#
Back

Page 19

వేదాంత పరిభాషా వివరణము


ఆత్మీయ : ఆత్మ అంటే నేను. ఆత్మీయమంటే నాది. ఆహం, మమలని వీటికే మారుపేర్లు. అఖండమైన ఆత్మచైతన్యంలో ఏర్పడిన విభాగమిది. స్వతహాగా అది అఖండమైనా మన అవిద్య మూలంగా ఖండమై కనిపిస్తున్నది. మొదటిది చిదాభాసుడైన జీవుడైతే రెండవది సదాభాసమైన జగత్తు. మరలా విద్య ఉదయిస్తే ఆభాసలు రెండూ లయమై సచ్చిత్సామాన్యమైన అఖండాత్మగా దర్శనమిస్తుంది.

ఆతివాహక : మరణానంతరం ఉపాసుని ఆయా భూమికల ద్వారా లోకాంతరాలకు తీసుకువెళ్ళే దేవదూత. divine conductor.

ఆత్మాకారవృత్తి : ఆత్మ ఎలా ఉందో అలాగే సాధకుడి మనస్సులో కలిగే ఆలోచన. తాను భావించిన వస్తువు తాలూకు ముద్ర మనఃఫలకం మీద ఎప్పటికప్పుడు ఏర్పడటం మనస్సుకున్న ఒక గొప్ప లక్షణం. ఇది అనాత్మ తాలూకు వృత్తి అయితే సంసారం వైపు తీసుకెళ్లుతుంది. ఆత్మాకారమైతే ఆత్మ తత్త్వానుభవానికి తెస్తుంది. ఆత్మదర్శనానికి ఇదే ప్రమాణం. ఇదే సాధన. బాహ్యంగా మరేదీ లేదు.

ఆత్మసాక్షాత్కార : అద్వైతంలో ఈశ్వర సాక్షాత్కారమనే మాటకు అర్థంలేదు. ఆత్మచైతన్యానికి భిన్నంగా జగత్తు ఎలా లేదో అలాగే ఈశ్వరుడు కూడా లేడు. ఈశ్వరుడంటే అఖండ చైతన్యమే కనుక అది ఆత్మగానే అనుభవానికి రావాలి. అప్పటికి ఆత్మసాక్షాత్కారమంటే సమస్తమూ సత్య, జ్ఞాన, ఆత్మకంగా దర్శన మివ్వటమే.

ఆత్మహా : ఆత్మను చంపుకొన్నవాడు. దాని జ్ఞానం లేని వాడని అర్థం.

ఆత్మాశ్రయ : ఇది ఒక దోషం. తానే జ్ఞాత. తానే జ్ఞేయమని భావించటం. అలా ఎప్పటికీ జరగదు. రెంటికీ తేడా ఉండి తీరాలి.

ఆత్యంతిక : అత్యంతమైన పదార్థం ఆత్యంతికం. అంతాన్ని దాటిపోయినది అనంతం. దేశకాల వస్తువులే అంతం. హద్దు. ఇలాంటి హద్దులేవీ లేక ఎప్పటికీ నిలిచి ఉండేది ఆత్యంతికం constant.

ఆత్యంతికప్రళయ : ప్రపంచ లయం దానిపాటికది జరిగితే ప్రాకృతం. అది మనకు పరిష్కారం కాదు. మరలా సంసారబంధం తెచ్చి పెడుతుంది. అలాకాక సాధకుడు బ్రహ్మాకార వృత్తితో బుద్ధిపూర్వకంగా లయం చేసుకోగలిగితే దానికి ఆత్యంతికమని పేరు. ఇది కలిగిన తరువాత ఇక సంసార బంధమనేది ఉండదు. సాయుజ్యమే సిద్ధిస్తుంది.

ఆదర : ఒకదానికి ప్రాధాన్యమివ్వటం, నొక్కి చెప్పటం emphasis, అదే ముఖ్యమని చూపటం. అలాంటప్పుడే ఆ విషయం పదేపదే వర్ణిస్తుంది శాస్త్రం. ఇందులో పునరుక్తి దోషం లేదు. మీదుమిక్కిలి సాధకుడి దృష్టి ప్రధానమైన అంశం మీదనే పడుతుంది.

ఆదర్శ : అద్దమని mirror బాహ్యార్థం. అంతటా స్పష్టంగా కనిపించేదని వ్యుత్పత్తి. లక్షణికంగా వేదాంతంలో మనస్సని, జ్ఞానమని కూడా చెప్పవచ్చు.

ఆదాన : చేతికి తీసుకోవటం. పట్టుకోవటం. గ్రహించటం. దీనికి వ్యతిరేకం ప్రదానం ఇవ్వటమని అర్థం.

