ప్రస్థానత్రయ పారిజాతము
1.ఈశావాస్యోపనిషత్తు
ఉపనిషత్తులనేవి అసంఖ్యాకంగా ఉన్నా వాటిలో ముఖ్యంగా పరిగణిస్తున్నది పదింటినే. ''ఈశ కేన కఠ ప్రశ్న ముండ మండూక్య తిత్తిరిః ఐతిరేయంచ ఛాన్దోగ్యం బృహదారణ్య మేవచ'' అని వాటి పేర్లు. వీటిలో మొట్టమొదటి దీశావాస్యం. 'ఈశావాస్యమిదమ్ సర్వమ్' అని ఆరంభమవుతుందీ ఉపనిషత్తు ప్రపంచమంతా ఈశ్వర చైతన్యంతోనే నిండి ఉందట. అంచేత మనం చేయవలసిందేమిటి. 'తేన త్యక్తేన భుంజీథా;' త్యజిస్తూ భుజించమంటున్న దుపనిషత్తు. త్యజించవలసింది నామరూపాలను భుజించవలసింది ఆత్మతత్త్వాన్ని, ప్రపంచమంటే నామరూపాలే కాబట్టి నామరూపాలను పరిత్యజిస్తేగాని సచ్చిద్రూపమైన ఆత్మతత్త్వాన్ని అనుభవానికి తెచ్చుకోలేము. నామరూపాలనేవి వాస్తవంలోలేవు. లేకపోయినా ఉన్నట్టు భావిస్తున్నాము మనం. అలా భావించటం మూలాన్నే అవి మన పాలిటికొక తరిగిపోని ధనమై మనల నాకర్షిస్తున్నది.ఈ అర్ధం మీద మనసున్నంత వరకూ పరమార్థాన్ని మనమందుకోలేము. కనుకనే ''మా గృధః కస్యస్విద్ధనమ్'' అది ఒకధనమూ కాదు - దానిని నీవాసించనూ వద్దని మనలను వారిస్తున్న దుపనిషత్తు. దీనినిబట్టి మనమీ నామరూపాలను మనసుకు రానీయకూడదని తేట పడుతున్నది, మనసుకు రానీయకూడదంటే వాటిని కూడా మన స్వరూపంగానే దర్శించాలని అర్ధం. అలా దర్శించగలిగితే అప్పుడిక అంతా ఆత్మ స్వరూపమే. కాబట్టి మనకిక శోకమూలేదు. మోహమూలేదు. ''యత్ర సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్రకోమోహః కశ్శోకః ఏకత్వమను పశ్యతః'' అని ఉపనిషత్తిచ్చే హామీ.
అయితే ఇలాంటి ఏకత్వ దర్శన మందరికీచేతగాదు. చేతకాకనే కొందరవిద్యనూ మరికొందరు విద్యనూ పట్టుకొని ప్రాకులాడుతారు. అవిద్య అంటే కర్మ. విద్య అంటే దేవతోపాసన ''కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషే చ్ఛతగ్‌ం సమాః'' అని నూరేండ్లూ కర్మలతోనే వెళ్ళబుచ్చుతారు కర్మిష్ఠులు. తద్ద్వారా వారు సాధించేదేమిటి. ''అవిద్యయా మృత్యుమ్ తీర్త్వా'' మృత్యువును దాటిపోతారు. మృత్యువును దాటటమంటే మోక్షం కాదు. స్వాభావికమైన కర్మే మృత్యువు. దాన్ని శాస్త్రోదితమైన కర్మాచరణతో నిర్మూలించి స్ధూలదేహం పతనమైన తరువాత సూక్ష్మదేహంతో ధూమయానం చేసి పితృలోకాన్ని చేరటం. ఇంతకుమించి కర్మలవల్ల సాధించేదేదీ లేదు. పోతే ''విద్యయా-మృత మశ్నుతే'' విద్యవల్ల సాధించగలిగింది అమృతత్వం. అమృతత్వమంటే ఇదీ మోక్షంకాదు ఇంద్రవరుణాదులైన దేవతల నుపాసన చేసి వారి సాయుజ్యాన్ని గడించటం. తద్ద్వారా వారి లోకాలలో కొంతకాలం సుఖాలనుభవిస్తాడు సాధకుడు. అయితే ఈ సుఖాలు తాత్కాలికమేగాని శాశ్వతం కావు అటు పితృలోకాలకుపోయే కర్మిష్ఠులూ-ఇటు దేవలోకాలకు పోయే ఉపాసకులూ ఇరువురూ తిరిగి రావలసిందే. ''పునరపి జననమ్ పునరపి మరణమ్'' అన్నట్టు వీరికి మరలా జనన మరణాదులు తప్పవు.
