ప్రస్థానత్రయ పారిజాతము
6.మాండూక్యోపనిషత్తు
పోతే ఇక దీని తరువాత ఆరవది మాండూక్యం. ''మాండూక్య మేక మేవాలమ్'' అన్నారు మన ప్రాచీనులు. అన్నిటిలోకీ ఇది చాల చిన్నదైనా ఇది చెప్పే తీరు మాత్రం చాలా అపూర్వమైనది. ఓంకారం ద్వారా ఆత్మ తత్త్వాన్ని దర్శించే ఉపాయాన్ని బోధిస్తుందీ ఉపనిషత్తు. ఓంకారమనేది ఒక శాబ్దికమైన ప్రతీక. భాషలో అన్ని శబ్దాల మాదిరే ఇది కూడా ఒక అర్థాన్ని చెబుతుంది. ఆ అర్థమే ఆత్మచైతన్యం. ఓంకారం శబ్థమైతే ఆత్మ దానికర్ధం. శబ్దార్థాలకుండే సంబంధమే వీటికీ ఉన్నది. ఏమిటా సంబంధం. శబ్ధ ముచ్చరించగనే అర్ధం అనేది మనసుకు స్ఫురిస్తుంది. అలాగే ప్రస్తుతమీ ''ఓమ్'' అనే శబ్దం కూడా ఉచ్చరిస్తూపోయామంటే తద్వాచ్యమైన ఆత్మ స్వరూపం మనసుకు రావలసిందే. అది ఎలాగో పరిశీలిద్దాము.
''ఓమ్'' అనే శబ్ధం ఒకటిగాదు. అందులో మూడక్షరాలు కలిసి ఉన్నాయి. అఉమ-అనేవే ఆ మూడూ.ఈ మూడింటికీ మూడు మాత్రలని పేరు. మాత్ర అంటే కొలిచేది అని అర్ధం. ఓంకారాన్ని ఇవి ప్రతి ఒక్కటీ కొంత కొంత కొలుస్తున్నాయి. కాబట్టి వీటికి మాత్రలని పేరు వచ్చింది. పోతే నాలుగవ దొకటి ఉంది. అది కొలవబడేదే గాని కొలిచేదిగాదు. అంచేత దీని కమాత్ర అని పేరు పెట్టిందుపనిషత్తు. ఓంకార శబ్దమెక్కడ లయమవుతుందో అది అమాత్ర. ఇదే నిశ్శబ్ద రూపమైన తురీయావస్థ. ఇవి నాలుగూ ఓంకారంలో ఎలా ఉన్నవో అలాగే ఓంకార వాచ్యమైన ఆత్మకు కూడా నాలుగు పాదాలున్నాయి. నాలుగు పాదాలతో కూడిన ఆత్మకు చతుష్పాత్తని పేరు. ''సోయ మాత్మా చతుష్పా''త్తని ఉపనిషత్తు. ఆ నాలుగు పాదాలేమిటి. జాగ్రత్తొక పాదం. స్వప్నం రెండవది. సుషుప్తి మూడవది. పోతే నాలుగవది పరిశుద్ధమైన చైతన్యమే. ఇది ఓంకారంలో అమాత్రలాగా పాదం గాని పాదం. మొదటి మూడూ గమ్యాన్ని చేర్చే సాధనాలైతే ఇది గమ్యమే.
ఇవి నాలుగూ ఆత్మకు పాదాలని చెప్పామంటే గవాశ్వాదుల పాదాలలాగా విడివిడిగా కనపడుతుంటాయని భావించరాదు. ఒక రూపాయలో నాలుగు పావలాల లాగా కలిసిపోయి ఉంటాయని చెప్పారు భగవత్పాదులు. రూపాయ చేతికి తీసుకొని చూస్తే అది ఒకే ఒక నాణెం. అందులో నాలుగు పావలాలున్నాయంటే అవి వస్తురూపంగా లేవు. వాటి విలువలు మాత్రమే ఉన్నాయందులో. పావలా విలువ అర్ధరూపాయలోనూ అర్ధరూపాయ విలువ ముప్పావలాలోనూ ముప్పావలా విలువచివరకు రూపాయలోనూ కలిసి వస్తుంది. అలాగే ప్రస్తుతం జాగ్రత్తనేది స్వప్నంలోనూ స్వప్నమనేది సుషుప్తిలోనూ సుషుప్తి చివరకు సమాధిలోనూ చేరిపోయేవే. అయితే మన అవిద్యా దోషం కారణంగా అవి వేర్వేరుగా ఉన్నట్టు భాసిస్తున్నాయి. ఇది వట్టి ఆభాసే కాబట్టి వాటిని మరలా లయం చేసుకోవటమే సాధకుడు చేయవలసిన పని.
ఈ లయ సాధనలో మన కుపకరిస్తుందనే ఓంకారాన్ని ఒక సంకేతంగా తీసుకొని బోధిస్తున్నదుపనిషత్తు. ఓంకారం వాచకమూ - ఆత్మ చైతన్యం దానికి వాచ్యమూనని గదా చెప్పాము. వాచ్యవాచకాలు రెండూ ఒకదానికొకటి అభిన్నమని సిద్ధాంతం. దీనినిబట్టి ఓంకారంలో చెప్పిన మాత్రలకూ, ఆత్మకు చెప్పిన పాదాలకు భేదం లేదని గ్రహించాలి సాధకుడు. ''పాదా మాత్రా మాత్రాశ్చ పాదాః'' అని రెండింటికీ అభేదాన్నే ప్రతిపాదిస్తున్న దుపనిషత్తు. ఉపనిషత్తు చెప్పిన దానిని బట్టి మనమూ రెంటినీ ఏకంగానే భావించవలసి ఉంటుంది. అలా భావించామంటే అకారం జాగ్రత్తనీ ఉకారం స్వప్నమనీ మకారం సుషుప్తి అనీ బోధ పడుతుంది. పోతే ఒకతురీయమైన నిశ్శబ్దం శుద్ధమైన ఆత్మ స్వరూపమేనని వేరుగా చెప్పనక్కరలేదు. 'నిశ్శబ్దమ్ బ్రహ్మ ఉచ్యతే' అని భగవద్వచనమే ఉంది మనకు ప్రమాణం.
