• English
    •  

ప్రస్థానత్రయ పారిజాతము



4.ఫలం

సాధన అనేదేమిటో - అది ఎలా చేయాలో నిరూపించాము. పోతే ఇక ఈ సాధన కంతటికీ ఫలమైన ముక్తిని గూర్చి విచారించవలసి ఉంది. ముక్తి అంటే అది ఏదో ఒక అపురూపమైన వస్తువు - ఎక్కడో ఒక లోకంలో మనకందకుండా ఉంది దాని నీ సాధన ద్వారా మనమందుకొంటామని భావించరాదు. క్రొత్తగా ఏదీ పొందటంలేదు మనం. ఆ మాటకు వస్తే ఎప్పుడూ పొందే ఉన్నాము దాన్ని. బ్రహ్మభావమే ముక్తి. ఆ బ్రహ్మమనేది ఎక్కడో లేదు. అది మన స్వరూపమే. అది మన లోపలా వెలపలా అంతటా ఉంది. సర్వమూ నేననే అనుభవమే అది. అయితే అది ఇంతకాలమూ మరచిపోయామా రహస్యం. మరచిపోయి మామ పెండ్లాన్ని అత్త అన్నట్టు మరలా ఈ సాధన నిమిత్తంగా జ్ఞాపకంచేసుకొంటున్నాము. అంత మాత్రమే. కనుకనే ''విముక్తశ్చ విముచ్యతే'' అని చాటుతున్న దుపనిషత్తు.

దీనిని బట్టి ముక్తి అనేది భౌతికంగా పొందే ఒకానొక దశ కాదని అర్ధమయింది. భౌతికంగా పొందినట్టు శాస్త్రమెక్కడైనా వర్ణించిందంటే అది సద్యోముక్తి గాదు క్రమముక్తి. ముక్తిలో మరలా రెండు భేదాలా అని సందేహించనక్కరలేదు. నిర్గుణంగా భావించలేక బ్రహ్మతత్త్వాన్ని సగుణంగా ధ్యానించే సాధకులుంటారు గదా. అలాంటప్పుడా మేరకే వారికా ఫలం సమకూరవలసి ఉంటుంది అదే క్రమముక్తి. క్రమముక్తి అనటంలోనే ఉంది అది అసలైన ముక్తి కాదని, అసలు దానికి చేసే సాధన అది కూడా. అయితే ఇహంలో కాదు. పరంలో అది. ఎలాగని అడగవచ్చు.

యావజ్జీవమూ సగుణోపాసన చేస్తూ పోయే ఈ సాధకుడు ఆ భావనతోనే చివరకు మరణిస్తాడు. ఈ మరణంలో మామూలు వ్యక్తికీ అతనికీ ఎలాంటి విశేషమూ ఉండబోదు. మరణం రాగానే ఇంద్రియ వృత్తులన్నీ మనసులోనూ - మనోవృత్తి ప్రాణంలోనూ ప్రవేశిస్తుంది. అది జీవుడి నాశ్రయిస్తుంది. జీవుడు మనః ప్రాణాదులతో కలిసి తేజస్సులో సంక్రమిస్తాడు. తేజస్సంటే ఒక్క తేజోభూతమేగాదు. పృధివ్యాదులైన భూత సూక్ష్మాలన్నీ నని అర్థం. ఈ ఉపాధులన్నింటినీ వెంట బెట్టుకొని పోయి జీవుడు హృదయనాడిలో తలదాచుకొంటాడు. అప్పుడా నాడీ ముఖం ప్రజ్వలిస్తుంది. దాని వెలుగులో శరీర నిర్గమ ద్వారాలన్నీ ప్రకాశిస్తాయి. ఇంతవరకూ సామాన్యుడికి ఉపాసకుడికీ తేడాలేదు. ఇక్కడనుంచీ ఉత్క్రమణ చెందేటపుడు మాత్రం లౌకికుడైతే చక్షురాది స్థానాల నుంచి వెళ్ళిపోతాడు. బ్రహ్మోపాసన చేసిన సాధకుడైతే అలా వెళ్ళిపోడు. హృదయం నుంచి ప్రసరించే నూటొక్క నాడులలో నూట ఒకటవదైన సుషుమ్నా నాడిద్వారా కపాల భేదంచేసుకొని బయట పడతాడు. బయటికిరాగానే అక్కడ సూర్యరశ్మి ఉంది. ఈనాడిలో నుంచి వెంటనే ఆ రశ్మిలో ప్రవేశించి తద్ద్వారా సూర్యమండలం దాకాపోయి తన అభ్యాస బలంతో దాన్ని కూడా భేదించుకొని క్రమంగా చంద్రాదిత్య విద్యుద్వరుణాది భూమికలన్ని దాటి చివరకు సత్య లోకానికిపోయి చేరుతాడు. ఈ ప్రయాణంలో ఒక భూమిక నుంచి మరొక భూమికకు చేరేందుకతనికి సహాయంగా ఒక అమానవుడైన పురుషుడు అతివాహికుడుగా స్త్రతిరిఖిలి పని చేస్తాడు, సత్యలోకమనేది కార్యబ్రహ్మ Reality qualifide,limited అయిన హిరణ్యగర్భుడి స్థానం. అతని సన్నిధిలో సగుణం నుంచి నిర్గుణానికి మారే శిక్షణ పొంది అది పాకానికి వచ్చేసరికి ''బ్రహ్మణా సహతే సర్వే-సంప్రాప్తే ప్రతిసంచరే పరస్యాంతే కృతా త్మానః ప్రవిశంతి పరమ్‌ పదమ్‌'' అన్నట్టు కార్యబ్రహ్మకు ప్రళయం సంభవించినప్పుడా బ్రహ్మతోపాటు తానూ పరమమైన ముక్తి పదాన్నే చూరంగొంటాడు. దీనినే ''కార్యాత్యయే తదధ్యక్షేణ సహాతః పరమ్‌'' అనే సూత్రంలో సూచన చేశారు బాదరాయణులు.