కాబట్టి అవిద్యా విద్యలు రెండూ ఉపయోగంలేనివే. రెండూ మనల నంధకారంలో పడదోసేవే. ''అంధం తమః ప్రవిశంతి యే అవిద్యా ముపాసతే - తతోప్యంధ మివ తే తమోయ ఉ విద్యాయాం రతాః'' అని ఉపనిషత్తు ఘాెషిస్తున్నది. కారణమేమంటే అవి రెండూ నామరూపాలనే పరిధిని దాటి పోలేవు. నామరూపాలను దాటనంతటవరకూ మనమాత్మ స్వరూపాన్ని దర్శించలేము. కనుకనే త్యజిస్తూ భుజించమని చెబుతున్న దుపనిషత్తు. మొత్తంమీద నామరూపాలను పరిత్యజించటం ద్వారా బ్రహ్మతత్త్వాన్ని అందుకోమనే ఈశావాస్యం మనకిచ్చే సందేశం.
2.కేనోపనిషత్తు
ఈశావాస్యమైన తరువాత రెండవది కేనోపనిషత్తు. ''కేనేషితమ్ పతతి ప్రేషితమ్ మనః'' అని ఇది కేనశబ్దంతో ప్రారంభమవుతుంది. అందుకే దీనికి కేనోపనిషత్తని పేరు వచ్చింది. మనః ప్రాణేంద్రియాలకంటే భిన్నంగా ఆత్మ అనే పదార్ధమొకటి మన శరీరంలో ఉన్నదా అని అనుమానం. ఈ అనుమానంతోనే ప్రశ్నిస్తాడొక శిష్యుడు తన ఆచార్యుణ్ణి. ''కేనేషితమ్ పతతి ప్రేషితమ్ మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః'' మనలో మనసనేది ఎప్పుడూ ఆలోచిస్తూంటుంది. ప్రాణమనేది రాకపోకలు చేస్తుంటుంది. ఇంకా ఆయా ఇంద్రియాలాయా వ్యాపారాలు సాగిస్తుంటాయి ఈ వ్యాపారాలన్నిటికీ ఆధారమేమిటి. దేని ప్రేరణవల్ల నడుస్తున్నాయి ఇవి. స్వతహాగా అచేతనాలైన ఇవన్నీ ఏదో ఒక చేతన పదార్థం లేకపోతే ప్రసరించలేవు. మన ప్రాణేంద్రియాత్మకమైన ఈ శరీరమంతా ఒక సంఘాతం ఇది అసంహతమైన ఒక చైతన్య కార్యాన్ని నిర్వర్తించటానికేర్పడిందే గాని స్వకార్యమంటూ లేదు దీనికి. కరణమే గాని ఇది కర్తగాదు. కరణాన్ని బట్టి కర్త నూహించవలసి ఉంది మనం. అది ''శ్రోత్రస్య శ్రోత్రమ్ - మనసో మనోయ ద్వాచో హ వాచ ముత ప్రాణస్య ప్రాణః'' శ్రోత్రానికి శ్రోత్రమూ మనస్సుకు మనస్సూ - వాక్కుకు వాక్కూ ప్రాణానికి ప్రాణమూనట. అంటే ఒకానొక చైతన్యకాంతిలోనే ఇవన్నీ చలించ గలుగుతున్నాయి. కాబట్టి ఆ చైతన్యమే నిజమైన శ్రోత్రాదికమని భావం.
అయితే ఈ చైతన్యాన్ని మన మందుకోవటమెలాగ అని ప్రశ్న వస్తుంది. ''అన్యదేవ త ద్విదితా దథో అవిదితా దధి'' అని ఉపనిషత్తిచ్చిన సమాధానం. విదితమూ కాదది అవిదితమూ కాదు. విదితం కాదనటంవల్ల ఉపాదేయం కాదనీ అవిదితం కాదనటంవల్ల హేయం కాదనీ అర్థమవుతున్నది. హేయోపా దేయాలు రెండూ కాకపోతే అది ఇక పరిపూర్ణం. అప్పటికి దాన్ని పరిపూర్ణంగా చూడటమే అందకోవటమని చెప్పినట్టయింది. పరిపూర్ణంగా చూడటమంటే జ్ఞానం జ్ఞేయమనే భేదం లేకుండా సాధకుడంతా తన స్వరూపంగా భావించటమే. అలా భావించామంటే ఇక దాన్ని గూర్చి చెప్పటంగాని వినటంకాని సంభవం కాదు. చివరకు తెలియటం కూడా అసంభవమే. కనుకనే ''అవిజ్ఞాతమ్ విజానతామ్ విజ్ఞాత మవిజానతామ్'' తెలుసునన్నవాడికి తెలియదనీ-తెలియదన్న వాడికే తెలుసుననీ ఘాెషిస్తుందుపనిషత్తు.