అయితే ఇక ఇందులో ఉన్న సాధన రహస్యమేమంటే ఓంకారాన్ని ఉచ్చరించేటపుడకారం ఉకారంలోకి లయమవుతుంది ఉకారం మకారంలోకి లయమవుతుంది. చివరకా మకారం కూడా తురీయమైన నిశ్శబ్ద తత్త్వంలో పోయి చేరుతుంది. చేరితే చివరకు ఆ తురీయ తత్త్వమే మిగులుతున్నది. ఇది మన కనుభవ సిద్ధం. ఇలా జరుగుతున్నపుడీ లయమయ్యేది కేవలం అకారాదులైన అక్షరాలు కావు. అవి సూచించే జాగ్రదాది దశలే అలా లయమవుతున్నాయని భావించాలి మనం. అకారం ఉకారంలో లయమైందంటే జాగ్రత్తు స్వప్నంలో లయం కావటం. ఉకారం మకారంలో లయమైందంటే స్వప్నం సుషుప్తిలో లయంకావటం. మకారం తురీయమైన నాదాతీతంలో లయమైందంటే ఆ సుషుప్తి చివరకు తురీయమైన శుద్ధ చైతన్యంలో లయంకావటమే. లయం కావటమంటే అవి మనం భావన చేస్తేనే గాదు. స్వతహాగా కూడా అవి అంతకు పూర్వమే లయమయి ఉన్నాయి. కారణానికి భిన్నంగా కార్యమనేది లేదని గదా మనం ప్రతిపాదించింది. అన్నిటికీ కారణం ఆత్మ చైతన్యం. అందులో నుంచి వచ్చిన అవ్యక్తమైన తత్త్వమే సుషుప్తి. అది కొంచెం వ్యక్తమైన సూక్ష్మరూపమే స్వప్నం. ఆ సూక్ష్మమయిన స్వప్నం స్థూలంగా కనిపిస్తే అది జాగ్రత్తు. కాబట్టి పూర్వ పూర్వమయిన దశలుత్తరోత్తర దశలకు కారణాలవుతాయి కారణాలెప్పుడవుతాయో అప్పుడీ కార్యాలా కారణాలకంటే భిన్నం కావు. అంటే జాగ్రత్తు స్వప్నంలోనే ఉందని స్వప్నం సుషుప్తిలోనే ఉందని సుషుప్తి సమాధిలో ఉందని అన్నీ కలిసి మొత్తంగా అసలు పరిశుద్ధమయిన ఆత్మలోనే ఇమిడిఉన్నాయని అర్ధం చేసుకోవాలి. అలా ఇమిడి ఉన్నాయి గనుకనే మరలా వాటిని లయం చేసుకొనే అవకాశమేర్పడింది. లేకుంటే మనమెంత యత్నించినా అది నిరర్ధకమే అయ్యేది.
మొత్తంమీద అవస్థాత్రయ మనేది లయం కావటమే ఇక్కడ జరుగుతున్న కార్యం. అంతేకాదు. అవస్థాత్రయంతో పాటు వాటి నభిమానించే విశ్వతైజస ప్రాజ్ఞులనే జీవులు కూడా లయం కాక తప్పదు. వారితో పాటు వారు చూచే స్థూల సూక్ష్మ కారణాలనే త్రివిధ ప్రపంచాలు కూడా లయం కావలసిందే. అనాత్మ అంతా లయం కావలసిందే. అనాత్మ అంతా లయమయితే చివరకు మిగిలేది ఆత్మతత్త్వమొక్కటే. సూక్ష్మాతి సూక్ష్మమయిన ఆ తత్త్వాన్ని దర్శించటానికే స్థూలమయిన అనాత్మ ప్రపంచాన్నంతా ఒకదాని తరువాత ఒకటి వరుసగా లయం చేసుకోవలసి రావటం. అందులోనూ అతిస్థూలమయినది జాగ్రత్ప్రపంచం. దాన్ని స్వప్నంలోకి లయం చేసుకోవాలి. అంటే స్వప్నం మాదిరి ఈ ప్రపంచాన్ని అంటి ముట్టనట్టు దర్శించాలని అర్థం. దాన్ని మరలా సుషుప్తిలో లయం చేసుకోవాలి. అంటే అది కూడా నామరూపాత్మకమే కాబట్టి సుషుప్తి మాదిరి నామరూపరహితంగా చూడాలని భావం. దాన్ని మరలా సమాధిలోకి లయంచేసుకోవాలి. చివరకా శూన్యాన్ని మరలా శుద్ద చైతన్యంతో భర్తీ చేసుకొని అభావంగా కాక భావరూపంగా అనుభవానికి తెచ్చుకోవాలని తాత్పర్యం. ఇంత చేస్తే అప్పుడనాత్మ అనే గంధం కూడా లేని ఆత్మ స్వరూప మనుభావానికి వస్తుంది. ఓంకారమనే ఆలంబనం ద్వారా ఇలాంటి అనుభవాన్ని మనకందిస్తున్నది మాండూక్యోపనిషత్తు.
Back
Next