అంచేత సగుణోపాసకులు పొందే ముక్తికే క్రమముక్తి అని పేరు. క్రమంగా పొందినా కట్టకడపటి దశ వచ్చేసరికది సద్యః ఫలాన్నే ప్రసాదిస్తుంది గనుక వాస్తవానికి భేదం లేదు ముక్తిలో. ముక్తి స్వరూపమొక్కటే చివరకు. ముక్తి అంటే ఏమిటసలు, విడుదల అని దాని అక్షరార్థం, ఉపాధులన్నిటి నుంచీ పూర్తిగా వైదొలగటమే ముక్తి. శరీరాదులే ఆ ఉపాధులుకనుకనే అశరీరత్వమే ముక్తి అని వర్ణించాయి శాస్త్రాలు. స్థూల-సూక్ష్మ-కారణాలనే మూడు శరీరాలూ-లేకపోవటమే ముక్తి. లేకపోవటమంటే భౌతికంగా లేకపోవటమని మరలా భ్రాంతి పడరాదు. భౌతికంగానే అయితే దేహపాతమైన ప్రతీ ఒక్కడూ ముక్తుడే కావలసి వస్తుంది. అలాగే ఈస్థూల దేహం కనిపిస్తున్న నేరానికి బ్రహ్మనిష్ఠులైన సిద్ధ పురుషులనందరినీ ముక్తులు కారని కూడచాటవలసి వస్తుంది. అంచేత శరీరముండటం లేకపోవటంలో లేదు బంధముక్తి వ్యవస్థ. అయితే మరేమిటి. శరీరమున్నా దానిమీద ఎలాటి అభిమానమూ లేకపోవటమే ముక్తి, అభిమానముంటే బంధం.

మరి రేపు శరీరపాతమైతే అభిమానం దానిపాటి కదే పోతుంది గదా అని ప్రశ్నించరాదు. ఈ స్థూలం పతనమైనా సూక్ష్మముంది. దానికి కూడా మూలమైన కారణమొకటున్నది. జ్ఞానం కలిగేదాకా అవి రెండూ తొలగిపోవు. అజ్ఞానకల్పితమే శరీర భావం. జ్ఞానమెప్పుడుదయిస్తే అప్పుడే అది స్వప్న దృశ్యంలాగా నశిస్తుంది. ఆ జ్ఞానమిప్పుడే ఉదయిస్తే ఇప్పుడే నశిస్తుందది. దీనికే జీవన్ముక్తి అని పేరు పెట్టారు వేదాంతులు. జీవించి ఉండగానే కలిగే ముక్తి జీవన్ముక్తి.

