#


Back

Page 1

వేదాంత పరిభాషా వివరణము


అ : వర్ణ సమామ్నాయంలో ఇది మొట్టమొదటి వర్ణం. ఒక శబ్దానికి ముందు చేరితే ఇది దాని వ్యతిరేకార్థాన్ని చెబుతుంది. అది లేకపోవటమైనా కావచ్చు. కాకపోవటమైనా కావచ్చు. అవివేకమంటే వివేకం లేకపోవటం, అవిచారమంటే విచారం లేకపోవటం. అలాగే అకాయ మవ్రణమంటే కాయం కానిదని, వ్రణం కానిదని అర్థం. అంటే స్థూలసూక్ష్మశరీరాలు రెండూ కాని ఆత్మచైతన్యం. అ అనేది ఓంకారంలో మొదటి అక్షరం కూడా. అక్కడ అది స్థూల శరీరానికీ, జాగ్రదవస్థకూ, విశ్వుడనే జీవుడికీ సంకేతం. త్రిమూర్తులలో బ్రహ్మకు కూడా ఇది సంకేతమే. పోతే ప్రత్యభిజ్ఞా దర్శనంలో అకారం ప్రకాశ రూపమైన శివ తత్త్వానికైతే హకారం విమర్శరూపమైన శక్తితత్త్వానికి ప్రతీక. రెండూ బిందువు ద్వారా ఏకమైతే అహమ్‌ అనే జీవభావమేర్పడిందని వారి మాట.

అక : కమ్మంటే సుఖం. దానికి ముందు అ చేరింది కాబట్టి అకమంటే సుఖం కానిది, దుఃఖమని అర్థం. న+అక. అకం కూడా కానిది నాకమంటే. మరలా దుఃఖం కానిది సుఖమనే భావం. అది ధర్మపురుషార్థంలో స్వర్గమైతే బ్రహ్మ పురుషార్థంలో మోక్షం.

అకల : కల కళ అంటే భాగం అంశ Part అని అర్థం. ప్రాణం దగ్గరినుంచి నామం వరకు పదహారు కళలను వర్ణించాయి ఉపనిషత్తులు. వీటికే షోడశకళలని పేరు. పూర్ణమైన ఆత్మచైతన్యం వస్తుతః నిరవయవ Indivisible మైనా ఈ షోడశ కళలతో అది సావయవంగా Divisible భాసిస్తున్నది. అప్పుడది సకలం. అదే మనకు జ్ఞానోదయమై ఇవి ఆ పురుష చైతన్యంలో కలిసిపోతే దానికప్పుడు అకలమని పేరు. ఏ కళలూ అవయవాలూ Parts లేని శుద్ధమైన నిరాకారమైన చైతన్యమని తాత్పర్యం.

అకర్మ : లౌకిక శాస్త్రీయ కర్మలేవీ లేకపోవటం. ఏ పనీ పెట్టుకోకపోవటం. నిష్కర్మ అని కూడా అనవచ్చు. కర్మ అంటే చలనం. సర్వవ్యాపకమూ నిరాకారమైన ఆత్మచైతన్యం చలించదు గనుక అకర్మ అంటే చైతన్యమని, జ్ఞానమని కూడా అర్థమే. అనాత్మ అంతా కర్మ అయితే దానికి భిన్నమైన జ్ఞాన మకర్మ. కర్మణ్య కర్మ యః పశ్యేత్‌.

అకామ : కామమంటే ఒకటి పొందాలనే వాంఛ-కోరిక. అది నాకు విజాతీయ మొకటి ఉందని భావించినప్పుడే ఏర్పడుతుంది. అంతా ఆత్మస్వరూపమే నని గుర్తించి నప్పుడు కామ్యమైన పదార్థమే లేదు గనుక అకామమే. ఆత్మకు అకామమని పేరు. నిష్కామమన్నా అదే అర్థం.

అకాల : కాలం గాని కాలం. అనుచితమైన కాలమని అర్థం. కాలాని కతీతమైనది కూడా అకాలమే.

అకార్య : కార్యం కానిది. తయారైనది కాదు. స్వతస్సిద్ధమైనదని భావం. అది జ్ఞానస్వరూపమైన ఆత్మ తప్ప మరేదీ కాదు.

