrifice. యజ్ఞయాగాదులన్నింటికీ ఇజ్య అని పేరు.

ఇతి : ఇలాగ. ఇంతే. అని ఈ మూడూ దీనికర్థాలే. ఇత్యేవం అంటే ఇది ఇలాగ అని అర్థం. ఇతీవ అంటే ఇలా ఉన్నట్టు కనిపిస్తున్నదని భావం. ఇతి అనేది శాస్త్రంలో ఒక విషయం సమాప్తం కావటాన్ని తెలుపుతుంది. అథ ఆరంభాన్ని సూచిస్తూ ఇతి దాని ముగింపును సూచిస్తుంది.

ఇతిహాస : ఇతి ఈ విధంగా హ పూర్వం ఆస ఉండెను. ఇలా జరిగింది పూర్వమని అక్షరార్థం. కథలూ ఆఖ్యానాలూ ఇతివృత్తాలూ అన్నీ దీనికి పర్యాయాలే. Historical Event. Story. Tradition.

ఇత్థమ్‌ : ఇలాగా. ఈ ప్రకారంగా

ఇదమిత్థం : ఇది ఇలాగ. ఇది ఫలానా అని గ్రహించే సందర్భంలో వచ్చే మాట.

ఇదం : ఇది అని వాచ్యార్థం. ఎదుట కనిపించేదంతా ఇది అనే అంటాము. కాబట్టి ఇదమంటే ఈ ప్రపంచమంతా అని అర్థం వచ్చింది. అంతేకాదు. మనసులో కలిగే ఆలోచనలూ మన జ్ఞానానికి విషయమే. కనుక జ్ఞానానికి విషయమైన జ్ఞేయ ప్రపంచమంతా The objective world. అహం The self కానిదేదో అది ఇదం.Non-self. Known as opposed to the knower.

ఇదంతా : ఇదం తాలూకు భావం This ness. దీనికి వ్యతిరేకిపదం అహంతా. The I ness

ఇంద్ర : ఇదంద్ర అంటే దీనిని. ద్ర అంటే చూచేవాడు. ఈ ప్రపంచాన్ని తనకు విషయంగా చూచేవాడెవడో వాడు ఇదంద్రుడు. ఇదంద్రుడే ఇంద్రుడు. ఉపనిషత్తు ఇంద్ర శబ్దానికి చాలా చమత్కారంగా చెప్పిన వ్యుత్పత్త్యర్థం. ఇంతకూ ఇంద్రుడంటే దేవేంద్రుడు కాడు. జీవుడు. జీవుడే గదా చూస్తున్నాడీ జగత్తును ఇదమిదమని. కనుక జీవుడికి అద్వైతులు చేసిన నామకరణమిది. ఇంద్ర అంటే పరమాత్మ అని కూడా ఒక అర్థముంది. వాస్తవంలో పరమాత్మే కదా జీవరూపంగా శరీరంలో భాసిస్తున్నాడు. అతడు కూడా ఈ ప్రపంచాన్ని అజ్ఞానంతో కాకపోయినా జ్ఞానంతో తన స్వరూపంగానే చూస్తుంటాడు. కనుక ఇంద్రుడనే మాట పరమాత్మకు కూడా వర్తిస్తుంది. ఇంద్రో మాయాభిః పురురూప ఈయతే అని ఉపనిషద్వచనం. తన మాయాశక్తితో అనేక రూపాలు ధరించి ఈశ్వరుడే నటిస్తున్నాడట.

ఇంద్రియ : ఇంద్రుడైన జీవుడికి సంబంధించినదేదో అది ఇంద్రియం. అంటే జీవుడీ ప్రపంచాన్ని గ్రహించటంలో తోడ్పడే పరికరం లేదా సాధనం. జ్ఞాన సాధనం. దీనికే ప్రమాణమని Instrument of knowledge  నామాంతరం. ఇది రెండు జాతులు. ఒకటి ప్రత్యక్షం. మరొకటి అనుమానం. ప్రత్యక్షం చక్షురాది ఇంద్రియాలు. అనుమానం మనస్సనే అంతరింద్రియం. మొదటిది Perceptual. రెండవది ceptual. ప్రత్యక్షంలో మరలా జ్ఞానేంద్రియా లున్నాయి. కర్మేంద్రియాలున్నాయి. చక్షురాదులు జ్ఞానేంద్రియాలు. వాగాదులు కర్మేంద్రియాలు.