ఆది : మొదలు. ఆరంభం. సృష్టి. ఆది లేనిది ఈ సంసారం. ఆదిలేనిది ఆత్మతత్త్వం. రెండూ అనాదే. కాని ఒకటి జ్ఞానముదయిస్తే అంతమవుతుంది. మరొకటి జ్ఞానముదయిస్తే అనాదే కాక అనంతమని కూడా బోధపడుతుంది.

ఆదేశ : ఆజ్ఞ command. ఈ చెప్పిన విషయానికి ఇంక తిరుగులేదని చెప్పటం కూడా ఆదేశమే. conclusion, 'ఏష ఆదేశః' అంతేకాక ఒక గొప్ప రహస్యాన్ని అపురూపంగా బయటపెట్టే మాట. ఒక ఉపమానం ద్వారా దాన్ని బోధించటం. 'ఉత తమాదేశ మప్రాక్ష్యః' నీవా ఆదేశ మడిగి తెలుసుకొన్నావా? అని అడుగుతాడు ఛాందోగ్యంలో ఉద్దాలకుడు శ్వేతకేతువును. అన్నింటికన్నా రహస్యమైన విషయం వారు నీకు చెప్పారా? అని దీని తాత్పర్యం. ఆదేశమంటే అప్పటికి అన్నింటికన్నా విలువైనది, అపూర్వమైనది Secret knowledge అని అర్థం.

ఆధాన : ఉంచటం. placing. లేనిదాన్ని ఆపాదించటం. కలిగించటమని కూడా అర్థమే. గుణాధానమంటే అంతకుముందు లేని గుణాన్ని తెచ్చిపెట్టటం. సమాధానమంటే అక్కడా ఇక్కడా చెదిరిపోకుండా దృష్టిని ఒకచోట చక్కగా నిలపటం.

ఆధార : ఆశ్రయం. నిలయం. అధిష్ఠానమని basis  అర్థం. దేనిమీద మరొకటి ఆరోపితమౌతుందో ఆది ఆధారం. నేతికి పాత్ర ఆధారం. ఆద్వైతంలో ఆధారమే వస్తువు. మిగతాదంతా వస్తువు కాదు ఆభాస.

ఆధేయ : ఆధారంమీద ఆరోపితమైన పదార్థం. Imposed content. ఆధారం వస్తువైతే ఆధేయమంతా ఆభాసే అద్వైతంలో. వస్తువే మరో రూపంలో భాసిస్తే అది ఆభాస. వస్తువుమీద ఆరోపితమయ్యేది వస్తువే నన్నమాట. జలమే తరంగ రూపంగా జలంమీద ఆరోపిత మౌతున్నది. అప్పటికి ఆధార ఆధేయాలు రెండూ ఒకే ఒక తత్త్వం.

ఆధి : మనస్సుకు సంబంధించిన రుగ్మత Mental disease.

ఆధ్యాత్మిక/ఆధిభౌతిక/ఆధిదైవిక : మొదటిది శరీరానికి, రెండవది శరీరం చుట్టూ ఉన్న ప్రపంచానికి, మూడవది రెంటికీ ఆధారమైన బ్రహ్మాండానికి సంబంధించిన సమస్యలు. వీటికే తాపములని పేరు. మూడింటవల్లా మనకు ఎక్కడలేని ఆందోళన ఏర్పడుతున్నది. తాపత్రయమంటే ఇదే. మొత్తం సంసారం తాపత్రాయాత్మకమే. దీని నివారణకోసమే శాంతి పాఠంలో మూడుమార్లు శాంతిని ఉచ్చరిస్తారు పెద్దలు.

ఆధ్యాన : నిరంతరమూ తైలధారగా ఒకే ఒక్క లక్ష్యం మీద దృష్టి పెట్టి కూర్చోవటం Meditation, Reflection.  ద్వైతంలో అయితే ధ్యేయం ధ్యానించే ధ్యాతకు వేరుగా ఉంటుంది. ఆద్వైతంలో అది తన స్వరూపమే.

ఆధికారికపురుష : అధికారమంటే deputation. అది ఉన్న వ్యక్తి ఆధికారిక పురుషుడు. అంటే ఒక పని చేయమని పరమాత్మ జీవన్ముక్తుడికి అప్పగిస్తే దానికి అధికారమని పేరు. జీవన్ముక్తులు రెండు విధాలు. ఆత్మారాముడొకడు. ఆధికారిక పురుషుడొకడు. దేనితోనూ సంబంధం పెట్టుకోక తనలో తాను రమించేవాడు ఆత్మారాముడు. తనపాటికి తాను నిష్ఠలో ఉంటాడు. రెండోవాడు లోకానుగ్రహార్థం నలుగురికీ జ్ఞానబోధ చేస్తూ తిరుగుతుంటాడు. అదే అతని అధికారం. Duty. ప్రారబ్ధం తీరేవరకు అది సాగించి తరువాత విదేహముక్తుడై పోతాడు.