జీవించి ఉండగా ముక్తేమిటి. జీవించిన వాడికింకా శరీరాద్యు పాధులున్నాయి గదా. ఉపాధులతో సంపర్కమున్నంత వరకూ అది ముక్తి ఏలాగయింది. ముక్తి అంటే విడుదల అని గదా చెప్పారు. అది వాడికి జీవితంలో ఎలా సంభవమని ఆక్షేపణ రావచ్చు.ఇక్కడే ఉంది మన మర్ధం చేసుకోవలసిన శాస్త్ర రహస్యం. శరీరాదులుండటం కాదు. వాటిమీద అభిమాన బుద్ధి పెట్టుకోటమే బంధమని పేర్కొన్నాము. అభిమానమంటే అదే నేను అంతకన్నా నేను భిన్నంగా లేననే తాదాత్మ్యదృష్టి ఈ దృష్టి మనకెలా ఏర్పడింది. ఈ శరీరమేమిటి, ప్రపంచమేమిటి. అండపిండ బ్రహ్మాండాత్మకమైన ఈ సృష్టి అంతా నాకు భిన్నంగా ఎక్కడా లేదు. అంతా నాచైతన్యమే-నేనే అనే జ్ఞానం లేక. శ్రవణాదికమైన సాధనచేసి క్రమంగా సాధకుడీ జ్ఞానమెప్పుడార్జించాడో అప్పుడా మిధ్యాదృష్టి నశిస్తుంది. అది నశించిన మరుక్షణం తన్నిమిత్తంగా ఏర్పడిన శరీరాద్యుపాధులు కూడా నశించవలసిందే తప్పదు.

అయితే బాధితానువృత్తి అని ఒకమాట ఉన్నది. శరీరాదులైన ఉపాధులు బ్రహ్మజ్ఞానం చేత బాధితమైనా అప్పుడే అదృశ్యమై పోవు. కొంతకాలమింకా అనుసరిస్తూ ఉంటాయి. దానికి కారణం ప్రారబ్ధకర్మ. ముక్తుడు గదా వాడికింకా కర్మ ఏమిటి అని శంకించరాదు. కర్మ మూడు విధాలు. సంచితం-ఆగామి-ప్రారబ్దం. వీటిలో మొదటి రెండూ జ్ఞానోదయం కాగానే తొలగిపోతాయి. ప్రారబ్ధమనే దొక్కటీ అలా తొలగిపోదు. ''ప్రారబ్ధమ్‌ భోగతో నశ్యే''త్తన్నారు. అనుభవం కోసమే ఏర్పడింది. కాబట్టి అది అనుభవమున్నంతవరకూ నిలిచి ఉంటుంది. ముక్తుడికి దానివల్ల ప్రయోజనం లేకపోవచ్చు. అయినా కుమ్మరి సారెలాగా వేగ క్షయమయ్యే వరకూ తిరుగుతుంది. దేహపాతం కాగానే దాని పాటి కదే ఉపశమిస్తుంది. బలవంతంగా దాన్ని అరికట్టవలసిన అవసరం ముక్తుడికి లేదు. ఎంచేత అది ఉన్నా అతడికి బాధలేదు గనుక. ప్రతిఒక్కటీ బ్రహ్మాకారంగానే చూస్తున్న వాడికి బాధ ఏముంది. ఇలా లోకుల దృష్టికేగాని తన దృష్టికేదీ భిన్నమైన తత్త్వమే లేనందువల్ల ప్రారబ్ధమని చెప్పినా దాని ప్రభావం కూడా వాడి మీద పని చేయదు వాస్తవంలో. కనుకనే జీవిస్తూ ఉన్నా వాడు ముక్తుడే.

ఇలాంటి జీవన్ముక్తులుండటం మూలాన్నే ముముక్షు జనాని కెంతో మేలు జరగుతున్నది. ''ఆచార్యవాన్‌ పురుషో వేద'' అన్నారు. బ్రహ్మనిష్ఠుడైన ఆచార్యుడు లేకపోతే ఇతరులు తరించటాని కాస్కారం లేదు. గురుశిష్య సంప్రదాయమడుగంటి పోతుంది. అసలు జ్ఞానముదయించి కూడా ముక్తి లేకపోతే జ్ఞానం నిరర్థకమని చాటవలసి వస్తుంది. కాబట్టి జీవన్ముక్తులుండవలసిందే వారివల్ల లోక సంగ్రహమనేది జరగవలసిందే. ఈ లోక సంగ్రహానికే అధికారమనీ-అది చేసేవారి కాధికారిక పురుషులనీ పేరు. ''యావదధికార మవస్థితి రాధికారి కాణా''మని ఆచార్యులవారి సూత్రం.





Back Next






     All Rights Reserved by M.Sudhakar  - 9440524168