ఇంద్రయాతీత : ప్రపంచమంతా ఇంద్రియ గోచరమైతే దీనిని దర్శించే ఆత్మచైతన్యం మాత్రం ఏ ఇంద్రియానికీ గోచరించదు. అది వీటి కతీతం. కారణం అది వీటికి సాక్షియే గాని సాక్ష్యం కాదు.

ఇంధ : ఇంధ అనే మాటకు కూడా ఇంద్రుడైన జీవుడనే అర్థం. అయితే జీవచైతన్యం శరీరమంతా వ్యాపించినా దక్షిణమైన నేత్రంలో అది చాలా ప్రబలంగా వ్యక్తమై కనిపిస్తుందట. ఇది లోకుల వాడుకలో కూడ కొంత కద్దు. కాని అంత స్పష్టంగా తెలియదు లౌకికుడికి. అక్షి అంటే దక్షిణాక్షి. అందులో ప్రకటమైన ఆత్మచైతన్యాన్ని స్పష్టంగా దర్శించగలుగుతాడట ఉపాసకుడు. అతడు పాసించే ఈ విద్యకు అక్షిపురుష విద్య అని పేరు వచ్చింది. ఇంధ అంటే దేదీప్యమానంగా వెలిగేదని అర్థం. చైతన్యం అలాంటి ఒక అభౌతికమైన వెలుగు. దానిని అక్షిలో దర్శిస్తారు కనుక ఇంధ అంటే అక్షి పురుషుడైన జీవుడు.

ఇష్ట : కోరబడే విషయం. వెతకబడేది కూడా. ఏది కోరుతాడో మానవుడు దానినే వెతుకుతూ పోతాడు. కనుక రెండూ దీని కర్థాలే. అంతేకాదు. యజింపబడేది కూడా Worshipped ఇష్టమే. యజ్ఞయాగాదులని అర్థం.

ఇష్టదేవతా : తాను ఏ దేవతను అభిమానించి ఉపాసిస్తాడో ఆ దేవతకు పేరు. చివరకు మరణానంతరం ఉపాసకుడికి ఇష్టదేవతా సాయుజ్యమే లభిస్తుందని శాస్త్రమిచ్చే హామీ.

ఇష్టి : యజ్ఞమని అర్థం. పుత్త్రకామేష్టి మొదలైన మాటలలో చూడవచ్చు. అంత్యేష్టి అని ఒక మాట ఉన్నది. చివరిసారిగా మానవుడికి చేసే ఉత్తరక్రియలు అని అర్థం.

ఇషిత : ఇష్టమనే అర్థం. 'కేనేషితం పతతి ప్రేషితం మనః' అని ఉపనిషత్తు దేనిని కోరి మనస్సు ఒక పదార్థంమీద పోయి వాలుతున్నదో దానిని ఏ మహాశక్తి వెనకాల జేరి నడుపుతున్నదో అని అక్కడ భావం.

ఇష్టాపత్తి : ఒక వాదనలో ప్రతివాది చేసే వికల్పానికి జవాబు చెప్పేటప్పుడు ఒక పక్షం కాదని చెప్పినా మరొక పక్షం తమకు సమ్మతమేనని ఒప్పుకోవటం. Acceptance. తమకిష్టమైనది ఎదటివాడు చెప్పినప్పుడు సరే అని ఆపన్నమయితే అది ఇష్టాపత్తి. ఉదాహరణకు జీవన్ముక్తుడికి వేదచోదితమైన కర్మలు వర్తించవు గనుక వేదానికి ప్రామాణ్యం అతని విషయంలో చెల్లదుగదా అని ఆక్షేపిస్తే అంతవరకు మాకు ఇష్టమేనని అద్వైతులు సమాధానమిస్తారు. అజ్ఞానికి కర్మలు వర్తిస్తాయి. అక్కడ శాస్త్రానికి ప్రామాణ్యం చెల్లుతుంది. జ్ఞాని విషయంలో చెల్లదు. ఇది మాకిష్టాపత్తే.

