• Youtube
    •  
    • English
    •  

నిర్వాణ దశకము


పీటిక

''తదేకో-వ శిష్టః శివః కేవలో-హమ్‌'' అనే మకుటంతో పది శ్లోకాలు బాగా ప్రచారంలో ఉన్నాయి. వీటికి నిర్వాణదశకమని పేరు. ఇది జగద్గురు శంకర భగవత్పాదుల రచన అని ప్రతీతి. అలాగే కనిపిస్తుంది. సందేహం లేదు. భగవత్పాదులు బోధించిన అద్వైత వేదాంత రహస్యాలన్నీ ఇందులో చక్కగా పొందుపడి ఉన్నాయి. పరమ పురుషార్ధాన్ని బోధించి లోకాన్ని ఉద్ధరించటమే భగవత్పాదుల ధ్యేయం. ఈ మానవలోకాన్ని ఆయన మూడుజాతులుగా విభజించారు. అందులో మొదటివారుత్తమాధికారులు. ఎంత గంభీరమైన విషయమైనా అవలీలగా గ్రహించగలవారు. వీరికోసం అతివిపులమూ అతిసూక్ష్మమూ అయిన భాష్యగ్రంథాలను ప్రసాదించారాయన. రెండవవారు మధ్యమాధికారులు వీరంత దీర్ఘమైన విచారణకు తట్టుకోలేరు. ఉన్న విషయమెంత క్లిష్టమైనా సంగ్రహించి చెబితే అవగాహన చేసుకోగలరు. ఇలాంటి వారికోసమాయన ''ఉపదేశ సాహస్రి'' ''వివేక చూడామణి''లాంటి ప్రకరణ గ్రంథాలు (Treatises) రచించారు. పోతే ఇక మూడవజాతి వారు మందాధికారులు. వీరికి గ్రహణశక్తి చాలా తక్కువ. అయినా శ్రద్ధాభక్తులకే మాత్రమూ తక్కువలేదు. తమ అంతస్తుకు దిగివచ్చి బోధిస్తే మాత్రం అందుకోగలరు. జగద్గురువులు సార్ధక నామధేయులు కాబట్టి వారికది ఒక్క లెక్కలోనిది కాదు, అలాంటి వారికి కూడా పనికివచ్చే గ్రంథాలు రచించారాయన. అవే భజగోవిందాదులైన నానావిధ స్తోత్ర గ్రంథాలు.

అయితే ఒక చమత్కారమేమంటే భగవత్పాదులే రచన చేసినా సరే, ఎవరికోసం వ్రాసినా సరే, ఎక్కడికక్కడే శాస్త్రప్రమేయ (Scope of the subjest) మంతా అందులో ఇమిడ్చి లోకానికందిస్తూ వచ్చారు. ఎంతెంత లోతుకు దిగితే అంతంత విషయం మనకు బోధపడుతూ పోతుంది. చివరకంతా ఇక్కడే ఉందనే సంతృప్తి కూడా కలుగుతుంది సాధకుడికి. ఇది ఒక అనన్య సామాన్యమైన ప్రతిభ. భాష్యకారుల కొక్కరికే చూడగలమిది. మరి ఎక్కడా కనిపించదు.

ప్రస్తుతమీ నిర్వాణదశకాన్ని చూస్తేనే మనకు విశదమవుతుందీ విషయం. ఇదికూడా భజగోవిందాదుల లాగా మందాధికారుల కోసం వ్రాసిన ఒక స్తోత్రగ్రంథమే. చూడటానికి చాలా చిన్నదైనా మర్రి విత్తనంలో మహావృక్షంలాగా ఇందులో అద్వైత జ్ఞానరత్నాలన్నీ గుప్తమయి ఉన్నాయి. భావన చేసేకొద్దీ అవి బయటపడుతూ వస్తాయి. కనుకనే మధుసూదన సరస్వతి అనే మహావిద్వాంసుడు దీనినెంతగానో మధించి సిద్ధాంత బిందువనే పేరుతో ఒక విపులమైన వ్యాఖ్య వ్రాసిపోయాడు. కాని బాగా మననం చేస్తే ఇంకా దీన్ని సుళువుగానూ, సమగ్రంగానూ బోధించ వచ్చునన్న అభిప్రాయం నాకేర్పడింది. ఆ విశ్వాసంతోనే యథాశక్తిగా నేనీదశకాన్ని భగవత్పాదుల కటాక్ష బలంతో మథించి తత్సారాన్ని జిజ్ఞాసులోకాని కందింపదలచాను. దీనిమూలంగా జిజ్ఞాసువులైన పెద్దలూ, పిన్నలూ అద్వైత వేదాంతాన్నంతటినీ ఆకళించుకొని అనుభవానికి తెచ్చుకోగలిగితే అంతకన్నా కావలసింది లేదు. వారి జీవితమూ నా జీవితమూ కూడా ధన్యమేనని సవినయంగా మనవి చేస్తున్నాను.


ఇట్లు

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారు





Next






     All Rights Reserved by M.Sudhakar  - 9440524168