ఆత్మారామ : ఇంతకుముందు చెప్పినట్టుగా జీవన్ముక్తులలో ఇతడు మొదటి వర్గానికి చెందినవాడు. ఆత్మజ్ఞాన నిష్ఠ తప్ప అనాత్మ ప్రపంచంతో ఏ మాత్రమూ సంబంధం లేక దూరప్రాంతాలలో ఒంటరిగా మసలుతూ తనలో తాను రమిస్తూ కాలం గడిపేవాడు.

ఆనంత్య : అనంతభావం. ఎప్పటికీ అంతం లేకుండా నిలిచి ఉండటం. 'సచ ఆనంత్యాయ కల్పతే.' జీవుడు కూడా ఈశ్వరుడిలాగే చిన్మాత్రుడు గనుక తన స్వరూపాన్ని తాను గుర్తిస్తే అనంతత్వానికే నోచుకోగలడని శాస్త్రవచనం.

ఆనంద : నందమన్నా ఆనందమన్నా సుఖమని అర్థం. ఇది విషయ జన్యం కాదు. విషయి రూపమైన ఆత్మజన్యం. తైత్తిరీయంలో ఆనందాన్ని గూర్చిన మీమాంస ఎక్కువగా వస్తుంది. మనుష్యుడి స్థాయినుంచి పరబ్రహ్మ స్థాయివరకు ఎన్నో ఆనంద భూమికలు వర్ణించారు. అన్నింటికీ కడపటిది బ్రహ్మానందమే. పంచకోశాలలో ఆనందమయకోశ మొకటున్నది. దానిలో కలిగే ఆనందం కాదిది. 'బ్రహ్మపుచ్ఛం ప్రతిష్ఠా.' అనే మాటను బట్టి బ్రహ్మానందమే అసలైన ఆనందం అని పరిష్కారం.

ఆనందమయకోశ : పంచకోశాలలో అన్నమయ దగ్గరినుంచి ఆనందమయం వరకు ఆత్మచైతన్యం ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయవలసి ఉంది. అది కూడా దాటిపోతే బ్రహ్మసాయుజ్యం లభిస్తుందని శాస్త్రం. ఆనందమయ కోశంలో ఉన్న ఆనందం సుషుప్తిలో కలిగే విషయ సుఖమేకాని నిత్యసుఖం కాదు. ఇది జడమైతే బ్రహ్మానందం దాని కతీతమైన చేతనానందం. కనుక దీనికి దానికి తేడా ఉన్నది. కనుకనే ఇది కోశమైనది. అది కోశాతీతమైనది.

ఆనుపూర్వి : పరిపాటి క్రమం. అనుక్రమం. order. ఒకదాని తరువాత ఒకటి రావటం. వరుస. మాములుగా మొదట పెద్దది తరువాత చిన్నది. ఈ వరుస పాటించవలసి ఉంటే దానికి ఆనుపూర్వి అని పేరు.

ఆనృశంస్య : నృశంసుడంటే నరఘాతకుడు. హింసాపరుడు. అలాంటి ఘాతుక కృత్యాలు, జీవహింస తలపెట్టని సత్పురుషుడు అనృశంసుడు. వాడికుండే స్వభావం ఆనృశంస్యం Unharmful nature. దైవగుణాలలో ఇది ఒక ప్రధాన గుణం.

ఆపత్తి : ఏర్పడటం. వచ్చిపడటం. ఆపన్నం కావడం. అద్వైతంలో సంపత్తి, ఆపత్తి అని రెండు మాటలు వస్తాయి. సంపత్తి అంటే బ్రహ్మం తాను కాకపోయినా అయ్యానని భావించటం. పోతే ఆపత్తి అంటే అలా కానిదాన్ని భావించటం కాదు. బ్రహ్మమే అయికూడా కానేమోనని మరచినవాడు మరలా నేనా బ్రహ్మమే కదా అని గుర్తించి బ్రహ్మభావం పొందితే అది ఆపత్తి. ఇది సంపత్తిలాగ కానిదాన్ని పొందటం కాదు. అయిన దాన్ని జ్ఞాపకం చేసుకోవటం. సంపత్తి ఉపాసనమార్గమైతే reflection,  ఆపత్తి జ్ఞానమార్గం realisation.