ఇష్టాపూర్త : ఇష్టమంటే యజ్ఞం. పూర్తమంటే వాపీకూప తటాకాదులు. రెండూ కలిసి ఇష్టాపూర్తం. ఇది ఒక ధర్మకార్యం. అభ్యుదయమనే Prosperity ఫలితమిస్తుంది ఇది. ఇందులో ఇష్టం శ్రౌత కర్మ. పూర్తంస్మార్త కర్మ.

ఇహాముత్ర : ఇహమంటే మనమున్న ఈ లోకం. అముత్ర అంటే మనం చేరబోయే పరలోకం. ఒకటి పుట్టుక నుంచి గిట్టేవరకు అనుభవానికి వచ్చేది. మరొకటి గిట్టినప్పటి నుండి మరలా పుట్టేవరకు అనుభవానికి రాబోయేది. రెండూ మొత్తానికి అనాత్మ క్రిందికే వస్తుంది కాబట్టి మనకు సంసార బంధాన్ని తెచ్చిపెట్టేవే. కాబట్టి వీటిమీద మమకారం వదలుకోమని వేదాంతుల హెచ్చరిక.

ఇషీకా : ఒక ఆకు నడుమ చారికలాగా కనిపించే ఈనెపుల్ల. Mid rib of a leaf. గడ్డిపోచకూడ కావచ్చు. ఆకు మడచి దానిలో గుప్తంగా ఉన్న ఈనెను లాగినట్టు మన ఆత్మచైతన్యాన్ని శరీరాదుల నుంచి బయటికి లాగుకోవాలని అద్వైతుల బోధ.

ఇచ్ఛా : కోరిక. జ్ఞాతుమిచ్ఛా జిజ్ఞాసా. Desire to know.తెలుసుకోవాలనే కోరిక. అర్థిత్వమని కూడా అంటారు దీన్ని. జ్ఞానమున్నందుకు ఇచ్ఛ ఉండాలి. ఇచ్ఛ ఉంటేనేగాని క్రియ చేయలేవు. క్రియ చేస్తేనే గాని ఫలం లేదు. జ్ఞానశక్తి శివస్వరూపమైతే ఇచ్ఛాశక్తి దేవీ స్వరూపం. ఈశ్వరునికి కలిగిన సంకల్పమే ఈ ప్రపంచసృష్టికి కారణం. ఇదే ఈశ్వరేచ్ఛ. జ్ఞానంతో మరలా ఈ ప్రపంచాన్ని లయం చేసుకోవాలని కోరితే అది మానవేచ్ఛ. అప్పుడు మానవుడు ఈశ్వరుడే అవుతాడు కాబట్టి మానవేచ్ఛ ఈశ్వరేచ్ఛగానే మారగలదు.

ఈక్షా/ఈక్షణ : చూపు, దృష్టి అని అర్థం. ఇచ్ఛ అని కూడా అర్థమే. పరమాత్మ ఈక్షణమే క్రియారూపంగా సాగి ప్రపంచంగా అవతరించింది. తదైక్షత బహుస్యాం అని ఉపనిషత్తు. ఈక్షణమన్నా, ఇచ్ఛ అన్నా, సంకల్పమన్నా, దృష్టి అన్నా అన్నిటికీ ఒకే అర్థం. The vision or the will of God which intends to create the world by multiplying itself.

