ప్రస్థానత్రయ పారిజాతము
రెండవ భాగము
సూత్ర విజ్ఞాన మారుతము
ప్రస్తావిక
ఉపనిషద్విజ్ఞానమనే సౌరభాన్ని ఆఘ్రాణించి తీరాలని చెప్పాము. దాన్ని తనివిదీర ఆఘ్రాణించాలంటే ఆ సౌరభాన్ని మనదాకా మోసుకొని తెచ్చే మారుతమొకటి కావాలి. ఆ మారుతమే బ్రహ్మ సూత్రాలు. సూత్రమంటే సూచించేదని అర్ధం. బ్రహ్మ స్వరూపాన్నే మనకు సూచిస్తుంది. కాబట్టి దీనికి బ్రహ్మ సూత్రమని పేరు వచ్చింది. శారీరక సూత్రమని కూడా దీనికే నామాంతరం. మన శరీరంలో ఒక ఆత్మ అనేది ఉందా లేదా అని ముందు విచారణ చేయాలి మానవుడు. అది ఒకటి ఉందని తేలితే తరువాత దానికీ బాహ్యంగా ఉండే బ్రహ్మానికీ భేదం లేదని గ్రహించవచ్చు. ఎంచేతనంటే బ్రహ్మమనేది ఒకటి ఉందని తెలిసింది మనకి శారీరకమైన జీవతత్త్వం వల్లనే. లేకపోతే అది మన ఆలోచన కసలు తట్టేది కాదు. అంతేకాదు. శారీరకమైన జీవతత్త్వమే లేకపోతే ఎవరికీ మనం బ్రహ్మభావం చెప్పవలసింది. 'తత్త్వమసి' అనే ఉపదేశమే అప్పుడు నిష్ప్రయోజన మవుతుంది. కాబట్టి సర్వతో వ్యాప్తమైన బ్రహ్మ తత్త్వానికి సజాతీయమైన తత్త్వమొకటి మన శరీరంలో కూడా ఉండి తీరాలి. అలా వున్నప్పుడే ఈ శారీరకాన్ని ఖరిబీజీళి బట్టి విశ్వ శారీరకమైన ఖబిబీజీళి ఆ తత్త్వాన్ని మనం పట్టుకోగలం. పట్టుకోగలిగితేనే జీవ బ్రహ్మైక్య మనేది సిద్ధిస్తుంది. ఇలాంటి ఐక్యాను సంధానం చేసుకొని తరించమని చెప్పడానికే బాదరాయణుడనే మహర్షి ఈ బ్రహ్మసూత్రాలను రచించాడు.
అయితే ఇది ఉపనిషత్తులతోనే గతార్ధమైన విషయం కదా. మరలా చర్విత చర్వణం చేయడం దేనికని ప్రశ్న వస్తుంది. ఉపనిషత్తులతో గతార్థమైన మాట వాస్తవమే. కానీ ఉపనిషత్తులు శ్రవణ రూపంగా మాత్రమే బోధిస్తాయి తత్త్వాన్ని. దానినే బ్రహ్మ సూత్రాలు మనకు మనన రూపంగా నిరూపిస్తాయి. శ్రవణానికీ మననానికి తేడాఉంది. శ్రవణమంటే ఒక విషయాన్ని పెద్ద సబబు చూపకుండా పేర్కొనటం, మననమంటే అలా కాదు. పేర్కొన్న విషయం చెల్లుతుందా లేదా అని ఆమూలాగ్రమూ తర్కించి చూడటం. అలా తర్కిస్తే అది స్థూణా నిఖనన న్యాయంగా మన బుద్ధులలో బాగా నాటుకొని పోతుంది. లేకపోతే కేవల శ్రవణమాత్ర లభ్యమైన విషయం మీద మనకు నమ్మకం కలగదు. 'నద్యాస్తీరే మహాన్ న్యగ్రోధ- స్తత్రైకా పిశాచికా వర్తతే' నదీ తీరంలో పెద్ద మఱ్ఱి వృక్షముంది. దాని మీద ఒక బ్రహ్మరాక్షసి కాపురముంది, అని చెప్పే పుక్కిటి పురాణాలు కూడా ఒకప్పుడు శ్రవణమే కావచ్చు. కాబట్టి బ్రహ్మతత్త్వాన్ని మనం శ్రవణం చేసినంత మాత్రాన సరిపోదు. అందులో ఎన్నో సందేహాలుండి పోతాయి. సందేహాలన్నీ తీరాలంటే మననరూపమైన తర్కం కూడా మనకు తోడు కావలసిందే. ''శ్రోతవ్యో మంతవ్య'' అని ఉపనిషత్తులే చెబుతున్నాయి.