అసలే తెలియకపోతే దాన్ని పరిపూర్ణమని భావించటమైనా ఎలా సాధ్యమని మరలా ప్రశ్న. దానికొక ఉపాయాన్ని బోధిస్తున్నదీ ఉపనిషత్తు. ''ప్రతి బోధవిదితం మత మమృతత్వం హి విందతే'' మనసులో కలిగే ప్రతి ఆలోచనా దేని వెలుగులో మనకు గోచరిస్తుందో ఆ వెలుగే అది అని గుర్తించవలసి ఉంటుంది. వెలుగే అది అనుకొంటే అప్పుడా వెలుగులో కనిపించేవన్నీ దానికి విలక్షణంగా కన్పిస్తాయి. అలా కనిపించేకొద్దీ అవి వాటన్నిటికీ సాక్షి అయి నిలుస్తుంది. నిలిస్తే ఆ సాక్షి నీడలోనే ఇవన్నీ కదులుతూ మెదులుతూ ఉంటాయి. కాబట్టి ఇవి దాని సద్భావాన్ని జూనిరిరీశిబిదీబీలి సూచించే సంకేతాలుగా పరిణమిస్తాయి. ఇది మన శరీరం లోపల ఎలాగో వెలుపల ఉన్న విశ్వ శరీరంలో కూడా అలాగేనని అర్ధం చేసుకోవచ్చు. విశ్వంలో జరిగే ప్రతిచలనమూ దాని అస్తిత్వాన్ని తెలిపే ఒక సంకేతమే Indication. వివిధ రూపాలుగా వ్యాపించి ఉన్న ఈ సంకేతాలను బట్టి ఏకరూపంగా భాసించే ఆ చైతన్యాన్ని గుర్తించటమే మనం చేయవలసిన పని. అసలా చైతన్య విభూతి శకలాలే ఈ సంకేతాలన్నీ. కాబట్టి ఈ సంకేతాలను పట్టుకొని పోయామంటే సరాసరి ఆ మూల స్థానానికే తీసుకుపోతాయి సాధకుణ్ణి.
ఇలాంటి ప్రయత్నం చేయటానికే అసలీ శరీరమనేది మనకేర్పడింది కనుక దీనినొక సాధనంగా ఖలిబిదీరీ చేసుకొని తాను జీవించి ఉండగానే ప్రతి అణువులోనూ తత్త్వాన్ని వెదకి పట్టుకోవాలి సాధకుడు. ''భూతేషు భూతేషు విచిత్య'' అని ఉపనిషత్తు చెప్పే మాటకిదే అర్థం. అలా పట్టుకోలేకపోతే మానవ జన్మ ఎత్తికూడ అది నిరర్థకమే. ఒక్క మానవజన్మే కాదు. అంతకన్నా ఉత్తమమని భావించే దేవతా జన్మలుకూడా ఈ సత్యాన్ని గ్రహించలేకపోతే పనికి రావని చెబుతున్న దుపనిషత్తు. దీనికి నిదర్శనంగా చెప్పినదే ఇంద్ర హైమవతీ సంవాద రూపమైన ఆఖ్యాయిక. సకల జగత్సాక్షి అయిన పరమాత్మవల్ల కలిగిన విజయాన్ని తమ విజయంగా భావించారట ఇంద్రాదులు. అది పరిచ్ఛిన్నమైన Limitted ఆత్మాభిమానం వల్ల ఏర్పడిన ప్రమాదం. అది ఉన్నంత వరకూ పరిపూర్ణమైన తత్త్వం వారి కంతు పట్టలేదు. దాన్ని దూరం చేసుకొన్న తరువాతనే పూర్తిగా దీన్ని ఆకళించుకో గలిగారు. ఇంతకూ ఈ సృష్టినంతా ఒక సంకేతంగా చేసుకొని దీనినిబట్టి స్రష్ట నర్థం చేసుకోమనే కేనోపనిషత్తు మనకు చేసే ప్రబోధం.
Back
Next