ఈప్సా : ఆప్తుమిచ్ఛా. ఒకటి పొందాలనే కోరిక. కోరబడిన పదార్థం ఈప్సితం. The desire thing.ఇది ప్రాపంచికంగా కాక పారమార్థికంగా సాగితే మానవుడు ధన్యుడు.

ఈట్‌/ఈశ/ఈశ్వర : అన్నిటికీ అర్థమొకటే. ఈశన అంటే ఒక విషయాన్ని అదుపులో ఉంచుకోవటం. పెత్తనం చలాయించటం. To command. To control. అనాత్మ జగత్తుకు బాహ్యంగా, ఆంతర్యంగా చేరి దాన్ని తన వశంలో ఉంచుకొని నడుపుతున్నది ఈశ్వరుడే. అంతర్యామి అని కూడా ఆయనకే నామధేయం. 'ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే' అని గీతా వచనం. తన మాయాశక్తిని అధీనంలో ఉంచుకుని సృష్టి స్థితి లయాదులు చేస్తున్న వాడెవడో వాడు ఈశ్వరుడు. ఈశావాస్య మిదం. ఇదంతా ఈశ్వరుని చేతనే వాసితం అయి ఉన్నది. కనుక మనం దీనిని ఈశ్వర భావనతోనే చూడాలంటున్నది ఉపనిషత్తు. పరమాత్మ వేరు. ఈశ్వరుడు వేరు. నిర్గుణమైన తత్వమైతే అది పరమాత్మ లేదా బ్రహ్మం. అది సగుణమై జగన్నాటకం నిర్వహిస్తే ఈశ్వరుడు. మాయాశక్తి నిర్గుణంలో గుప్తమై ఉంటుంది. ఈశ్వరుడిలో ప్రకటమై అతనికి అధీనమై సృష్ట్యాదులు సాగిస్తుంది. ఇదీ మనం గ్రహించవలసిన రహస్యం.

ఈడ్య : పూజింపదగినవాడు ఈశ్వరుడు.

ఈశావాస్యం : పది ఉపనిషత్తులలో ఇది మొదటిది. ఈశోపనిషత్తు అని కూడా పేర్కొంటారు. ఈశావాస్యమని ఈట్‌ శబ్దంతో ప్రారంభమౌతుందిది. కనుక దీనికీ పేరు వచ్చింది. సర్వమూ ఈశ్వరాత్మకమే వాస్తవంలో. కానీ మానవుడది మరచిపోయాడు. కనుక గురూపదేశంతో మరలా దానిని గుర్తించి ఈశ్వరాత్మకంగానే జగత్తును దర్శిస్తే ముక్తుడౌతాడని సంగ్రహంగా ఇందులోని విషయం.

ఈశాన : ఈశ్వరుడనే అర్థం. అంతేగాక ఈశాన్య దిక్కుకు అధిపతి అయిన దేవత కూడా ఈశానుడే. పోతే పంచముఖుడైన రుద్రుని అయిదు ముఖాలలో ఈశానమని ఒక ముఖానికి పేరు.

ఈశిత్వ : అష్టసిద్ధులలో ఇది ఒక సిద్ధి. ఈశిత్వమనగా అండ పిండ బ్రహ్మాండాదుల అన్నింటిమీదా అధికారం చెలాయించటం. weilding power over all the energy and matter. యోగసిద్ధి పొందిన వారికి ఇది వశమవుతుంది. జ్ఞానులు కోరకపోయినా వారికీ అప్రయత్నంగా సిద్ధులన్నీ లభిస్తాయి.

ఈహా : వాంఛ. కోరిక.

ఈషా : ఈశనం చేయటం. అదుపుచేయటం. మనస్సును అదుపుచేస్తే మనీషా. అలాంటి మనీషా కలవాడు మనీషి. ఇది సాధన మార్గంలో ముఖ్యంగా అవలంభించ వలసిన గొప్ప సూత్రం. మనస్సు వశమైతేగాని ఏకాగ్రత సిద్ధించదు. అప్పుడే లక్ష్యాన్ని భేదించి పట్టుకోగలం.