అయితే తర్కం తోడు కావాలన్న మాత్రాన అది కేవలం శుష్క తర్కమైతే మరలా సుఖం లేదు. శ్రుత్యనుకూలమైన తర్కమే కావాలి. ''తద విరోధి తర్కోప కరణా'' అన్నారు భాష్యకారులు. తర్కమనేది ఒక ఉపకరణం మాత్రమే. అది పదార్ధాన్ని క్రొత్తగా సృష్టించబోదు. పదార్థమనేది ఎప్పుడూ ప్రత్యక్ష సిద్ధమే. ఆ ప్రత్యక్షాన్ని అనుసరించి నడుస్తుంది తర్కం. అందుకే దీన్ని అనుమాన ప్రమాణ Inference మన్నారు. ప్రత్యక్ష్యాన్ని Perception ఆధారం చేసుకొని రాణించవలసిందేగాని స్వతహాగా దీని కస్తిత్వం లేదు. పర్వతం మీద నిప్పుంటుందని చెప్పామంటే ఎలా చెప్పగలిగాము. కేవలం పొగ కనిపించినంత మాత్రాన చెప్పే విషయం కాదది. నిప్పూ పొగ-రెండూ కలిసి ఉండడం ఎన్నో మార్లు ఏ మహానసంలోనో ప్రత్యక్షంగా చూచి ఉండాలి. అలాగే బ్రహ్మతత్త్వాన్ని కూడా పూర్వం మహర్షులు తపస్సమాధిలో కూర్చొని ప్రత్యక్షంగా చూచి ఉన్నారు. చూచారనే చాటుతున్నది శ్వేతాశ్వతర మనే ఉపనిషత్తు. ''తే ధ్యానయోగానుగతా అపశ్యన్ దేవాత్మశక్తిమ్ స్వగుణైర్ని గూఢామ్'' కాలమా, స్వభావమా, నియతియా యదృచ్ఛయా ఏది ఈ జగత్తుకు కారణమని అనేక విధాల చర్చించి ఏదీ దిక్కు తోచక చివరకందరూ కలిసి సమాధిలోనే దాన్ని దర్శించారట.
వారు ప్రత్యక్షంగా దర్శించిన సత్యమే మనకిప్పుడు ఉపనిషత్తుల రూపంలో సాక్షాత్కరిస్తున్నది. దీనికే ఆగమ Intution ప్రమాణమని పేరు. ఇది మనపాలిటి కిప్పు డాగమంగా కనబడుతున్నా వారికది ప్రత్యక్ష ప్రమాణమేనని మరచిపోరాదు. వారి ప్రత్యక్షమే మనకిప్పుడాగమమైంది. అయితే వారికైనా అది ప్రత్యక్షమైనదా లేదా అని మనకు సందేహం కలగవచ్చు. సందేహమున్నంతవరకూ మనం సాధన కుపక్రమించలేము. ఇలాంటి సందేహాన్ని నివృత్తి చేయటం కోసమే అనుమాన రూపమైన తర్కం మనకు తోడు పడుతుంది. ఇది ఆగమ వాక్యాన్ని సహేతుకంగా విచారణ చేసి మన పూర్వులకు కలిగిన అనుభవం అసలు సంభవమో కాదో నిరూపిస్తుంది. సంభవమైననాడు వారి అనుభవానికి వచ్చిన సత్యం మనకూ ఇప్పుడనుభవానికి వచ్చేఅవకాశముంది. కాబట్టి సాధన చేస్తూ పోతే ప్రస్తుత మాగమంగా కనిపించే వాక్యమేనాటికో ఒక నాటికి మనకూ ప్రత్యక్షం కాక తప్పదు. అప్పుడది మన అనుభవమే కాబట్టి ఇక సంశయలేశం కూడాఉండబోదు. అంతేకాదు మన పూర్వులకు కలిగిన అనుభవమే మనకెప్పుడు కలిగిందో అప్పుడది యధార్ధమని ఇక చెప్పనక్కరలేదు.
అంచేత బ్రహ్మజ్ఞానమనేది ఉపనిషత్తుల మూలంగా ఆ పాతతః కలిగినప్పటికీ తద్విషయమైన సందేహాలు పూర్తిగా తొలగాలంటే తార్కికంగా కూడా విచారణ సాగించవలసిందే. ఇలాంటి విచారణకోసమే ఈ బ్రహ్మసూత్రాలనేవి అవతరించాయి. వీటి మూలంగా మనం సందేహాలన్నీ నివృత్తి చేసుకొని బ్రహ్మానుభవం కోసం సాధన చేయవచ్చు. ఇవి మొత్తం అయిదు వందల యాభై అయిదు సూత్రాలు, 'అధాతో బ్రహ్మ జిజ్ఞాసా' అనే సూత్రంతో ఆరంభమై 'అనావృత్తి శ్శబ్దా దనావృత్తి శ్శబ్దాత్' అనే సూత్రంతో సమాప్తమవుతాయి. అయిదు వందల యాభై అయిదూ మరల నాలుగధ్యాయాలుగా విభక్తమయినాయి. మొదటి అధ్యాయానికి సమన్వయమని పేరు, రెండవదానికి అవిరోధమని పేరు. మూడవ దానికి సాధనమని పేరు, నాలుగవదానికి ఫలమని పేరు. సమన్వయమనేది జగత్తుకంతటికీ బ్రహ్మమే కారణమని సమన్వయించి చూపుతుంది. అవిరోధ మా కార్యకారణాలకు రెండింటికీ అభేదాన్ని నిరూపిస్తుంది. సాధన మా అభిన్నమైన తత్త్వాన్ని జీవుడనుభవానికి తెచ్చుకొనే ఉపాయాన్ని బోధిస్తుంది. పోతే ఫలమనే నాలుగవ అధ్యాయం తద్ద్వారా జీవుడికి ప్రాప్తించే మోక్ష స్వరూపాన్ని వర్ణిస్తుంది. ఇదీ దీని ప్రణాళిక. ఈ ప్రణాళిక ననుసరించి దీన్ని సంగ్రహంగా పరిశీలిద్దాము.
Back
Next