అకాయ : కాయమంటే శరీరం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో ఏదైనా కావచ్చు. కాని ఈశావాస్యంలో అకాయమవ్రణమనే చోట అకాయమంటే సూక్ష్మ శరీరమని అర్థం చెప్పారు కాయ శబ్దానికి. ఇంతకూ అకాయమంటే లింగ శరీర వర్జితమైన ఆత్మ అని అర్థం.

అకుతోభయ : దేనివల్లనూ భయం లేకుండా బ్రతకటం. తనకు భిన్నమైనది ఎదురైతేనే భయం. ఆత్మ తప్ప అనాత్మే లేదని సిద్ధాంతం కాబట్టి ఆత్మజ్ఞాని అకుతోభయుడు.

అకృత : కృతమంటే తయారైనది. జ్ఞేయమైన పదార్థాలన్నీ లోకంలో తయారయ్యేవే. పోతే వాటికి సాక్షి అయిన చైతన్యమలా తయారయ్యే పదార్థం కాదు. కాబట్టి దాని కకృతమని పేరు. నిత్యసిద్ధం - స్వతస్సిద్ధమని భావం.

అకృతాభ్యాగమ : మనమొక కర్మ అది సుకృతం కానీ దుష్కృతం కానీ ఎప్పుడూ చేయకపోయినా దాని ఫలితం వచ్చి నెత్తిన పడితే దానికి అకృతాభ్యాగమ మని పేరు. కారణం లేకుండా కార్యమేర్పడటమని భావం. అది అశాస్త్రీయం. హేతు వాదానికి నిలవదు. కనుకనే సుఖమో, దుఃఖమో ఇప్పుడు జీవుడు అనుభవిస్తున్నాడంటే పూర్వమెప్పుడో దానికి దోహదమైన కర్మ వాడు చేసి ఉంటాడని వేదాంత సిద్ధాంతం.

అకృతకర్తృ : అసిద్ధమైన దానిని సిద్ధం చేసేది. అంతకుముందు లేనిదానిని సాధించేది శాస్త్రం. అంతకుముందే ఉంటే సాధించనక్కరలేదు. అప్పుడు శాస్త్ర మనువాద (ఉన్న దానిని చెప్పేది) మవుతుందేగాని విధానం (క్రొత్తగా విధించేది) కాదు. కాకుంటే ప్రామాణ్యం Authority లేదు దానికి.

అక్రతు : క్రతువు లేనిది. క్రతువంటే యాగం కాదిక్కడ. సంకల్పం అధ్యవసాయం లేదా నిశ్చయమని అర్థం. క్రతుమయః పురుషః మానవుడంటే వాడి నిశ్చయమే Conviction. అది లేని పక్షంలో అక్రతు. క్రతువంటే కామం, కోరిక అని కూడా ఒక అర్థం. తమ క్రతుః పశ్యతి. ఏ కామమూ లేని నిష్కామమైన మానవుడి బుద్ధికే గోచరిస్తుంది ఆత్మ స్వరూపమని భావం.

అక్రమ : ప్రపంచ సృష్టి విషయంలో ఆకాశం నుంచి మొదలయిందా, తేజస్సు నుంచి మొదలయిందా అని క్రమం పాటించనక్కరలేదు. అసలు సృష్టే జరగలేదు. ఆభాస అని సిద్ధాంతమయినప్పుడు ఒక క్రమమేముంది? అక్రమమైనా క్రమమే నన్నారు అద్వైతులు.

అఖండ : ఖండం కానిది. ఖండమంటే శకలం. తునక. విభాగం. అలాటి విభాగం లేని అవిభక్తమైన పూర్ణమైన పదార్ధం. అది నిరాకారమూ వ్యాపకమైన ఆత్మతత్త్వమొక్కటే. అది ఎలా ఉందో అలాగే మనసులో వృత్తి లేదా ఆలోచన ఏర్పడితే దానికి అఖండాకార వృత్తి అని పేరు.

అఖ్యాతి : ఖ్యాతి అంటే బయటపడి కనిపించటం. అలా బయట పడకుంటే అఖ్యాతి. ఒక దానిమీద మన భ్రాంతి మూలంగా మరొకటి అధ్యాస అయినప్పుడు ఆ మొదటిది బయట పడకపోతే అలాంటి దానికి అఖ్యాతి Unapparehension అని సంజ్ఞ. మీమాంసకులది అఖ్యాతి వాదం.

అఖిల : ఖిలమన్నా ఖిల్యమన్నా ఒక కరడుగట్టిన ముద్ద. పిండం. ఒక శకలం. అది కానిది అఖిలం. అవిభక్తం, పరిపూర్ణమని భావం. అకలమంటే ఏమిటో అదే అఖిలమన్నా Indivisible whole.

అగతి : అనన్యప్రోక్తే గతి రత్ర నాస్తి. గతి అంటే ఇక్కడ జ్ఞానం. ఆత్మజ్ఞానం. అపరోక్షంగా బ్రహ్మతత్త్వాన్ని అనుభవించే ఆచార్యుడు బోధ చేస్తే అగతి లేదు. అంటే ఆత్మజ్ఞానం కలగకుండా పోదని తాత్పర్యం.

అగతిక : గతి అంటే ఇక్కడ మార్గం. మరొక మార్గం లేదు. గత్యంతరం Alternative లేదని భావం.

అగమ్య : గమ్యం కానిది. గమ్యమంటే చేరగలిగినది. పొందగలిగినది. పొంద లేనిది అగమ్యం. ఆత్మచైతన్యం. అది మన స్వరూపమే గనుక మనకు గమ్యంకాదు.

అగ్ర : కొస-చివఱ. అంతేకాదు. కర్మఫలమని అర్థం చెప్పారు భాష్యకారులు. సమగ్రం ప్రవిలీయతే-అగ్రంతో సహా అంటే ఫలంతో సహా లయమవుతుందట కర్మ. కర్మకు చివరి దశ ఫలానుభవమే గదా. కనుక అగ్రమంటే ఫలమని చెప్పారు.

అగ్య్ర : అగ్రమంటే మొన - బాగా మొనదేరినది Sharpened అని భావం. దృశ్యతే త్వగ్య్రయా బుద్ధ్యా - ఆత్మతత్వమెంత అగోచరమైనా బాగా పదునెక్కిన బుద్ధితో దర్శించవచ్చునట. అగ్య్రమంటే పదునైన అని అక్కడ అర్థం.

అగ్రహణ : గ్రహణమంటే పట్టుకోవటం. పట్టుకోలేకపోతే అగ్రహణం. సుషుప్తిలో ఉన్నది అగ్రహణం. మన స్వరూపమక్కడ గుర్తులేదు.

అగ్రాహ్య : గ్రాహ్యం కానిది. అనగా ఏ ఇంద్రియంతోనూ పట్టుకోరానిది. Incomprehensible ఆత్మతత్వం. యత్త దద్రేశ్య మగ్రాహ్యమ్‌.

అగోచర : గోచరం కానిది. గో అంటే ఇంద్రియం లేదా జ్ఞానం. దాని పరిధిలో ఉంటే అది గోచరం Object to Impurity. అలా కాకుంటే అగోచరం. ఇంద్రియాతీత మని భావం.

అగోత్ర : గోత్రం లేనిది ఆత్మతత్త్వం. గోత్రమంటే ఇక్కడ అన్వయమన్నారు. అన్వయమంటే మరి ఒక పదార్థంతో సంబంధం. ఆత్మకన్నా భిన్నమైన పదార్థమే లేదన్నప్పుడిక సంబంధమనే ప్రశ్నేముంది. ఎప్పుడూ అది అనన్వయమే. అగోత్రమే.

అఘ : పాపమని ఒక అర్థం. దోషం, కళంకమని ఒక అర్థం. మాలిన్యమని, లోపమని మరి ఒక అర్థం. sin defect Impurity. అవిద్యా కామకర్మలే పాపాలు. అవే అఘం. 'తే త్వఘం భుంజతే పాపాః' అవి వదలకుండా భుజిస్తే ఆ భుజించేది వారు అన్నం కాదు. పాపమేనట.